ఈ మధ్య ఒక పదేళ్ళలో 'ఎలెక్ట్రానిక్ మ్యూజిక్' అనే కొత్త 'సంగీతం' ప్రచారంలోకి వచ్చింది. బీతోవెన్, మొజార్ట్ వంటి సంగీత యుగపురుషులకు పుట్టినిల్లైన జర్మనీలోనే ఇది పుట్టినట్లు కనిపిస్తోంది. అంతకు ముందే ప్రపంచంలో మరే దేశంలోనైనా అటువంటి ప్రయోగాలు జరిగాయేమో తెలియదుగాని, దానికి ఒక ఖచ్చితమైన రూపం (?) ఇచ్చి, 'ఎలెక్ర్టానిక్ మ్యూజిక్' అని నామరణం చేసిన వారు పశ్చిమ జర్మనీవారు. అయితే సంగీత ప్రియులెవరూ దానిని సంగీతంగా గుర్తించలేదు. గుర్తించబోరుకూడా. అసలు దానిని సృష్టించినవారు కూడా అదొక 'సంగీతం' అనే ఉద్దేశంతో సృష్టించినట్లు లేదు. ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం, ఒక విచిత్రమైన, వినూత్నమైన ప్రయోగంగా దానిని సృష్టించారు. అయితే దానిని ఏమనాలో తెలియక 'ఎలెక్ట్రానిక్ మ్యూజిక్' అన్నారు. 'కెలైడోస్కోపిక్ మ్యూజిక్' అనే వర్ణన జాజ్ కంటే దీనికి ఇంకా బాగా అతుకుతుంది. 'ఆబ్ శ్ట్రాక్ట్ మ్యూజిక్', 'యూనివర్సల్ మ్యూజిక్', 'స్సేస్ ఏజ్ మ్యూజిక్' అనే పేర్లు కూడా దీనికి చక్కగా అతుకుతాయి.

ఈ ఎలెక్ట్రానిక్ 'సంగీతం' లోని శబ్దాలు సంగీత వాద్యాల నుంచి ఉత్పత్తి అయినవి కావు. వాద్యాల శబ్దాలు కూడా కొద్దికొద్దిగా నంచుకుంటున్నట్లు అక్కడక్కడా ఉపయోగించినా, ఎక్కువ శబ్దాలు యంత్రాలకు సంబంధించినవై ఉంటాయి. అంటే ఇందులో జంత్ర సంగీతం కంటే యంత్ర 'సంగీతం' ఎక్కువగా ఉంటుంది. అందుకని దీనిని 'యంత్ర జంత్ర తంత్ర సంగీతం' అని అన్నా తప్పులేదు. గచ్చునేల మీద సూది పడితే అయ్యే సున్నితమైన చప్పుడు మొదలు, ఇంటి బైట విమానం కూలిపడిన భయంకర శబ్దం వరకు అనేక రకాల శబ్దాలు, అనేక పరిమాణాల శబ్దాలు ఈ 'సంగీతం'లో ఉంటాయి. రైలుకూతలు, ఇంజన్ల శబ్దాలు, కారు హారన్లు, పళ్లెం క్రింద పడిన చప్పుడు, సుత్తి దెబ్బలు, టైప్ రైటర్ల టకటకలు, తుఫానుల హోరు, కెరటాలు విరిగిపడే శబ్దాలు, ప్రేలుళ్ళు, ఉరుములు ఇలాంటివి ఎన్నో ఉంటాయి. టేప్ రికార్డర్ పై టేప్ ను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు వచ్చే కిచకిచ శబ్దాలు, 33 ఆర్.పి.ఎం. రికార్డును 78 ఆర్.పి.ఎం. స్పీడుతో ప్లే చేస్తే వచ్చే విచిత్ర 'సంగీతం' కూడా ఈ ఎలెక్ట్రానిక్ మ్యూజిక్ లో ఉంటాయి. ఇన్ని రకాల శబ్దాల మధ్య అప్పుడప్పుడు పియానో, గిటార్ వంటి వాద్యాలు ఉపయోగిస్తారు. ఒక్కొక్కప్పుడు పూర్తి నిశ్శబ్దాన్ని కూడా ఉపయోగిస్తారు. రాళ్ళు, రప్పలు, మేకులు, మోకులు, సమస్తం మింగి హరాయించుకునే ఉష్ట్రపక్షిలాంటిది ఈ 'సంగీతం'.

