Title Picture

(3)

ఆ మరునాడు సుబ్బణ్ణ సంగీత రంగంలో తాను ఇంతకాలం చేస్తున్న సాధన గురించి తండ్రికి చెప్పాడు. త్వరలో తనకు రాజావారు వేతనం మంజూరు చేసే అవకాశం ఉందని కూడా చెప్పాడు.

ఆమాట వినగానే నారాయణశాస్త్రి గారి మనస్సు చివుక్కుమంది. తన తాత ముత్తాలందరూ సంస్కృత విద్వాంసులు, తానూ విద్వాంసుడే. కుటుంబ సంప్రదాయాన్ని తన శాయశక్తులా కాపాడుతున్నాడు. కాని తన కొడుకు తన కుటుంబ సంప్రదాయానికి వారసుడైన కొడుకు-సంస్కృతానికి తిలోదకాలిచ్చి గాయకుడయ్యాడు.

రాజసభలో పండితుల మధ్య కూర్చుని పురాణ ప్రవచనం చేస్తూ, రాజావారిని ఆశీర్వదించే సంస్కృత విద్వాంసుడెక్కడ? వినోదం కోసం చేరిన జనం ఎదుట కూర్చుని 'హా', 'హూ' అంటూ పాడే గాయకుడెక్కడ? తన తాతముత్తాతలు నిర్మించిన అత్యున్నత గోపురం ఒక్కసారిగా నేలకూలినట్లు శాస్త్రి గారికి ఆ క్షణంలో అనిపించింది. కాని ఏం చేయగలడు? దైవేచ్ఛ అనుకొని ఇంక ఆ విషయం ఆలోచించడం మానివేశాడు.

సుబ్బణ్ణ గాయకుడయ్యాడన్న మాటవిని అతడి తల్లికూడా అలాగే బాధపడింది. తాను కనిపెంచిన ఒక్కగాను ఒక్కకొడుకు వేశ్యలాగా జనం ముందు కూర్చుని పాడతాడంటే ఆవిడకి చాలా తలవంపులుగా అనిపించింది. తల్లిగా ఆవిడ అలా బాధపడడం సహజం.

మనం సాధారణంగా ఇతరులను ఆనందపరచడం కంటే ఇతరులపై అధికారం చూపించడం గొప్పగా భావిస్తాం. దేవఋషి నారదుడు వైకుంఠంలో విష్ణుసాన్నిధ్యంలో గానం చేస్తాడన్న సంగతి మరచిపోతాం. సంగీతంతో, వినయంతో ఇతరులకు ఇవ్వగలిగిన ఆనందాన్ని పాండిత్యంతో, ప్రతిష్ఠతో ఇవ్వలేము. కాని మనం అలా ఆలోచించం. ప్రపంచం మనల్ని ఎలా చూస్తున్నదనే ఆలోచిస్తాం. సంస్కృతం నేర్చుకున్నవాడు రాజుగారిని ఆశ్వీరదిస్తాడు. గానం చేసేవాడు దాదాపు వేశ్యలాంటివాడు. కాబట్టి సంస్కృతం గొప్పది, సంగీతం చౌకబారుది. మన ఆలోచన ఇంతకంటే ఎక్కువ దూరం పోదు.

ఈ దురదృష్టానికి కూడా కోడలే కారణమని సుబ్బణ్ణ తల్లి ఆరోపించింది. సంగీతం అభ్యాసం చేస్తున్నానని సుబ్బణ్ణ చెప్పినప్పుడు వేశ్యల ఇళ్ళకు పోవడానికి అదొక నెపమని ఆవిడ అనుకుంది.

“ఈ కాలపు ఆడపిల్లలకి ఏం చెప్పగలం? భర్తలని ఎలా చూసుకోవాలో వీళ్ళకి తెలీదాయె. ఆడది మొగుణ్ణి తిన్నగా చూసుకుంటే మగవాడు ఇంకో ఆడదాని దగ్గరికి ఎందుకుపోతాడు?” అన్నది ఆవిడ.

ఆ రోజు పొరుగింటి వాళ్ళెవరో వస్తే ఈ వ్యవహారమంతా ఏకరపు పెట్టింది. “మా చిన్నతనంలో మేము ఈ కోడల్లాగా ఉంటే మా సంసారాల గతి ఏమై ఉండేది” అంది ఆవిడ.

ఆ మాటలు విన్న వారెవరికైనా నారాయణశాస్త్రి గారు చిన్న తనంలో జులాయి తిరుగుడు తిరిగేవాడని, ఈవిడ తన హొయలతో చమత్కారంగా ఆయన్ని అదుపులోకి తెచ్చుకున్నదనీ అభిప్రాయం కలుగుతుంది. నిజానికి భర్త పట్ల లలితమ్మ చూపించినంత శ్రద్ధ ఆవిడ ఎన్నడూ శాస్త్రిగారి పట్ల చూపించలేదు. కోడలిని ఏదో అనాలని అనడమే తప్ప ఆ మాటలు మనస్ఫూర్తిగా అనేవి కావు. వినేవారు కూడా ఆవిడ మాటలను అంతగా పట్టించుకోరు.

