Title Picture

ముసలి పిల్లల మొగుడూ పెళ్ళాలాట

కోనసీమ లాంటి స్వర్గసీమలో ఓ పాతకాలపు పెంకుటిల్లు. దాని వెనక ఓ నందనవనం. అందులో సమస్తమైన ఫలవృక్షాలు, కూరమొక్కలు, పాదులు, పూలతీగలు. వీటికి తోడు కామధేనువు లాంటి ఒక ఆవు, దూడ. ఈ సెట్టింగ్ లో... డెబ్భయ్ దాటిన ఆచార పరాయణులైన ఆదర్శ బ్రాహ్మణ మిథునం. రోగం, రొష్టూ, లేమీ, దిగులూ లేని జీవితం. 'వినాదైన్యేన జీవనం'.

ఆ ఇంట్లో, ఆ తోటలో వాళ్ళిద్దరే-ఇద్దరంటే ఇద్దరే. వాళ్ళు బైటికి పోరు, బైటి వాళ్ళు లోపలికి రారు, రాలేరు. 'అదేమిటి? పిల్లా పీచూలేరా? నా అనే వాళ్ళెవరూ లేరా? దిక్కులేని వాళ్ళా? గృహ నిర్బంధంలో ఉన్నారా? అయ్యో పాపం!' అని జాలిపడకండి. తాము కోరుకున్న ఏకాంతంలో వాళ్ళు హనీమూన్ దంపతులంత హాయిగా ఉన్నారు. ఎవరైనా తలుపు కొడితే శోభనప్పెళ్ళికొడుక్కి వచ్చినంత కోపం వస్తుంది ముసలాయనకి. తలుపు ఓరగా తెరిచి కసురుకుంటూ శాపనార్థాలు పెట్టి పంపేస్తాడు. లోపలకు అడుగు పెట్టనివ్వడు. 'ఒసే' అంటే 'ఓయ్' అని పలికేంత దగ్గరగా పెళ్ళాం ఉంటే ఇంకేమీ అక్కర్లేదు ఆయనకి. 'హమ్ తుమ్ ఎక్ కమ్రేమే బంద్ హో...' అని పాడుకొనే టీనేజ్ లవర్స్ లాగా ఉంటారు వాళ్ళిద్దరూ. 'మేడ్ ఫర్ ఈచ్ అదర్', 'ఏక్ దూజేకేలియే' అన్నట్లుగా ఉంటారు.

'ఫర్బిడెన్ ఫోర్ట్', 'నో ఎంట్రీ', 'జస్ట్ మేరీడ్', 'డోంట్ డిస్టర్బ్', 'ట్రెస్ పాసర్స్ విల్బీ ప్రాసిక్యూటెడ్' - ఇలాంటి బోర్డులేవీ సింహ ద్వారానికి వేలాడదీయకపోయినా అవి అదృశ్యంగా కనిపిస్తూనే ఉంటాయి బైటి వాళ్ళకి.

''అవునూ... పొద్దస్తమానం అలా ఎదురూ బొదురూగా కూర్చుంటే వాళ్ళకి బోరు కొట్టదా? ఎలా టైమ్ పాసవుతుంది?''

అయ్యో రామ! వాళ్ళకి బోరా? అది వాళ్ళ డిక్షనరీలోనే లేదు. అరవయ్యేళ్ళ నాటి పెళ్ళి కబుర్లు తలుచుకుని కులకడానికి, కొబ్బరాకులతో బూరలు చేసుకుని 'పిప్పీ... బూబూ' అని ఊదుకుంటూ మురిసిపోడానికీ, సరసాలకీ, సరాగాలకీ రోజుకి ఇరవై నాలుగ్గంటలు, ఏడాదికి మూడొందల అరవయ్యయిదు రోజులు చాలడం లేదు వాళ్ళకి.

