Title Picture

సంగీతం, సాహిత్యం, శిల్పం, నృత్యం-యివి మానవ జీవితాన్ని వ్యాఖ్యానించజూస్తాయి. జీవితపు లోతులను, అంచులను తడవి చూడాలని ప్రయత్నిస్తాయి. అదే లలిత కళలకు లక్ష్యం. అదే వాటి మనుగడకు ప్రయోజనం. అయితే ఈ కళల్లో ఏ ఒక్కటీ కూడా జీవితాన్ని సమగ్రంగా వ్యాఖ్యానించలేదు. యథాతథంగా ప్రతిబింబించలేదు. అస్పష్టంగా జీవితపు ఛాయలను మాత్రం కొంత ప్రదర్శించ గలుగుతుంది.

'జీవితం' అనే దాని అర్థం తెలుసుకోవడమే మానవుని గమ్యం. ఈ గమ్యం ఒక మృగతృష్ణ. ఎంత గొప్ప కళాకారుడైనా జీవితాన్ని యథాతథంగా రూపించలేడు; శతసహస్రాంశాన్నైనా వ్యాఖ్యానించలేడు. అనంతమైన 'జీవితం'లోని ఏ ఒక్క అంశాన్నో తీసుకొని, దాన్ని తన సంకుచితమైన దృష్టితో, అల్పమైన మేధాశక్తితో, అపరిపూర్ణమైన సంస్కారంతో వ్యాఖ్యానించ పూనుకొంటాడు. తాను చెప్పదలుచుకున్న దాంట్లో శతాంశాన్నైనా చెప్పగలుగుతాడో లేదో! మానవ జీవిత వైశాల్యంతో పోల్చుకుంటే ఈ సంగీతం, సాహిత్యం, శిల్పం, నృత్యం అతి సంకుచితమైనవి.

వర్తమాన మానవ విజ్ఞానపు పరిధిలో పరికిస్తే, ఈ లలిత కళలు నాలుగింటికంటే కూడా జీవితాన్ని మరింత వాస్తవికంగా రూపించగలదీ, మరింత స్పష్టంగా వ్యాఖ్యానించగలదీ సినిమా అని తోచక మానదు. సిద్ధాంత రీత్యా సినిమా కళ మిగతా లలిత కళలకంటే విశాలమైనది. లలిత కళలు నాలుగింటినీ ఒక్కచోటికి చేర్చి, ఒక్కటిగా ప్రదర్శించడానికి సినిమాలో అవకాశం ఉన్నది-వాస్తవంగా నేటి సినిమాలు ఎలా ఉంటున్నాయి అనేది వేరే ప్రశ్న. సినిమా ఒక సాధనంగా గొప్పది. కళాకారులమనే పేరుతో లలిత కళలను హతమార్చే వారిలాగానే, సినిమా హంతకులు కూడా అసంఖ్యాకంగా ఉంటారు.

'వాస్తవికత' అనేదాన్ని నిర్వచించబూనడం వృధాశ్రమ. దాని అర్థం దేశ దేశానికి, కాలకాలానికీ, పాత్ర పాత్రకూ మారిపోతూ ఉంటుంది. ఒకానొక స్థలం (దేశం)లో, ఒకానొక క్షణం (కాలం)లో, ఒకానొక వ్యక్తి (పాత్ర) ఒక సంఘటనకు ప్రాతిపదిక. స్థలమూ, సమయమూ, పరిసరాలూ, శీతోష్ణస్థితి, శబ్దాలు వగైరా, ఇతర వ్యక్తులు-దీన్ని 'వాతారణం'గా చెప్పవచ్చును. ఈ వాతారవణ ప్రభావం మానవుని మనస్తత్వంపై ప్రసరించినప్పుడు అతనికి ఒక 'మూడ్' వస్తుంది. ఆ మూడ్ లోని అతని ప్రవర్తనే ఒక 'సంఘటన'. కాలం గడుస్తున్నకొద్దీ వాతావరణంలో మార్పు వస్తూ ఉంటుంది. ప్రవర్తన మారుతుంది. సంఘటనలు మారిపోతాయి. ఇట్టి సంఘటనల పరంపరయే 'జీవితం'. ఒకే వాతావరణం వివిధ వ్యక్తులకు ఒకే విధమైన అనుభూతిని ప్రసాదించలేదు. అది ఆయా వ్యక్తుల మనస్తత్వంపై ఆధారపడి ఉంటుంది-అందుకే ఫలానాపరిస్థితిలో ఏ మానవుడైనా గానీ ఫలానా విధంగా ప్రవర్తిస్తాడని నిర్థారణగా చెప్పడానికి వీలులేదు-సినిమాలలో వాస్తవికతను సృష్టించడం ఇంత క్లిష్టమైనది.