ఆవిడే ఇంతకు ముందు ఒకసారి కోడలు నెరజాణ అనీ, తన కొడుకును లోబరుచుకున్నదనీ సాధించింది. ఆ నోటితోనే ఇవాళ కొడుకు చెడుతిరుగుళ్ళు తిరుగుతుంటే కోడలు వెర్రిబాగులదానిలాగా చూస్తూ ఊరుకుందని ఫిర్యాదు చేస్తోంది. కోడలిపై ఏదోనింద వెయ్యాలనే తప్ప ఆవిడ అది వరకటి ఆరోపణకి, ఇప్పటి ఆరోపణకి పొంతన లేదు.

మొత్తం మీద సుబ్బణ్ణ సంగీత సాధన వార్త తల్లి తండ్రులిద్దరికీ కష్టం కలిగించింది.

ఆ సంఘటనతో సుబ్బణ్ణకు తల్లి పట్ల ఒక విధమైన విముఖత ఏర్పడింది. ఆవిడ కారణంగా తాను భార్యను కొట్టినందుకో, తాను భార్యను ప్రేమగా చూసుకుంటున్నాననే అక్కసుతో ఆవిడ అస్తమానం లలితమ్మను ఆడిపోసుకుంటున్నందుకో మొత్తం మీద తల్లిపై అతనికి కోపంగా ఉంది. దానికి తోడు ఆవిడ ఆ రోజు చాలా సార్లు సంగీతాన్ని తిడుతూ గొణగడం మరీ కష్టం కలిగించింది. అప్పటి నుంచి రోజు రోజుకూ అతడికి తల్లిపై కోపం, విముఖత ఎక్కువవుతూ వచ్చాయి.

లేగ దూడలా అమాయకంగా, అణుకువగా ఉంటూ, తనకి ఎన్నడూ ఎదురు చెప్పి ఎరుగని కొడుకు ప్రవర్తనలో వస్తున్న మార్పును మొదట్లో ఆవిడ గమనించలేదు. కోడలిపై తాను వేసిన నిందలో నిజం లేదని ఆవిడకీ తెలుసు. కొడుకుపై కోడలి అదుపు ఏమీ లేదని ఆవిడకి తెలుసు. అయితే పరిస్థితి మారుతున్న సంగతి ఆవిడకి తెలియదు. అందుకని కొడుకునీ, కోడలినీ తన ధోరణిలోనే చూస్తోంది.

సుబ్బణ్ణకు మాత్రం తల్లి చేసే పనుల్లో కొత్త అర్థాలు కనిపించడం మొదలు పెట్టాయి. కోడలు పూజా పాత్రలు తోమడం ఒకటి రెండు నిమిషాలు ఆలస్యమైతే చాలు ఆవిడ అదో పెద్ద నేరమైనట్లుగా నోరు పెట్టుకు అరుస్తూ ఆ పాత్రలని తన పెరట్లోకి తీసుకువెళ్ళి తోమేది. అది వరకు కూడా చాలా సార్లు ఆవిడ అలా చేయటం సుబ్బణ్ణకు తెలుసు. కాని ఆవిడ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నదని అప్పట్లో అతనికి అనిపించలేదు.

కాని అదే సంఘటన ఈ రోజు జరిగితే అతడికి తల్లిపై చాలా చిరాకు, కోపం కలిగాయి. కోడలిపై నేరం వేయడం కోసమే తల్లి అలా చేస్తున్నదని అతడికి అనిపించింది. నిజానికి లలితమ్మ ఊరికే కూర్చోలేదు. సావిడి ఊడుస్తోంది. ఆమె రెండు పనులు ఒకేసారి ఎలా చేస్తుందని తల్లిని గట్టిగా అడగాలని అనిపించింది. కాని నిగ్రహించుకుని మెదలకుండా ఊరుకున్నాడు.

ఆ తరువాత కొద్ది రోజులకే సుబ్బణ్ణ రెండవ అక్క లక్ష్మి పురిటికి వచ్చింది. ఆమె రాకతో కుటుంబంలో కలతలు ఇంకా ఎక్కువయ్యాయి. సుబ్బణ్ణ తల్లి ఏ చిన్న సాకు దొరికినా దీర్ఘాలు తీస్తూ కొడుక్కూ, కోడలికి వినిపించేటంత బిగ్గరగా కూతురితో అంటూ ఉండేది: “ఈ ఇంట్లో ఏం సుఖపడదామని వచ్చావే తల్లీ? పాలా పెరుగా! రెండు చేతులా సంపాయించి పోసే తమ్ముడున్నాడనుకున్నావా? మీ నాన్నగారు ఒక్కరు సంపాయిస్తుంటే ఇంత మంది తింటున్నాం. ఇంక నీకే ఉపచారాలు జరుగుతాయే?” అని!

సుబ్బణ్ణను మనస్సులో పెట్టుకుని ఆవిడ అలా మాట్లాడుతుంటే లలితమ్మ చిన్నబుచ్చుకునేది. సుబ్బణ్ణ మొదట్లో ఈ మాటలు వినిపించుకోలేదు. ఆవిడ ఇలా అంటున్నదని భర్తతో చెబుదామనిపించింది లలితమ్మకి. కాని అంతలోనే కన్న తల్లికీ కొడుక్కీ మధ్య వైషమ్యాలు సృష్టించడం ధర్మం కాదని ఊరుకుంది.

అత్తగారు మామూలుగా కొనే పెరుగులో కొంత భాగం కడుపుతో ఉన్న కూతురి కోసం వేరే తీసి పెట్టేది. మిగిలిన పెరుగులో నీళ్ళుపోసి గిలక్కొట్టి మిగతా వాళ్ళందరికీ పోసేది.

