Humor Icon

నాగేశ్వర్రావుకు అమెరికా నుంచి ఆహ్వానం వచ్చిందని తెలిసి వాళ్ళమ్మ అడిగింది. "అమెరికా అంటే ఎంతదూరం ఉంటుందిరా నాగూ" అని.

"చాలా దూరం ఉంటుందమ్మా" అని చెప్పాడు నాగేశ్వర్రావు.

చాలా అంటే ఎంతో తెలీలేదు ఆవిడకి. మళ్ళీ మనవడిని అడిగింది. అతను బళ్లో జాగర్ఫీ మాస్టారు చెప్పిందంతా జ్ఞాపకం తెచ్చుకుని చెప్పాడు? "అమెరికా అంటే అదొక పెద్ద ఖండం బామ్మా. అది యిక్కడికి చాలా బోల్డుదూరం. మన భూగోళం గుండ్రంగా బంతిలాగా వుంటుంది కదూ. అందుకని అమెరికా యిప్పుడు మనం వున్న చోటికి కింద సరిగ్గా భూగోళానికి అవతలి పక్క వుంటుందన్నమాట. పూర్వం దాన్నే పాతాళలోకం అనేవారుట. "కళ్ళు ఇంతంత చేసుకుని యాక్షన్ చేస్తూ చెప్పాడు. ఆవిడకి భయం వేసింది. అయినా మనవడి మాటమీద నమ్మకం కుదరక మళ్ళీ కొడుకుని అడిగింది:

"హైదరాబాదు నుంచి మన వెంకటరాఘవపురానికి వున్నంత దూరం వుంటుందా ఏంరా?"

నాగేశ్వర్రావు ఒక్కసారి తలెత్తి ఆవిడ కేసి చూశాడు. "ఇంకా చాలా యెక్కువ దూరమే వుంటుందమ్మా"

అతని మనస్సు పాతిక సంవత్సరాల లోతుకు మునకవేసింది. ఎన్నెన్నో ఆశనిరాశలతో, కష్ట సుఖాలతో, జయాపజయాలతో కూడిన తన పాతికేళ్ళ నటజీవితం మనోనేత్రం ముందు సాక్షాత్కరించింది. జీవితంలోని ఒక్కొక్క ముఖ్య సంఘటన ఒక్కొక్క మైలురాయి అయితే, తన జీవితం ఒక సుదీర్ఘ సాహసయాత్ర.

తను నిల్చున్న చోటు నుంచి ముందున్న అమెరికాకు, వెనక వున్న వెంకటరాఘవ పురానికి మధ్యగల అంతరాలను దూరంలో, కాలంలో అంచనా వేసుకున్నాడు. హైదరాబాదు నుంచి అమెరికాకు దూరం 8000 మైళ్ళు. 24 గంటలు. తన గ్రామం నుంచి హైదరాబాదుకు దూరం 200 మైళ్ళు, 25 సంవత్సరాలు. తను పుట్టిన వెంకటరాఘవ పురం నుంచి హైదరాబాదు చేరుకోడానికి 25 సంవత్సరాలు పట్టింది.

రాజుగారి రాచవుండు నయం చేయడానికి మూలిక కోసం నాగేశ్వర్రావు యిది వరకు చాలాసార్లు పాతాళలోకం వెళ్ళి వచ్చాడు. ఇప్పుడు ఆంధ్రుల కీర్తి ధ్వజాన్ని తీసుకుని వెళ్తున్నాడు. అయితే దానికీ దీనికి కల్పనకీ వాస్తవానికీ మధ్యవున్నంత అంతరం వుంది. కాని సాహసాలు అతను సినిమాలోనూ చేశాడు. జీవితంలోనూ చేశాడు. జీవితంలోనూ, సినిమాలోనూ కూడా రాజకుమారుడి లాగానే వెలిగాడు, వెలుగుతున్నాడు. మనకి వున్నది ఒక్కగానూ ఒక్క నాగేశ్వరర్రావు. మరి అతను యిప్పుడు యెక్కడో భూగోళానికి అవతలపక్కనున్న అమెరికాకి వెళ్తున్నాడంటే, ఇంకా రెండు నెల్లదాకా మనకు కనిపించడంటే బాధగానే వుంటుంది. అతని తల్లికే కాదు తెలుగు సినీమతల్లికే బెంగగా వుంటుంది అతని మీద. అతను లేకపోతే తెలుగు సినిమారంగంలో సందడే వుండదు. ఒక్క సినిమారంగం ఏమిటి? తెలుగు ప్రజారంగంలోనే సందడి వుండదు. అతను ఒక రంగానికి ప్రత్యేకించినవాడు కాదు. అతను అందరికీ చెందిన వాడు. అందరికీ కావలసినవాడు.

నాగేశ్వర్రావులో వున్న విశేషమేమిటో కాని, మన ప్రజలు అతని మీద పెంచుకున్న మమకారం ఇంతా అంతాకాదు. 'కీలుగుర్రం' తీసేటప్పుడు అతని కాలు విరిగిందని తెలిసి ప్రజలు యెంత ఆందోళన పడ్డారో చెప్పడానికి వీల్లేదు. సినిమాల్లో అతను తనకి రెట్టింపు సైజులో వున్న ముక్కామలతో కత్తియుద్ధం చేస్తుంటే ఈ అర్భనాకారి పిల్లాడిని ఆ 'రాక్షసుడు' ఏం చేస్తాడోనని ప్రేక్షకులు విలవిలలాడిపోయేవాళ్ళు. ఆ ఆపేక్ష-ఎవరో కొందరి విషయంలో అలా లోపల్నించి తన్నుకొస్తుంది గానీ తెచ్చిపెట్టుకుంటే వస్తుందా? తెలుగు ప్రజల దగ్గర అంత గారాబం సంపాదించుకోగలిగాడంటే అది నాగేశ్వర్రావు ఒక్కడికే చెల్లింది.

