Humor Icon

అసలు రాంబాబు ఉంటున్న ఇంటాయన శివశంకరం గారు బాగా ఆస్తిపరుడే. ఈ మూడంతస్తుల మేడ కాక, వాళ్ళకి బాపట్ల దగ్గరో ఎక్కడో ఏడు చింతలపాలెంగావును అక్కడ పొలాలు కూడా ఉన్నాయట. అయితేనేం ఆయన పట్నంలోనే స్థిరపడి తెలుగు టీచరుగా రిటైరయి మేడ కట్టించాడు.

పెళ్ళికావలసినపిల్ల ఆయనకి పాపం ఒక్క గాను ఒక్కతే. పేరు రాణి. గారాబుకూచి. ఈవిడగాక ఇంకా ఆడామగా అన్ని సైజుల్లోనూ సుమారు అరడజను మంది. చిట్టచివరికి ఒక ఏడు పొడి. వాడి స్థానం ఎప్పుడు పంతులుగారి భుజం మీదే. ఇహ పోతే గృహలక్ష్మి రుక్ష్మిణమ్మగారు ఆయన కంటే మహా అయితే ఇంకో జానెడు పొడుగుంటుందేమో. ఆయన మాతృదేవత ఇంకా అవతారం చాలించకపోవటం చేత "ఎటొచ్ఛీ ఇంకా నలభై ఎనిమిదేళ్ళేకదండీ నాకు..." అనుకుంటాడు పంతులుగారు.

ధర్మం యమగా అమలు జరిపించే యమ ధర్మపీఠం నుంచి వారం వారం వారంటు మీద వారంటు జారీ అవుతున్నా ముసలావిడ ససేమిరా అని ప్రయాణం కావటం లేదు-ఇదీ ఆ సంసారపు సంక్షిప్త సమాచారం.

"పిల్లకి ఇంకా యిరవైదాటలేదుగా" అని ఆయనకింకా కాస్త ధైర్యం. "పిల్లకి ఈ యేడాది పెళ్ళి చేయాలంటే కనీసం నాలుగు వేలయినా కావాలా! ఈ నాలుగు వేలూ పెట్టితే ఇంటిపైన ఇంకో రెండు గదులు వేసుకోవచ్చు కదా!" అని ఆయన ఇప్పటికి ఆరేళ్ళ నుంచీ అనుకుంటూ, ఆరు రెళ్ళు పన్నెండు గదులు కట్టించేశాడు మేడమీద.

ఈ ఏడాదికి కూడా అట్లాగే వాయిదా వెయ్యటంతో మూడో అంతస్తులో ఒక గదీ, ఆ గదిలో రాంబాబు వెలిశారు. కానీ ఖర్చు లేకుండా ఏ గండభేరుండమైనా వచ్చి పిల్లను ఎత్తుకుపోతుందేమో ఒక్కో గ్రహం వదిలిపోతుందని ఆ శుభ ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నాడు శంకరంగారు. ఇప్పటికి చాలామంది జ్యోతిష్యులను పిలిపించాడు. కాని ముహూర్తం మాత్రం తేలటం లేదు. మొన్నీ మధ్యనే ఒక జ్యోతిష్కుడు వచ్చాడు.

"మిమ్మల్ని ఒక గ్రహం పీడిస్తోందండీ" అని చెప్పాడు.

"ఏడిసినట్లే ఉంది. ఆ సంగతి మీరే చెప్పాలా! నాకు తెలీదూ! అసలది ఎప్పుడు విరగడవుతుందో సెలవియ్యండి" అన్నారు పంతులుగారు విసుక్కుంటూ.

ఆయన ఇంకా కాస్త తీవ్రంగా ఆలోచించి "ఆ గ్రహం మిమ్మల్ని వదిలే సూచనలు లేవండీ. అదీ కాక ఈ సంవత్సరం మీకు మరో కొత్త గ్రహం కూడా పట్టవచ్చు" అని శుభవార్త చెవిని వేసి జారుకున్నాడు జ్యోతిష్కుడు.

దీనికి తోడు ఆయనకారాత్రి బ్రహ్మాండమైన కల కూడా వచ్చింది. ఓ పెద్ద డేగ కోడిపిల్లను ఎగరేసుకుపోయింది. ఇన్నాళ్ళ నుంచీ ఇంట్లో నానా కిచాటూ చేస్తున్న కోడిపిల్ల విరగడయినందుకు పంతులుగారు బ్రహ్మానందబాష్పాలు కార్చబోతూండగా ఆకాశంమీంచి ఆ కోడి వూడిపడింది. శంకరం గారు విచారంతో కుప్పకూలిపోయారు మంచం మీద నుంచి.

