Title Picture

వెనక ఇంగ్లీషులో వచ్చిన ''బ్లోజమ్స్ ఇన్ ది డస్ట్'' చిత్రానికీ, బి.ఆర్. ఫిలింస్ వారి ''ధూల్ కా ఫూల్'' (ధూళిలో పూలు) చిత్రానికీ పేరులోనూ, కథావస్తువులోనూ మాత్రమే పోలికలున్నాయి. ప్రయోజనాత్మకమైన వస్తువును స్వీకరించాలనే విషయంలో ముఖ్ రామ్ శర్మ, బి.ఆర్. ఛోప్రా ఉభయులకూ కూడా శరత్ కున్నంత చిత్తశుద్ధి ఉంది. వారిద్దరూ ఉమ్మడిగా ఇంతవరకూ చిత్రించిన చిత్రాలన్నీ ఈ విషయాన్నే చాటుతున్నాయి. వారి లక్ష్యం 'సాధన' చిత్రంలో పరిపూర్ణంగా సిద్ధించింది. ఆ చిత్రాన్ని చూసి కొండంత ఆశతో రాకపోతే ఈ చిత్రం నిరుత్సాహపరచదు. చిత్త శుద్ధి ఉన్నంత మాత్రాన అందరూ 'సాధన' అంత గొప్ప చిత్రం నిర్మించలేరు. ఈ చిత్రానికి దర్శకుడు బి.ఆర్. ఛోప్రా కాదు, యశ్ ఛోప్రా.

ఈ చిత్రంలో చాలా సన్నివేశాలు మనకు సుపరిచితాలే. కొత్త సీసాలో పాత మద్యం అనే నానుడి దీనికి వర్తిస్తుంది. పాత మద్యమంత పారవశ్యం కల్గింస్తుందని కాదు భావం. ఏమైనా, సగటు సరిహద్దులను దాటిన చిత్రం యిది. ఆర్థికంగా విజయవంతం కాగలదు.

మీనా కాలేజీ విద్యార్థిని, మహేష్ ఆ కాలేజీలోనే విద్యార్థి. తొందరపాటు కలవారు కాబట్టి ప్రథమ వీక్షణంలోనే, వారి సైకిళ్లూ, జీవితాలూ 'ఢీ' కొన్నాయి. ఫలితంగా ఆడపిల్ల కాబట్టి ఆమె సైకిలే వంకరపోతుంది. ఇక్కడ సైకిళ్లు, వారి జీవితాలకు సంకేతాలు. అరటిఆకూ, ముల్లూ సామెతగా, స్త్రీ పురుషులు తొందరపడితే, నాశనమయేది స్త్రీ జీవితమే. సైకిలు వంకరపోయినా ఆమె అతన్ని క్షమిస్తుంది. తర్వాత సీనులోనే యుగళగీతాలు పాడటం, షికార్లు చెయ్యటం జరుగుతుంది. ప్రేమ క్రమంగా అభివృద్ధి కావటానికి ముందు ఇంకా జరగాల్సిన కథ చాలా ఉంది గనుక, టైములేదు కనుక ప్రథమ వీక్షణంలోనే వారి ప్రేమ వికసించిందని కొందరు సినిమా విమర్శకులు అనుకుంటారు. కాని, ఇది పొరపాటు. వారు అలా త్వరపడటమే చిత్రానికి నాంది. ఆ తొందరపాటు వల్లనే ఆమె జీవితం ఒక సినిమాగా పరిణమించింది. ఒకనాడు వర్షంలో వారిద్దరూ ఒంటరిగా కలుసుకుంటారు. ఆ వర్షమే ఆమె పాలిట జారుడుమెట్టు అవుతుంది. కాలు జారింది. మరుక్షణమే తాను ఎంత అగాధంలో పడిందీ తెలుసుకుంది. పురుషునికి చీమ కుట్టినట్లు కూడా లేదు. ఇంటికి వచ్చి క్యాలెండరులో పసిపాప ఫోటోను చూసి ఆమె గుండె భయంతో వణికిపోతుంది. వివాహం చేసుకుంటానన్న మహేష్ మాట జారి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మీనా ఆ పెళ్లి కళ్లారా చూసింది. ఆమె గర్భవతి అని తెలిసిన తక్షణం ఇంటిలోంచి తరిమివేశారు. ఎక్కడో ప్రసవించింది. తన బిడ్డను తీసుకోమని మహేష్ ను బ్రతిమాలింది, త్రోసిపుచ్చాడు. లోకభీతితో, పాపభీతి విడనాడి పువ్వులాంటి పాపణ్ణి ధూళిలో విడచిపోయి ఆత్మవంచన చేసుకుంది. ఆ బిడ్డను ఒక ముస్లిం వృద్ధుడు తెచ్చుకుని పువ్వుల్లో పెట్టి పెంచాడు. 'రోషన్' అని పేరు పెట్టుకున్నాడు. ఆ పిల్లవాణ్ణి లోకం కాకిలా పొడుస్తుంది. మహేష్ కు రమేష్ అనే మరో పిల్లవాడు పుడతాడు. రమేష్, రోషన్ లు ఒకే బళ్ళో చదువుతూ ఉంటారు. రోషన్ రోజూ ఇంటికి వస్తున్నా మహేష్ కి అతను తన కొడుకని తెలీదు. మీనా జగదీష్ అనే వకీలువద్ద టైపిస్ట్ గా చేరుతుంది. అతను బహుఉదారుడు. మీనా, జగదీష్ లు వివాహమాడతారు. మహేష్ మేజస్ట్రేటు అవుతాడు. నిర్దోషి రోషన్ నేరస్తుడుగా కోర్టు కెక్కుతాడు. జగదీష్ అతని తరపున వకాల్తా పుచ్చుకుంటాడు. ఈలోగా మీనాకు అతను తన పుత్రుడని తెలుస్తుంది. మహేష్ కుమారుడు రమేష్ కారు ప్రమాదంలో అంతకు ముందే చనిపోతాడు. కోర్టులో మేజిస్ట్రేటు మహేష్, గృహిణి మీనా ముఖాముఖి కలుసుకుంటారు. రోషన్ నిర్దోషిగా నిరూపింపబడతాడు. మహేష్ పశ్చాత్తాపంతో, రోషన్ ను పెంచిన అబ్దుల్ చాచా ఇంటికి వెడతాడు, కొడుకుని తెచ్చుకునేందుకు. అప్పటికే అక్కడికి మీనా వస్తుంది. ఇద్దరూ తమ తప్పిదాలను ముస్లిం వృద్ధుని ఎదుట ఒప్పుకుంటారు. ఇంతలో జగదీష్ వస్తాడు. అబ్దుల్ చాచా, పిల్లవాడిని జగదీష్, మీనాలకు ఒప్పగిస్తాడు. జగదీష్ విశాల హృదయానికి వినమ్రుడై జోహారులర్పించాడు మహేష్. ఇంతటితో ఈ చిత్రం ముగుస్తుంది.

