Title Picture

పోషించే తాహతు లేనప్పుడు 'ఒకరి తర్వాత ఒకరు'గా అదే పనిగా సంతానాన్ని ఉత్పత్తి చేయటం చాలా ప్రమాదమనీ, పిల్లలకు చదువుసంధ్యలు చెప్పించలేక, బికారుల్లాగా దేశం మీదికి వదిలి, చివరికి ఆత్మహత్య కూడా చేసుకోవలసిన గతి పడుతుందనీ, అందుకే బుద్ధిగా ప్రభుత్వం చెప్పినట్లు కుటుంబ నియంత్రణాన్ని అమలు జరిపి, భూభారాన్ని తగ్గించాలనీ ప్రబోధించటం ఈ చిత్రం ఉద్దేశ్యం. ఉద్దేశ్యం చాలా చక్కనిదే. మిగతా సంపదలమాట ఎలా ఉన్నా, జనాభా ఉత్పత్తి విషయంలో మాత్రం మిగతా దేశాలన్నింటినీ ఓడించి ప్రథమ స్థానం అలంకరించటానికి ప్రయత్నిస్తున్న తరుణంలో మన దేశంలో ఇటువంటి చిత్రాల ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే ప్రయోజనాత్మక చిత్రం అనే పేరిట ప్రేక్షకులను విసిగించాలని కుట్రపన్నితే సహించబోరని మాత్రం నిర్మాతలందరూ గుర్తుంచుకోవాలి.

కుటుంబ నియంత్రణ మంత్రాన్ని జపించమని తమ్ముడు (దేవానంద్) ఎంత చెప్పినా వినక, వరుసగా ఆరుగురు పిల్లల్ని ఉత్పత్తి చేసి, ఏడో పిల్లని కంటూ భార్య (తరళ) మరణించగా, పిల్లల్ని పెంచలేక, తాను బికారియై, పిల్లల్ని బికారులుగా చేసి క్లైయిమాక్సులో ఆత్మహత్య చేసుకున్న ఒక మధ్య తరగతి అన్న (ప్రభు) విషాదగాధ ఇది. తర్వాత తమ్ముడు ఒక అమ్మాయిని (శారద) పెళ్లి చేసుకొని అన్నగారి పిల్లలందరినీ పెంచుకుంటాడు.

చిత్రాన్ని 11 1/2 వేల అడుగులలో ముగించినందుకు నిర్మాతలను తప్పక అభినందించాలి. శారద, తరళ అనే ఇద్దరు సరికొత్త తారలను ఇందులో పరిచయం చేశారు. రూపురేఖా విలాసాలు అంత చెప్పుకోతగ్గ విధంగా లేకపోయినా, ఇద్దరూ చాలా చక్కగా నటించారు. దేవానంద్ ధోరణికి అలవాటు పడినవారికి ఈ చిత్రం మరీ బావుంటుంది. కీ.శే. రాధాకిషన్ కూడా ఇందులో మంచి వేషం వేశాడు. ఈ చిత్రాన్ని ఆయనకు అంకితం చేశారు కూడా.

చిత్రం మొదట్లో కొన్నివేలఅడుగుల పాటు మరీ మందకొడిగా నడిచింది. దర్శకత్వం (రాజఋషి) కానీ, కెమెరాపనిగానీ, చెప్పుకోతగ్గ విధంగా లేవు. విశేషంగా చెప్పుకోతగింది బర్మన్ సంగీతం. 'చల్తీకానామ్ గాడీ' తర్వాత ఆయన మళ్లీ ఈ చిత్రంలో సంగీతంతో హాస్యాన్ని సృష్టించాడు. అందులోకంటే ఇందులో ఆయన సృష్టించిన హాస్యం ఉదాత్తంగా ఉంది. రకరకాల వాద్యాలతో సవ్యసాచిలా స్వరాలను ప్రయోగించాడు. పాటలన్నీ చక్కగా ఉన్నాయి.

వివాహితులయిన యువతీ యువకులందరూ ఈ చిత్రాన్ని ఒకసారి చూడటం ఎందుకైనా మంచిది. ముందు జాగ్రత్త కోసం బ్రహ్మచారులూ,చారిణిలూ కూడా చూడవచ్చును. వీరందరి కంటే వృద్ధులూ, చాదస్తులూ చూడటం మరీ అవసరం. ఒక్కమాటలో ఆబాలగోపాలం చూడదగిన చిత్రం.

నండూరి పార్థసారథి
(1960 జూన్ 05వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది)

Previous Post Next Post