కళాపరిషత్తు గోష్ఠి విశేషాలు: కొన్ని సూచనలు

అనంతపురంలో జరిగిన ఆంధ్ర నాటక కళాపరిషత్తు 23వ మహాసభలో వర్తమాన ఆంధ్ర నాటక రంగాన్ని గురించి రెండు రోజులు గోష్ఠి జరిగింది. కళాపరిషత్తు ప్రధాన కార్యదర్శి సంగీత నాటక అకాడమీ అధ్యక్షుడు అయిన పసల సూర్యచంద్రరావు గారు ఈ సంస్థల కృషిని వివరించారు.

మొదటి రోజు ఉదయం మహాసభ ప్రారంభోత్సవ సందర్భంలో ఆయన ఇలా అన్నారు: "ఏడాదికోసారి మనం భారీఎత్తున నాటక నాటికలపోటీలు జరుపుతున్నాం. షీల్డులు, కప్పులు బహూకరిస్తున్నాం. బాగానే ఉంది. కానీ కళాపరిషత్తు వారి ప్రథమ బహుమతి నందుకున్న నాటకాలు ప్రజాభిమానాన్ని చూరగొనలేకపోతున్నాయి. అంటే పరిషత్తు న్యాయమూర్తుల అభిరుచికి, ప్రజాభిరుచికి మధ్య అగాధం ఉన్నదన్నమాట. అంటే ప్రజలు ఈ నాటకాలను హర్షించదగ్గ స్థాయికి రాలేదా? కురుక్షేత్రంవంటి పౌరాణిక నాటకాలలో ముగ్గురు కృష్ణులు, ఐదుగురు ధర్మరాజులు నటిస్తుంటే ఆనందించే ప్రజలు ఈ నాటకాలను ఎందుకు మెచ్చటం లేదు? దీనికి కారణం ఏమిటి? దీనికి పరిష్కారం ఏమిటి? వీటిని గురించి ఇక్కడ చేరిన పెద్దలంతా యోచించాలి. నాటకాలు బహుజనరంజకంగా ఉండాలి. ప్రయోజనాత్మకంగా ఉండాలి. ఒకానొక సత్యాన్ని వెల్లడించేవిగా ఉండాలి. ఇవన్నీ ఇమిడిన నాటకాలు వెలువడాలి. ప్రజలు మెచ్చలేని నాటకాలకు బహుమతులివ్వటం కోసం ఏటా నాలుగు రోజుల పాటు ఇలా రంగస్థలం మీద తైతక్కలాడినందు వల్ల ప్రయోజనం లేదు".

కళాపరిషత్తు పోటీలలో బహుమతులు పొందిన నాటకాలకు ప్రజాదరం లభించడం లేదన్న విషయాన్ని డి.వి. నరసరాజు కూడా ప్రస్తావించారు. ఆయన ఇలా అన్నారు: "ఈ కళా పరిషత్తు పోటీలకు వచ్చేవారంతా ఔత్సాహిక నాటక సమాజాలవారే. వీళ్లకి పోషకులు, రాజపోషకులూ ఎవరూ ఉండరు. నాటకాల వల్ల వీళ్లకి డబ్బు సంపాదన పైసా కూడా లేకపోగా, పై పెచ్చు చేతి డబ్బే ఖర్చు అవుతుంది. కళా పరిషత్తు వారి యోగ్యతా పత్రం వీరికి ఎందుకూ ఉపయోగించదు. "మా నాటకానికి పరిషత్తు పోటీలలో ప్రథమ బహుమతి వచ్చింది చూడండి" అని టిక్కెట్టు పెట్టి ప్రదర్శిస్తే దమ్మిడీరాదు. అయినా ఈ సమాజాలవాళ్లు ఇంత శ్రమపడి, చేతి డబ్బు ఖర్చు పెట్టుకుని, ఎంతో దూరం నుంచి ఈ పోటీలకు ఎందుకు వస్తున్నారూ అంటే అది కేవలం కళ పట్ల ఉండే అభిమానం వల్లనే. ఈ నాటకాల వల్ల వాళ్లకి మిగిలేది ఉత్సాహం ఒక్కటే. ఇన్ని సంవత్సరాలలో ఆంధ్రనాటక కళాపరిషత్తు సాధించిన దేమిటీ అంటే - ఒక్కటి నికరంగా చెప్పుకోవచ్చు. ఈ పరిషత్తు ఎంతో మంది ఉత్తమ రచయితలను, నటులను సినిమా రంగానికి అందించింది. ఈ పరిషత్తు గొప్ప రచయితలను, నటులను తర్ఫీదు చేసిందని చెప్పుకోవచ్చు.

