మద్రాసులో హిందీ సినీ గాయకుల పాటకచేరీలు జరగటం చాలా అరుదు. సాధారణంగా ఏడాదికి ఒకటి కూడా జరగదు. అటువంటి కచేరీల కోసం కలవరించే శ్రోతలకు ఇటీవల మహమ్మద్ రఫీ శ్రవణతర్పణమైన విందు చేశారు. 'దయాసదన్' అనే అనాథబాల శరణాలయం సహాయార్థం 'సఖీమండల్' మహిళా సంస్థ ఏప్రిల్ 25వ తేదీ నిర్వహించిన కార్యక్రమంలో రఫీ పాడారు. మ్యూజిక్ అకాడమీ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో సంగీత దర్శకురాలు ఉషా ఖన్నా, దక్షిణాది ముఖేష్ గా పేరుపొందిన డాక్టర్ మన్ మోహన్ ఠాకూర్, హాస్యనటులు జానీ విస్కీ కూడా పాల్గొన్నారు.

అన్నిటి కంటే పెద్ద టిక్కెట్టు నలభై రూపాయలు, చిన్న టిక్కెట్టు పది రూపాయలు పెట్టినా హాలు కిటకిటలాడిపోయింది. ఇంకా టిక్కెట్లు దొరకక నిరాశతో వెళ్లిపోయినవారు ఎందరో ఉన్నారు. మద్రాసులో స్థానిక సినీ గాయకుల కచేరీలు తరుచుగా జరుగుతూనే ఉంటాయి. వాటి రేట్లు వీటిలో మూడవవంతు మాత్రమే ఉంటాయి సాధారణంగా. వాటికి ఇంత గిరాకీ ఉండదు.

సిలోన్ రేడియో పుణ్యమా అంటూ దేశంలో హిందీ సినిమా పాటలకు విశేషమైన ప్రచారం లభిస్తున్నది. దక్షిణాదిన-ముఖ్యంగా మద్రాసులో-దక్షిణాది సినిమా పాటలకంటే హిందీ సినిమా పాటలపై మోజు రోజురోజుకు పెరుగుతున్నది. ఈ మోజు ఎక్కువగా విద్యార్థులలోనూ, యువ ఉద్యోగులలోనూ కనిపిస్తుంది. రఫీ కచేరీ జరిగిన రోజున ఈ విషయం వెల్లడి అయింది. ఆయన పాడిన ప్రతి పాటకు హాలులో విపరీతంగా హర్షధ్వానాలు (చప్పట్లు, ఈలలు వగైరా) చెలరేగాయి. లయ ప్రధానంగా ఉన్న కొన్ని పాటలకు జనం భజన చేశారు కూడా. రఫీ - గానం కంటే అభినయం ఎక్కువగా చేయటం శ్రోతలలో చాలామంది హుషారుకు కారణం. ఉషాఖన్నా పాడిన పాటలకు ఈ రకమైన హర్షధ్వానాలు జరగలేదు. ఆమె పాడిన పద్ధతి చాలా లలితంగా, సున్నితంగా, హాయిగా ఉంది. డాక్టర్ మన్ మోహన్ ఠాకూర్ 'సంగమ్' చిత్రంలో ముఖేష్ పాడిన పాటలను తన ఆర్కెస్ట్రాతో పాడారు. ఆర్కెస్ట్రా ఆకర్షణ వల్ల ఆయన పాటలు బాగున్నాయి. రఫీ, ఖన్నాల పాటలకు హార్మోనియం, తబలా మినహా వేరే ఆర్కెస్ట్రా ఏమీ లేదు. ఇక-జానీ విస్కీ విదూషక పాత్ర వహించి ప్రేక్షకులను రంజింపచేశారు. ఒక అంశానికీ, ఇంకొక అంశానికీ మధ్య ఖాళీ దొరికినప్పుడెల్లా రంగం మీదికి చొరబడి, తన హాస్యంతో ప్రేక్షకులను నవ్వించి, కన్నీరు (ఆనంద బాష్పాలు) కార్పించారు. ఆయన హాస్యనటుడేకాక అనుకరణ ప్రవీణుడు కూడా. రాజ్ కపూర్, దిలీప్ కుమార్, దేవానంద్, కిశోర్ కుమార్, జానీ వాకర్, శివాజీ గణేశన్ మున్నగు నటులను; ముబారక్ బేగం, తలత్ మహమ్మద్ మున్నగు గాయనీ గాయకులను అనుకరించి చూపారు. కార్యక్రమానికి సూత్రధారిగా కూడా ఆయనే వ్యవహరించారు.

