Namminabantu Title Picture

సంక్షిప్త చిత్రం

గత జూలై నెలలో జరిగిన శాన్ సెబాస్టియన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించేనిమిత్తం రాష్ట్రపతి రజతపతకాన్ని పొందిన శంభూఫిలింస్ వారి 'నమ్మినబంటు' చిత్రాన్ని స్పెయిన్ కు పంపేముందుగా, భారత ప్రభుత్వపు విదేశాంగ వ్యవహారాల శాఖవారు చిత్రంనిడివిని 18 వేల అడుగులనుంచి 9 వేల అడుగులకు కుదించారు. ఈ సంక్షిప్తప్రతిని క్రిందటి మంగళవారం నాడు నవయుగ ఫిలింస్ వారు విజయవాడలోని అలంకార్ థియేటర్ లో ప్రతికలవారికి ప్రత్యేకంగా చూపించారు.

కళా ప్రమాణాల ప్రమేయం లేకుండా ఏదో విధంగా 18 వేల అడుగుల చిత్రాన్ని నిర్మించడానికి అట్టే ప్రయాసపడ నక్కరలేదు. ప్రతిభా అవసరం లేదు. కాని ఆ చిత్రాన్ని 9 వేల అడుగులకు కుదించడం మాత్రం ప్రతిభ, ప్రయాసలతో కూడుకున్నపని; ముఖ్యంగా తెలుగు చిత్రాలను కుదించడం మరీ క్లిష్టమైన వ్యవహారం.

కత్తిరింపు

'నమ్మినబంటు' చిత్రాన్ని పస చెడకుండా సగానికి సగం కత్తిరించి వేయగలిగిన 'కత్తెర'ను ఎంతైనా ప్రశంసించవలసి వుంది. చిల్లర మల్లర సన్నివేశాలను, పాటలను, నృత్యాలను, రేలంగికి ప్రత్యేకంగా కేటాయించిన సన్నివేశాలనూ, ప్రయోజనంలేని పొల్లు సంభాషణలను, స్టూడియో కృతక వాతావరణం మరీ ఎబ్బెట్టుగా కనుపించే దృశ్యాలను 'కత్తెర' చిత్రవధ చేసింది. మొత్తం 10 పాటలలో 5 పాటలు యిందులో మిగిలాయి. ఇవి కథలోని కీలక సన్నివేశాలలో వుండటం వల్ల గత్యంతరంలేక వుంచవలసి వచ్చింది. పాత చిత్రం చూసినవారికి యీ చిత్రం చాలా తెరిపినిస్తుంది.


ఈ చిత్రం శాన్ సెబాస్టియన్ లో బహుమతులేమీ అందుకోలేదు. గొప్పగా వుందని లోపాయికారీగా ప్రశంసలు అందుకోలేదు. 9 వేల అడుగుల కత్తిరింపుకు యీ చిత్రం అవకాశం యిచ్చిందని తెలిస్తే వారు యింకా ఎటు వంటి వ్యాఖ్యానాలు చేసేవారో!

మన చిత్రాలలోని సెట్స్, పాత్రల కదలికలు, సంభాషణలు నాటకాలను జ్ఞప్తికి తెస్తూ వుంటాయి. పాత్రలు కెమెరాకు ఎట్ట ఎదురుగా నిలబడి, వుపన్యాసాల ధోరణిలో వుండే సంభాషణలను అప్పజెబుతూ వుంటాయి. నాటకాలలో కూడా మోటు అయిపోయిన స్వగతాలు, జనాంతికాలు యిప్పటికి మన చిత్రాలలో కనిపిస్తున్నాయి. లంకంత సెట్ వేస్తేనే గాని మన వారు కెమెరాను తిప్పుకోలేరు. దేశంలోగానీ, విదేశాలలో గానీ దక్షిణ భారత చిత్రాలకు ఆదరణ లేకపోవడానికి యీ లక్షణాలు కొంత కారణం. శాన్ సెబాస్టియన్ చిత్రోత్సవానికి విచ్చేసిన పెద్దలు కూడా యీ లక్షణాలను విమర్శించారు.

'నమ్మినబంటు' చిత్రాన్ని చూసిన విదేశీయులు ఆంధ్రులు బాగా వాగుడుకాయలని భావించి వుండవచ్చును. ఈ చిత్రం తెలుగురానివారికి చక్కగా అర్థం కాదు. సుదీర్ఘమైన సంభాషణలను అనువదించి సబ్ టైటిల్స్ చూపడం వలన చిత్రాన్ని చూడడం కష్టతరం అవుతుంది. ఏమయినా తెలుగు చిత్రాలను కుదించి వాటిలో నుంచి మంచిని ఏరడం చాలా వృధాప్రయాస.

కళాప్రమాణాలు

చిత్రాల నిడివి తగ్గినకొద్దీ కళా ప్రమాణాలు పెరుగుతాయన్న సత్యాన్ని యీ సంక్షిప్త చిత్రం రుజువు చేస్తుంది. తక్కువ నిడివిగల చిత్రాలలో 'చెత్త' సన్నివేశాలకు, 'వెకిలి' నృత్యాలకూ, తావు వుండదు. కథ సూటిగా, క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. నిడివి తగ్గిన కొద్దీ బిగువు పెరుగుతుంది. అన్నిటి కంటే ముఖ్యంగా నిర్మాణానికి 'వ్యయ ప్రయాసలు' తగ్గుతాయి.

చిత్రాల నిడివిని నిర్మాతలు స్వచ్ఛందంగా తగ్గించుకోవాలని యిటీవల భారత ప్రభుత్వం ఆదేశించడంతో పలువురు ప్రముఖులు ఆందోళన ప్రకటించారు. కాని వారి ఆందోళన ఆధార రహితమని యీ చిత్రం చూస్తే అనిపిస్తుంది. పాటలు, నృత్యాలూ లేకుంటే చిత్రాలను ప్రజలు ఆదరించరనడం పొరబాటు. అన్నీ తక్కువనిడివి చిత్రాలే వుత్పత్తి అవుతూ వుంటే ప్రజలు తప్పనిసరిగా ఆ చిత్రాలనే చూస్తారు. అలవాటు పడతారు. చిత్రాల నిడివి తగ్గడం ప్రేక్షకులకూ ప్రభుత్వానికీ, పరిశ్రమకూ కూడా శ్రేయోదాయకం.

స్థానికంగా మన ప్రేక్షకులను తృప్తిపరచేందుకు పాటలు, నృత్యాలు మొదలయిన అన్ని హంగులనూ వుంచినప్పటికీ, అంతర్జాతీయ చిత్రోత్సవాలలో ప్రదర్శించే అవకాశం వచ్చినప్పుడు సులభంగా ఎడిట్ చేసుకోవడానికి వీలుగా ముందే ఆలోచించి చిత్రాలను తీయడం ఉత్తమం, దీని వలన ప్రభుత్వం వారి కత్తెరకు వృధా ప్రయాస తప్పిపోతుంది.

'నమ్మినబంటు' నేర్పిన గుణపాఠాన్ని అనుసరించి మనవారు చిత్రాలను తీస్తారని ఆశిద్దాం.

నం.పా.సా.
(1960 నవంబరు 6వ తేదీన ఆంధ్రప్రభ సంచికలో ప్రచురితమైనది)

Previous Post Next Post