Title Picture
పుష్పలత

ఇది స్టంటు చిత్రమని పేరు చూస్తేనే తెలిసిపోతుంది. అంత చక్కగా అతికేటట్లు పెట్టారు పేరు. ఈ చిత్రంలో ఇంకా స్టంటు చిత్రానికి కావలసిన సర్వలక్షణాలు ఉన్నాయి. స్టంటుకు అంతరాయం కల్పించని కథ, కథకు తగ్గ భాష అన్నీ చక్కగా అమరాయి. రీళ్ళ తరబడి కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలు చేసి నటీనటులు అలసిపోగానే వారికి విశ్రాంతి కల్పించడంకోసం మధ్య మధ్య కథ వచ్చిపోతూ ఉంటుంది. ఈ కథలో మరొక విశేషం కూడా ఉంది. అది అవసరమైనప్పుడు జానపద చిత్ర వాతావరణంలోనికి, అక్కర్లేదనుకున్నప్పుడు సాంఘిక చిత్ర వాతావరణంలోనికి అంగలు వేస్తుంది. ఆయా సందర్భాలననుసరించి కత్తులు, గుర్రాలు, పిస్తోళ్ళు, జీప్ కార్లు కథలో ప్రవేశిస్తూ ఉంటాయి. నటులు కూడా కాసేపు జానపద వీరుల దుస్తులు, కాసేపు పాంట్లూ, జర్కిన్ లూ ధరిస్తారు.

ఈ రకం చిత్రాలు అన్ని వర్గాల ప్రేక్షకుల కోసం ఉద్దేశించబడినవి కావు. ఏ వర్గం కోసం ఈ చిత్రాన్ని నిర్మించారో ఆ వర్గం వారికి ఈ చిత్రం పరిపూర్ణమైన తృప్తినీ, ఆనందాన్నీ ఇస్తుంది. నిర్మాతల లక్ష్యం పూర్తిగా నెరవేరింది. ఒక జమీందారుగారు ఒక వన్నెల విసనకర్ర చేతిలో చిక్కి, ఆమె మాయలో పడి, భార్యను అనుమానించి తరిమేశాడు. జమీందారిణి పసిపిల్లతో సహా అడవులకు వెళ్ళి అజ్ఞాతవాసం చేస్తుంది. జమీందారులకు విశ్వాసపాత్రుడైన ఒక వ్యక్తి ఆమెను కాపాడుతూ ఉంటాడు. ఇది 20 సంవత్సరాల పూర్వకథ. అంటే ఇది సినిమా ప్రారంభానికి ముందు జరిగిన కథ. తర్వాత కథ-పిల్ల పెరిగి పెద్దదై కత్తి యుద్ధం వగైరాలు నేర్చుకుని విప్లవ స్త్రీ అవుతుంది. ఆమె ముసుగు వేషం వేసుకుని కొండవీటి సింహం అనే పేరుతో అడపాతడపా జమీందారు దగ్గరకు వెళ్ళి మాయలాడి వలలో పడవద్దనీ, జమీందారిణిని స్వీకరించమనీ హెచ్చరికలు చేస్తుంది. ఇంతలో ఆమెకు ఒక నాయకుడు తటస్థపడతాడు. ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఉమ్మడిగా సాహసాలు ప్రారంభిస్తారు. చివరకు జమీందారు కళ్ళు తెరిపించి, మాయలాడి కుట్రలను, జమీందారిణి పాతివ్రత్యాన్ని రుజువు చేస్తారు. అందరూ కులాసాగా ఉంటారు.

ఈ చిత్రంలో ఛాయాగ్రహణం నేత్రపర్వంగా ఉంది. విప్లవస్త్రీ చక్కగా ఉంది. తగు మాత్రంగా నటించింది. గుర్రాలు బాగా స్వారీ చేశాయి. కుక్క చక్కగా నటించింది. కాలక్షేపానికి ఎవరైనా ఒకసారి చూడతగిన చిత్రం 'విప్లవ స్త్రీ'.

నిర్మాత: యు.విశ్వేశ్వరరావు; దర్శకుడు: ఎం.ఎ.ఆరుముగం, మాటలు, పాటలు: సముద్రాల ద్వయం; సంగీతం: పామర్తి; తారాగణం: పుష్పలత, ఆనందన్, ఎం.ఆర్.రాధ, పండరీబాయి, తాంబరం లలిత, రాజగోపాలన్ వగైరా.

నండూరి పార్థసారథి
(1961 సెప్టెంబర్ 10వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post