Title Picture

(నవల. రచన : వెంపో ; ప్రచురణ : దీప్తి కన్సర్న్స్, ముఖరంజాహీ రోడ్, వరంగల్ ; ప్రాప్తి స్థానం కూడా అదే. క్రౌన్ సైజు : 240 పేజీలు; వెల : 5 రూపాయలు)

'వెలుతురు మలుపులు' అన్న పేరు చూడగానే ఇదేదో ఇంటలెక్చువల్స్ కు మాత్రమే ఉద్దేశించిన 'అల్ట్రామోడరన్ హైస్టయిల్ సింబాలిక్ నావెల్' (అదేమిటో మనకు తెలీదు!) అని పాఠకులు అపోహపడే ప్రమాదం ఉంది. కానీ నిజానికి అర్థం కాని ఐడియాలతో సామాన్య పాఠకులను హడలగొట్టే దురుద్దేశం రచయితకు ఎంతమాత్రం లేదు. నవలకు ఈ పేరు ఎందుకు పెట్టారో గానీ-దాన్ని బట్టి లోపల సరుకును అంచనా వేయడానికి వీల్లేదు.

దాదాపు అన్ని వర్గాల పాఠకుల చేత 'చదవబడగల' చక్కటి నవల ఇది. మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకూ ఏ పేచీ లేకుండా ఒక్క ఊపులో చదివించగల సరళమైన, ధారాళమైన భాష ఉంది. ఒక స్పష్టమైన కథ, దానికి తగిన కథనం ఉన్నాయి. శైలి 'హైస్టయిల్లో' కాక, నిరాడంబరంగా ఉంది. రచయిత చెప్పదలచుకున్నదేదో ఎక్కడి కక్కడ స్పష్టంగా అర్థమైపోతూ ఉంటుంది. కొందరు 'పురోగామి' రచయితల నవలల్లోలాగా జీవితం మీద, ప్రపంచం మీద, సంఘం మీద వ్యాఖ్యానాలు, విమర్శలు, నిర్వచనాలు లేవు. మెట్టవేదాంతం లేదు. చెప్పదలచినదాన్ని పాత్రలపరంగానూ, సన్నివేశాల రూపంలోనూ చెప్పారు కానీ తానుగా రచయిత ఎక్కడా ఉపన్యసించలేదు.

ప్రేమ, ఎడబాటు, విరహం, అపార్థాలు, ఆత్మబలిదానం, సంసార కలహాలు, ఆత్మ హత్యలు మొదలైన అరిగిపోయిన కథాసామగ్రిని వదిలి కొత్త రకం వస్తువును, కొత్తరకం వాతావరణాన్ని స్వీకరించారు రచయిత. పగిలిన హృదయాలు, చితికిన ఆశలు, విరిగిన కలలు వంటి కొటేషన్ పదజాలం ఇందులో కనిపించదు. ఇందులోని ప్రతి భావం, ప్రతి వాక్యం రచయిత సొంతం. ఇందులోని పాత్రలన్నీ నిరాడంబరమైనవి. వాళ్లు మాట్లాడే మాటలన్నీ వాళ్ల చదువూ, సంస్కారాల హద్దుల్లోనే ఉంటాయి కానీ హద్దు మీరి జీవిత సత్యాలను ఏకరువుపెట్టరు. కేవలం 'డ్రామా' కోసం, 'థ్రిల్' కోసం ప్రవేశపెట్టినవి కాక సన్నివేశాలన్నీ సహజంగా ఉన్నాయి.