"ఛీ! పీడ కల" అనుకున్నాడు కళ్ళు నలుపుకుంటూ. శంకరంగారు, ఒక చేత్తో ఊరకుక్క మెడక్కట్టిన గొలుసూ, రెండో చేత్తో ఒక పాత గొడుగు కర్రా పుచ్చుకుని ప్రతి రోజూ సాయంకాలం షికారుకి వెళ్తాడు, దారిప్రక్కన ఎక్కడైనా ఉచితంగా వరులు దొరుకుతారేమోనని. పొట్టిగా స్థూలంగా ఉండే ఆయన కాయాన్ని ఆ ఊరకుక్క లాక్కెళ్ళుతూ ఉంటుంది ముందు. బట్టతలమీద హాటూ, పాంటులో షర్టు టక్ చేసి ఒక కోటూ వేసుకుని రాచఠీవి వుట్టిపడేలా నడిచేవాడు. ఆయన ఇంటి పేరు ఎవరికీ తెలీదు కాని 'మీసాల' అని మాత్రం ఆ వీథిలో చాలామంది కుర్రాళ్ల నమ్మకం. ఆయన నెరసిన గుబురు మీసాల ప్రత్యేకత ఏమిటంటే, అవి అవసరానుకూలంగా పైకీ కిందికీ పోతూ ఉంటాయి. పైగా ఆయన నవ్వుతున్నప్పుడు కొత్తగా ఈ మధ్యనే కట్టించుకున్న బంగారపు పళ్లు రెండింటికీ పబ్లిసిటీ ఇచ్చే పద్ధతిలో కత్తిరింపబడి ఉంటాయి అవి. అలా తిరిగి తిరిగి చీకటి పడే వేళకు కొంపకు చేరుకునేవాడు. దురదృష్టదేవత ఆయన మొహాన బోర్డు కట్టుక్కూర్చుంటే ఎలా దొరుకుతారు వరులు ఉచితంగా?

ఇంటికి రాగానే ముసలావిడ ఎదురుగ్గా వచ్చి శాపనార్థాలతో దిష్టితీసేది. "నేను బతికి ఉండగా నువ్వు దానికి పెళ్లి చెయ్యవురా! నువ్వెందుకు చేస్తావ్! నువ్వు నా చావు కోసం ఎదురుచూస్తున్నావాయెను. నువు బాగుపడవులే, నాకు తెలుసుగా! దాని ఉసురు కట్టుకుపోతావ్! గదిమీద గది ఏడు అంతస్తులు కట్టిస్తే పోయేటప్పుడేం కట్టుకుపోవు. నిక్షేపంగా పెళ్లి కావాల్సిన పిల్ల, అందులోనూ పెద్దపిల్ల బంగారుపు బొమ్మను పెట్టుకుని, దాని పెళ్ళి చెయ్యటానికి నాలుగు వేలు ఖర్చు పెట్టితే ఇంతలోనే బికారివాడివయిపోతావా నీకిదేం మాయరోగంరా... నా కడుపున చెడపుట్టావురా. ఇంతకీ దాని ఖర్మ దాని మొహాన అలా రాసి పెట్టాడు మాయదారి దేవుడు..." ఇహ దానికి అంతు ఉండదు.

"అబ్బబ్బ. ఛస్తున్నా ప్రతి రోజూ ముందు నీ పోరు పడలేక. ఇహ రోజూ యిలాగే సణుగుడు ప్రారంభిస్తే నీకంటే ముందు నేనే ఛస్తాను. ఏం! ఇంతలావు మేడ కట్టించానంటే నేను కట్టుకుపోదామనా! ప్రతి వాళ్ళూ ఇల్లు ఇల్లు అని ఇంటి మీద పడి ఏడుస్తున్నారు. ఏమిటో వాళ్ళ తాత ముల్లెలు పెట్టి కట్టిస్తున్నట్లు. నా ఇష్టం. ఇంకా ఏడు అంతస్తులు కట్టిస్తా. మీరెవరు మధ్య అడగటానికి. అయినా ఎంత కూడబెట్టినా వాళ్ల కోసమేగా. వేలకు వేలు పోసి ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేస్తే ఇహ మగపిల్లల నోట్లో మట్టే... అయినా దానికేం ఊరికే చెప్పించటం లేదు చదువు". ఈ చివరి ముక్క కాస్త నెమ్మదిగా గొణుక్కుంటూ అన్నాడు.

