Title Picture

(కవితా సంకలనం, సంపాదకుడు : అడపా శివాజీ నాయుడు ; ప్రచురణ, ప్రాప్తిస్థానం : అమరసాహితి, గోషామహల్, హైదరాబాదు ; 1/8 డెమ్మీ సైజు : 77 పేజీలు; వెల : రూ. 1.50 పైసలు)

'అర్ధం లేని పదాల అల్లిక గజిబిజి' మెచ్చుకొనే వారందరూ తప్పక పారాయణం చేయవలసిన పుస్తకం 'రాత్రి'. తెలుగుసాహిత్యంలో అభ్యుదయ కవిత్వం వేసిన క్రొంగొత్త వెర్రితల 'రాత్రి'. అభ్యుదయ కవి ననిపించుకోవాలన్న తహతహ, చెప్పేందుకు విషయమేమీ తోచక, చెప్పకుండా ఉండలేక రచయితలు పడే మధన ఇందులో చాలా గేయాలలో కనిపిస్తాయి. 'అర్థం కానిదంతా అద్భుతం కాబోలు' అని అనుకునే అమాయక పాఠకులు ఉన్నంతవరకూ ఈ రకం కవిత్వం బజారున పడుతూనే ఉంటుంది. దేశంలో నిజమైన అభ్యుదయ సాహిత్యం కూడా ఉత్పత్తి అవుతూనే ఉంది. కాని నకిలీ సాహిత్యం పెచ్చు పెరుగుతున్నందువల్ల దేనిని స్వీకరించాలో, దేనిని త్రోసిపుచ్చాలో తెలియక సామాన్య పాఠకులు బెంబేలు పడుతున్నారు. భావంలో, భాషలో స్పష్టతగల చక్కని గేయాలుకూడా నాలుగైదు ఈ పుస్తకంలో ఉన్నాయి. కానీ ఎక్కువ భాగం అయోమయం, గజిబిజి. ముఖచిత్రం కూడా అలాగే ఉంది.

నండూరి పార్థసారథి
(1965 జనవరి 15వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమయింది)

Previous Post Next Post