"నాటక ప్రదర్శనాలను వృత్తిగా పెట్టుకుని నిర్వహించగల పరిస్థితి వచ్చేవరకు మన నాటకరంగం ఇలాగే ఎదుగూ బొదుగూ లేకుండా ఉంటుంది. నేటి మన నాటక సమాజాలవారు నాటక రంగానికే జీవితాన్ని అంకితం చేసి, దానినే వృత్తిగా పెట్టుకుని, దానిపైనే జీవించగల స్థితిలో లేరు. అంత స్తోమతులేదు. నాటకాలను వ్యాపారంగా నిర్వహించుకోలేకపోతున్నారు. అటువంటి అవకాశాలు కల్పించి నాటకరంగాన్ని సజీవం చెయ్యడానికి ప్రభుత్వం, ప్రజలు కృషి చేయాలి. ప్రయోగయోగ్యమైన, ప్రయోజనాత్మకమైన, ప్రజారంజకమైన ఉత్తమ నాటకాల రచనకు పోటీ నిర్వహించాలి. ప్రభుత్వం స్వయంగా నిర్మించనక్కర్లేదు. ఆయా పట్టణాల పురపాలక సంఘాల చేత నిర్మింపచేయాలి. లక్షలు ఖర్చుపెట్టి నిర్మించకపోయినా కనీసం 50 వేల రూపాయలు పెట్టి నిర్మించవచ్చు. అట్టి నాటకశాలలకు కొన్ని కనీసపు హంగులు ఉండాలి. రంగస్థలాల నిర్మాణానికి-కొలతల విషయంలో - ప్రామాణికత ఉండాలి".

వడ్లమూడి సీతారామారావు గారు వెల్లడించిన అభిప్రాయాలు ఇవి:

"మన ప్రజలలో నూటికి 80 మంది గ్రామీణ జనం. వాళ్ల అభిరుచిని, అవగాహన శక్తిని దృష్టిలో ఉంచుకుని రచనలు చేయాలి. ప్రజాసామాన్యం ఆనందించాలంటే నాటకాలలో తగుమాత్రపు సంగీతం అవసరం. అంటే పద్యాలను, పాటలను అసందర్భంగా ప్రవేశపెట్టాలని గానీ, పూర్తిగా ప్రజల స్థాయికి దిగజారిపోవాలని గానీ, నా ఉద్దేశం కాదు. కళాత్మకంగానూ, వాస్తవికంగానూ, ప్రజారంజకంగానూ కూడా ఉండే విధంగా నాటకాలు వ్రాయాలి, ప్రదర్శించాలి. అంటే-అటు పూర్వపు పద్య నాటకాలకూ, ఇటు ఇప్పటి సాంఘిక నాటకాలకూ మధ్యతరహా నాటకాలను రూపొందించాలి".

"ఆరుబయట రంగస్థలాలు అభివృద్ధి కావాలని చాలామంది అంటున్నారు కానీ వాటి వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు. నాటకశాలలో ఉండే సౌకర్యాలు ఆరుబయట రంగస్థలంలో ఉండవు. థియేటర్ సౌకర్యాలు ఎక్కడ ఉంటాయో అక్కడే నాటక సమాజాలు వృద్ధి చెందుతాయి. ఈ విషయం-ఈ ఏడాది ఇక్కడి పోటీలకు వచ్చిన నాటకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. వీటిలో ఎక్కువభాగం హైదరాబాదు, విజయవాడ వంటి పెద్ద నగరాల నుంచి వచ్చినవే. అక్కడ మంచి హంగులున్న నాటక శాలలు ఉన్నాయి. ఇటువంటి నాటకాలకు నాటకశాలలే కావాలి కాని ఆరుబయట రంగస్థలాలవల్ల లాభం లేదు".