Picture

అన్నట్టు ఇందాక పిల్లా పీచూ అనుకున్నాం కదూ...! సంతాన భాగ్యానికేమీ కొదవలేదు వాళ్ళకి. కొడుకులూ, కోడళ్ళూ మనవళ్ళూ, మనవరాళ్ళూ అందరూ ఉన్నారు. అమెరికాలోనో, ఇంకెక్కడో. అప్పుడప్పుడూ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. తమదగ్గరికి రమ్మని పిలుస్తూ ఉంటారు కూడా. వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు. ఎంత కాలమైనా వాళ్ళ దగ్గరే ఉండిపోవచ్చు. రమ్మంటే వాళ్ళు వస్తారు. అందరూ బాగా సంపాదించుకొని స్ధిరపడ్డవాళ్ళే. కాని, ఈ ముసలాయనకి వెళ్ళాలనిపించదు. వాళ్ళు రావాలనీ అనుకోడు. వాళ్ళు దగ్గర లేరన్న బెంగలేదు. పెళ్ళాం ఉంటే ఎవరూ అక్కర్లేదు. మనవడు అమెరికా నుంచి ఫోన్ చేస్తే కూడా విసుక్కుంటాడు. ఓ గుడికి వెళ్ళడం లేదు, వేదాంతం లేదు, వైరాగ్యం లేదు. జిహ్వాచాపల్యం, తిండి పుష్టి, జీర్ణశక్తి మాత్రం దండిగా ఉన్నాయి. ఎప్పుడు ఏది ఎంత తినాలనిపిస్తే అప్పుడు అది అంత తినగల అదృష్టవంతుడు. తిండి మోజులన్నీ తీర్చే ఇల్లాలుండగా ఆయనకేం కొదవ!

ఆయన భోం చేశాక అరిటాకు ఎంగిలాకులా ఉండదు, చెయ్యి ఎంగిలి చెయ్యిలాగా ఉండదు. ఆకూ, చెయ్యీ కూడా శుభ్రంగా నాకేస్తాడు. బ్రేవ్ మని త్రేన్చి ''అద్భుతః-నీచేతిలో అమృతరేఖ ఉందే అమ్మీ'' అంటాడు. తర్వాత 'తాంబూలం' అంటాడు. 'పెరట్లో తమలపాకు తీగ ఉందిగా.. వెళ్ళి తెంపుకో' అంటుంది ఆవిడ. ఆయన వెళ్ళి చూసేటప్పటికే ఆవిడ లేత తమలపాకులతో చక్కగా కిళ్ళీ చుట్టి, దానికి లవంగం గుచ్చి తీగకి తగిలించి ఉంచుతుంది. ఆ కిళ్ళీని నోట కరచుకుంటాడు మొగుడుగారు. ఈ దంపతులిద్దరిదీ ఒకే మనోధర్మం. సుఘ్ఠగా భోంచేసినా ఇంకా ఏవఁన్నా నవఁలాలని ఆయనకి అనిపిస్తే ఆవిడకి తెలిసిపోతుంది. అర్థరాత్రయినా అపరాత్రయినా మామిడి తాండ్రో, పేలాలో ఏదో ఒకటి సిద్ధంగా ఉంచుతుంది ఆవిడ.

శ్రీరమణ ప్రఖ్యాత రచన 'మిథునం' ఆధారంగా అదే పేరుతో తనికెళ్ళ భరణి తీసిన సినిమా కథనం ఇదంతా. 'మిథునం' పుస్తకం లక్షపైగా కాపీలు అమ్ముడయిందట! పెక్కు భాషలలోకి తర్జుమా అయింది కూడా. ప్రఖ్యాత మలయాళ సినీ దర్శకుడు ఎం.టి. వాసుదేవన్ నాయర్ ఈ కథతో సినిమా తీశాడు. అయినా ఉండబట్టలేక మళ్ళీ భరణి అచ్చ తెనుగుదనం ఉట్టిపడేట్లుగా తనదైన శైలిలో సినిమా తీశాడు. మామూలుగా సినిమాలకు అవసరమైన 'డ్రామా' ఏమీ లేని ఈ రచనను తెరకెక్కించబూనడం చాలా పెద్ద రిస్క్ తో కూడిన సాహసం, 'గేంబుల్'.