అసలు పిల్లను ఆయన ఇంతవరకూ చదివిస్తూనే వుండటానికీ, ఆమె ఎప్పుడూ ఐదో ఫారంలోనే వుండటానికీ వెనక ఒక బ్రహ్మాండమైన చిదంబర రహస్యం ఉంది. అది ఆరేళ్ళ క్రితమే, ముసలావిడకి తెలీకుండా దంపతులిద్దరూ రహస్యంగా వేసిన పథకం. హైస్కూల్లో చదివిస్తే ఏ కుర్రాడో ఆమెని ఇట్టే ప్రేమించేసి, రాక్షస వివాహమో, గాంధర్వ వివాహమో చేసుకోవచ్చు. ఈ కలికాలంలో, అందులోనూ ఇలాంటి పట్నాల్లో అది అసాధ్యం కాదని ఆయనకు తెలుసు. అందుకే అంత దూరదృష్టితో ముందే జాగ్రత్తపడ్డాడు శంకరం గారు. కలికాలపు పరమ రహస్యాన్ని అంత చక్కగా ఉపయోగించుకోగలిగాడాయన.

అయితే ఐదో ఫారం దాకా వచ్చినా పిల్ల ఒక్క 'స్టెప్' అయినా ముందుకు వెయ్యకపోవటం చూసే సరికి పంతులుగారు కంగారు పడ్డాడు. అంత బ్రహ్మాండమైన పథకం ఇలా నీళ్ళు కారిపోవటం ఆయనకి చాలా నిస్పృహ కలిగించింది. మళ్లీ ఇంకో పథకం తయారు చేశాడు. అమ్మాయి చక్కనిదే అయినా కొంచెం పిచ్చది. అమాయకపుది. పైగా పందొమ్మిదేళ్ల పిల్లలా కన్పించదు. కాబట్టి ఫర్వాలేదు. కాని అమ్మాయి ఇప్పుడు కొంపతీసి ఐదోఫారం ప్యాసయిందంటే యస్.యస్.యల్.సి. నాలుగేళ్ళ కంటే ఎక్కువ ఛాన్సు ఉండదు. ఆ తర్వాతయినా యింట్లో కూర్చోవాల్సిందే. ఈలోగా ఎవడయినా గంధర్వుడు ఈమె ప్రేమపాశాల్లో చిక్కుకుంటాడో లేదో నమ్మకమేమిటి! ఇంత దూరం ఆలోచించి శంకరం గారు అమ్మాయిని ఐదోఫారం ప్యాసుకాకుండా చెయ్యాలని నిశ్చయించుకున్నాడు.

మొదటి రెండేళ్ళూ అమ్మాయి నాన్న గారి చేయూతలేకుండానే స్వయంగానే పరీక్ష తప్పగలిగింది. శంకరం గారి హయాంలో తర్వాత రెండేళ్ళు కూడా తన పలుకుబడిని కరగించి ఆ క్లాసు దాటి పోకుండా చూశాడు. ఈయేడాది ఆయనిహ రిటైరయిపోయాడు. ఈ యేడాదే ఆయనకి కాస్త ఆందోళనగా ఉంది. ఆ పిల్ల ఐదో ఫారంలో తన సీటు రిజర్వు చేసుకొని స్థిరనివాసం ఏర్పరచుకొంది. కాని ప్రయోజనం మాత్రం పలకడంలా. పైగా అనవసరంగా జీతం కట్టడం కూడా వృథా అవుతోందే అని పంతులుగారికి బెంగపట్టుకుంది. శనిదేవత ఆమెలో పరకాయ ప్రవేశంచేస్తే, ఆవిడ మాత్రం ఏం చేస్తుంది పాపం. ఆ శని ఈయేటితో వదిలిపోతుందేమోనని అందరికీ ఆశ.