ఈ 'సంగీతాన్ని' రచించే కళాకారుడు ఒకానొక 'మూడ్'లో, తన మనస్సులో ఒకానొక దృశ్యాన్ని, లేదా చిత్రాన్ని భావన చేసుకుని, ఆ దృశ్యాన్ని శ్రోతల మనోనేత్రం ఎదుట ఆవిష్కరించడానికి ప్రయత్నించుతాడు. అయితే శ్రోతలందరూ అతడు భావన చేసిన చిత్రాన్నే చూడకపోవచ్చు. ఆబ్ శ్ట్రాక్ట్ ఆర్ట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అర్థమైనట్లు ఇది కూడా శ్రోతల సంస్కారాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థం కావచ్చు. ఈ ఎలెక్ట్రానిక్ సంగీత రచన కంపోజర్ అనేక టేప్ రికార్డర్లపై రికార్డు చేసిన రకరకాల శబ్దాలన్నింటినీ పోగేసుకుని, తాను ఉద్దేశించిన 'మూడ్'ను సృష్టించడానికి, తాను భావన చేసిన దృశ్యాన్ని చిత్రించడానికి ఏ శబ్దం తర్వాత ఏ శబ్దాన్ని ఉపయోగించితే బాగుంటుందో నిర్ణయించి వాటిని ఆ వరుస క్రమంలో పేర్చి, మధ్య మధ్య పియానో, గిటార్, ట్రంపెట్, వైలిన్ లను నంచుకుంటూ, అవసరాన్ని బట్టి నిశ్శబ్దాన్ని ప్రయోగిస్తూ, దీనినంతటినీ ఒక తోరణంగా, మాలగా రీరికార్డ్ చేస్తాడు. ఈ రకరకాల శబ్దాలను పొదుపుగా, సమర్థంగా, విచిత్రంగా, శ్రావ్యంగా ఉపయోగించుకొని, అందమైన మాలను కూర్చడంలోనే కంపోజర్ ప్రతిభ వ్యక్తమవుతుంది. కంపోజర్ ప్రతిభావంతుడు కాకపోతే ఇదంతా వట్టి కాకి గోలగా ఉంటుంది. సాహిత్యాన్ని సృష్టించే రచయిత భాషలోని పదాలను ఏవిధంగా ఉపయోగించుకుంటాడో, ఈ 'ఎలెక్ట్రానిక్ సంగీతం'లో కంపోజర్ ప్రపంచంలోని శబ్ద సంచయాన్ని ఆ విధంగా ఉపయోగించుకుంటాడు. భాషలో పంక్చుయేషన్ కోసం కామా, సెమికోలన్, పుల్ స్టాప్ లను ఏ విధంగా ఉపయోగించుకుంటామో ఈ 'సంగీతం'లో నిశ్శబ్దం ఆ విధంగా ఉపయోగించబడుతుంది.

అయితే ఈ 'ఎలెక్ట్రానిక్ సంగీతం' నూటికి తొంబై తొమ్మిది సందర్భాలలో కొన్ని దృశ్యాలకు నేపథ్యంగా మాత్రమే ఉపయోగించబడుతున్నది. దృశ్యంతో సంబంధం లేకుండా స్వతంత్రమైన సంగీతంగా ఎవరూ దీనిని వినిపించడం లేదు. అత్యంత ఆధునికమైన కొన్ని నృత్య ప్రక్రియలకు, కొన్ని ప్రయోగాత్మక చలన చిత్రాలకు నేపథ్యంగా ఈ సంగీతాన్ని ఉపయోగిస్తున్నారు. ఆబ్ శ్ట్రాక్ట్ ఆర్ట్ గురించి ఎవరైనా డాక్యుమెంటరీ చలన చిత్రం నిర్మిస్తే దానికి నేపథ్య సంగీతంగా ఎలెక్ట్రానిక్ మ్యూజిక్ తప్ప మరేదీ పనికిరాదు.