ప్రతిదానికీ ప్రభుత్వ సహాయాన్ని ఆపేక్షించడం మంచిదికాదని కళాపరిషత్తు అధ్యక్షుడు, మద్యనిషేధ శాఖామంత్రి అయిన ఎం.ఆర్. అప్పారావు గారు అన్నారు. ప్రయోజనాత్మకమైన ఒక నాటకాన్ని రచించాలన్న ఉత్సాహం రచయితలో ఉంటే పోటీ పెట్టినా పెట్టకపోయినా, బహుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా రచిస్తాడనీ, డబ్బు ఇచ్చినంతమాత్రానే మంచి రచనలు పుట్టుకురావనీ ఆయన అన్నారు. "100 కోట్ల రూపాయలు ఇస్తే నాగార్జున సాగర్ డామ్ కట్టించగలం కానీ, కాళిదాసు శాకుంతలం వంటి నాటకాన్ని రచింపచేయలేము" అన్నారు ఆయన. "కళాపరిషత్తు కోసం కొన్ని లక్షలు పోగుచేసి, ఆ డబ్బు పెట్టుకుంటూ ప్రతి ఏటా పోటీలు నిర్వహించడం మంచిది కాదు. అలాచేస్తే సంస్థకు బోలెడు నిధి ఉంది కదా అనే నిర్లిప్తత ఏర్పడుతుంది. అందుచేత-శాసనసభ్యులు ఐదేళ్లకొకసారి ప్రజలను వోట్లు అడిగి, తద్వారా ప్రజలకు తమపైగల విశ్వాసాన్ని నిరూపించుకున్నట్లే-పరిషత్తు కూడా ఏడాదికోసారి ప్రజల నుంచి విరాళాలు అడిగి పుచ్చుకోవాలి. పరిషత్తు ఎప్పటికప్పుడు తన కృషిని ప్రజల దృష్టికి తీసుకురావాలి. ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలి. ప్రభుత్వాభిమానం కంటే ప్రజాభిమానం ముఖ్యం" అని అప్పారావు అన్నారు.

జమ్మలమడక మాధవరామశర్మ గారు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. నటీనటులకు శిక్షణ ఇచ్చేందుకు నాటక విద్యాలయాలు అవసరమనీ నాటక రంగంలో విశేషానుభవం గడించినవారు తమ అనుభవాలను గ్రంథరూపంలో వెలువరించడం ఎంతైనా మంచిదనీ ఆయన చెప్పారు.

పసల సూర్యచంద్రరావు గారు సంగీత నాటక అకాడమీ కృషిని వివరిస్తూ 'నాట్యకళ' పత్రికను ఇక అకాడమీయే నిర్వహిస్తుందనీ, దాని కోసం ప్రత్యేకంగా ఒక ప్రెస్సు కూడా కొనబోతున్నామనీ చెప్పారు. నటీనటులకు శిక్షణ ఇవ్వడంకోసం, నాటక ప్రయోగంలో శిక్షణ కోసం విజయవాడలో ఒక నాట్య విద్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వపు గ్రాంటుతో స్థాపించబోతున్నామనీ, సంగీత, నృత్య, నాటకాలకు సంబంధించిన అముద్రిత ప్రాచీన గ్రంథాలను సేకరించి ఒక గ్రంథాలయాన్ని నెలకొల్పుతున్నామనీ కూడా ఆయన చెప్పారు. కళారంగానికి జీవితాలను అంకితం చేసిన పాతికమంది వృద్ధ కళాకారులకు నెలకు 40 రూపాయల చొప్పున అకాడమీ ఇస్తున్నదని వారు తెలియజేశారు. అకాడమీపైనా, ప్రభుత్వంపైనా కొందరు చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ ఆయన ఆవేశంగా మాట్లాడారు: "విమర్శించడం చాలా తేలిక. ఎవరైనా చేయచ్చు. ఎలాగైనా చేయచ్చు. ఈ కార్యనిర్వహణలో ఎన్నెన్ని సాధక బాధకాలు ఉంటాయో నా స్థానంలో ఉంటే తెలుస్తాయి. తెలిస్తే ఇలా విమర్శించరు. మాకు దమ్మిడీ జీతం లేదు. కానీ ఎందుకు చేస్తున్నామంటే-'కళాకండూతి'వల్ల చేస్తున్నాం.

