బెంగుళూరు, ఆగస్టు 13: ప్రఖ్యాత వైలిన్ విద్వాంసుడు పద్మశ్రీ ఎం.ఎస్. గోపాలకృష్ణన్ మొన్న ఆదివారం రాత్రి ఇక్కడ ఇంజనీర్స్ ఇన్ స్టిట్యూట్ హాలులో చేసిన హిందూస్థానీ సంగీత కచేరీతో స్వామిశివానంద తనకు ప్రసాదించిన 'వైలిన్ వాద్య సమ్రాట్' బిరుదాన్ని మరొకసారి సార్థకం చేసుకున్నారు. దక్షిణాది సంగీత ప్రియులకు గోపాలకృష్ణన్ కర్ణాటక సంగీత విద్వాంసుడుగానే సుపరిచితుడు. హిందూస్థానీ సంగీతంలో కూడా ఆయనకు గొప్ప ప్రావీణ్యం ఉన్నదని చాలామందికి తెలియదు. ఉత్తర హిందూస్థానంలో ఆయన పెక్కు సార్లు హిందూస్థానీ కచేరీలు చేశారు. స్వర్గీయ ఓంకార్ నాథ్ ఠాకూర్ కు ప్రక్కవాద్యం వాయించారు. కానీ దక్షిణాదిని ఆయన హిందూస్థానీ కచేరీలు చేయడం అపురూపం. అటువంటి అపురూపమైన అవకాశాన్ని 'బెంగుళూరు సంగీత సభ' వారు కల్పించారు.

గోపాలకృష్ణన్ మూడు గంటల కచేరీలో ఆరు రాగాలు వినిపించారు. మొదట 'యమన్' రాగం గంటసేపు వాయించారు. ఈ రాగంలో విలంబిత్ ఖయాల్ ఏక్ తాళ్ లోనూ, ధ్రుత్ ఖయాల్ తీన్ తాళ్ లోనూ వాయించారు. మామూలుగా హిందూస్థానీ సంగీతంలో వాద్యాలపై 'గత్'లు వాయిస్తారు. ఖయాల్ గానం గాత్ర సంగీతానికి పరిమితమైనది. కాని, వైలిన్ పై ఖయాల్ వాయించేవారు చాలా కొద్దిమంది ఉన్నారు. గోపాలకృష్ణన్ వాయించిన 'యమన్' రాగం వింటుంటే స్వర్గీయ ఓంకార్ నాథ్ ఠాకూర్ ఖయాల్ గానం జ్ఞాపకం వస్తుంది. ఓంకార్ నాథ్ బాణి గోపాలకృష్ణన్ వైలిన్ వాదనంలో స్పష్టంగా కనిపించింది. 'యమన్' తర్వాత పావుగంటసేపు 'కాఫీ' రాగంలో ఠుమ్రీ వినిపించారు. చివర ఈ ఠుమ్రీకి 'శంకర', 'కేదార్', 'భీంపలాస్', 'బేహాగ్', 'మాల్కౌస్' రాగాలను జోడించి రాగమాలికగా రూపొందించారు. దీని తర్వాత 40 నిమిషాల సేపు 'మధువంతి' రాగంలో ఆలాప్, జోడ్, మసీత్ ఖానీగత్, ధ్రుత్ గత్, అత్యద్భుతంగా వాయించారు.

విరామానంతర సంగీతం మరింతగా రక్తి కట్టింది. 'అభోగికానడ' రాగంలో విలంబిత్ ఖయాల్ ఏక్ తాళ్ లోనూ, ధ్రుత్ ఖయాల్ తీన్ తాళ్ లో వాయించారు. ఈ రాగంలో మళ్లీ ఓంకార్ నాథ్ ఖయాల్ బాణి స్పష్టంగా కనిపించింది. దీని తర్వాత 'మిశ్రమాండ్'లో పది నిమిషాల సేపు మధుర మంజులమైన భజన్ వినిపించారు. పిమ్మట భైరవిరాగంలో 'జోగీమత్ జా' అనే మీరాభజన్ తో కచేరీ ముగించారు. ఈ భజన్ కూడా ఓంకార్ నాథ్ గానం చేసిందే.

వైలిన్ పై గోపాలకృష్ణన్ కు ఉన్నంత అధికారం కర్ణాటక సంగీతంలోగానీ, హిందూస్థానీ సంగీతంలోగానీ ఒకరిద్దరికైనా ఉందో లేదో అనుమానం. గోపాలకృష్ణన్ ఒక దశలో అతితారస్థాయిని దాటి, వైలిన్ 'బ్రిడ్జి'కి అతి సమీపంగా వ్రేళ్ళు పోనిచ్చారు. మాధుర్యం ఏమాత్రం తగ్గకుండా, అవలీలగా వాయించి శ్రోతలను ఆశ్చర్యానందాలతో ఉర్రూతలూగించారు.

నండూరి పార్థసారథి
(1965 ఆగష్టు 14వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమయింది)

Previous Post Next Post