'అద్భుతం', 'అమోఘం' ఇత్యాది పదార్థాలు మారిపోతున్న ఈ కాలంలో పండితులు, పత్రికలు, ఈ చిత్రాలను అద్భుతం, అమోఘం అని వర్ణిస్తే ఆశ్చర్యం లేదు. ఎలా ఉన్నాయని నిగ్గదీసి అభిప్రాయం అడిగితే చెప్పడం కష్టం. అందుకే-అనిర్వచనీయంగా ఉన్నాయంటే సరిపోతుందేమో. ఇక ఈ చిత్రాల స్థాయిని గురించి ప్రశ్నిస్తే-నూటికి 90 తెలుగు డబ్బింగు చిత్రాలు ఏ స్థాయిలో ఉంటున్నాయో ఇవీ అలాగే ఉన్నాయని చెప్పక తప్పదు.
'జగదేకసుందరి' చిత్రం హిందీ నుంచి డబ్ చేయబడింది. హిందీలో దీని పేరు 'సింహళ ద్వీపసుందరి'. ఇది జానపద చిత్రం. కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలు, ఇంద్రజాల మహేంద్ర జాలాలు, వికటాట్టహాసాలు, ట్రిక్కుసీనులు, హాస్యాస్పద సన్నివేశాలు, పాతివ్రత్య మహిమ మొదలైనవి ఈ చిత్రసుందరికి ఆభరణాలు, ప్రేక్షకులకు భరణాలు.
ఈ చిత్రంలో నళినీ ఛోంకార్, అనంత కుమార్, సప్రూ, బి.ఎం.వ్యాస్, సుందర్, టున్ టున్ మున్నగు వారు నటించారు. మాంత్రికుడుగా బి.ఎం. వ్యాస్ అలవాటు ప్రకారం బాగా నటించాడు. ఈ చిత్రానికి మాటలు మహారధి, పాటలు వీటూరి వ్రాశారు. సంగీతం టి.వి. రాజు సమకూర్చారు. ఛాయాగ్రహణం బాబూ భాయ్ ఉదేష్ నిర్వహించారు. దర్శకుడు శాంతిలాల్ సోనీ, నిర్మాతలు రూపక్ మూవీస్ వారు. డిస్ట్రిబ్యూటర్లు పూర్ణావారు.
ఈ చిత్రం కన్నడం నుంచి డబ్ చేయబడింది. ఆంగ్లేయుల నెదిరించి పోరాడిన భారత వీర నారీమణి కథ ఇది. ఇందులో కూడా కత్తి యుద్ధాలు, వీరోచిత సన్నివేశాలు, కడుపుబ్బ నవ్వించు హాస్యము, సంగీతము ఉన్నాయి. నటీ నటులు అమిత నటనా ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. ఛాయాగ్రహణము 'అద్భుతము'. శబ్ద గ్రహణము 'అమోఘము'.
ఈ చిత్రంలో బి.సరోజాదేవి, రాజకుమార్ ఎం.వి.రాజమ్మ, మున్నగు వారు నటించారు. దర్శకుడు బి.ఆర్.పంతులు.
నండూరి పార్థసారథి
(1961 అక్టోబర్ 08వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది)
Copyright © 2021 nanduri.com | All Rights Reserved | Site designed and maintained by CodeRhythm Works