"ప్రభుత్వం సహాయం చేయటం లేదని విమర్శిస్తారు. సహాయం అడిగేముందు ఈ నాటక సమాజాలవారు తమ నైతిక స్థాయిని పెంచుకోవాలి. సంగీత నాటక అకాడమీ ఉత్తమ నాటకానికి 7500 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. ఆ నాటకాన్ని కొన్ని ముఖ్య కేంద్రాలలో ప్రదర్శించడానికి ఒక నాటక సమాజానికి డబ్బు అప్పగించింది. కాని ఆ సమాజం వారు ఆ కేంద్రాలలో నాటకాన్ని ప్రదర్శించకుండానే ప్రదర్శించినట్లు దొంగ సంతకాలు చేయించి డబ్బులు జేబులో వేసుకున్నారు. కళాకారుల నైతిక స్థాయి ఇలా ఉంటే ప్రభుత్వం ఎలా నమ్మి సహాయం చేస్తుంది?"

పసల సూర్యచంద్రరావు గారు ఘాటుగ చేసిన విమర్శకు మరింత ఘాటుగా ఈయుణ్ణి జగన్నాధాచార్యులు గారు సమాధానం చెప్పారు: "ప్రభుత్వం ఏడువేలో, పదివేలో ఇవ్వగానే సరికాదు. పాత్రత, అర్హత తెలుసుకుని ఇవ్వాలి. ఎవరు దొంగలో, ఎవరు యోగ్యులో తెలుసుకోలేనంత గుడ్డిగా ఉందా ఈ ప్రభుత్వం. యోగ్యత తెలుసుకోకుండా ఎవరి చేతులోనో డబ్బు పెట్టి, వాళ్లు మోసం చేశారని నాటక రంగానికి అవినీతిని అంటగట్టడం మంచిది కాదు."

"ఇక ప్రభుత్వం ఎంతవరకు సహాయం చేయగలదు అని అంటారు. ప్రభుత్వం వినోదపు పన్ను అంటూ ఒకటి వసూలు చేస్తోంది. ఆ వసూలయిన మొత్తంలో కొంత శాతం ఖచ్చితంగా నాటకరంగం అభివృద్ధి కోసం ఖర్చు పెట్టవచ్చు. ప్రతి పట్టణానికి ఒక నాటకశాలను నిర్మించవచ్చు".

అసలు ఆంధ్ర నాటకరంగానికి సంబంధించిన విమర్శలుగానీ, ప్రశంసలుగానీ ప్రధానంగా ఆంధ్రనాటక కళాపరిషత్తుకే వర్తిస్తాయి. ఎందుకంటే మన నాటకరంగం ఈనాడు ఈ స్థాయిలో ఉండటానికి ప్రముఖ బాధ్యతపరిషత్తుదే. ఈ స్థాయి గర్వించతగినదవునా కాదా, పూర్వం కంటే దిగజారిందా, ఉన్నతం అయిందా అనేది వేరే విషయం. కానీ 1929లో ఈ పరిషత్తు చరిత్రే ఆంధ్ర నాటక చరిత్ర, ఆంధ్రనాటక చరిత్రే ఈ పరిషత్తు చరిత్ర అని చెప్పుకోవచ్చు. ఈ 35 ఏళ్లలో పరిషత్తు పరిధిలోకి రాకుండా ఆంధ్ర నాటక రంగంలో ఏ పరిణామమూ రాలేదు. పరిణామం అనండి-పరిణతి అనండి-దానికి కారణం పరిషత్తే. ఇప్పటికీ పరిస్థితి అలాగే ఉంది.