కచేరీలో రఫీ ఎనిమిది పాటలు, కుమారి ఉషా ఖన్నా ఐదు పాటలు, ఇద్దరూ కలిసి రెండు పాటలు పాడారు. ఉషాఖన్నా తాను సంగీతం కూర్చిన సినిమాల పాటలే పాడారు. రఫీ - నౌషాద్, శంకర్ జైకిషన్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, రవి కూర్చిన పాటలు పాడారు. వీటిలో అల్లరి పాటలు, భక్తి గీతాలు, ప్రేమ గీతాలు-అన్ని రకాలూ ఉన్నాయి. అల్లరి పాటలను హుషారుగా, భక్తి గీతాలను గంభీరంగా, ప్రేమ గీతాలను సున్నితంగా పాడారు. తాను ఎంత హెచ్చు స్థాయిలో పాడగలడో, ఎంత గుక్కపట్టగలడో కూడా ప్రదర్శించారు. రికార్డులలో ఉన్నవాటికి అప్పటికప్పుడు ఆశువుగా చిలవలు పలవలు కల్పించి పాడి శ్రోతలను రంజింపజేశారు.

హిందీ సినిమా పాటలను కొందరు కేవలం బడాయి కోసమే పొగుడుతారన్నమాట నిజమే కానీ, దక్షిణాది సినిమా సంగీతం కంటే హిందీ సినిమాల సంగీతం ఎంతో అభివృద్ధి చెందినమాట మాత్రం అబద్ధం కాదు. దేశంలోని అన్ని ప్రాంతాల సంగీత దర్శకులకూ ఒక్కటే లక్ష్యం-బొంబాయి చిత్రాలకు సంగీతం సమకూర్చటం. ఇంట గెలిచిన సంగీత దర్శకులందరూ బొంబాయి రచ్చ కెక్కుతూ ఉంటారు. మంది ఎక్కువైతే పోటీ పెరుగుతుంది. సమర్థులయినవారికే అక్కడ నిలవటానికి వీలుంటుంది. స్పర్థవల్ల సంగీతం వృద్ధి చెందుతుంది. ఆవిధంగా బొంబాయి సినిమా రంగం వివిధ సంగీత రీతులకు సంగమం అయింది. ఒకరి సంగీత ప్రభావం మరొకరిపై ప్రసరించటం వల్ల, ఒకరి నుంచి మరొకరు పాఠాలు నేర్చుకొనటం వల్ల, నూతన రీతుల కోసం ప్రతి ఒక్కరూ అన్వేషిస్తూ ఉన్నందు వల్ల హిందీ సినీ సంగీతం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందింది. కేవలం డబ్బు చేసుకోవటమేకాక నిజంగా తమ విద్యను పెంపొందించుకోవాలనే శ్రద్ధగలవారు, స్వతంత్రమైన శైలిగలవారు బొంబాయి సినీ దర్శకులలో చాలామంది ఉన్నారు.

