Title Picture

(నవల, రచన : కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ; ప్రచురణ, ప్రాప్తిస్థానం : సర్వోదయ పబ్లిషర్స్, ఏలూరురోడ్డు, విజయవాడ-2; క్రౌన్ సైజు : 244 పేజీలు; వెల : నాలుగు రూపాయలు)

'సజీవమైన' పాత్రలను ప్రవేశపెట్టటం విశ్వనాథవారికి అలవాటు. తెలిసిన ఒక వ్యక్తిని గురించి ఉన్నది ఉన్నట్లుగా వ్రాసేస్తే అది సజీవమైన పాత్రే అవుతుంది. ఇటువంటి పాత్రలు విశ్వనాథవారి నవల లన్నింటిలోనూ దర్శనమిస్తాయి. తాను ఎరిగిన వ్యక్తి, తాను చూసిన కోణం నుంచి ఎలా కనిపించాడో వర్ణిస్తూ, దాని మీద తన వ్యాఖ్యానాన్ని జోడిస్తూ ఆయన నవల పన్నుతారు. అలా పన్నినవలే 'గంగూలీ ప్రేమకథ'.

గంగూలీపాత్ర చిత్రణ మినహా ఇందులో చెప్పుకోదగ్గ కథా కమామీషు ఏమీ లేదు. మామూలుగా అందరూ చెప్పుకునే అర్థం ప్రకారం అసలు ఇది ప్రేమకథ కానేకాదు. శృంగార వ్యవహారం ఏమీ లేదు. నాయకుడు గంగూలీ ప్రేమికుడు కాదు, రసికుడూ కాదు. పైకి మంచిగా కనిపించే పరమ దుష్ణుడు. అసలు పేరు గంగయ్య, గొప్ప వాడైన తర్వాత గోరోజనం పెరిగి బెంగాలీ గంగూలీగా రంగు మార్చుకున్నాడు. చిన్నతనంలో స్కూలు జీతం కట్టేందుకు డబ్బులులేక, రైళ్ళలో అడుక్కుంటూ ఉండగా ఒక లక్షాధికారి అతన్ని చేరదీస్తాడు. వ్యాపార వ్యవహారాలలో తర్ఫీదు ఇచ్చి, తన కూతురును, ఆస్తిని అప్పగించి కన్నుమూస్తాడు. గంగయ్య గంగూలీ అయి, ధనమదంతో భార్యను, బంధువులను, తనను ఆశ్రయించిన వారిని అవమానిస్తాడు. ఒక దినపత్రిక, వారపత్రిక, సచిత్ర వారపత్రిక స్థాపిస్తాడు. బోలెడు పేరు, పలుకుబడి, రాజ్యసభ సభ్యత్వం సంపాదిస్తాడు. తన కింద పనిచేసే ఉద్యోగులందరినీ రకరకాలుగా అవమానిస్తూ ఉంటాడు. కడుపు నొప్పి వ్యాధికి గురి అవుతాడు. ఆపరేషన్ చేయించుకుంటాడు. అతని పత్రికలు దినదినాభివృద్ధి పొందుతూ ఉంటాయి. ఇదీ కథ.

ఇందులో రచయిత ఒక చోట చెప్పినదానిని ఇంకొక చోట మరిచిపోయిన సందర్భం ఒకటి ఉంది. 141వ పేజీలో ''భీమశంకరము పెద్ద కూతురు పేరు వెంకాయమ్మ'' అని వ్రాశారు. 146వ పేజీ నుంచి భీమశంకరము భార్య పేరు వెంకాయమ్మ అయింది.

కామము, ధర్మము, ప్రేమము, భార్యా భర్తల సంబంధము, మానవునిలోని చైతన్య శక్తి మొదలయిన విషయాలను గురించి నిర్వచనాలు, వ్యాఖ్యానాలు పేజీల తరబడి వ్రాశారు. వీటిని విడిగా చదివి ఆనందించవచ్చు. భాష గ్రాంథికం. 'గంగూలీ'ని విమర్శించటం కంటే వేరే ఉద్దేశం రచయితకు ఉన్నట్లు కనిపించదు. అదే అయితే వారి ప్రయోజనం సిద్ధించినట్లే.

ఈ 'ప్రేమకథ'కు బ్రాకెట్లో 'కథానిక' అని తగిలించారు. అయితే ఇందులో కథ లక్షణాలు గానీ, కథానిక లక్షణాలు గానీ కనిపించవు. సైజును బట్టి అయితే నవల అని చెప్పవచ్చు. ఇతర లక్షణాలను పరిశీలిస్తే ఈ మూడూ కాని మరి ఏ ప్రక్రియ ఐనా అవుతుందేమో తెలియదు. ఈ పుస్తకం ఏ వర్గం పాఠకులను ఆనందింపచేయగలదో చెప్పటం కూడా కష్టం.

నండూరి పార్థసారథి
(1965 మార్చి 03వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమయింది)

Previous Post Next Post