బసంత్-నాడియావారు లోగడ, సమర్పించిన 'రామభక్త హనుమాన్', 'వీరఘటోత్కచ', 'హనుమాన్ పాతాళవిజయం', 'జింబో', 'జింబో నగర ప్రవేశం' డబ్బింగ్ చిత్రాలను మెచ్చుకొని ఆదరించి వాటి ఆర్థిక విజయానికి ఇతోధికంగా తోడ్పడిన తెలుగు ప్రేక్షకులకు వాడియా వారి తాజాచిత్రం 'ఆరబ్బీవీరుడు జబక్' ఆశాభంగం కలిగించదనే చెప్పాలి. ఈ చిత్రం కూడా ఇంచుమించు పై చిత్రాల స్థాయిలోనే ఉన్నది. ఇది పూర్తి పంచరంగుల చిత్రం. మూడు గంటల ముచ్చటైన చిత్రం; నవరసభరితం. మిరుమిట్లు గొలిపే వర్ణ ఛాయాగ్రహణం, వినిపించని వీనులకు కూడా విందుచేసే శబ్దగ్రహణం ఇందులో చెప్పుకోతగ్గ అంశాలు. కావలసినన్ని కత్తి యుద్ధాలు, అంతకు మించిన నృత్యాలు, పాటలు, ఎడతెరిపిలేని సంభాషణలు ఈ చిత్రంలో క్రిక్కిరిసి ఉన్నాయి. మాటలను, పాటలను మింగి వేయాలని కుట్ర చేస్తున్న ధోరణి నేపధ్య సంగీతంలో కనుపిస్తుంది. మొత్తం మీద అన్ని అంశాలు ఎక్కువ మోతాదులో, ఒకదానితో ఒకటి పోటీ పడేవిగా ఉండటం చేత ఈ చిత్రం అధిక సంఖ్యాకులను ఆకర్షించవచ్చును. ఆర్థిక విజయం తప్పక పోవచ్చును.
అధిపతి కూతుర్ని ప్రేమించిన నేరానికి మాతృదేశం నుంచి బహిష్కృతుడై, అనేక కష్టాలుపడి, శిష్టరక్షణ, దుష్టశిక్షణ తన కర్తవ్యంగా పాటించి, చివరికి అల్లా దయవల్ల కష్టాలను గట్టెక్కి, ప్రేయసిని పొందిన అరబ్బీ వీరుడు జబక్ కథ ఇది. కారణం ఏదైనా మూడు గంటలపాటూ ప్రేక్షకులు యావన్మందీ నవ్వుతూ, నిట్టూరుస్తూ, కంటతడి పెడుతూ పశ్చాత్తాపపడుతూ ఉంటారు.
శ్రీశ్రీగారి రచన సంతృప్తికరంగా ఉందని చెబితే అతిశయోక్తే అవుతుంది. సంగీతంలోనూ సెట్స్ నిర్మాణంలోనూ, పాత్రల వేషధారణలోనూ, అరబ్బీ వాతావరణాన్ని చక్కగా పొందుపరచారు. ఐతే, సంగీతంలో శబ్దం పాలు, దృశ్యంలో రంగులుపాలు, ముదరడం వల్ల కళ్ళకు, చెవులకు కొంత ఇబ్బంది కలిగే ఆస్కారం ఉంది. నటీనటులంతా ఇటువంటి పాత్రలను ధరించడంలో ఆరితేరినవారు. ఇటువంటి సంభాషణలు వారికి కంఠోపాఠం. అందరూ అనాయాసంగా నటించారు. ముఖ్యంగా దొంగల నాయకుడుగా బి.ఎం. వ్యాస్ చాలా హుందాగా ఉన్నాడు. అందరూ తప్పక ఒకసారి చూడతగిన చిత్రం 'జబక్'.
నండూరి పార్థసారథి
(1961 మార్చి 26వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది)
Copyright © 2021 nanduri.com | All Rights Reserved | Site designed and maintained by CodeRhythm Works