నాటకాల ఉత్తమత్వ నిర్ణయానికి పరిషత్తు పోటీలే ప్రమాణమైనాయి. ఈ పోటీల నిబంధనలకు అనుగుణంగా నాటకాలు రూపొందుతున్నాయి. పరిషత్తు ఏ మూసలో పోస్తే ఆ విధంగా తయారవుతూంది తెలుగు నాటకం. పరిషత్తు తెలుగు నాటక రంగానికి ఏకచ్ఛత్రాధిపత్యం వహిస్తూంది. తెలుగు నాటకం పరిషత్తు చేతిలోని కీలుబొమ్మ అయింది. బొమ్మ సరిగా ఆడాలంటే ఆడించే వారు సరైనవారు కావాలి. అందుచేత పరిషత్తు క్షేమంగా, ఆరోగ్యకరంగా ఉండటం, ఋజుమార్గంలో నడవటం మన అందరికీ అవసరం, వ్యక్తులకంటే సంస్థ ముఖ్యం. వ్యక్తులు ఎవరైనా, ఎటువంటివారైనా, వారు ఉన్నా, మారినా సంస్థ ఒడుదుడుకులకు లోనుకాకుండా చేయాలి. ఇటువంటి సంస్థ ఇది ఒక్కటే కావటం వల్ల తెలుగు నాటకరంగంలో ఏ అభివృద్ధి వచ్చినా ఆ కీర్తి దీనికే రావటం సహజం. అయితే పరిషత్తులోని వ్యక్తులకు అది గర్వించతగిన విషయం కాదు.

నేర్చుకునే గుణం మనలో ఉండాలి గానీ, అనుభవం చాలా పాఠాలు నేర్పుతుంది. అనుభవం నేర్పిన పాఠాల వల్ల-ఒకసారి జరిగిన పొరపాటును ఇంకోసారి జరగకుండా, ఒకసారి పడిన ఇబ్బంది ఇంకోసారి పడకుండా దిద్దుకోగలిగారా? పోటీ నాటకాల ప్రదర్శనకు చేసే సౌకర్యాలు ఒక యేడాదికంటే ఇంకో ఏడాది మెరుగుగా ఉంటున్నాయా? అసలు పరిషత్తు పురోగమిస్తూందా? ఈ ప్రశ్నలకు అవునని సమాధానాలు చెప్పలేము. పొరపాట్లు జరుగుతాయి. రెండోసారి జరగకూడదు. జరగకుండా కనీసం గట్టి ప్రయత్నమైనా చేయాలి.

విమర్శలు, సూచనలు చేసేవారు లిఖితపూర్వకంగా చేస్తే సంతోషిస్తామని పసల సూర్యచంద్రరావు గారు అన్నారు.

నా సూచనలు సవ్యాఖ్యానంగా ఇక్కడ పొందుపరుస్తున్నాను: పరిషత్తుకు వచ్చిన దాదాపు అన్ని సమాజాలవారితో మాట్లాడి, వారి ఇబ్బందులను తెలుసుకున్న మీదట ఈ అభిప్రాయాలు ఏర్పరచుకున్నాను. ఈ సూచనలన్నీ ఆచరణయోగ్యమైనవీ, సాధ్యమైనవీ అని భావిస్తున్నాను.