Dhool ka Phool Picture
రాజేంద్రకుమార్, నందా

నిజానికి వాస్తవిక జీవితంలో క్రొత్త కథ అప్పుడే ప్రారంభమవుతుంది. మీనా గత చరిత్ర జగదీష్ కు తెలుసు. మహేష్ భార్యకు కూడా తెలుస్తుంది. ఈ విషయాన్ని ఇరువురూ మరిచిపోలేరు. అనుక్షణం వారిని ఆ విషయాలు సలపరించుతూనే ఉంటాయి. ఈ అశాంతికి దూరంగా ప్రశాంతంగా వారు జీవించగల్గటం అసంభవం. ఈ అశాంతి మానవునికి సహజమైన లక్షణం. ఈ సమస్యకు పదిమంది ముఖ్ రామ్ శర్మలైనా పరిష్కారం చెప్పలేరు. అందుకే యీ చిత్రం ముగింపు, మరో కళాఖండానికి మొదలు కాగలవిధంగా ఉంది. బి.ఆర్. చోప్రా దర్శకత్వం వహించిన 'సాధన' చిత్రం అస్ఖలిత బ్రహ్మచారి వేశ్యను వివాహమాడటంతో ముగుస్తుంది. వారి సాంసారిక జీవితాన్ని మరో చిత్రంగా తీయబోతున్నట్లు చోప్రా లోగడ ప్రకటించారు. ఈ చిత్రానికి కూడా అలాంటి అవకాశం ఉంది. ఈ చిత్రానికి రెండవ భాగాన్ని చిత్రిస్తే ఇంతకంటే గొప్పగా ఉంటుంది.