ఒక రోజు శాస్త్రిగారు “ఏమిటే మజ్జిగ మరీ ఇంత నీళ్ళుగా ఉన్నాయి?” అని అడిగారు.

“అవును నీళ్ళ మజ్జిగే మరి. ఇంటిల్ల పాదికీ పెరుగు వడ్డించాలంటే ఎంత పెరుగు కొనాలి?” అంది సుబ్బణ్ణ తల్లి.

తండ్రి పక్కన కూర్చుని భోజనం చేస్తున్న సుబ్బణ్ణకు ఆ మాటలు చురుక్కుమనిపించాయి. తరువాత అతడి భార్య, అక్క భోజనం చేస్తుండగా ఏదో కావలసి వచ్చి అటువైపు వెళ్ళాడు. లలితమ్మ నీళ్ళ మజ్జిగతో అన్నం తింటున్నది. లక్ష్మిగడ్డ పెరుగుతో తింటున్నది. అది గమనించిన సుబ్బణ్ణకు ఈ పెరుగులో కాస్త తీసి నాన్నగారికి వడ్డించవచ్చుకదా అనిపించింది.

ఆ మాట అతను తల్లితో అని ఉంటే ఆవిడకి అదొక హెచ్చరికగా ఉపయోగపడేది. కాని సుబ్బణ్ణ మనసులో మాట బైటికి అనే రకం కాదు. అందుకని తను చూసింది, అనుకున్నది అంతా మనస్సులో పెట్టుకున్నాడు. అలా క్రమంగా తల్లి పట్ల అతడికి విముఖత పెరుగుతూ వచ్చింది. తన తల్లి లలితమ్మను సరిగా చూడడం లేదనే భావం స్థిరపడింది. భర్తగా తను లలితమ్మకి ఏమీ చేయలేకపోతున్నాననే చింతకూడా ఏర్పడింది.

తప్పుపట్టే స్వభావం ఉంటే ఏమీ లేకపోయినా తప్పు కనిపిస్తుంది. అటువంటిది ఉద్దేశ పూర్వకంగా సూటిపోటి మాటలనే ఇలాంటి కుటుంబంలో వైషమ్యాలు వృద్ధి చెందడంతో ఆశ్చర్యం ఏముంది? లలితమ్మకూడా గర్భవతి కావడంతో పరిస్థితి మరింత విషమించింది. పుట్టింటివారు వచ్చి ఆమెను తీసుకు వెళ్ళడం విధాయకం. కాని వాళ్ళు తీసుకువెళ్ళకపోవడంతో లలితమ్మ ప్రతిదానికీ అత్తగారిపై ఆధారపడవలసి వచ్చింది. కాని కోడలిపట్ల ఆవిడకి ఆసక్తిలేదు. కోడలి యోగక్షేమాల పట్ల శ్రద్ధ చూపించడం అత్తగా తన హోదాకు తక్కువ అనుకుంది ఆవిడ. కోడలు వంగి ఇల్లు ఊడవడానికి కష్టపడుతుంటే ఆవిడ వద్దని వారించవచ్చు. కాని ఆవిడ వారించదు. గర్భవతియైన కోడలికి కూడా కూతురితోపాటు కాస్త పెరుగు వడ్డించవచ్చు. అదీ చేయలేదు ఆవిడ.

సుబ్బణ్ణ ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. ప్రతి చిన్న విషంయంలో తన తల్లి వివక్ష చూపిస్తూనే ఉంది. లలితమ్మ సీమంతం కూడా చాలా క్లుప్తంగా జరిపించారు. కొద్ది రోజులకు లలితమ్మ మగపిల్లవాణ్ణి కన్నది.

కొడుకు పుట్టినందుకు సుబ్బణ్ణ పెద్దగా సంతోషించలేదు. ఈ ఇంటికి తనూ, భార్యే భారంగా ఉన్నామనుకుంటుంటే ఇప్పుడు ఈ పిల్లాడు ఇంకో భారం. దీనికి తోడు నవరాత్రి ఉత్సవాలలో రాజావారి ముందు గానంచేసే అవకాశం కూడా అసూయాగ్రస్తుల వల్ల దక్కకుండా పోయింది. రాజావారి అనుగ్రహం వల్ల వేతనం వస్తుందన్న ఆశ కూడా ఆ విధంగా వట్టిదై పోయింది.

ఇది చాలక దేశ దురదృష్టం కొద్దీ మహారాజావారు మరణించారు. అత్యంత ఉదారశీలుడైన కృష్ణరాజఒడయర్ అస్తమయంతో వేలాది జనులకు నీడ ఇచ్చిన డేరా మూలస్తంభం కూలిపోయినట్లయింది.

చెట్లు పడిపోయినప్పుడు చెల్లాచెదరైపోయే పక్షుల్లాగా అప్పటి వరకు రాజావారి ఆశ్రయంలో వర్ధిల్లిన పలువురు కళాకారులు కొత్త ఆశ్రయాల కోసం తలకొక దారి పట్టి వలసపోయారు. వయసు మళ్ళిన కొద్దిమంది మాత్రం మిగిలారు. వాళ్ళలో కొందరు వార్ధక్యం వల్ల ఎక్కడికీ వెళ్ళలేక ఉండిపోగా, మరికొందరు రాజ కుటుంబం పట్ల విశ్వాసంతో ఉండిపోయారు.