అసలు నిక్షేపంగా మూడో అంతస్తులో రాంబాబును పెట్టుకుని ఇంకా ఉపేక్షించడం దేనికని మీకు సందేహం రావచ్చు. రాంబాబు గదిలో వెలిసిన మర్నాడే మూడో అంతస్తులోకి, గాలం విసిరిచూశాడు శంకరం గారు. కాని కనీసం నాలుగు వేల కట్నమయినా గాలానికి కట్టకపోతే అంతలావు చేప పడుతుందా వట్టిగా గాలానికి! పాపం ఆయన ఎన్ని సార్లు గాలాన్ని లాగి చూసినా వట్టిదే బయటికొచ్చింది. అందుకని అది తన అంతస్తుకి అతీతమైనదనే నిశ్చయానికి వచ్చేశాడాయన. వాగి వాగి నోరు వాచి మాతృదేవతగారు, ఇహ తను అవతారం చాలించటం అత్యవసరంగా పరిణమించిందని తెలుసుకొని, రాత్రికి రాత్రి, అజ్ఞాతన్యాయస్థానం నుంచి వచ్చిన కడసారి వారంటుపుచ్చుకొని, మూటా ముల్లే సర్దేసి అర్జెంటుగా వెళ్ళిపోయింది. (లేకపోతే యమధర్మారావు గారే స్వయంగా దున్నపోతువాహనం మీద సపరివారంగా వచ్చి ఆవిడని బలాత్కారంగా తోడ్కొని వెళ్ళారో) ఆమె భౌతికదేహాన్ని శ్మశానం వరకు సాగనంపారు పంతులుగారు. సగం పీడ విరగడయిందనుకొన్నాడు. ఇహ తీరుబడిగా దంపతులిద్దరూ కూర్చుని ఆలోచించుకోవచ్చు.

రాణికి ఇంట్లో ఉన్నంతసేపూ వీథివైపు కిటికీలోనే నివాసం. రోజూ ఉదయం, సాయంకాలం ఓ అపరకృష్ణుడు ఆదారి వెంటే పోవటం నేర్చుకున్నాడు. పోతూ పోతూ గాట్టిగా నాలుగయిదు చూపులతూపులు గురిగా కిటికీలోకి విసిరి మరీ పోయేవాడు. అవి వెళ్ళి సరాసరి ఆ అమ్మాయి హృదయఫలకంపై నాటుకునేవి గాఢంగా. ఇది చూస్తున్న వాళ్ళమ్మ ముసి ముసి నవ్వులు నవ్వుకునేది తనలో.

"ఆ అబ్బాయి ఎందుకమ్మా రోజూ యిటే వెళ్తాడు... పైగా నా వంక అదేమిటి అట్లా చూస్తాడు... అసహ్యంగా" అనేది రాణి. "నా పిచ్చి తల్లీ" అవి ముసి ముసి నవ్వుకుంటూ ప్రేమగా మొటికలు విరుచుకునేది మనస్సులో రుక్మిణమ్మగారు.

"ఎవరే అబ్బాయి?" తల్లీ మళ్ళీ అడిగేది. "మా క్లాసబ్బాయే. రోజూ క్లాసులోకూడా అట్లాగే చూస్తాడు నా వంక.. అమ్మా.. ఆ అబ్బాయి ముక్కు అట్లా వుంటుందేమే... ఛీ... బావుండదు" అనేది రాణి.

"ఆ... నీకు మరీ బడాయే... ఏం. అబ్బాయి ముక్కుకేమే. చక్కగా సంపెంగపువ్వులా వుంటే. కుర్రాడు మాత్రమేం, కాస్త నలుపన్న మాటే గాని" అని ప్రోత్సహించేది తల్లి.

రోజూ ఆ రాజూ, ఈ రాణి నివసించే కిటికీ దగ్గర కాసేపు మకాం వేసి, కాంక్షావీక్షణాలు కిటికీ లోంచి ప్రసరింపచేసి చక్కా పోయేవాడు. క్రమంగా ఆ అమ్మాయికీ ఆ చూపుల భాష పరిచయం అయింది. నెమ్మదిగా కిటికీలోంచి బయటికీ, బయట్నుంచి కిటికీలోకీ ప్రేమ లేఖలు ప్రవహించటం మొదలెట్టాయి. వారిరువురి హృదయపాత్రికల్లోనూ ప్రేమపాకం ముదరటం మొదలెట్టింది. "మనిద్దరి హృదయాలకు మధ్య ఈ ఇనుప కడ్డీలు అడ్డమాయెనుగా" అని విలాప గీతాలు పాడుకున్నారు విధాయకంగా. తర్వాత ఇహ వాళ్ల విరహాగ్నికి ఇనుప కడ్డీలు విరిగి కరిగిపోయాయి. వ్యవహారం క్రింది అంతస్తులో ఇంత ఝంఝామారుతంగా సాగిపోతుంటే రాంబాబు ఇంకా మూడో అంతస్తులో 'స్టెప్ నంబర్ వన్' అంటూ కూర్చున్నాడు. రాణీ తమ్ముళ్ళనీ, చెల్లెళ్ళనీ మంచి చేసుకుంటున్నాడు బ్లేడులూ, రబ్బరు ముక్కలూ, తగరాలు యిస్తూ. తనకున్న ఆస్తినీ, కట్నపిశాచిని, సంఘాన్నీ తిట్టుకుంటున్నాడు.

