Title Picture

విఠల్ ప్రొడక్షన్స్ వారి జానపద చిత్రం 'వరలక్ష్మీ వ్రతం', విఠల ఆచార్య గారు ఇంతకు ముందు నిర్మించిన 'కనకదుర్గపూజా మహిమ' చిత్రం-రెండూ కవల పిల్లలలాగా ఉంటాయి. రెండింటిలోనూ ఒకే హీరో (అడవిలో పెరిగిన రాకుమారుడు), ఒకే హీరోయిన్ (రాకుమారి), ఒకే విలన్ (మాంత్రికుడు), ఒకే హాస్యగాడు ఉన్నారు. ఈ పాత్రలను ధరించిన వారు కూడా ఆ చిత్రంలోనూ, ఈ చిత్రంలోనూ ఒకరే.

రచయిత, సంగీత దర్శకుడు, సాంకేతిక నిపుణులు కూడా రెండు చిత్రాలకూ ఒకరే. వారి పనివాడితనంలోనూ మార్పు కనుపించదు. ఈ చిత్రం నిడివి 14,800 అడుగుల పైచిల్లర. దీనిలో దాదాపు సగభాగం కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలు, నృత్యాలు, పాటలు, మాయలు, మంత్రాలు.

ఒక రాజుగారికి ఇద్దరు భార్యలు. చిన్నరాణి తమ్ముడు రాజ్యకాంక్షతో రాజుగారిని చంపివేశాడు. రాణులను ఇద్దరినీ చెరలో ఉంచాడు. పెద్దరాణి కొడుకు పసికందును కూడా చంపడానికి ప్రయత్నిస్తుండగా రాజభక్తుడైన ఒక వ్యక్తి ఆ పసివాణ్ణి రక్షించి ఆ స్థలంలో తన బిడ్డను ఉంచాడు. రాజకుమారుణ్ణి తన కుమారునిలా పెంచి పెద్ద చేశాడు. రాజుగారి బావమరిది రాజ్యం ఏలుతూ ఉంటాడు. ఆయనకు మణిమంజరి అని ఒక కూతురు. ఆ అమ్మాయి, అజ్ఞాతవాసం చేస్తున్న రాజ కుమారుడు ప్రేమించుకొంటారు. గాంధర్వ వివాహం చేసుకుంటారు. ఈ లోగా ఒక మాంత్రికుడు వారికి ఎడబాటు కలిగిస్తాడు. ఒక యక్ష కన్య రాకుమారుణ్ణి ప్రేమించి, అతన్ని పువ్వుగా మార్చి తన లోకానికి తీసుకుపోతుంది. చివరికి మణి మంజరి 'వరలక్ష్మి వ్రతం' చేసి తన భర్తను తిరిగి పొందుతుంది. యక్ష కన్య ఇచ్చిన వరాలతో రాజకుమారుడు మాంత్రికుడిని హతమారుస్తాడు.

ఈ చిత్రంలో 8 పాటలు ఉన్నాయి. వీటిలో రెండు మూడు పాటలు హిట్ కాగల అవకాశం ఉంది. నటీనటులందరికీ ఈ వేషభాషలు కొత్తగాదు కనుక వారి నటన నల్లేరుమీది బండిలాగా నడిచింది.

బొంబాయి రంగంలో వాడియా బ్రదర్స్ లాగా, దక్షిణాదిన విఠల ఆచార్యగారు సంవత్సరానికి రెండేసి ఈ తరహా చిత్రాలను నిర్మిస్తూ చిత్రరంగంలో 'ఘటికుడు'గా నిలదొక్కుకున్నారు. భారీ ఎత్తు జానపద చిత్రాలకు కె.వి.రెడ్డి ప్రామాణికుడైతే, చిన్న ఎత్తు జానపద చిత్రాలకు ఈయన ప్రామాణికుడుగా చలామణి అవుతున్నారు. ఇటువంటి చిత్రాల నిర్మాణంలో ఆయన ఒక ప్రత్యేక శైలిని అలవరచుకున్నారు. ఆస్థానకవిని, గాయకులను, నటీనటులను ఏర్పాటు చేసుకుని అవిచ్ఛిన్నంగా, అందరూ ఆశ్చర్యపడేవిధంగా ఆయన చిత్రాలు నిర్మిస్తున్నారు. సినిమా మార్కెట్ లోని కిటుకు ఆయనకు తెలిసినంతగా పెద్ద నిర్మాతలకు కూడా తెలియదేమోననిపిస్తుంది.

'వరలక్ష్మీ వ్రతం' చిత్రం ఆయనకు 'తగినంత' లాభాలు చేకూర్చిపెట్టగలదని ఆశించవచ్చును.

కథకుడు, దర్శకుడు, నిర్మాత: విఠల ఆచార్య; మాటలు, పాటలు: కృష్ణమూర్తి; సంగీతం: రాజన్, నాగేంద్ర; కెమెరా: జి. చంద్రు; తారాగణం: కృష్ణకుమారి, కాంతారావు, రాజనాల, బాలకృష్ణ, సత్యనారాయణ, స్వర్ణలత, మీనాకుమారి, రమాదేవి, నిర్మలాదేవి వగైరా.

నండూరి పార్థసారథి
(1961 సెప్టెంబర్ 3వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post