అభిమానుల అభిమతాన్ని కాదనలేక నాగేశ్వర్రావు తన ప్రాణాన్ని హైరానపెట్టుకుని ఏడాదికి డజనేసి చిత్రాల్లో నటించినా మన ప్రజలకి తనివి తీరలేదు. "నాగేశ్వర్రావు మరీ ఒక్కడైపోయాడే. కనీసం అరడజను మందైనా నాగేశ్వర్రావులుంటే ఎంత బావుణ్ణి" అనుకున్నారు ప్రజలు, సినిమా నిర్మాతలు కూడా. కానీ తను ప్రజలకి మరీ యింత అలవాటు కావటం మంచిదికాదనీ, క్రమంగా అలవాటు మాన్పించాలనీ అనుకున్నాడు నాగేశ్వర్రావు. చిత్రాల సంఖ్య చాలా తగ్గించుకున్నాడు. క్రిందటేడు అతని చిత్రాలు మూడే వచ్చాయి. అవికూడా సంవత్సర పూర్వార్థంలోనే వచ్చాయి. చివరి ఆరు నెలల్లో అతని చిత్రం ఒక్కటి కూడా లేదు. ప్రజలు అప్పుడే అతనికోసం బెంగపడిపోయారు. బెజవాడ లాంటి పెద్ద పట్టణాల్లో వున్నవారు నాగేశ్వర్రావు చిత్రాలు కొత్తవి లేకపోతే పాతవే మళ్ళీ మళ్ళీ చూసి తృప్తి పడ్డారు. మూడు నాలుగు థియేటర్లు మాత్రమే వున్న వూళ్ళలో ఎప్పటి కప్పుడు కొత్త చిత్రాలే గానీ పాత చిత్రాలు వేసే అవకాశం వుండదు. ఆ విధంగా ఒక వూళ్ళో వరసగా కొన్ని నెలలపాటు నాగేశ్వర్రావు చిత్రం లేకుండా పోయింది. అతనికోసం ప్రేక్షకులు ఆవురావురు మంటున్న సమయంలో ఒక హాల్లో నాగేశ్వర్రావు పాత చిత్రం ఒకటి వేశారు. జనం విపరీతంగా ఎగబడ్డారు. ఆ వూళ్లో ఆడుతున్న కొత్త సినిమాలకంటే యెక్కువగా దీనికి డబ్బు లొచ్చాయి. ఇదే సరైన అదను అనుకొని నాగేశ్వర్రావు పాత చిత్రాలని వరసగా నాలుగైదు ఆడించారు. అన్నీ డబ్బులు చేసుకున్నాయి.

నాగేశ్వర్రావు గురించి యింతగా చెప్పాలా, మాకుమాత్రం తెలీదా అతన్ని గురించి అనవచ్చు కొందరు. మీకు తెలీదని కాదు. అసలు ఆ మాటకొస్తే నాగేశ్వర్రావును గురించి మాకంటే, నాగేశ్వర్రావు కంటే కూడా ప్రజలకే బాగా తెలుసు. అతని జీవితంలో ఏతారీఖున ఏం జరిగిందో అతనికంటే బాగా ప్రజలకే జ్ఞాపకం. అతను బాధపడుతుంటే ఓదార్చిందీ, క్రుంగిపోతుంటే ప్రోత్సహించిందీ, సంతోషిస్తుంటే ఆ సంతోషం తమదేనని భావించిందీ ప్రజలే. నాగేశ్వర్రావు మనస్సులో ఏముందో అతను చెప్పకముందే ప్రజలకి తెలుసు. మద్రాసులో అతను తన యింటిని సావిత్రికి విక్రయించాలని నిశ్చయించుకున్న క్రిందటి రోజునే ఆ విషయం ప్రజలకి తెలుసు.

అయినా, పల్లెటూళ్ళో పుట్టి పెరిగి, సంస్కారానికీ విద్యకీ, ప్రతిభకీ, పాండిత్యానికి సంబంధం లేదని నిరూపించి, జీవిత నిశ్రేణిలో అడుగు మెట్టునుంచి బయలుదేరి ఒక్కొక్క మెట్టుతోనూ హోరాహోరీ పోరాడుతూ అన్నిటినీ జయించి పైమెట్టు నందుకున్న ఒక తెలుగువాణ్ణి గురించి మరొకసారి గర్వపడడానికే ఈ వాక్యాలు వ్రాయడం జరిగింది.

అతని అమెరికాయాత్ర అమోఘంగా, అద్భుతంగా, ఆనందప్రదంగా జరగాలని మీలాగే మేమూ కోరుకుంటున్నాము.

నండూరి పార్థసారథి
(1963లో 'జ్యోతి' మాసపత్రికలో ప్రచురితమైనది)

Previous Post Next Post