అతిశయోక్తి అలంకారం అంటే పండిత ముఖ్ రామ్ శర్మ గారికి ఎక్కువమోజు అని ఈ చిత్రంలో రూఢిగా తెలుస్తుంది. భూతద్దంతో చూస్తే కొన్ని నగ్నసత్యాలు అతిశయోక్తుల అట్టడుగున సూక్ష్మంగా కనుపిస్తాయి. మానవునికి ఇచ్చే గౌరవానికి వెనక అతని వంశం, సంప్రదాయం, పుట్టు పూర్వోత్తరాలు మూలంగా ఉంటున్నది ఈనాడు. మానవుణ్ణి మానవుడుగానే గౌరవించండి. ఒకరి తప్పిదానికి మరొకరిని నిందించకండి -అనేది ఒక నగ్నసత్యం. ఒకసారి పరిస్థితుల ప్రభావానికి పతిత అయిన స్త్రీ చిరకాలం పతితగానే జీవించాలని లేదు. పతివ్రతగా గడపటానికి ఆమెకూ హక్కువున్నది అనేది - మరో సత్యం. ఈ మాదిరి సత్యాలు కొన్ని సన్నివేశాల కుప్పల అడుగు నుంచి అప్పుడప్పుడూ తొంగిచూస్తూ ఉంటాయి.

మీనాగా మాలాసిన్హా చిరస్మరణీయమైన నటనను ప్రదర్శించి ముఖ్ రామ్ శర్మ గారి ప్రతిష్టను కాపాడింది. చిత్రం అంతటికీ ఆమె ప్రాణం. ఆమె తెరమీద కనుపించిన ప్రతి దృశ్యం ఉన్నతంగా ఉంది. ఆ ఖ్యాతి అంతా దర్శకుడికి కాక నేరుగా ఆమెకే ఇవ్వాలనిపిస్తుంది. తప్పు చేసిన మరుక్షణంలో ఆమె ప్రదర్శించిన భావాలు ఎంతకీ మరుపురావు. అలసట, భయం, పశ్చాత్తాపం, జాలితనం ఎంతో గొప్పగా ప్రదర్శించింది.

మహేష్ గా రాజేంద్రకుమార్ నటనలో చాలా అభివద్ధి కనుపించింది. దిలీప్ కుమార్ ను అనుకరించటానికి ఆయన ప్రయాసపడకపోవటం ప్రశంసించతగింది. నందాకు నటించేందుకు అవకాశం లభించలేదు. పదేళ్ళ పిల్లాడి తల్లిగా ఆమెను ఊహించుకోవటం కొంచెం ప్రయాస అనిపించింది. ఏ కారణం చేతనో అశోక్ కుమార్ పేరు టైటిల్స్ లో కనిపించలేదు. జగదీష్ గా ఆయన మామూలుగా గొప్పగా నటించాడు. అబ్దుల్ చాచాగా మన్ మోహన్ కృష్ణ, నటన కృత్రిమంగా ఉంది. 'నేనెంత గొప్ప పనులు చేస్తున్నానో చూశారా' అని పదే పదే ప్రేక్షకులను సవాలు చేశాడు. ఇంకా రాధాకిషన్, జీవన్, లీలా చిట్నిస్ మున్నగు వారు నటించారు. రోషన్ గా మాస్టర్ కెల్లీ చాలా చక్కగా నటించాడు.

ఎన్. దత్తా సంగీతం కొన్ని చోట్ల చిరాకు పుట్టింది. కారణం - అమితంగా శబ్దోత్పత్తి చెయ్యటమే. పాటలన్నీ బిట్టులతో సహా హిట్టులయినాయి. మాలా సిన్హా హృదయవిదారకంగా జాలిగా నటిస్తూంటే, దత్తా శహనాయి ఊదటం బొత్తిగా బాగాలేదు. అటువంటి దృశ్యాలలో వాద్యాలు చేతులు ముడుచుక్కూచ్చుంటే ఎంతో ఉదాత్తంగా ఉండేది. 'దృశ్యం చూడనక్కర్లేదు కళ్ళు మూసుకోండి నేను చెప్తాను, అన్నట్లు ఆయన శబ్దాలు ఉత్పత్తి చేశాడు.

ముఖ్ రామ్ శర్మ, మాలాసిన్హాల వ్యక్తిత్వాలు మినహా, దర్శకుని స్వంత వ్యక్తిత్వం ఎక్కడా చెప్పుకోతగినంతగా కన్పించదు.

ఈ చిత్రం తుదిని మొదలుగా గ్రహించి మరో కళాఖండం బి.ఆర్. ఫిలింస్ పతాక కింద వెలువడగలదని ఆశిద్దాం.

నండూరి పార్థసారథి
(1960 ఫిబ్రవరి 7వ తేదీన ఆంధ్రప్రభ సంచికలో ప్రచురితమైనది)

Previous Post Next Post