రెండు గంటల సినిమాకు అవసరమైనంత వస్తుసామగ్రి మూలకథలో లేదు. అసలది సినిమా కోసం రాసింది కాదు. ఉన్న దున్నట్లుగా తీస్తే నిడివి ముప్పావుగంటకు మించదు. అందుచేత ఇంకో గంటంబావుకు సరిపడ అదనపు సరంజామా చేర్చారు. ఆ అదనం అంతా దర్శకునిదే. స్క్రీన్ ప్లే ఆయనదే.

మూలకథలో ఈ మొగుడూ పెళ్ళాలు కాక ఇంకో కుర్రాడున్నాడు. అతడు వరసకి ముసలాయన మేనల్లుడు. అంటే వరసకి బావమరిది కొడుకన్నమాట. ముసలాయన తన ఆవు, దూడ పోషణ బాధ్యత ఆ బావమరిదికి అప్పగించాడు. అంచేత ఆ కుర్రాడు పొద్దునా సాయంత్రం వచ్చి పాల చెంబు ఇచ్చి పోతుంటాడు. వచ్చినప్పుడల్లా కాసేపు ఈ మొగుడూ పెళ్ళాలాట చూసి వినోదించి వెడుతుంటాడు. ఈ కథంతా అతడు చెప్పిందే. సినిమాలో మాత్రం రెండే పాత్రలు-మొగుడూ, పెళ్ళాం. కుర్రాడు లేడు.

రెండే రెండు పాత్రలతో తీసిన మొదటి పూర్తి నిడివి కథా చిత్రంగా గినెస్ బుక్ లోకి ఎక్కాలన్నది దర్శకుని సంకల్పం కాబోలనిపిస్తుంది. ప్రపంచం మొత్తం మీద, దేశం మొత్తం మీద కాకపోయినా కనీసం తెలుగులో ఇలాంటి సినిమా ఇదొక్కటేనని చెప్పవచ్చు. అంతేకాదు-కేవలం రెండు సందర్భాలలో తప్ప కెమెరా, ఇల్లు, తోట దాటి బైటికి పోదు. అప్పుడు కూడా మరో మనిషి ఎవరూ కెమెరా ఫీల్డులోకి చొరబడకుండా జాగ్రత్తపడ్డారు. నిజానికి ఆ రెండు సన్నివేశాలు అత్యవసరమైనవి కావు. వాటిని కూడా తొలగిస్తే గడప దాటని మొదటి సినిమా అయ్యుండేది.

ఎప్పుడో నలభై ఎనిమిదేళ్ళ క్రిందట సునీల్ దత్ హిందీలో 'యాదేఁ' (జ్ఞాపకాలు) అనే ఒక ఏకపాత్రాభినయ చిత్రం తీశాడు. ఆ పాత్ర అతనే. కథ అంతా ఒకే ఇంట్లో నాలుగ్గోడల మధ్య జరుగుతుంది. సినిమా అంతా అతనొక్కడే కనుక సంభాషణలుండవు-అంతా స్వగతమే. అతి తక్కువ రోజులాడిన అతి బోరు చిత్రంగా బహుశా అది రికార్డు నెలకొల్పి ఉంటుంది.

Picture

'మిథునం' అలాంటిది కాదు. మొదట్నించి చివరి దాకా ఎక్కడా బోరు కొట్టకుండా చిత్రం నిండా పుష్కలంగా హాస్యాన్ని దట్టించారు. ఆ హాస్యంలో వెకిలితనం లేదు. ప్రేక్షకుల్లో అత్యధికులు మిథునాలే-నేటి వృద్ధులే కాదు, రేపటి వృద్ధులు కూడా. హాలంతా ఒకటే ముసిముసి గుసగుసలు.