అటువంటి వారిలో నారాయణశాస్త్రిగారు ఒకరు. "ఇంతకాలం రాజావారి ఉప్పుతిన్నాను. వారి వంశానికి ఎంతో ఋణపడి ఉన్నాను. ఇప్పుడు యువరాజా వారి శ్రేయస్సు కోసం ప్రార్థించడం నా ధర్మం. ఇంక నేనెక్కువ కాలం ఉండను. ఈ జీవిత శేషం రాజావారి వంశాభివృద్ధి కోసం భగవంతుని ప్రార్థిస్తూ గడుపుతాను” అని ఆయన మనస్సులో అనుకున్నాడు.

రాజకుటుంబం వారు ఇదివరకు రాజావారు ఉన్నప్పుడు ఖర్చుపెట్టినంత ధారాళంగా ఇప్పుడు ఖర్చు పెట్టలేరు. అయినా తరతరాలుగా తమను ఆశ్రయించుకొని ఉన్న శాస్త్రిగారి వంటి వారిని పొమ్మనలేక యధాశక్తిని పోషిస్తున్నారు. ఈ కారణంగా శాస్త్రిగారి ఆదాయం తగ్గిపోయింది.

రాజకుటుంబం శాస్త్రిగారికి ఇచ్చేదే తగ్గించివేసినప్పుడు ఇంక కొత్తగా సుబ్బణ్ణకు వేతనం ఏమిస్తారు? రాజకుటుంబం నుంచి తనకు సంపాదన ఏమీ ఉండదని సుబ్బణ్ణ తెలుసుకున్నాడు.

కుటుంబంలో కలతలు పెరుగుతున్నాయి. సుబ్బణ్ణ తల్లి సాధింపులు, సూటిపోటి మాటలు ఎక్కువయ్యాయి. లలితమ్మ తరచుగా కన్నీరు పెట్టుకుంటూ ఉండేది. చంటి హిల్లాడికి సరైన పోషణ లేకుండా పోయింది. సుబ్బణ్ణ కూడా అర్ధాకలితో ఉంటున్నట్లు గమనించి ఆమె బాధపడింది.

అసలే ఇంటి పరిస్థితి ఇలా ఉంటే సుబ్బణ్ణ తల్లి తన కూతుళ్ళకు అవీ ఇవీ పంపిస్తూ ఉండేది. ఆ కూతుళ్ళ కుటుంబాలు కూడా రాజకుటుంబంపై ఆధారపడినవే. శాస్త్రిగారికి తగ్గినట్లే వారికీ ఆదాయం తగ్గింది. ఒక్కొక్కప్పుడు ఒక కూతురువచ్చి “అమ్మా కొంచెం నెయ్యి ఉంటే ఇవ్వవే. మళ్ళీ రేపు తెచ్చి ఇచ్చేస్తాను” అని అడిగేది.

తల్లి నెయ్యి ఇస్తూ దండకం చదివేది. “ఏం చేస్తాం తల్లీ రోజులిల్లా వచ్చాయి. ఒకప్పుడు ఈ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తూ ఉండేది. ఇప్పుడు ఇల్లంతా గుల్లయింది. పాద మహిమ, ఏం చేస్తాం ఎవరి పోషణ భారం వారే భరిస్తే బాగానే ఉండేది. మీ నాన్నగారు ఒక్కరూ ఈ వృద్ధాప్యంలో ఇంత మందిని పోషించాలంటే మాటలా?” అనేది!

ఆవిడ అనే ప్రతి మాట లలితమ్మకు బల్లెంలా గుచ్చుకునేది. ఒక్కొక్కప్పుడు ఆవిడ కూతురిని పక్కన కూర్చోబెట్టుకుని లలితమ్మ మీద ఉన్నవీ లేనివీ చిలవలు పలవలుగా కల్పించి చెబుతూ ఉండేది.

ఒకరోజు అలాగే ఆవిడ కూతురిని దగ్గర కూర్చోబెట్టుకుని లలితమ్మ గురించి చెబుతుండగా సుబ్బణ్ణ ఇంట్లోకి రావడం జరిగింది. అతడి అక్క చేతిలో నేతి గిన్నె ఉంది. గిన్నె నిండా నెయ్యి ఉంది. సుబ్బణ్ణ వారిద్దరినీ గమనించాడు గాని ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు. అక్కతో మామూలుగా మాట్లాడటానికి అతనికి మనస్కరించలేదు. తల్లీ కూతుళ్ళిద్దరూ చేరి తన భార్యను ఆడిపోసుకోవడం అతడికి కోపానికి కారణమయింది. కాసేపటికి అక్క వెళ్ళిపోయింది. తరువాత కాసేపాగి తల్లి కూడా కూతురింటికి వెళ్ళింది.

