Title Picture

ఒక వ్యక్తి జీవితగమనానికి అతని మనస్తత్వం ఎంత ప్రాతిపదికో, చలన చిత్రానికి కథ అంత ప్రాతిపదిక. కథ చిత్రానికి జీవం, కథే చిత్రానికి అవధులు కల్పిస్తుంది. కథ ఆధారంగానే నటులు నటిస్తారు, దర్శకుడు ప్రతిభను ప్రదర్శిస్తాడు. చిత్రంలో మరే అంశమైనా కథ ఆధారంగానే జరుగుతుంది. నటులయినా, సాంకేతిక నిపుణులయినా కథను విడిచి సాము చేయలేరు.

మెజారిటీ భారతీయ చిత్రాలలో-ముఖ్యంగా మన తెలుగు చిత్రాలలో కథకు తగిన గౌరవం లభించడం లేదు. చిత్రంలో కథ ప్రముఖస్థానాన్ని ఆక్రమించలేకపోతున్నది. చిత్రం అంతా కథను విడిచిన సాముగా ఉంటున్నది. కథ తప్ప మిగతా (నిష్ఫలమైన) హంగులన్నీ ఉంటున్నాయి. నటులు, దర్శకులు, నిర్మాతలు కథను పనికిరాని చెత్తగా ఊడిచేస్తున్నారు. రచయిత అంటే అందరికీ అలుసు. మెజారిటీ రచయితలు పేరుకు మాత్రమే రచయితలు. వాస్తవానికి సన్నివేశాలు సంభాషణలూ తయారుచేసేది అగ్రశ్రేణి నటులు, దర్శకులు, నిర్మాతలు, ఆ పైన డిస్ట్రిబ్యూటర్లు. పాత్రలు, సన్నివేశాలు అన్ని 'రెడీమేడ్'గా ఉంటాయి. ఎటొచ్చీ నటులు వాటిని తొడుక్కోవడం, దర్శకులు హడావుడి చేయటం, కెమేరామన్ స్విచ్ నొక్కటం మాత్రం జరుగుతున్నది. లోగడ డజన్ల కొద్దీ చిత్రాలలో నలిగినవే కావడం వల్ల అనుభవజ్ఞులయిన నటులకు అవి కంఠోపాఠంగా వచ్చినవే అయి ఉంటాయి. వాళ్ళకి ఆట్టే యిబ్బంది లేకుండా రచయితలనేబడేవారూ, దర్శకులూ కలిసి పాతసంభాషణలనే సిద్ధం చేసి ఉంచుతారు-ఇదీ మన చిత్రాల పరిస్థితి. నిష్కర్షగా చెప్పాలంటే ఈనాటి ఆంధ్రుల సంస్కారానికీ, అభిరుచికీ, విజ్ఞానానికీ అనుగుణంగానే ఉంటున్నాయి తెలుగు చిత్రాలు. సినిమాలకు అనుగుణంగా ప్రజలు మారుతున్నారనీ, సినిమాలు ప్రజలను చెడగొడుతున్నాయని కొందరూ, కాదు ప్రజల అభిరుచులు అంతలక్షణంగా ఉండబట్టే మేము ఇటువంటి చిత్రాలను తీస్తున్నామని సినిమాల వారూ దెబ్బలాడుకొంటున్నారు.

ఒక్క సినిమాలనే అననక్కరలేదు. అన్ని కళల స్థితీ అలాగే ఉన్నది. కధాదారిద్ర్యం మన సినిమా రంగంలోనే కాదు, మన సాహితీ రంగంలోనే ఉంది. తాతముత్తాతలు ఆవకాయజాడీలలా, అప్పడాలూ, వడియాలులా మిగిల్చిపోయిన ప్రబంధ సాహిత్యం మినహా గర్వించతగిన సాహిత్యం మనకు ఏమీలేదు. ముఖ్యంగా కథాసాహిత్యం మనకు శూన్యం. ప్రపంచావధిన స్థూలంగా పరికిస్తే మనకు ఒకసత్యం గోచరిస్తుంది. కథాసాహిత్యం, నవలాసాహిత్యం సమృద్ధంగా ఉన్న భాషలోనే ఉత్తమ శ్రేణి చిత్రాలు వెలువడడానికి అవకాశం ఉంటుంది. హాలీవుడ్, సోవియెట్, ఫ్రెంచి చిత్రాలు ఇందుకు తార్కాణం. కథలు నవలలు మనదేశంలో పుట్టడం ప్రారంభించి ఎంతో కాలం కాలేదు. భారతీయ సాహిత్యంలో చెప్పుకోతగ్గ నవలలూ, కథలూ అంటూ ఏమైనా ఉంటే అవి కాసినీ బెంగాలీ భాషలో మాత్రం ఉన్నాయి. అందుకే బెంగాలీ చిత్రాల ప్రమాణాలు చెప్పుకోతగ్గ విధంగా ఉంటున్నాయి.