హిందీ సినీసంగీతం ఎన్ని ముఖాలుగా విస్తృతి పొందిందో రఫీ ముఖతః మనం వినగలం. సినీ రంగంలో ప్రవేశించిన తర్వాత-గడచిన ఇరవై సంవత్సరాలలో-ఆయన పాడని రకం పాట లేదు. శాస్త్రీయంగా ఉండే పాటలు, మామూలు పాటలు, పాశ్చాత్య బాణీలో ఉండే పాటలు పాడారు. దాదాపు బొంబాయిలోని సంగీత దర్శకులందరికీ ఆయన పాటలు పాడారు. సంగీత దర్శకుని వ్యక్తిత్వాన్ని అవగాహన చేసుకుని, అతనికి కావలసిన పద్ధతిలో పాడుతారు. ఆయన గొంతు హిందీ సినీమాలలోని కథానాయకులందరికీ సరిగా అతుకుతుంది. అలా అతికే విధంగా గొంతును సవరించుకుని పాడటం కూడా ఆయనకు చేతనవును. ఆయన గిరాకీకి ఇదొక ముఖ్యకారణం. రంగంలో ప్రవేశించిన నాటి నుంచి ఇంతవరకు రోజు రోజుకు ఆయనకు గిరాకీ పెరగటమే తప్ప తరగటం అన్నది జరగలేదు. కొత్త గాయకులు ఎందరు వస్తున్నా ఆయన స్థానం అచంచలం. బొంబాయి సినీ గాయకులలో ఇన్ని రకాల పాటలు పాడగలవారు గానీ, ఇంత హెచ్చు శ్రుతిలో పాడగలవారు గానీ మరొకరు లేరు. ఇంత ప్రఖ్యాతి పొందిన రఫీ వయస్సు నలభై సంవత్సరాలు మాత్రమే.

ఉషాఖన్నా ఇప్పుడు చాలా 'బిజీఆర్టిస్టు'లలో ఒకరు. ఆమె వయస్సు ఇప్పుడు పాతికలోపు. ఏడు సంవత్సరాల క్రితం 'దిల్ దేకే దేఖో' చిత్రంతో ఆమె సినీ సంగీత రంగంలో ప్రవేశించింది. ఇంతవరకు ఆమె సంగీతం సమకూర్చిన ఏడు చిత్రాలలో దాదాపు ప్రతిపాట 'హిట్' అయింది. ఇప్పుడు ఆమె శంకర్ జైకిషన్, నయ్యర్, రోషన్, మదన్ మోహన్ వంటి పెద్ద సంగీత దర్శకులతో పోటీపడుతున్నది. ఇంత చిన్న వయస్సులో ఇంత ప్రతిభ చూపిన వారు బొంబాయి రంగంలోనే చాలా అరుదు. ఈతరంలో ఈమె భారతదేశం మొత్తం మీద ఏకైక సంగీత దర్శకురాలు. ఇంత చిన్న వయస్సులోనే ఆమె తన సంగీతానికి ఒక స్పష్టమైన శైలిని రూపొందించుకున్నది. ప్రతి పాటలోనూ ఆమె కొత్తదనాన్ని చూపిస్తుంది. కొత్తదనం ఒక్కటే ఆమె లక్ష్యం కాదు. అంతకంటే లాలిత్యం ముఖ్యమని ఆమెకు తెలుసు. ఆమె పాటలు చాలా సరళంగా, మధురంగా ఉంటాయి అందుకే. ఇప్పుడిప్పుడు ఆమె సినిమాలలో స్వయంగా పాడుతున్నది కూడా. రోషన్, చిత్రగుప్త, ఎన్.దత్తాలకు కొన్ని పాటలు పాడింది. హిందీ, పంజాబీ, ఉర్దూ, బెంగాలీ, గుజరాతీ పాటలు పాడగలదు. ఆమె మద్రాసు రావటం ఇదే ప్రథమం.

'సఖీమండల్' వారు ఈ కార్యక్రమానికి ముందురోజు-ఏప్రిల్ 24వ తేదీన మరొక వినోద కార్యక్రమం నిర్వహించారు. సంగీతం, నృత్యం, నాటకం, విచిత్రవేషధారణలుగల ఆ కార్యక్రమంలో అందరూ 'సఖీమండల్' సభ్యురాండ్రే పాల్గొన్నారు. ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ ఆ కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేశారు.

నండూరి పార్థసారథి
(1965 జూన్ 09వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమయింది)

Previous Post Next Post