వేదాంతం సత్యనారాయణ శర్మ

బెంగళూరు, మే 30 : మన ప్రాచీన కవులు నాయిక అందచందాలను వర్ణిస్తూ ఆమె నడకను హంసనడకతో పోల్చేవారు. కొందరు కవులు ఆమె హంసలకే ఒయ్యారాలు నేర్పుతుందని రాశారు. అవి చదివి ఈ కాలపువారు అతిశయోక్తి అలంకారం అనుకుంటారు. ఆధునిక రచనలలో ఎవరైనా అటువంటి వర్ణనలు చేస్తే వట్టి బడాయి అనుకుంటారు. "ప్రాచీన కావ్యాల్లో తప్ప అంతటి ఒయ్యారం ఈకాలంలో ఎవరికుంది" అనుకుంటారు. కూచిపూడి నటరాజు పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ స్త్రీలకే స్త్రీత్వం నేర్పగలడని అంటే కూడా చూడని వారు అతిశయోక్తి అనే అపోహపడతారు. కాని, ఆయనను ఒక్కసారి రంగస్థలంపై చూసిన వారు ఆ మాట అక్షరాలా నిజమని అంగీకరిస్తారు. అంతేకాదు-ప్రాచీన కావ్యాలలో నాయిక లావణ్య వర్ణన కూడా అతిశయోక్తి కాదని అంగీకరిస్తారు.

ఇటీవల బెంగుళూరు నగరంలో వేదాంతంవారి 'విప్రనారాయణ', 'భామాకలాపం' నృత్య నాటకాలను చూసిన వేలాది ప్రేక్షకులు ఆయన సౌందర్యానికి, కళాప్రతిభకు ముక్తకంఠంతో జోహారులర్పించారు. 'దేవదేవి' వంటి వేశ్య పాత్రలో సైతం లేశమంతైనా అశ్లీలం స్ఫురించకుండా, అత్యంత మనోహరంగా, ఆయన ప్రదర్శించిన శృంగార హావభావాలు, ఒలకబోసిన ఒయ్యారాలు రసాభిజ్ఞులకు మరపురాని మధురాతిమధుర స్మృతులుగా మిగిలిపోయాయి. బెంగుళూరు రసికులకు ఇది అపూర్వమైన, అపురూపమైన, అద్భుతమైన అనుభూతి. వేదాంతం వారిని ఇదివరకే రంగస్థలంపై చూసిన వారికి కూడా ఇది అపూర్వమైన అనుభూతిగానే అనిపించింది. ఆయన ఇంతకుముందు నాలుగైదు సంవత్సరాల క్రిందట ఇక్కడ 'ఉషాపరియణం' ప్రదర్శించారు. అప్పటికీ ఇప్పటికీ ఆయన కళా వైదగ్ధ్యం ద్విగుణీకృతమైనట్లు అనిపిస్తున్నది.

కొందరి నృత్య ప్రదర్శనలు పండిత జనరంజకంగా ఉంటాయి. మరికొందరి నృత్య ప్రదర్శనలు కేవలం పామర జనరంజకంగా ఉంటాయి. కాని, పండిత పామర విచశ్రక్షణ లేకుండా అందరినీ మంత్ర ముగ్ధులను చేయగల ఆకర్షణ, ప్రతిభ మిక్కిలి కొద్దిమందికి మాత్రమే ఉంటుంది. అటువంటి కొద్దిమందిలో వేదాంతం ఒకరు. ఆయన స్త్రీలను, పురుషులను, బాలలను, వృద్ధులను, కళాభిజ్ఞులను, కళ సంగతి బొత్తిగా తెలియని వారిని సమానంగా సమ్మోహపరచగలరు. 'ఆడది మెచ్చినది అందం' అంటారు. వేదాంతం సత్యభామ అందం అందగత్తెలు అసూయ పడే అందం, అందగత్తెలు ఆరాధించే అందం.

గ్యాలరీ ప్రేక్షకులను ఆకర్షించడానికి వేదాంతం తన ఉన్నత కళాశిఖరం మీదనుంచి ఒక్క అంగుళమైనా క్రిందికి దిగిరానవసరం లేదు. తన ఔన్నత్యాన్ని నిలబెట్టుకుంటూనే ఆయన ప్రేక్షక హృదయాన్ని చూరగొనగలరు. ఇక పండితులు, విమర్శకులు ఆయన 'అంగశుద్ధి'కి, సాత్వికాభినయానికి, రసావిష్కరణ ప్రతిభకు ముగ్ధులైనారు. ఒక్క వేదాంతం వారికే కాదు. కూచిపూడి నాట్య కళావైభవానికే వారు నీరాజనాలర్పించారు. కళాప్రపంచం మీదికి తెలుగుదేశం విసిరిన కూచిపూడి విరితూపు వేదాంతం సత్యభామ.

వేదాంతం బృందం వారు మే 24వ తేదీన 'విప్రనారాయణ' నృత్య నాటకాన్ని, మే 27వ తేదీన 'భామాకలాపం' నృత్య నాటకాన్ని ప్రదర్శించారు. 'ఆకాశవాణి' బెంగుళూరు కేంద్రం 23, 24 తేదీలలో నిర్వహించిన 'జానపద కళామేళ'లో భాగంగా 'విప్రనారాయణ' ప్రదర్శించబడింది. అందులో వేదాంతం దేవదేవి పాత్రను పోషించారు. 'ఆకాశవాణి' వారు అచ్ఛమైన శాస్త్రీయ కళారూపాన్ని 'జానపద కళామేళ'లో ఎందుకు చేర్చారో గాని, కూచిపూడి కళా వైభవం ముందు ఇతర జానపద కళారూపాలన్నీ వెలవెల బోయాయని విమర్శకులు భావించారు.