ఈ రాజా రాణీ ప్రణయవ్యవహారం ఆ నోటా ఆ నోటా పడి ఆ పేట అంతా పొక్కింది. (పొక్కింది ఏమిటి? శంకరంగారే పొక్కింపచేశారు ఆట్టే మాట్లాడితే). వీరి ప్రేమాయణమే పురాణం అయింది ఆ చుట్టు పక్కల వాళ్ళకి. కాని పాపం రాంబాబు రేడియో మాత్రం 'రిసీవ్' చేసుకోలేదు ఈ పురాణాన్ని. సమయం కోసం నిరీక్షిస్తూ తెరవెనుక పొంచివున్నాడు శంకరం పంతులు గారు.

రాజా, రాణీ, ఆనందవీచికల్లో, ప్రేమడోలికల్లో వూగుతూ ఉండగా ఒక రోజు ఉయ్యాలతాడు పుటుక్కున తెగింది రసాభాసగా. ఆ పిల్లకి నెలతప్పిన మర్నాడు శంకరం గారు మూడో కన్ను (జ్ఞాననేత్రం) తెరిచారు. ఆ రోజు మసకసందెలో, సందు మలుపులో హీరోని చొక్కా కాలరు పట్టుకుని నిలవేశాడు పంతులుగారు. ఆ తర్వాత, ఇంటికి లాక్కొచ్చి "మా అమ్మాయిబతుకు నట్టేట్లో కలుపుతావుట్రా పుండాకోర్ రాస్ఖెల్. పద! మీ తల్లిదండ్రుల దగ్గరకి... ఇదేం మర్యాదస్తుల కొంప అనుకున్నావా... మరేమనుకున్నావ్. నీ పరువుని హుస్సేన్ సాగర్ లో కలుపుతాను పద 'స్కౌండ్రల్'. ఇప్పుడు మా అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోకపోతే దాని బ్రతుకేం కాను..." అని నిలదీసి సంజాయిషీ అడిగాడు. పెళ్ళి కొడుకు అమాంతం నిలువునా బోర్లపక్కలుగా పడ్డాడు, సాష్టాంగం ఆయన పాదాలమీద. "త్వమేవ శరణం మమ... రక్షమాం.." అని పాదాలు గట్టిగా పట్టుకున్నాడు. హతోస్మి అని దీవించాడు మామగారు. "ఇంతకంటే నా జన్మ కేమికావాలి మామగారూ! నన్ను రక్షించారు. మీమేలు జన్మలో మరచిపోలేను. ఆ వెధవ అనాధశరణాలయం బారి నుంచి తప్పించారు నన్ను. ముహూర్తం తీరుబడిగా పెట్టుకోవచ్చును. ముందు ఆ నరకం నుంచి ఆ పెట్టేబేడా అయినా తెచ్చుకుంటాను ఇవాళే", అని ఆనందబాష్పాలు కార్చాడు అల్లుడుగారు.

"హే భగవాన్! కరుణామయా! ఇంట్లో ఉండే గ్రహాన్ని వదిలించుకుందామనుకుంటే ఇంకో దశమగ్రహాన్ని తగిలించావా పరమాత్మా" అంటూ వాపోయారు శంకరం గారు. అతగాడి ఆనంద బాష్పాలూ, ఇయన గారి విషాద బాష్పాలు, స్టెప్ నెంబర్ టూ గురించి ఆలోచనలు అపుజేసి మూడో అంతస్తులోంచి ఇదంతా చూస్తున్న, నికృష్టభగ్న ప్రేమికుడి అశ్రువులూ కలిసి కాలవలు కట్టాయి.

నండూరి పార్థసారథి
(1959 ఏప్రిల్ 4వ తేదీ ఆంధ్రపత్రిక వీక్లీలో ప్రచురితమైనది)

Previous Post Next Post