సుబ్బణ్ణ సావిట్లో ఏదో తాళపత్ర గ్రంథం తిరగేస్తూ కూర్చున్నాడు. శాస్త్రిగారు సాయంత్రం చీకటి పడ్డాక ఇంటికి చేరాడు. కోడలిని పిలిచి “ఇవాళేమిటో నోరు చచ్చినట్టుందమ్మా... ఏదైనా కాస్త వేపుడు కూర చేద్దూ” అన్నాడు. మామ గారు చెప్పినట్లు లలితమ్మ వేపుడు కూర చేసింది. తరువాత కాసేపటికి సుబ్బణ్ణ తల్లి వచ్చి ఆ కూర చూసి కోడలిపై మండిపడింది. “ఎంత పొగరు? ఇంట్లో నెయ్యి అసలే తక్కువగా ఉంటే వేపుడు కూర చేసి నెయ్యి దుబారా చేస్తావా? ఇంటికి నువ్వే యజమానురాలివనుకుంటున్నావా? లేక యజమానురాలి కంటే మించిన దాన్ననుకుంటున్నావా?” అని ఆవిడ గయ్ మంటూంటే శాస్త్రిగారు కల్పించుకుని “ఆ పిల్లనేమీ అనకే, వేపుడు చేయమని నేనే అడిగాను” అన్నాడు. ఓహో... ఇంత కాలం మొగుణ్ణే వశపరుచుకుందనుకున్నాను. ఇప్పుడు మామగారిని కూడా వశపరచుకుంటోందన్నమాట. తెలివుంటే పొదుపుగా సంసారం దిద్దుకురావాలి. పొదుపంటే ఏమిటో దీనికేం తెలుసు?” అంది ఆవిడ.

రెండు మూడు సందర్భాలలో శాస్త్రిగారు ఏవో అడగడం, అవిలేవని ఆవిడ చెప్పడం సుబ్బణ్ణ గమనించాడు. లేవని చెప్పిన ఆ వస్తువులనే ఆవిడ కూతుళ్ళకి ఇవ్వడం కూడా గమనించాడు. ఈ గొడవ జరిగిన రోజున ఆవిడ కూతురికి నెయ్యి ఇవ్వడం అతను కళ్ళారా చూశాడు. అయినా లలితమ్మ కాస్త నెయ్యి వేసి వేపుడు చేస్తే ఇంత రాద్ధాంతం చేస్తోంది.

సుబ్బణ్ణ కోపం పట్టలేక పోయాడు. ఎన్నో రోజులుగా అణచిపెట్టుకున్న ఆగ్రహం అంతా ఒక్కసారి పెల్లుబికింది. “అదేమిటమ్మా! సాయంకాలం నువ్వు అక్కకి నెయ్యి ఇవ్వలేదూ? వేపుడు కూర చేయడానికే నెయ్యి లేకపోతే అక్కకి ఎలా ఇచ్చావు?” అని అడిగాడు. ఆవిడ “అవునురా! నాయనా ఇన్నాళ్ళూ నువ్వూ, నీ పెళ్ళాం కలిసి నా ప్రాణం తీశారు. ఇప్పుడు మీ నాన్న గారికి కూడా బోధించండి. మీరందరూ సుఖంగా ఉండండి. నేను నా కూతురింటికి పోతాను” అంది.

“అదేమిటమ్మా... నిన్ను నీ కూతురింటికి వెళ్ళమని నేను అన్నాన్నా?” అన్నాడు సుబ్బణ్ణ.

“వెళ్ళమని అనక్కర్లేదు. నువ్వన్నమాటలే చాలు. సంసారం పొదుపుగా నడుపుకోవాలమ్మా అన్నాను. ఆ మాత్రానికే నువ్వు పెళ్ళాన్ని వెనకేసుకువచ్చి నన్ను తప్పు పడుతున్నావు. పైగా నేను కూతురికి నెయ్యి ఇచ్చానని మీ నాన్నగారికి చాడీలు చెబుతున్నావు. ఇన్ని మాటలనిపించుకున్న తరువాత ఏ మొహం పెట్టుకుని ఉంటాను ఈ ఇంట్లో? ముప్ఫయ్యేళ్ళు ఈ ఇంట్లో కాపురం చేసినదాన్ని కన్న కూతురు వచ్చి అడిగితే కాస్త నెయ్యి ఇచ్చే అధికారం నాకు లేదా?” అంది తల్లి.

సుబ్బణ్ణ కోపంతో ఇంకా గట్టిగా ఏదో అనబోయాడు. అంతలో లలితమ్మ ఏదోపనిమీద వచ్చినట్లు అటువైపు వచ్చి భర్తతో నెమ్మదిగా “మీకు పుణ్యం ఉంటుంది. ఏమీ అనకండి ఆవిణ్ణి” అంది. సుబ్బణ్ణ నాలిక చివరిదాకా వచ్చిన మాటలని ఆపుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

తల్లి అది గమనించి “ఆహాహా ఇది మరీ బావుంది. నా ఎదురుగానే వచ్చి అది అనండి. ఇది అనండి అని మొగుడికి బోధిస్తోంది” అని దీర్ఘాలు తీసింది. ఇంకా ఇంట్లో ఉంటే తను ఏదో ఒకటి అనవలసి వస్తుందని సుబ్బణ్ణ బైటికి వెళ్ళిపోయాడు.

ఆ రోజు నుంచి సుబ్బణ్ణకు కష్టాలు ఎక్కువయ్యాయి. అతను సంగీతంలో మంచి ప్రావీణ్యం సాధించాడు గాని దాని వల్ల అసూయాగ్రస్థులైన ప్రముఖ గాయకులు అతడికి ప్రత్యర్థులయ్యారు. అందువల్ల అతడు కొంతకాలం పాటు కచేరీలు చేయకూడదని నిర్ణయించుకున్నాడు. దాని వల్ల సంపాదన లేకుండా పోయింది. అలా కొంతకాలం గడిచాక ఇక కచేరీలు చేయకతప్పని పరిస్థితి ఏర్పడింది. వేశ్యల పిల్లలకు సంగీత పాఠాలు చెబితే డబ్బు వస్తుంది గాని అది నీచ సంపాదన అవుతుంది. తన తండ్రిది మచ్చలేని జీవితం. అటువంటి ఆయన ఇంటిలోకి తను అటువంటి నీచసంపాదన తీసుకు రాకూడదు.