ఐతే-అనవసరాలు, అనౌచిత్యాలు చాలానే ఉన్నాయి. ముసలాయన కుమ్మరి సారెపై కుండలు చేయడం, ప్రొఫెషనల్లాగా (పెళ్ళాం కోసం) చెప్పులు కుట్టడం, కట్టెలు కొట్టడం, దూది యేకడం లాంటి రకరకాల వృత్తి పనులు చేస్తుంటాడు. ఇవన్నీ సినిమాని పొడిగించడానికి చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇవి మూలకథలో లేవు. ముసలాయన పారవశ్యంతో పెళ్ళాం చీర ఉతికి ఆరేయడం మాత్రం సమంజసంగా, సరసంగా ఉంది-పనిలో పని చాకలి వృత్తి కూడా నిర్వహించినట్లయింది.

సినిమాలో ఒక చోట మాటల్లో-ఆయన మూడు ఎమ్మేలు చేసినట్లు, ప్రెసిడెంటు అవార్డు అందుకున్నట్లూ తెలుస్తుంది. ఏ సబ్జక్టుల్లో డిగ్రీలు తీసుకున్నాడో గాని ఆయన మేధావి అనడానికి దాఖలాలు ఎక్కడా కనిపించవు. అద్దాల బీరువాలో ఏవో పుస్తకాలు కనిపిస్తాయి గాని రెండు గంటల సినిమాలో ఆయన ఒక్క పుస్తకం తిరగేసిన పాపాన పోలేదు. ఓ పాత గొట్టం గ్రామఫోన్ ఉంది. కాని, అది ఒక్కసారీ మోగలేదు. ఆయన ఏ రకం సంగీతం వినేవాడో తెలియదు. ఆయనకి అసలు తిండి యావ తప్ప మరోటి లేదు. 'పెళ్ళాం వంట' పై పరిశోధనకే ప్రెసిడెంట్ అవార్డు వచ్చిందేమో!

ఇక సంగీతం. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారి 'కాఫీదండకం' చిక్కగా, కమ్మగా, స్ట్రాంగ్ గా ఘుమఘుమలాడుతూ ఉంది. (ఇది పాతకాలపు వాల్వుల రేడియోలోంచి వినిపిస్తుంది). మరొకటి- 'ఆవకాయ మన అందరిదీ, గోంగూర పచ్చడీ మనదేలే' అనేది పూర్వపు 'మిస్సమ్మ'లోని 'బృందావనమది అందరిదీ' పాట వరసలో వినిపిస్తుంది. ఇది కథానాయక పాత్రకోసం పాడిన ఫాంటసీ పాట-ఊహాగానం. సరదాగా ఉంది. ఇంకొకటి-జేసుదాస్ పాడిన టైటిల్ సాంగ్ 'ఆది దంపతులు అభిమానించే అచ్చతెలుగు మిథునం', రేడియోలో వినిపించిన యెల్లా-నేమాని మృదంగం-ఘటం లయ విన్యాసానికి దీటుగా మొగుడూ పెళ్ళాల 'కూరలతరుగుడు' దృశ్యం మంచి హాస్యం అందించింది. ఘంటసాల 'పుష్పవిలాపం' పాటను చొప్పించి, చిత్రీకరించడం మాత్రం అనవసరం.

సినిమాను పొడిగించడానికే అయితే ఔచిత్యవంతమైన ఉపాయాలు బోలెడు దొరుతాయి. మొగుడూ పెళ్ళాలు ఎంచక్కాతూగుటుయ్యాల మీదో, పట్టెమంచం మీదో కూర్చుని భారత భాగవతాలో, కాళిదాసు కావ్యాలో చదువుకోవచ్చు. (ముసలాయన త్రిబుల్ ఎమ్మే కదా) అవి కాక పోతే కర్మసన్యాసం, మోక్షసన్యాసం, సత్తు చిత్తులు, ఉపనిషత్తులు మొదలైన వ్యంగ్య హాస్య సంవర్థక విషయాలెన్నో చర్చించుకోవచ్చు.