  1. పరిషత్తు మహాసభ నిర్వహించడానికి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసి, ఆ ఖర్చు మొత్తాన్ని ఎవరు భరిస్తే వారి ఊరు పోయి మహాసభను నిర్వహిస్తున్నారు. ఖర్చు భరించే బాధ్యతను నెత్తిన వేసుకున్నవారు ఊరూరూ తిరిగి, పరిషత్తు యావజ్జీవ సభ్యులుగా చేర్పించడం ద్వారానూ, విరాళాలు సేకరించడం ద్వారానూ డబ్బు పోగుచేసి, కొంత డబ్బు సంగీత నాటక అకాడమీ నుంచి తీసుకుని మహాసభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతికాదు. మనకు ఉన్న ఒక్కగానూ ఒక్క సంస్థ ఈ పరిషత్తు. డబ్బు ప్రసక్తి లేకుండా, ప్రతి ఏడాది ఖచ్చితంగా భారీ ఎత్తున, సకల హంగులతో నాటక పోటీలు నిర్వహించగలిగి ఉండాలి. పరిషత్తు వారు ఎప్పటికప్పుడు ఈ సారి ఏదో విధంగా గడిచిపోతే చాలుననుకుంటున్నారు. ఎప్పటి కప్పుడు ఇలా పరగడుపుగా ఉంటే మన నాటక రంగం ఇంకా వంద సంవత్సరాలకైనా ఇలాగే ఉంటుంది. ఈ సంస్థకు కొన్ని లక్షల రూపాయల శాశ్వతనిధి ఉండాలి, ప్రభుత్వంలోనూ, ప్రజలలోనూ కూడా పలుకుబడికలవారు ఈ పరిషత్తు నిర్వాహకవర్గంలో ఉన్నారు. వారు గట్టిగా కృషిచేస్తే ఈ నిధిని ఏర్పాటు చేయటం కష్టం కాదు.
  2. మహాసభ కార్యక్రమంలో సన్మానాల కంటే, ఉపన్యాసాలకంటే నాటక నాటిక ఏకపాత్రాభినయ పోటీలు ముఖ్యమైనవి. అందుచేత ఈ ప్రదర్శనలకు సకల సౌకర్యాలుగల నాటకశాల అవసరం. నాటకశాల బాగా లేకపోతే నాటకాలు బాగుండవు. ఆరుబయట రంగస్థలాన్ని నమ్ముకుంటే ఎన్ని ఇబ్బందులకు గురికావలసి వస్తుందో అనంతపురంలో అనుభవమైంది. నాటకాలు నాటక మందిరాలలో ప్రదర్శిస్తేనే రక్తికడతాయి. రోడ్డు పక్క తడికలు కట్టి నాటకాలు ఆడిస్తూ, మన నాటకాలు సాంకేతికంగా అభివృద్ధి చెందడం లేదని వాపోవటం అనవసరం. ఈ పోటీలు ఏడాది కొక్కసారే జరిగేవి కాబట్టి అన్ని హంగులూ ఉన్న నాటక మందిరం ఎక్కడుందో అక్కడికి వెళ్లి నిర్వహించడం మంచిది. అటువంటి హంగులు ఉన్న నాటకమందిరం మన రాష్ట్రంలో ఒక్కటే ఉంది. అది హైదరాబాదులోని రవీంద్రభారతి. అటువంటి నాటక మందిరాలు, ఇంకో ఐదారైనా వెలిసే వరకూ ఈ పోటీలను రవీంద్రభారతిలో నిర్వహించడం మంచిది. హైదరాబాదు రాజధాని కనుక సర్కారు, తెలంగాణా, రాయలసీమ అనే భేద భావాలకు తావు ఉండదు. నాటకాలు ప్రదర్శించేవారికి రవీంద్రభారతిలో అయితే ఎటువంటి ఇబ్బందులూ ఉండవు. నాటకం రక్తి కడుతుంది. అన్ని జిల్లాలలో ప్రజలకూ ఈ నాటకాలను చూసే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఇలా తడవకు ఒక ఊళ్లో ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పవచ్చు. ఆ ఉద్దేశం ఉంటే ఈ పోటీలలో బహుమతులు పొందిన నాటక నాటికలను పరిషత్తు ప్రత్యేకంగా ఆయా పట్టణాలలో ప్రదర్శించడం మంచిది. వీటిపై వచ్చే ఆదాయం పరిషత్తు నిధిలో చేరుతుంది. ఆ నటీనటులను ప్రోత్సహించినట్లూ అవుతుంది. అయితే దీనికి ఇంతకు ముందు సూచించినట్లు శాశ్వత నిధి అవసరం.