సుబ్బణ్ణ అటువంటి సంకట పరిస్థితిలో ఉండగా అతడి పెద్దక్క ఆ ఇంట్లో ఉండడానికి పిల్లలతో సహా వచ్చింది. ఈ అదనపు జనాభాతో కుటుంబ పరిస్థితి మరీ అధ్వాన్నమయింది. తల్లి అక్క పిల్లలకి ఎక్కువ నెయ్యి వేసి పెట్టడం, తన పిల్లాడికి తక్కువ వెయ్యడం, అక్క పిల్లలకి పెరుగు వేయడం, తన పిల్లాడికి నీళ్ళ మజ్జిగ పోయడం సుబ్బణ్ణ చాలా సార్లు గమనించాడు. అయినా సహించి ఊరుకున్నాడు. ఆవిడ కొడుకుతో లడాయి వేసుకోవడం లాంటివి చేయడం లేదు.

నిజంగా ఆవిడకి కూతురు బిడ్డలపై ఎంత ప్రేమ ఉందో కొడుకు బిడ్డపైకూడా అంత ప్రేమవుంది. కాని ఆవిడ ఆలోచనా ధోరణి “ఈ భార్యా భర్తలిద్దరూ నన్ను వ్యతిరేక భావంతో చూస్తున్నారు. వాళ్ళు నన్ను అలా చూస్తుంటే నేను వాళ్ళని ఇంకెలా చూస్తాను?” అని.

ఆవిడ ఇలా ఆలోచిస్తున్నట్లు సుబ్బణ్ణకు తెలియదు. ఆవిడ ప్రవర్తనతో అతడికి అసహనం పెరిగిపోయింది. ఒకటి రెండు సార్లు లలితమ్మ అతడిని శాంతింపచేయడానికి ప్రయత్నించగా అతడు ఆమెపై గంయ్ మంటూ లేచాడు. “నీ మాట వింటున్నాను కదాని నా మీద దొరతనం చేయాలని చూస్తున్నావు. మా అమ్మ చెప్పింది నిజమే” అన్నాడు. లలితమ్మ ఇంకేం మాట్లాడగలదు?

“దేవుడా ఆయన కోపం తగ్గించు” అని మనస్సులోనే ప్రార్థించేది. తల్లీ కొడుకుల మధ్య దూరం ఇంకా పెరిగిపోయింది.

ఏవైనా పండగలు పబ్బాలు వచ్చినప్పుడు, నోములు, వ్రతాలు జరిగినప్పుడు అత్తా కోడళ్ళు రాజబంధువుల ఇళ్ళకు వెళ్ళి వారిచ్చే వాయనాలు తీసుకొస్తూ ఉండేవారు. శాస్త్రిగారి కుటుంబ ఆదాయంలో అవి ఒక భాగం. సుబ్బణ్ణకు అది ఇష్టం లేదు. ఆడవాళ్ళు రాజబంధువుల ఇళ్ళకు వెళ్ళకూడదని కాదు. తను ఏ సంపాదన లేకుండా ఊరికే కూర్చుని తింటున్నాడు. ఇది చాలక ఆడవాళ్ళు సంపాదించేది కూడా తినాల్సి వస్తోంది.

ఒక రోజు అతను ఇంటికి వచ్చేసరికి తల్లి బిగ్గరగా లలితమ్మపై అరుస్తోంది. లలితమ్మ ఒక మూల నుంచుని ఏడుస్తోంది. ఏం జరిగిందని తల్లిని అడిగాడు సుబ్బణ్ణ. “చూడరా ఎంత హఠం చేస్తోందో ఇది. అరసు గారింటికి వెళ్ళి వాయనాలు తీసుకురావే అంటే వెళ్ళనంటోంది. ఈవిడగారు రాణి.. వాయనాలు తీసుకోవడం ఈవిడ హోదాకు తక్కువ. నేను వెళ్ళి తీసుకురావాలన్నమాట” అంది తల్లి.

ఆ అరసు గారింట్లో అప్పటికి ఐదారు రోజులుగా ఏదో నోము జరుగుతోంది. లలితమ్మ రోజూ వెళ్ళి వస్తోంది. ఆ సంగతి సుబ్బణ్ణకూ తెలుసు. మరి ఆ రోజు ఎందుకు వెళ్ళనంటోందో అతనికి అర్థం కాలేదు. ఎందుకు వెళ్ళనన్నావని భార్యని అడిగాడు. ఎందుకో వెళ్లాలనిపించలేదని ఆమె బదులు చెప్పింది.

అంతలో శాస్త్రిగారు వచ్చారు. ఈ సంగతి విని ఆయన కోడలిని సమర్ధిస్తూ “ఆమెకి ఇష్టం లేకపోతే బలవంతం చేయడం దేనికి ఊరుకోండి” అన్నారు. సుబ్బణ్ణ కోపం పట్టలేకపోయాడు.

“రా” అని భార్యని పిలిచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. భర్త తనని బాగా తిడతాడనీ, బహుశా దెబ్బలు కూడా పడతాయనీ అనుకుంటూనే లలితమ్మ గదిలోకి వెళ్ళింది. ఒకప్పుడు తన తల్లి చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి - “బతికినా చచ్చినా దైవాన్ని విడువకు. కొట్టినా తిట్టినా భర్తను విడువకు”.