డెబ్భయ్ దాటిన స్థూలకాయుడు బావిలోకి దూకి చేదతో పాటు ఉగ్గుగిన్నె, సిగ్గుబిళ్ళ బైటికి తీయడం సిల్లీగా ఉంది (దూకడం, బైటికి ఎక్కి రావడం ప్రత్యక్షంగా చూపించలేదు.)

ఎవరినీ పిలవకుండా ముసలిదంపతులిద్దరే, నాలుగ్గోడల మధ్యే లక్షవత్తుల నోము నోచుకోవడం హాస్యాస్పదం. పల్లెటూళ్ళలో లక్షవత్తుల నోము అంటే ఊరంతటికీ పండగ. ముత్తయిదువలెవరూ లేకుండా నోము ఎలా నోచుకుంటారు?

ఇక చిట్ట చివరి సీను-ముసలాయన వాలుకుర్చీలో చేరగిలి పడుకుని, హాయిగా నిద్రపోతున్నవాడిలా మరణించాడు. 'అనాయాసేన మరణం'. అంత వరకు బాగుంది. కాని, ఇరుగూ పొరుగూ, కొడుకులూ కోడళ్ళూ ఎవరూ రాకపోవడం ఏమిటి? ఎదురుగా ఎవరూ లేకపోవడం వల్ల ఇల్లాలు తనలో తనే - ''నేను ముందు పోతానేమోనని భయపడి చచ్చేదాన్ని. ఇప్పుడు నాకు పెద్ద బరువు తీరింది. నేను ముందు పోతే పసుపు కుంఖాలు మిగిలేవేమో గాని ఆ జీవుడు ఎంత అవస్థపడేవాడో...'' అనుకుంటుంది. (మూలకథలో ఆవిడ ఈ మాటలు మేనల్లుడి వరసైన కుర్రవాడితో అంటుంది.)

పెద్దాయన పోతే కూడా ఒక్కళ్ళూ ఎందుకురాలేదంటే దర్శకుడు ఎవర్నీ ఫ్రేములోకి రానివ్వలేదు-ప్రతిజ్ఞా భంగమవుతుందనే భయంతో. 'సమాప్తం' తర్వాత అందరూ వచ్చి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపించారని ప్రేక్షకులు ఊహించుకోవాలన్నమాట.

ఇలాంటి కొన్ని అనౌచిత్యాలుంటే ఉన్నాయి గాని 'మిథునం' చిత్రం ఒక సాహసోపేత ప్రయోగం. ఇటువంటి చిత్రాలు ఆర్థిక విజయం సాధించడం చాలా అవసరం. పెట్టుబడి తిరిగిరావడమే కాదు-ఇటు వంటి మరో చిత్రం-ఇంతకంటే మంచి చిత్రం-తీయడానికి అవసరమైనంత లాభం గడించడం కూడా అవసరం. గ్రాఫిక్ ఫైట్లు, ఐటం సాంగ్సు, కామెడీ ట్రాక్ లు లేకుండా కారుచౌకగా తీసిన ఈ చిత్రం హైదరాబాద్ లో అర్థశతదినోత్సవం జరుపుకున్నదంటే సూపర్ హిట్టనే చెప్పుకోవాలి.

కథానాయకుడుగా ఎస్పీబాల సుబ్రహ్మణ్యం, నాయికగా లక్ష్మి తమ పాత్రలను సమర్థంగా పోషించారు. ఇంతరిస్క్ తో కూడిన ప్రయోగానికి పెట్టుబడి పెట్టిన నిర్మాత ముయిద ఆనందరావు ప్రశంసనీయుడు.

నండూరి పార్థసారథి
(2012 డిసెంబర్ రచన)

Previous Post