Title Picture
మెహదీ హసన్

మెహదీ హసన్ అస్తమయంతో 'భారతీయ గజల్' చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం ముగిసింది. ఆయనతో పోల్చదగిన గజల్ గాయకులు ఇప్పుడు ఎవరూ లేరు. ఇక ముందు కూడా అంతటి వారు అవతరించకపోవచ్చు. ఈ మాట కొందరికి అతిశయోక్తిగా అనిపించవచ్చు. కాని ఆలోచించండి! హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంలో బడేగులాం అలీఖాన్, అమీర్ ఖాన్ ల స్థానాలను ఎవరైనా భర్తీ చేయగలిగారా? పన్నాలాల్, బిస్మిల్లాఖాన్, విలాయత్ ఖాన్ ల స్థానాలను ఎవరైనా భర్తీ చేయగలరా? గజల్ గానంలో మెహదీ హసన్ స్థానం అటువంటిదే.

1974లో బేగం అఖ్తర్ మరణించగా తర్వాతి ఏడాది - 1975లో- భారతీయ గజల్ ప్రియులకు మెహదీ హసన్ పరిచయమయ్యాడు. అంతకు ముందు చాలా సంవత్సరాలుగా ఆయన ఎన్నో రికార్డుల్లో గజళ్లు పాడారు. పాకిస్థానీ సినిమాలలో కూడా చాలా పాటలు పాడారు. కాని, భారత, పాకిస్థాన్ ల మధ్య 'ఇనప తెర' కారణంగా తెర అవతల ఏం జరుగుతోందో ఇవతలి వారికి తెలిసేది కాదు. ఇవతలి సంగీత సంగతులు అవతలి వారికి తెలిసేవి కావు. యూరప్ లోనూ, అమెరికాలోనూ రెండు దేశాల సంగీతం దొరికేది. 1975లో ఉభయ దేశాలలోని రికార్డింగ్ కంపెనీల మధ్య కుదిరిన ఏదో ఒప్పందం వల్ల కొద్ది పాకిస్థానీ రికార్డులు-మెహదీ హసన్, నూర్జహాన్, ఫరీదా ఖానుమ్, గులాం అలీ గజల్ రికార్డులు-మన దేశంలో విడుదలైనాయి. మెహదీ హసన్, నూర్జహాన్ ల సినిమా పాటల రికార్డులు కూడా కొద్దిగా విడుదలైనాయి. వీటిలో ముఖ్యంగా మెహదీ హసన్, గులాం అలీల రికార్డులకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. వీరిద్దరినీ అభిమానించే వాళ్లు చాలా మందే ఉన్నా, ఇద్దరిలో ఒకరి పట్ల ఎక్కువ అభిమానం చూపించే వారు కూడా చాలామందే ఉన్నారు.

పన్నీటి జల్లు!

ముషాయిరా (కవి సమ్మేళనం)లో 'వాహ్ వాహ్ లన్నీ నేరుగా కవి ఖాతాలో జమ అవుతాయి. గజల్ గాన కచేరీలలో 'ఆహా, ఓహో'లు తొంబైశాతం గాయకుని ఖాతాలో పడతాయి. కానీ గజల్ గాయకులు కవితను తొక్కిపట్టి తమ గాన ప్రావీణ్యాన్ని ప్రదర్శించుకోవడం మాత్రం క్షమార్హం కాదు. మెహదీ హసన్ ఎంత మధురంగా, హాయిగా పాడేవాడో అంతగా కవితా సౌందర్యాన్ని కూడా ఆవిష్కరించేవాడు. ఠుమ్రీ గానంలో 'బోల్ బనావ్'లాగా గజల్ లో ప్రతిపదంలోని అర్థాన్ని, సౌందర్యాన్ని వర్ణిస్తున్నట్టు 'చూడండి-యిది ఎంత బావుందో!' అని వివరిస్తున్నట్టు గానం చేసేవాడు. స్వరాలను తెగ మెలిపెట్టి జిమ్మిక్కులతో హైరానా పెట్టి తమ పాండిత్యానికి తామే మురిసిపోతూ 'మీరు కూడా మురిసిపొండర్రా!' అని రెచ్చగొడుతున్నట్లుగా కాకుండా మెహదీ హసన్ పన్నీటి జల్లులాంటి తన గానంతో అలసిన మనసులను సేద తీర్చేవాడు. ఆయన గానం సాత్వికమైనది. మనోహరమైనది.

రాగరాజు!