ఆమె గదిలోకి వెళ్ళగానే “అరసు గారింటికి ఎందుకు వెళ్ళనన్నావు” అని గద్దించి అడిగాడు సుబ్బణ్ణ.

ఆమె “నేను చెప్పను” అంది. “చెప్పి తీరాలి” అని నిగ్గదీశాడు అతను. అయినా ఆమె చెప్పలేదు. “ఎంత పొగరు?” అంటూ అతను భార్యను దబదబా బాదాడు.

ఆ శబ్దం విని శాస్త్రిగారు భార్యతో “చూడవే నీ వల్ల ఆ పిల్ల పాపం ఎలా దెబ్బలు తింటోందో” అన్నాడు. "దానికి దెబ్బలు పడాల్సిందే. అత్తగారి పట్ల ఎలా ప్రవర్తించాలో దానికి తెలిసి రావాలి. నేను వెళ్ళి వాయినాలు తీసుకొస్తుంటే అది మాత్రం ఎందుకు తీసుకురాకూడదు” అంది ఆవిడ.

“అసలు ఎందుకు వెళ్ళనన్నది” అని అడిగాడు ఆయన. “నేను వెడితే నా వెంట వస్తానంది. తనని ఇంట్లో ఉండమని ముందు నేను వెళ్ళి వచ్చాను. తరవాత దాన్ని వెళ్ళమంటే వెళ్ళనంది. నాతో రావద్దు. నా తరవాత వెళ్ళమన్నానని అలా చేసింది. అంతా దాని ఇష్టమే” అంది ఆవిడ.

“ఒక్కత్తీ వెళ్ళడానికి సిగ్గుగా ఉందేమోనే” అన్నాడు శాస్త్రిగారు.

“అదేం కాదు. నాలుగు రోజులు ఒక్కతీ వెళ్ళింది కదా. అప్పుడు లేని సిగ్గు ఇప్పుడు ఎక్కడ నుంచి వచ్చింది. నిన్న కూడా మొదట వెళ్ళననే అంది. గట్టిగా చెబితే వెళ్ళింది. ఇవాళ వెళ్ళనంటే వెళ్ళనని కూర్చుంది” అని చెప్పింది ఆవిడ.

“పాపం... ఆ పిల్లకి తెలీదు. వీడు ఊరికే పట్టుకు కొడుతున్నాడు” అని సానుభూతి చూపించాడు శాస్త్రిగారు.

“కొట్టడం లేదు, ఏం లేదూ. అంతా నటన. ఇద్దరూ ఘర్షణ పడుతున్నట్లు మనల్ని నమ్మించాలని చూస్తున్నారు. వాడు నిజంగా పెళ్ళానికి నెప్పెట్టేట్టు కోడుతున్నారనుకొంటున్నారా ఏం” అంది ఇల్లాలు.

అత్తగారు నమ్మకపోయినా కోడలికి బాగానే దెబ్బలు తగిలాయి. తన తల్లి, భార్య వాయనాలు తీసుకురావడం సుబ్బణ్ణకూ ఇష్టం లేదు. అతడి కోపం ఆమె వెళ్ళనన్నందుకు కాదు - కారణం చెప్పనందుకు. ఎన్ని దెబ్బలు తిన్నా ఆమె మాత్రం కారణం చెప్పలేదు.

కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కారణమేమిటో భర్తకు చెప్పింది. ఆమె రాజబంధువుల ఇళ్ళకు చాలాసార్లు వెళ్ళింది. ఆ ఇళ్ళల్లో మగవాళ్ళు మంచి మర్యాదస్థులే. వాళ్ళు పాపభీతి, ధర్మబుద్ధిగలవారు. లలితమ్మలాంటి అందగత్తెలు కూడా ఆ ఇళ్ళకు నిర్భయంగా వెళ్ళిరావచ్చు. ఆ నమ్మకంతోనే లలితమ్మ అరసు గారింటికి వెళ్ళింది. మూడు రోజులు మామూలుగానే గడిచాయి. నాలుగో రోజున ఆమె వాయినాలు తీసుకొని వస్తుంటే హాలు పక్కనున్న గది తలుపు దగ్గర ఒక పురుషుడు నుంచుని ఆమె కేసి తేరిపార చూశాడు. ఆ చూపు ఏ శీలవతి కైనా పిడుగు పాటులా అనిపిస్తుంది. లలితమ్మకి చాలా భయం వేసింది. గబగబా హాల్లోంచి బైటపడి ఇంటికి వచ్చేసింది. ఆ మరునాడు తను ఒంటరిగా వెళ్ళడానికి ఇష్టపడలేదు. అత్తగారు వెడితే ఆమె వెంట వస్తానన్నది. కాని అత్తగారు ముందు తను వెళ్ళివస్తాననీ, తరువాత వెళ్ళమనీ గట్టిగా చెప్పడంతో ఇష్టం లేకపోయినా ఒప్పుకుంది. ఆ రోజు మామూలుగా హాల్లోంచి బైటికి రావడానికి వీల్లేకపోయింది. హాలు తలుపు మూసి ఉంది. అందుచేత ఆమె హాలు పక్కనున్న రెండు గదులలో నుంచి వెళ్ళవలసి వచ్చింది. ఆ రెండో గదిలో కిందటి రోజు కనిపించిన వ్యక్తి నుంచుని చాలా ఆశగా చూస్తున్నాడు. అతడు ఎవరో ఆమెకి తెలియదు. ఆ మరునాడు అత్తగారు వెంటలేకుండా తను ఒక్కతె వెళ్ళడానికి ఆమె నిరాకరించింది.