స్టాక్ హాసెన్

1966లో మన దేశంలో నృత్య ప్రదర్శనలు యిచ్చిన పశ్చిమ జర్మనీ బాలే బృందం వారు 'కాంటాక్ట్స్' అనే శీర్షికతో ఒక అల్ట్రామోడరన్ నృత్యాన్ని ప్రదర్శించారు. మామూలు సంప్రదాయసిద్ధమైన బాలే నృత్యాలను ప్రదర్శించిన తర్వాత చిట్టచివరి అంశంగా వారు 'కాంటాక్ట్స్'ను ప్రదర్శించారు. అది 'ఎలెక్ట్రానిక్ మ్యూజిక్'తో కూర్చబడిన అంశం. స్టాక్ హాసెన్ అనే ఆయన ఆ 'సంగీతాన్ని' రచించారు. దానికి ఉల్ఫ్ గాంగ్ లీన్నర్ అనే ఆయన నృత్య రచన చేశారు. ఆయనే మరొ నర్తకితో కలిసి ఆ అంశాన్ని ప్రదర్శించారు. స్టాక్ హాసెన్ కూర్చిన విచిత్ర శబ్ద సంచయ తోరణాన్ని ఉల్ఫ్ గాంగ్ లీన్నర్ విచిత్ర ఆంగిక చాలనాల మాలగా తర్జుమా చేశారు. వారిద్దరూ కలిసి శబ్దాలను దృశ్యాలుగా, దృశ్యాలను శబ్దాలుగా తర్జుమా చేసి చూపించారు. శబ్దాలు సున్నితంగా ఉన్నప్పుడు నృత్యంలో ఆంగిక చాలనాలు సున్నితంగా ఉంటాయి. శబ్దాలు భయాన్ని కలిగించేవిగా ఉంటే వారి ఆంగిక చాలనాలలో భయం ప్రతిబింబిస్తుంది. శబ్దాలు ఆశ్చర్యకరంగా ఉంటే ఆంగిక చాలనాలు ఆశ్చర్యజనకంగా ఉంటాయి. శబ్దం ఉన్నంత సేపు వారు కదులుతూ ఉంటారు. నిశ్శబ్దం ఉన్నప్పుడు వారు నిశ్చలంగా బొమ్మలవలె నిలబడిపోతారు. రంగస్థలంపై నర్తకీ నర్తకులు రకరకాల కోణాలలో కదులుతూ, కలుసుకుంటూ, పెనవేసుకొంటూ, విడిపోతూ, నిశ్చలంగా నిలబడుతూ కెలైడీస్కోప్ లోని డిజైన్ల లాగా ఆకృతులను సృష్టిస్తూ ఉంటారు. ఆ నృత్యాన్ని గురించి వారు ఒక్క వాక్యంలో ఇలా పరిచయం చేశారు. "ఏ లోకానికి చెందినదో తెలియని ఒక విచిత్ర శబ్ద సంచయానికి రూపాలు కల్పించే ప్రయత్నం ఇది".

ఈ ఎలెక్ట్రానిక్ సంగీతాన్ని ఉపయోగిస్తూ పశ్చిమ జర్మనీ వారు కొన్ని ప్రయోగాత్మక చలన చిత్రాలు కూడా నిర్మించారు. అటువంటి ఒక చిత్రంలో మనుషులు లేకుండా, గుర్తించడానికి వీలు లేని ఏవేవో వస్తువులతో, యంత్రాలతో, రంగుల సెట్టింగులతో దృశ్యాలను చిత్రీకరించారు. అందులో అంతా ఆశ్చర్యమేతప్ప ఆనందించేందుకు ఏమీ కనిపించలేదు.

'ఎలెక్ట్రానిక్ మ్యూజిక్' అనే లేబుల్ తగిలించినా, తగిలించక పోయినా మొత్తానికి ఈ రకం సంగీతం అనేక దేశాలలో ముఖ్యంగా సినిమాలలో - వినిపిస్తూనే ఉంది. '2001 - ఎ స్పేస్ ఒడిస్సీ' అనే రోదసీ యాత్రలకు సంబంధించిన వైజ్ఞానిక చిత్రంలో నేపథ్య సంగీతం ఇలాగే ఉంది. ఆ చిత్రానికి ఆ సంగీతం తప్ప మరేదీ అతకదు.

రూపాలను శబ్దాలతో వ్యాఖ్యానించడంలో జీనియస్ అయిన మన విజయరాఘవరావు కూడా ఫిలిమ్స్ డివిజన్ వారి అనేక ప్రయోగాత్మక విచిత్ర చిత్రాలకు నేపథ్యంగా ఇటువంటి సంగీతాన్ని సమకూర్చారు. ప్రపంచఖ్యాతి పొందిన హైదరాబాద్ చిత్రకారుడు హుస్సేన్ పెయింటింగ్స్ పై ప్రత్యేకంగా నిర్మించబడిన "త్రూది ఐస్ ఆఫ్ ది పెయింటర్" (Through the eyes of the painter) అనే డాక్యుమెంటరీకి విజయ రాఘవరావు యిచ్చిన సంగీతంలో కొంతవరకు యీ ఎలెక్ట్రానిక్ సంగీతం ఛాయలు కనిపిస్తాయి. ఆ తర్వాత ఇంకా కొన్ని డాక్యుమెంటరీలలో కూడా ఆయన ఎన్నెన్నో 'జిమ్మిక్స్' చేశారు.

సంగీతంలో ఈ ప్రయోగాలు ఇంకా ముందుకుపోయి, కొంతకాలానికి 'కంప్యూటర్ మ్యూజిక్' బాగా ప్రచారంలోకి వచ్చేటట్లు కనిపిస్తోంది.

నండూరి పార్థసారథి
(1974 ఏప్రిల్ 26వ తేదీన ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమయింది)

Previous Post Next Post