Vedantam Picture
వేదాంతం సత్యనారాయణ శర్మ

'భామాకలాపం' ప్రదర్శన కర్ణాటకరాష్ట్ర సంగీతనాటక అకాడమీ ఆధ్వర్యాన నిర్వహించబడింది. నాటి కార్యక్రమంలో మొదటి రెండు గంటల సేపు 'భామా కలాపం' ప్రదర్శించారు. విరామానంతరం వేదాంతం బృందంలోని ఒక కుర్రవాడు 'దశావతార' నృత్యం చేశాడు. మరొక కుర్రవాడు పసుమర్తి రత్తయ్య 'బాలగోపాల తరంగ' నృత్యం చేశాడు. ఈ రెండు అంశాలు రక్తికట్టలేదు. చివరి అంశం 'గోపీకృష్ణ'లో వేదాంతం గొల్లభామగా, మరొక నటుడు కృష్ణుడుగా 'మధురానగరి'లో పాటపాడుతూ నృత్యం చేశారు. సర్వాభరణ భూషితయైన సత్యభామలో కంటే, నిరాభరణయైన గొల్లభామలో సహజ సౌందర్యం గొప్పగా భాసించింది. వేదాంతం ప్రతిభ ముందు బృందంలోని ఇతరులందరూ తేలిపోయినట్లు అనిపించింది. ఆయనలోని హుందాతనం, ఠీవి ఇతరులలో లేవు. ఆయన నృత్యంలోని 'అంగశుద్ధి' కూడా ఇతరులలో కనిపించలేదు. అయితే, ఆయన శిక్షణలో పసుమర్తి రత్తయ్య స్త్రీ పాత్రల పోషణలో ప్రతిభావంతుడుగా రూపొందే సూచనలు కనిపిస్తున్నాయి.

వేదాంతం తన రెండు ప్రదర్శనాలతో భారతీయ శాస్త్రీయ నృత్య రీతులలో కూచిపూడి శైలి సాటిలేనిదని రుజువు చేశారు. రూపక ప్రయోగంలో గాని, ఏకపాత్ర నర్తన విషయంలోగాని భరతముని నాట్యశాస్త్రంలో నిర్దేశించిన విధులన్నింటినీ ఈనాటికీ శ్రద్దాభక్తులతో తు.చ తప్పకుండా పాటిస్తున్న వారు ఒక్క కూచిపూడి కళాకారులేనని చెప్పవచ్చును. కూచిపూడి నాట్య సంప్రదాయంతో పోల్చితే భరతనాట్యం, కథక్, కథకళి వంటి ఇతర రీతులన్నీ సంకుచితమైనవిగా కనిపిస్తాయి. ఈనాడు ప్రదర్శింపబడుతున్న భరతనాట్యం కేవలం ఏకపాత్ర నర్తనకు పరిమితమై పోయింది. కథక్ కూడా అంతే. 'కథకళి' నృత్య నాటక రూపంలో మాత్రమే వుంది. అందులో ఏకపాత్ర నర్తనం లేదు. కూచిపూడి సంప్రదాయంలో ఈరెండూ ఉన్నాయి. ఇందులో 'భామాకలాపం', 'ఉషాపరిణయం' వంటివి నృత్య నాటకాలుగా, 'దశావతారం', 'బాలగోపాల తరంగం' వంటివి ఏకపాత్ర నృత్యాలుగా ప్రదర్శింపబడుతున్నాయి. కూచిపూడి నాట్యకళలో తాండవ, లాస్యరీతులు రెండింటికీ స్థానం ఉన్నది. అలాగే సాత్విక, ఆంగిక, వాచిక, ఆహార్యాభినయాలు నాలుగింటికీ ప్రాముఖ్యం ఇన్నది. ముఖ్యంగా సాత్వికాభినయానికి-అనగా ముఖంలో హావభావాల వ్యక్తీకరణకు-కూచిపూడి నృత్యంలో ఉన్నంత ప్రాధాన్యం మరి ఏ శాస్త్రీయ నృత్యశైలిలోనూ లేదు. కూచిపూడి శైలికి మూల పురుషులైన సిద్ధేంద్రయోగి, క్షేత్రయ్య సాత్వికాభినయానికి పట్టాభిషేకం చేశారు. 'భామాకలాపం'లో సాత్వికాభినయం పరాకాష్ఠనందుకున్నది. ఆ పరాకాష్ఠ స్వరూపాన్ని వేదాంతం వారి సత్యభామలో తిలకించవచ్చును.

ఇతర శాస్త్రీయ నృత్యాలలో కళాకారులు పాడుతూ నృత్యం చేసే సంప్రదాయం లేదు. పాడేవారు వేరే ఉంటారు. కూచిపూడి సంప్రదాయంలో పాటపాడే సూత్రధారుడు ఉన్నప్పటికీ నృత్యం చేసే వారు తమ పాటను తాము స్వయంగా పాడతారు. అందుచేత ఈ సంప్రదాయంలో వాచికాభినయానికి కూడా ప్రాముఖ్యం ఉన్నది. సత్యభామ లేఖారచనలో వేదాంతం గద్గదకంఠంతో విరహోత్కంఠిత ధైన్యాన్ని స్ఫురింపజేస్తూ పాడిన తీరు వాచికాభినయానికి అచ్ఛమైన ఉదాహరణ.

నండూరి పార్థసారథి
(1976 మే 31వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమయింది)

Previous Post Next Post