Title Picture

ప్రఖ్యాత చిత్రకారుడు శ్రీ బాపు కార్టూన్ల సంకలనం 'కొంటె బొమ్మల బాపు' గీత పని వారందరికీ - ముఖ్యంగా బాపిస్టులందరికీ-శిరోధార్యమైన కార్టూన్నిధి. కొంటెతనం, తుంటరితనం, హాస్యం అపహాస్యం, పెన్ ప్రిక్స్, పన్ ట్రిక్స్, చురకలు, చెణుకుల కలబోతగా బాపు గీసిన కార్టూన్లు పాత కొత్తల మేలుకలయికగా ఇందులో ఏర్చికూర్చారు. పీఠికతో కలిపి 120 పేజీలున్న ఈ పుస్తకం (ప్రచురణ నవోదయ పబ్లిషర్స్, ఏలూరు రోడ్డు, విజయవాడ-2)లో మొత్తం 175 కార్టూన్ లున్నాయి. లావొక్కింతయులేని ఈ పుస్తకం వెల 12 రూపాయలని చెబితే చాలా ఎక్కువే అనిపిస్తుంది గాని పేజీలు తిరగేసి చూస్తే మాత్రం తక్కువే అనిపిస్తుంది. నిజానికిది వెలలేని పుస్తకం. ఈ కార్టూనిస్తాన్ లో ప్రతి పేజీ, ప్రతి బొమ్మా అమూల్యమే. ఇంత మంచి బొమ్మలని రూపాయికి పది పేజీల లెక్కన ఇచ్చారంటే ఇది భలే మంచి చౌకబేరమని చెప్పక తప్పదు.

ఈ కార్డూన్లలో మరీ పాతవి, ఒక మోస్తరు పాతవి, కొత్తవి ఉన్నాయి. 'జ్యోతి' మాసపత్రిక తొలి సంచికలలో ప్రచురితమై, తర్వాత 'జ్యోతి' బుక్స్ వారి 'రసికజనమనోభిరామం'లో పునః ప్రచురితమైనవి ఇందులో కొన్ని ఉన్నాయి. పదే పదే నవ్వించగల బొమ్మలు పాతవైతే మాత్రం ఏం? ఈ బొమ్మల్లో కొన్ని అందరికీ అర్థమవుతాయి. కొందరికి అన్నీ అర్థమవుతాయి. కాని అన్నీ అందరికీ అర్థంకాకపోవచ్చు. ఉదాహరణకు 60వ పేజీలో ఏనుగు లక్ష్మణ కవిగారి మీద వేసిన కార్టూను - అసలు ఆ పేరుతో ఒక కవి ఉన్నాడని తెలిసిన వాళ్ళకే కదా అది అర్థమయ్యేది? జయమాలిని తరం వాళ్ళకి జ్యోతిలక్ష్మి ఎవరో తెలియకపోవచ్చు. తెలిస్తే తప్ప 95వ పేజీలో పెద్ద మనిషి సినిమాకి భూతద్దం ఎందుకు తీసుకువెడుతున్నాడో అర్థం కాదు.

అయినా చాలా వరకు సార్వకాలికమైన సార్వజనికమైన బొమ్మలే ఉన్నాయి. ఈ బొమ్మల్లో మనపోలికలు, మన వాళ్ళ పోలికలు కనిపిస్తాయి; మనలోని బలహీనతలు అతిశయోక్తి అలంకారాలు సింగారించుకొని ఈ బొమ్మల్లో దర్శనమిస్తాయి. అంటే ఆత్మ సాక్షాత్కార మవుతుందన్న మాట. ఈ బొమ్మల్లో బాపుగారు కూడా ఉండే ఉంటారు. ఎందుకంటే తనని చూసి తాను నవ్వుకోగలవాడు, తనపై తాను జోక్ వేసుకోగలవాడు, తనని తాను హేళన చేసుకోగలవాడు మాత్రమే మంచి కార్డూనిస్టుగాని, మంచి హాస్య రచయితగాని కాగలుగుతాడు.