నవలలు అని చెప్పుకోతగ్గవి తెలుగులో గట్టిగా లెక్కపెడితే అరడజను దొరుకుతాయోలేదో అనుమానం. అలాగే ఉంది కథల పరిస్థితి కూడా. ఐదారు వందల పేజీల (బెంగాలీ) నవలలనే కానీ, చిన్న కథలను చిత్రాలుగా తీయడం మనవారు ఇంకా నేర్చుకోలేదు. ఇప్పట్లో నేర్చుకోగలరన్న ఆశ లేదు. పదివేల అడుగులలో మనవారు చిత్రం తీయగలిగినాడు దాన్ని ప్రపంచంలోని 'ఎనిమిదవ అద్భుతం'గా చెప్పుకొని గర్వించవచ్చును.

చిన్న 'స్కెచ్' లను అద్భుతమైన చిత్రాలుగా నిర్మించారు హాలీవుడ్ దర్శకులు. మన చిత్రాల దుస్థితికి మనవారు అనేక కుంటిసాకులు చెప్పి సమర్థించుకొంటారు. చిత్రాలలో కథకు తగిన గౌరవం, స్థానం ఇవ్వడానికి కావలసింది డబ్బుకాదు-చిత్తశుద్ధి, సాహసం, ప్రతిభ.

బహుళ ప్రజాదరణ పొందిన కథలనూ, నవలలనూ చిత్రాలుగా తీసే అలవాటు మనవారికి లేదు. మిగతా అన్నిదేశాలలోనూ ఉంది ఈ ఆచారం. బెంగాలీ రంగంలోనూ, ఇంకా కొంత వరకు హిందీ చిత్రరంగంలోనూ కూడా ఈ అలవాటు ఉన్నది. బొత్తిగా లేనిది మన తెలుగు రంగంలోనే. ఇందాక చెప్పినట్లు తెలుగులో నవలలు, కథలూ శూన్యం కావడం వలన అటువంటి అవకాశమూ లేదు. అందుకే సినిమా కథకులనబడే వారు వేరే 'తెగ'గా ఉంటున్నారు.

స్వయంగా ఆలోచించి స్వతంత్రమైన రచన సాగిద్దామనే ఆలోచన తెలుగు బుర్రకు సాధారణంగా పుట్టదు. అటువంటి ప్రతిభ, ఉత్సాహం, ఓపిక ఏనాడో నిండుకున్నాయి. కాస్తో కూస్తో ఓపిక ఉన్నవారు అయిన కాడికి ఇతర భాషల నుంచి అనువాదాలు దంచేస్తున్నారు. ఇంకా తెలివిగలవారు అనువాదమని చెప్పరు. ఆధునిక తెలుగు సాహిత్యం - అనుసరణలూ, ఆధారాలూ, ప్రభావాలూ పోనూ స్వతంత్రమైన సాహిత్యం - నూటికి 5 వంతులకన్నా ఎక్కువ ఉండదేమో. ఇకవాటి మంచి చెడ్డలను ప్రశ్నించనే కూడదు.

సాహిత్యాన్ని బట్టే సినిమాలూను. సొంతంగా కథ వ్రాసే తీరిక, ఓపిక లేదు. 'రాస్తే ఒరిగే దేమిటిలేస్తూ లేనిపోని శ్రమతప్ప. మరీ చాదస్తం' అని మనవారు పరాయి భాషలోని ఏ రజతోత్సవ కథనో కొనేసి చిత్రం తీస్తున్నారు. ఇంకా కొంతమంది ఏకంగా స్క్రీన్ ప్లేనే కొనేసి 'ఫ్రేం-టు-ఫ్రేం' అనువదిస్తున్నారు.

తెలుగుదేశంలో ప్రతి ముగ్గురిలోనూ ఇద్దరు రచయితలని ఎవరో అతిశయోక్తిగా అన్నట్లు జ్ఞాపకం-అచ్చులో తమ పేరు చూసుకోవాలన్న మోజు నానాటికీ ప్రజలలో విపరీతంగా పెరుగుతున్నది. పత్రికలు వారిని యథాశక్తిని ప్రోత్సహిస్తున్నాయి. స్తోమతు ఉన్నవారు పదో, పరకో ముట్టజెప్పుతున్నారు. కథా ప్రమాణానికి తగినట్లు పారితోషికమిస్తే వ్రాయగలవారికి ఉత్సాహం వస్తుంది.

కథలు ఎవరూ ఉచితంగా ఇవ్వరు. అట్టి అవసరం కూడా లేదు. శ్రమకు తగిన ప్రతిఫలం ఎవరయినా కోరుతారు. కాని సమర్థులయిన రచయితలకు ప్రోత్సాహమూ, ప్రతిఫలమూ లభించడం లేదు. సినిమారంగంలో పాతుకుపోయిన కొద్ది మంది రచయితలతోనే తృప్తిపడకుండా ఫలానా విషయంపై అత్యుత్తమంగా కథ రాసినవారికి ఇన్నివేలు పారితోషికమిస్తాము అని ప్రకటిస్తే తప్పనిసరిగా మంచికథలు, తర్వాత మంచి చిత్రాలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నది. దీనివలన సమర్థులయినవారిలో నిద్రాణమై ఉన్న ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చినట్లూ అవుతుంది. సాహిత్య ప్రమాణాన్నీ, చిత్రాల ప్రమాణాన్నీ ఉద్ధరించినట్లూ అవుతుంది. మనదర్శకులలో కథకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న ఇద్దరు ముగ్గురయినా ఇందుకు పూనుకోవడం అవసరం.

నండూరి పార్థసారథి
(1960 సెప్టెంబర్ 11వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమయింది)

Next Post