Title Picture

నవ్య కళామందిర్ వారి తెలుగు డబ్బింగ్ చిత్రం 'స్త్రీ హృదయం'. ఈ సంవత్సరం ఇంతవరకు విడుదలయిన డబ్బింగ్ చిత్రాలన్నింటికన్న మెరుగుగా ఉంది. సామాన్య ప్రేక్షకజనాన్ని అలరించడానికి కావలసిన అన్ని హంగులతోపాటు, కాస్తంత కళను కూడా మేళవించి సగటు స్థాయి కన్న మిన్నగా ఈ చిత్రాన్ని రూపొందించాడు దర్శకుడు శ్రీధర్. రజతోత్సవ చిత్రం 'పెళ్ళి కానుక' ద్వారా సంపాదించుకున్న పేరును ఆయన నిలబెట్టుకున్నాడు. డబ్ చేయడానికి బదులు తెలుగు నటీనటులతో పునర్నిర్మించినట్లయితే ఈ చిత్రం శతదినోత్సవాలు జరుపుకోగలిగేది.

శేఖర్ (జెమినీగణేశన్) అనే యువకుడు నిర్మల (పద్మిని) అనే అనాథ యువతిని చేరదీసి ఒక నాట్యాచార్యుని వద్ద భరతనాట్యం నేర్పిస్తాడు. ఆమె వివాహం చేసుకోదనీ, నాట్యానికే జీవితాన్ని అంకితం చేస్తుందనీ వాగ్దానం తీసుకొన్న పిమ్మటనే నాట్యాచార్యుడు శిక్షణ ప్రారంభిస్తాడు.

కాని శేఖర్, నిర్మల గాఢంగా ప్రేమించుకుంటారు. ఆమెను వివాహం చేసుకుంటే ఆమె కళారాధనకు భంగం కలుగుతుందనీ, వేరే వివాహం చేసుకోమనీ గురువు శేఖర్ ను హెచ్చరిస్తాడు. ఇష్టం లేకపోయినా, తన ప్రేమను త్యాగం చేసి మరొక యువతిని పెండ్లాడుతాడు శేఖర్. నిర్మల విరక్తితో నాట్యానికి స్వస్తి చెబుతుంది. గురువు గారు పశ్చాత్తాపపడతాడు. నాయికా నాయకులు విడిపోతారు. చివరికి శేఖర్ ఇల్లు వేలానికి వస్తే నిర్మల నాట్య ప్రదర్శనలిచ్చి డబ్బు సంపాదించి అతని అప్పులు చెల్లిస్తుంది. క్లైమాక్సులో శేఖర్ భార్య చనిపోతుంది. తిరిగి నాయికా నాయకులు కలుసుకొంటారు.

మామూలుగా అందరూ చెప్పుకొనే నిర్వచనం ప్రకారం ఈ చిత్రంలో విన్సెంట్ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. ఎందుకంటే పద్మిని భరతనాట్యానికంటే విన్సెంట్ కెమెరా నృత్యాన్ని 'శెభాష్' అని మెచ్చుకుంటున్నారు జనం. పాటలు, పద్మిని నృత్యాలు చక్కగా ఉన్నాయి. డబ్బింగ్ రచన సంతృప్తికరంగా ఉంది. పద్మిని చాలా హాయిగా నటించింది. జెమినీ గణేశన్ చాలా శ్రద్దతో, చెమటవోడ్చి నటించాడు.

నిర్మాత: టి.రాజగోపాలరెడ్డి; దర్శకత్వం: శ్రీధర్; రచన: శ్రీ శ్రీ; సంగీతం: నిత్యానందం; కెమెరా: విన్సెంట్; తారాగణం: పద్మిని, జెమినీగణేశన్, తంగవేలు, టి.ఆర్.రామచంద్రన్ వగైరా.

నండూరి పార్థసారథి
(1961 ఆగష్టు 6వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post