నవ్వు మానసిక ఆరోగ్యానికి చిహ్నం, నవ్వు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందింపజేస్తుంది. మానసిక ఆరోగ్యం కోసం అందరూ సుప్రభాతం టైములో ఓసారి, పవళింపు టైములో ఓ సారి తప్పక సేవించదగిన దివ్యమైన ఔషధం ఈ పుస్తకం.

అరవైదాటినా ఇరవై యేళ్ళ అమ్మాయిలని చూసి చొంగ కార్చుకునే వారూ, కంపల్సరీ రిటైర్మెంట్ తర్వాత కాలక్షేపానికి ఉండేలుతో అమ్మాయిల మీద బెడ్డలు విసిరే సరసులు, 'అహ నా సొగసే' అని పాడుకుంటూ మురుసుకుంటూ అప్పడాలు వత్తుకునే లావుపాటి పిన్నిగారు, మేనేజరుకు బూట్ పాలిష్ చేసే హెడ్ గుమాస్తా, కాలేజీ బ్యూటీకి పోజు కొడుతూ గోతిలో పడే కుర్రాళ్ళు... ఇంకా రకరకాల మనుషులు ఈ పుస్తకంలో కొలువు తీరారు. వీళ్ళంతా మనల్ని ఆప్యాయంగా పలుకరిస్తారు.

'జీవితంలోంచి, నిత్యకృత్యాల నుంచి నాజూకైన హాస్యాన్ని వొడకట్టడం బాపు నైజం... బాపు కార్టూన్నిష్టాగరిష్టుడు, గీత యజ్ఞం చేసిన సోమయాజి. తెలుగు కార్టూన్ కి ఒక రూపం, హద్దులు, శైలి ఏర్పాటు చేసి, వాటిని వందల సంఖ్యలో చిత్రించి, ప్రతి రేఖను తెలుగువారి పెదవులపై దరహాస రేఖగా మలచి, నేడు 'నానృషిఃకురుతే కార్టూన్' అనే స్థాయికి ఈ ప్రక్రియను తీసుకువెళ్ళారు బాపు' అని ఈ కితాబుకొక కితాబు ఇచ్చారు శ్రీరమణ పీఠికలో. పడిపోతున్న ఇండియన్ కరెన్సీ విలువను కాపాడాలంటే కరెన్సీ నోట్లమీద బాపు కార్టూన్లు ముద్రిస్తే మంచిదని ఆయన సూచించారు. ('శ్రీరమణ' అంటే ముళ్ళపూడి రమణ కాదు. ఈయన రంగుల రాట్నం ఫేమ్. ముళ్ళపూడి రమణ కాక 'శ్రీరమణ' చేత పీఠిక ఎందుకు రాయించారా అని బాపు అభిమానులకి సందేహం రావచ్చు. బాపు రమణలకి తనువులు వేరైనా ఆత్మలొక్కటే కదా? అందుచేత బాపు గురించి రమణ చెప్పడం ఆత్మస్తుతే అవుతుంది. ఆత్మస్తుతి అట్టే అందంగా ఉండదు కదా?)

మొత్తం మీద బాపుది అంతా ఒక ప్రత్యేకమైన లైన్ గ్వేజ్. ఈ లైన్ గ్వేజ్ కి వ్యాకరణం ఉంది. దీనిని అధ్యయనం చేసి, ఇందులో నిష్టాతులైన లైన్ గ్విస్టులు తెలుగులో ఎందరో ఉన్నారు. వీరందరూ బాపు గీచిన గీటు దాటరు. బొమ్మల భాష నేర్చుకోగోరే వారందరికి ఈ పుస్తకం పెద్దబాలశిక్ష లాంటిది. ఒక్క మాటలో చెప్పాలంటే 'ఇతి బాపు గీతార్థసారమ్'!

నండూరి పార్థసారధి
(1979 డిసెంబర్ 9వ తేదీన ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితమయింది)

Next Post