అరసు గారింట్లో జరిగిన ఆ సంఘటన ఇంట్లో అందరికీ చెప్పవలసిన పెద్ద విషయం కాదనిపించింది. చెప్పి అత్తగారి మనస్సు, భర్త మనస్సు కష్టపెట్టడం దేనికని ఊరుకుంది. ఆ వ్యక్తి ఎవరో తెలీదు. అతడి గురించి చెబితే అత్తమామలు అరసు గారింటికి వెళ్ళి మాట్లాడతారేమో. అనవసరంగా రచ్చ జరుగుతుందేమో. ఎందుకొచ్చిన గొడవ! ఆ వాయనం తీసుకోకపోతేనేం? కారణం చెప్పనందుకు తిట్లు, దెబ్బలు తగులుతాయి. అంతేకదా. ఆ రచ్చకంటే ఈ దెబ్బలే నయం అనుకుంది.

ఆ సంఘటన జరిగిన కొంత కాలానికి ఒక రోజు సుబ్బణ్ణ ఇంటికి వచ్చేసరికి లలితమ్మ పిల్లాణ్ణి పడుకోబెట్టి జోకొడుతోంది. ఆమె చాలా విచారంగా కనిపించింది. ఏం జరిగిందని అడిగాడు. “ఏం లేదు” అని ఆమె సమాధానమిచ్చింది. కాని ఏదో జరిగిందని అతడికి అనిపించింది. అప్పటికి ఊరుకుని రాత్రిపడుకున్న తరువాత అడిగాడు.

“మామూలే. అత్తగారు ఆ పిల్లలకి పెరుగుపోసి వీడికి నీళ్ళ మజ్జిగ పోసింది నేను అక్కడ ఉండగానే” అని చెప్పింది లలితమ్మ.

“అది మామూలే అని తెలుసు కదా. దీని గురించి ఎందుకంత బాధపడడం?”

“ఆవిడకి వాళ్ళు ఎంత మనవలో వీడూ అంతే కదా. వీడిని కూడా వాళ్ళతో సమానంగా చూసే మంచి బుద్ధి ఆవిడకి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను”.

“దీని కోసమేనా అంత దిగులుగా ఉన్నావు?”

లలితమ్మ నీరసంగా నవ్వింది - “వీడొక్కడే ఇంత భారంగా అనిపిస్తుంటే ఇప్పుడు మళ్ళీ గర్భవతినయ్యాను” అని చెప్పింది.

సుబ్బణ్ణ ఏమీ మాట్లాడలేదు. కాసేపు ఆలోచిస్తూ కూర్చున్నాడు. తరువాత లేచి బైటకు వెళ్ళాడు. అరగంట తరవాత మళ్ళీ తిరిగి వచ్చాడు. తమ ముగ్గురి బట్టలూ మూటకట్టమని చెప్పాడు.

“ఎక్కడికి వెడుతున్నాం” అని అడిగింది ఆమె.

“ఏమీ అడక్కు. చెప్పినట్టు చెయ్యి” అన్నాడు అతడు.

భర్త కోపంగా ఉన్నాడనీ, ఇప్పుడతనితో ఏం మాట్లాడినా ప్రయోజనం లేదనీ గ్రహించింది లలితమ్మ. లేచి తన బట్టలు, పిల్లాడి బట్టలు మూటకట్టింది. సుబ్బణ్ణ తన కాసిని బట్టలు వేరే మూట కట్టాడు. భోజనాలయ్యాక మామూలుగా అందరూ పడుకున్నారు. ఒకటి రెండు గంటల తరువాత సుబ్బణ్ణ భార్యని లేపి ప్రయాణానికి సిద్ధం కమ్మన్నాడు. తండ్రి నిద్రపోతున్న చోటికి వెళ్ళి చూసి వచ్చాడు. “నీ ఇష్టదైవానికి దణ్ణం పెట్టుకుని బయలుదేరు” అని భార్యకు చెప్పాడు.

“ఎక్కడికి వెడుతున్నాం' అని ఆమె అడగలేకపోయింది. ప్రయాణమై వెళ్ళేటప్పుడు 'ఎక్కడికి' అని అడగడం శుభసూచకం కాదు. అందుకని 'మళ్ళీ తిరిగి రావడానికి చాలా రోజులవుతుందా?” అని అడిగింది.

సుబ్బణ్ణ “ఇప్పుడేం మాట్లాడకు” అని ఒక మూట తీసుకుని, పిల్లాడిని భుజాన వేసుకుని నిశ్శబ్దంగా బైట తలుపు వైపు నడిచాడు. లలితమ్మ రెండో మూట తీసుకుని అతడి వెంట నడిచింది. సుబ్బణ్ణ తలుపు తీసి బైటకు వచ్చాక మళ్ళీ నిశ్శబ్దంగా తలుపు మూశాడు.

భార్యా భర్తలు శ్రీరంగపట్నం దిశగా నడిచారు.

నండూరి పార్థసారథి
(1987లో అనువదించబడినది)

Previous Post Next Post