1975లో వచ్చిన మెహదీ హసన్ మొదటి ఎల్ పీ రికార్డులో 12 గజళ్లున్నాయి. అవన్నీ అంతకు ముందు పాకిస్థాన్ లో విడుదలైన '78 RPM' రికార్డుల నుంచి సేకరించినవి. మూడున్నర నిమిషాలవి. 'పత్తా పత్తా బూతా బూతా', 'గుల్షన్ గుల్షన్ షోలా ఎ గుల్ కీ', 'దేఖ్ తో దిల్ కెహె జాన్ సే', 'బాత్ కర్నీ ముఝే', 'ఆయె కుఛ్ అబ్ర్ కుఛ్ షరాబ్ ఆయె', 'ఫూల్ హి ఫూల్ ఖిల్ ఉఠే', 'గులోం మే రంగ్ భరే' వంటి మధుర గీతాలు ఆ రికార్డులో ఉన్నాయి. ఆ తర్వాత వచ్చినవి చాలా వరకు కచేరీ రికార్డులు. బొంబాయిలో జరిగిన ఒక కచేరీ రికార్డింగ్ డబుల్ ఆల్బంగా వచ్చింది. ఆ కచేరీకి ముందు ప్రఖ్యాత సంగీత దర్శకుడు నౌషాద్ మెహదీ హసన్ ను పరిచయం చేస్తూ ప్రసంగించాడు. తర్వాత మెహదీ హసన్ మాట్లాడాడు. 'రంజిష్ హీ సహీ'తో సహా పది గొప్ప పాటలు ఆ ఆల్బంలో ఉన్నాయి. యమన్, భూపాలీ, కేదార్ బహార్, జింఝాటి, చారుకేశి, కళావతి, కీరవాణి వంటి ఎన్నో రాగాలలో ఎన్నెన్నో గజళ్లు ఆయన రికార్డులలో వినిపిస్తాయి.

తగ్గని ఆకర్షణ

1978 జనవరి 24న మెహదీ హసన్ హైదరాబాద్ రవీంద్రభారతిలో చేసిన కచేరీ ఎప్పటికీ చెరిగిపోని మధుర స్మృతిగా మిగిలిపోయింది. ఆయన కచేరీలు చేసి వెళ్లాక ఇక్కడ గజళ్ల ఉద్యమం ప్రారంభమయింది. పాలిడార్ రికార్డింగ్ కంపెనీ అనూప్ జలోటా, పంకజ్ ఉధాస్, తలత్ అజీజ్, చందన్ దాస్, పీనాజ్ మసానీ, రాజేంద్ర మెహతా-నీనా మెహతాలను ప్రోత్సహించి ప్రధాన నగరాలలో కచేరీలు నిర్వహించి వాళ్ల ఎల్ పీ రికార్డులను విరివిగా విడుదల చేసింది. ఐదేళ్ల తరువాత క్రమంగా ఆ పొంగు చల్లారింది. గజళ్ల క్వాలిటీ కవిత్వ పరంగా, సంగీతపరంగా కూడా పలచబడింది. కాని మెహదీ హసన్ గజళ్ల ఆకర్షణ మాత్రం తగ్గేది కాదు.

పరంపరాగం!

పదహారు తరాలుగా సంగీతజ్ఞులయిన కుటుంబంలో పుట్టిన మెహదీ హసన్ తండ్రి, పినతండ్రి కూడా ఉస్తాదులే. వారి వద్దనే ఆయన శిక్షణ పొందాడు. 1947 తర్వాత, ఆయన కుటుంబం పాకిస్థాన్ కు వలసపోయింది. కానీ పాకిస్థాన్ లో గాయకులకు ఆదరణ కరువయింది. బడేగులాం అలీఖాన్ వంటి వారు జన్మస్థలం పాకిస్థాన్ లోనే ఉన్నా అక్కడ ఇమడలేక ఇండియా వచ్చి స్థిరపడ్డారు. అలా రాలేకపోయిన వారు ఇండియాను ఒక మక్కాలాగా, మదీనాలాగా భావించుకుంటారు. ఢిల్లీ, కలకత్తా, బొంబాయి వంటి నగరాలలో కచేరీలు చేసి ప్రశంసలు అందుకోవాలని కోరుకుంటారు. పాకిస్థాన్ లో ఉన్నది కూడా హిందూస్థానీ సంగీతమే.

మెహదీహసన్ తన జీవితకాలంలో మరోసారి ఇక్కడికొచ్చి రాజస్థాన్ లోని (ఇక్కడే 1927లో జన్మించారు) తన జన్మస్థలాన్ని సందర్శించాలనుకున్నాడు. అనారోగ్యం వల్ల ఆ కోరిక నెరవేరలేదు. స్వర్లోకం అనేది ఏదైనా ఒకటి ఉంటే ఈపాటికి అక్కడే గజళ్లేవో పాడుతూ కచేరీ చేస్తూ ఉంటారు.

నండూరి పార్థసారథి
(2012 జూన్ 18వ తేదీన సాక్షి దినపత్రికలో ప్రచురితమయింది)

Next Post