ఇందులో నాయిక వరంగల్ జిల్లాలో ఒక అరణ్య గ్రామానికి చెందిన రైతు పిల్ల. ఆమెకు పన్నెండేళ్ల వయస్సులోనే ఒక నడివయస్సు బుర్రమీసాల రైతుతో పెళ్లి అవుతుంది. అతడికి అంతకు ముందే ఒక పెళ్లాం ఉంది. అయినా వంశాంకురం లేకపోవడం వల్ల ఈమెను చేసుకున్నాడు. ఈమె యుక్తవయస్సు వచ్చేవరకు పుట్టింట్లో ఉండిపోయింది. ఈ లోగానే అతడికి మొదటి భార్య వల్ల సంతానం కలగటంతో ఈమె అవసరం లేకపోతుంది. అందుకని ఈమె పుట్టిల్లు దాటవలసిన అవసరం రాదు. పెద్దపులిలాటి ఆ భర్తతో కాపరం కంటే ఇదే మేలు అని పుట్టింటివారికి సేవచేస్తూ ఉండిపోతుంది. అందమైన అడవులలో గొడ్లను మేపటం, వ్యవసాయం చేయటం-ఆమె జీవితం. కథా నాయకుడు యువకుడు. ఈమెకు దూరపు బంధువు. అతనిది నల్గొండజిల్లా, విద్యావంతుడు. ఆర్య సమాజ ఉద్యమం అతని జీవితానికి ముఖ్యమైన అంశం. ఇద్దరికీ పరిచయమవుతుంది. స్నేహం కుదురుతుంది. ఒకరి కొకరు ఆప్తులవుతారు. పరస్పరం గౌరవం, సానుభూతి, ప్రేమ పాదుకొంటాయి. అతడు ఆమెకు చదువు నేర్పుతాడు. ఆమె జీవితాన్ని ఉద్ధరించాలనుకుంటాడు. కాని చివరికి మరొక స్త్రీని వివాహం చేసుకుంటాడు. అది ఆమెను క్రుంగదీస్తుంది.

కథను కరుణామయంగా, హృదయంగమంగా చిత్రించారు రచయిత. మొదట్లో నాయిక వివాహ సన్నివేశాన్ని గొప్పగా వర్ణించారు. అయితే నవలను విషాదాంతం చేయటం కేవలం 'శరత్ టెక్నిక్'పై ల మోజువల్లనేమోననిపిస్తుంది. ఎందుకంటే ఆమెను వివాహం చేసుకునేందుకు అతనికి అభ్యంతరం ఏమీ లేదు. ఆమెకూ లేదు. వాళ్ల చుట్టూ ఉన్న మనుష్యుల ఆటంకమూ లేదు. అటువంటప్పుడు అతను ఆమెను వివాహం చేసుకోకపోవటం సమర్థనీయం కాదనిపిస్తుంది. పైగా అతను ఆదర్శవాది. శరత్ బాబు స్త్రీ జనోద్దరణకు కంకణం కట్టుకున్నవాడే కానీ ఏ నవలలోనూ ఆయన విధవా వివాహం చేయలేదు. పతిత స్త్రీని స్వీకరింపచేయలేదు. ఎందుకంటే-'పాఠకుల సానుభూతికోసం'. బహుశ వెంపోగారు కూడా ఇందుకోసమే కథను విషాదాంతం చేసి ఉంటారు.

నాయిక మల్లమ్మ పాత్ర చాలా కాలం జ్ఞాపకం ఉంటుంది. పాఠకుల సానుభూతికోసం ఆమె పదే పదే కళ్లు వత్తుకోటం, ముక్కు తుడుచుకోటం, 'మ్లానవదన' కావటం లాంటి పనులు చేయదు. జీవితంలో ఎంత వెలితి ఉన్నా ఎప్పుడూ నవ్వుతూ, గెంతుతూ అరణ్యంలో గొడ్లను మేపుకుంటూ గడుపుతుంది. నాయిక జీవితానికీ, నాయకుని జీవితానికీ మధ్యగల వ్యత్యాసాన్ని చూపుతూ, ఇద్దరి జీవితాలకూ నేపథ్యంగా ఉన్న భిన్న వాతావరణాలను సజీవంగా, సమగ్రంగా, స్పష్టంగా చిత్రించారు రచయిత.

చక్కటి, నిరాడంబరమైన నవల 'వెలుతురు మలుపులు'.

నండూరి పార్థసారథి
(1964 మార్చి 18వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమయింది)

Previous Post Next Post