ప్రతి సంఘటన కూడా దాని తర్వాతి సంఘటనకు కారణం అవుతుంది. జీవితంలోని చిట్టచివరి సంఘటనకు, మొట్ట మొదటి సంఘటన పునాది అవుతుంది. అదే జీవితానికి 'కారణం'; జీవితాన్ని ఇలా సంఘటనల గొలుసుగా నిర్మించుకొని రావడమే కథారచనలో అత్యంత క్లిష్టమైన విషయం. సినిమా కథలలోకానీ, విడి కథలలో కానీ మనకు సంఘటనలు విడివిడిగా, చెల్లాచెదురుగా అర్థ రహితంగా కనుపిస్తున్నాయి కానీ, ఒక దాని కొకటి ఆధార భూతమవుతున్న గొలుసులాగా కనిపించడం లేదు. వాస్తవికత లోపించడానికి ముఖ్యకారణం యిదే.

కథలో వర్ణించిన ప్రతి అనుభూతి, పాత్రల మనస్తత్వాలు, ఆయావాతావరణాలు, ప్రేక్షకుడు స్వయంగా అనుభవించినవే కాకపోయినప్పటికీ, సంభవం అనిపించే విధంగా ఉండాలి. ఇట్టి వాతావరణాన్ని చిత్రించలేక మన (భారతీయ, ముఖ్యంగా తెలుగు) నిర్మాతలు కలలలాంటివీ, అబద్ధాలలాంటివీ అయిన కొన్ని కృతక సన్నివేశాలను సృష్టిస్తున్నారు. ఫలానా మనస్తత్వం గల ఒక వ్యక్తి ఫలానా వాతావరణంలో ఇలా ప్రవర్తిస్తాడా, ఫలానా మాట అతని నోటి నుంచి వస్తుందా, అనే విచక్షణ, పరిశీలన మనవారిలో కనుపించవు. మన సినిమాలలో పాత్రలకు వ్యక్తిత్వాలు కనుపించవు. నోటికేది వస్తే అది మాట్లాడుతాయి. ప్రాణం ఉన్న బొమ్మలు అవి. కొన్ని మంచి సినిమాలలో కొన్ని పాత్రలపై చివరిదాకా ఎంతో గౌరవాన్ని పెంచుకుంటూ వస్తాము. చివర ఎక్కడో ఒక చిన్న అనరాని మాట పలికితే వెంటనే అప్పటివరకూ ఉన్న గౌరవం అంతా పోతుంది. కేవలం ప్రేక్షకుల వినోదం కోసమని అటువంటి అసభ్యమైన మాటలు మాట్లాడిస్తారు. ఇటువంటి పరిస్థితికి బాధ్యులు సినిమా రచయితలు. తప్పు చేయిస్తున్నది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అయినా చేస్తున్నది వీరే. అంతకంటే ముఖ్యకారణం రచయితల అసమర్థత.

ఒక వ్యక్తి జీవిత కథకీ అతని మనస్తత్వం ఎంత ప్రాతిపదికో, చలన చిత్రానికి కథ అంత ప్రాతిపదిక. చలన చిత్రానికి అవధులు కల్పించేది కథ. దర్శకుడు గానీ, నటులుగానీ, మరెవరైనా గానీ కథను విడిచి సాము చేయలేరు. చేయరాదు. సినిమాలో ప్రతిదాన్ని కథకు అనుగుణంగా మలచుకోవాలి. సర్వమూ కథకోసం జరగాలి. కథ సినిమాకు ఊపిరి. కానీ మన సినిమాలలో దర్శకుడికోసం, నటులకోసం, ప్రతివారికోసం కథను మలచుకొంటున్నారు.

కథ అంటే ఇక్కడ 'వస్తువు' అని నా భావం. అది కథ కావచ్చు, నవల కావచ్చు, కావ్యం కావచ్చు, లేదా ఒక చిన్న స్కెచ్ కావచ్చు. ఈ వస్తువును సిద్ధపరచడం అనేది సంభాషణల రచనకన్నా, పాటల రచనకన్నా, స్క్రీన్ ప్లే రచనకన్నా ఎంతో క్లిష్టమైనది, ఎంతో ముఖ్యమైనది.

నండూరి పార్థసారథి
(1960 సెప్టెంబర్ 11వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమయింది)

Previous Post Next Post