  3. ఈ పోటీలు జరిపేకాలం కూడా శాశ్వతంగా నిర్ణయించాలి. 'ఈ ఏడాది ఎప్పుడు జరుపుదాం' అని ప్రతిసారీ తర్జన భర్జనలు పడకుండా, ప్రతి సంవత్సరం ఫలానా నెలలో ఫలానా వారంలో పరిషత్తు మహాసభ జరుగుతుంది అని ఖచ్చితంగా నిర్ణయించి ప్రకటించాలి. ఇలా చేస్తే ప్రతిసారీ తేదీ నిర్ణయం కోసం నాటకాలవారు ఎదురు చూడవలసిన అవసరం ఉండదు. వేసవిలో జరపడం వల్ల చాలా ఇబ్బందులున్నాయి. వాతావరణం బాగుండదు. ఉత్సాహం ఉండదు. అంతకంటే జనవరి మొదటివారంలో జరపడం అనుకూలంగా ఉంటుంది. ఏ పట్టణంలోనైనా వినోదాలు, వేడుకలు, ఉత్సవాలు, సంతలు జరిగేది ఈ ఋతువులోనే, అప్పుడు అందరికీ చేతిలో డబ్బు ఆడుతూ ఉంటుంది. వాతావరణం చల్లగా ఉల్లాసకరంగా ఉంటుంది. హైదరాబాద్ లో ఎం.ఎల్.ఏ. క్వార్టర్స్ లో గానీ, మరోచోటగాని నటీనటులకు, ఆహ్వానితులకు బస ఏర్పాట్లు చేయవచ్చు. మిగతా పట్టణాలలోకంటే హైదరాబాదులో ఇటువంటి ఏర్పాట్లు చేయటం తేలిక. జనవరి మొదటివారంలో పోటీలు జరుగుతాయని ఖచ్చితంగా నాటకాలవారికి తెలిసి ఉంటుంది కనుక వారు సెప్టెంబరు నుంచి సన్నాహాలు ప్రారంభించుతారు. డిసెంబరు మొదటివారం నుంచి స్క్రూటినీ ప్రారంభించవచ్చు.
  4. పరిషత్తు సొంత ఆస్తిగా తెరలు, లైట్లు, మైకులు, సెట్టింగులు మొదలయిన పరికరాలు సమృద్ధిగా ఉండాలి. వీటిలోపం వల్ల నాటకాలు రక్తి కట్టకపోవటం అంటూ జరగకూడదు. నాటక సమాజాలవారు అడిగిన సాంకేతిక సౌకర్యాలు యావత్తూ లేదనకుండా అందజేయగలిగి ఉండాలి. ఈ సాంకేతిక సామగ్రి కనీసం ఆంధ్ర విశ్వవిద్యాలయంవారికి ఉన్నంతయినా ఉండాలి. తెలుగు నాటకం ఎదుగుబొదుగులు కేవలం ఈ పరిషత్తుపై ఆధాపడి ఉన్నాయని ముందే చెప్పుకున్నాం. అందుచేత పరిషత్తు సమకూర్చే సాంకేతిక సౌకర్యాలమీదనే తెలుగు నాటకం అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఈ సౌకర్యాలు విస్తృతమవుతున్నకొద్దీ నాటక రచయితలకు స్వేచ్ఛ పెరుగుతుంది. కొత్త ప్రయోగాలు ఎన్నో చేయడానికి వీలుంటుంది.
  5. పరిషత్తు పోటీలలో ప్రథమ బహుమతి పొందిన నాటక నాటికల వారికే ఇప్పుడు ప్రయాణం ఖర్చులు ఇస్తున్నారు. అలాకాకుండా పోటీకీ వచ్చిన సమాజాలన్నింటికీ ప్రయాణం ఖర్చులు ఇవ్వడం మంచిది. రెండు మూడు నెలలు శ్రమపడి, దాదాపు వెయ్యి రూపాయలకు పైగా డబ్బు ఖర్చు పెట్టుకుని, ఎంతో దూరం నుంచి పోటీలకు వస్తున్నారు కొందరు. వారికి ఇతర ఖర్చులమాట ఎలా ఉన్నా ప్రయాణం ఖర్చులయినా గిట్టటం అవసరం.
  6. సెలవు దొరకక జీతం నష్టానికి సిద్ధపడి వస్తూ ఉంటారు కొందరు. అమ్మమ్మ చచ్చిపోయిందనీ, తాతయ్య చచ్చిపోయాడనీ, నాన్న గారికి సీరియస్ గా ఉందనీ దొంగ అబద్దాలు ఆడి నానా అవస్థలూ పడి సెలవు సంపాదిస్తూ ఉంటారు కొందరు. ఈ బాధలేకుండా ప్రభుత్వం ఈ పోటీలలో పాల్గొనేవారికి స్పెషల్ లీవ్ మంజూరు చేయాలి. ఇదికాక-పోటీలలో బహుమతి పొందినవారు రాష్ట్రమంతా పర్యటించి వివిధ కేంద్రాల్లో ఈ నాటకాలు ప్రదర్శించేందుకు కూడా సెలవు మంజూరు చేయాలి. నాటకాలపై అభిలాషవల్ల వారి ఉద్యోగాలకు మొప్పం ఉండకూడదు.

ఈ సూచనలను పరిషత్తువారు శ్రద్ధగా పరిశీలిస్తారని ఆశిస్తున్నాను.

నండూరి పార్థసారథి
(1964 జూన్ 3వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది)

Previous Post