Title Picture
బి.ఆర్. ఫిలింస్ వారి కానూన్

హిచ్ కాక్ శైలిని అనుకరిస్తూ బి.ఆర్. ఛోప్రా నిర్మించిన 'కానూన్' చిత్రం ఇంతవరకు ఇండియాలో తయారైన క్రైం చిత్రాలన్నింటిలోకి శ్రేష్ఠమైనదని చెప్పవచ్చు. 13,083 అడుగులు నిడివిగల ఈ చిత్రంలో అనౌచిత్యంగానీ, అసహజత్వంగానీ ఒక్క 'ఫ్రేం'లో కూడా కనుపించవు. వ్యర్థమైన ఒక్క సన్నివేశంగానీ, ఒక్క పదం గానీ ఈ చిత్రంలో లేదు. చిత్రంలో దాదాపు సగం భాగం కోర్టు సన్నివేశాలతో నిండి ఉన్నప్పటికీ అరక్షణం సేపు కూడా విసుగుపుట్టించకుండా చిత్రీకరణలో అద్భుత ప్రావీణ్యాన్ని ప్రదర్శించాడు దర్శకుడు బి.ఆర్.ఛోప్రా. సంగీతంలో గానీ, ఛాయాగ్రహణంలో గానీ, ఇతర అంశాలలో గానీ ఈ చిత్రం ఉత్తమ శ్రేణి హాలీవుడ్ చిత్రాలకు దీటువచ్చే స్థాయిలో ఉంది.

భారతీయ న్యాయచట్టానికి ఈ చిత్రం ఒక సవాలు. ప్రస్తుత న్యాయచట్టం ప్రకారం ప్రత్యక్ష సాక్ష్యం కంటే బలమైన సాక్ష్యం మరొకటి లేదు. అందుకే చట్టం ఒక వ్యక్తి కంటితో చూసి చెప్పిన విషయాన్ని ఆధారంగా మరో వ్యక్తిని దోషిగా నిరూపించి ఉరితీయగలుగుతుంది కూడా. అయితే కోర్టులో ఎల్లప్పుడూ నిజం బైట పడుతుందా? ప్రత్యక్షసాక్ష్యం అబద్దమై నిర్దోషికి కఠిన శిక్షలు పడిన సంఘటనలు లేవా? సాక్షి కావాలని అబద్ధం చెప్పకపోయినా అతని కళ్ళు అతన్ని మోసం చేయడం సంభవం కాదా? అటువంటి సాక్ష్యం వల్ల నిర్దోషికి ఉరిశిక్ష పడితే చేసేదేముంది? ఈ ప్రశ్నలతోనే ఈ చిత్రం న్యాయచట్టాన్ని సవాలు చేస్తుంది - ఉరిశిక్షను రద్దు చేయాలని వాదిస్తుంది.

న్యాయచట్టాన్ని తాను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, అనుభవజ్ఞులయిన న్యాయవాదులతో, న్యాయమూర్తులతో సంప్రదించి ఈ చిత్ర నిర్మాణానికి పూనుకున్నాడు బి.ఆర్.ఛోప్రా. కోర్టు సంప్రదాయాలలోని సూక్ష్మ అంశాలను సైతం దృష్టిలో ఉంచుకొని, ఎక్కడా ఔచిత్యానికి భంగం కలగకుండా, న్యాయవాదుల పర్యవేక్షణ క్రింద ఈ సన్నివేశాలను ఆయన చిత్రీకరించారు. చిత్రం ద్వితీయార్థమంతా పూర్తిగా వాగ్వాదాలతో నిండి ఉన్నప్పటికీ ఎక్కడా ఈషణ్మాత్రమైనా విసుగు కలగకుండా చిత్రీకరించగలిగారంటే దర్శకుని ప్రతిభను ఎంతైనా ప్రశంసించాలి. అయితే ఇందులోని సంభాషణలన్నీ పూర్తిగా అర్థమయితే తప్ప, లేకుంటే ప్రేక్షకులకు, అంతా అయోమయంగా, తలనొప్పి వ్యవహారంగా ఉంటుంది.

ప్రత్యక్ష సాక్ష్యాన్ని అన్ని సందర్భాలలోనూ విశ్వసించడానికి వీలులేదని జడ్జి బద్రీ ప్రసాద్ జస్టిస్ ఝాతో వాదిస్తాడు. దాన్ని నిరూపిస్తానని సవాలు చేస్తాడు. ఈ విషయాన్ని నిరూపించడానికి హత్య చేయాలని కోరికగా ఉందని ఆరోజు ఆయన తన డైరీలో రాసుకున్నాడు.

Picture
అశోక్ కుమార్

జడ్జీ బద్రీ ప్రసాద్ (అశోక్ కుమార్) సౌమ్యుడు. చాలా ఉత్తముడని పేరు పొందాడు. ఆయనకు విజయ ప్రసాద్ (మహమూద్) అనే కొడుకు, మీనా (నందా) అనే కూతురు ఉన్నారు. మీనా ప్రియుడు కైలాస్ (రాజేంద్రకుమార్) పబ్లిక్ ప్రాసిక్యూటర్. వారిద్దరికీ వివాహం నిశ్చయమయింది. అతనూ వారి కుటుంబంలో వాడుగానే మెలగుతూ ఉంటాడు. కైలాస్ అంటే జడ్జి గారికి ఎంతో అభిమానం. విజయ్ జల్సారాయుడు. విచ్చల విడిగా డబ్బు తగలేస్తూ తిరుగుతూ ఉంటాడు. తండ్రికి తెలియకుండా ధనిరాం (ఓం ప్రకాశ్) అనే వడ్డీ వ్యాపారి దగ్గర వందలకు వందలు డబ్బు తీసుకుంటూ ఉంటాడు. అతని చేతి కీలుబొమ్మ అయి ఒక ఖాళీ నోటు మీద సంతకం పెట్టి ఇచ్చాడు. వెంటనే బాకీ మొత్తం తీర్చకపోతే ఆ నోటును ఉపయోగించి జడ్జి ఆస్తినంతా రాబట్టుకుంటానని ధనిరాం బెదిరిస్తాడు. విజయ్ చెల్లెలి వద్ద మొర పెట్టుకుంటాడు. తండ్రికి తెలియనివ్వవద్దని బతిమాలుకుంటాడు. ఆమె కైలాస్ సహాయాన్ని అర్ధిస్తుంది.

రాత్రి 11 గంటల వేళ కైలాస్ ధనిరాం ఇంటికి వెళ్ళాడు. అతన్ని మెల్లగా మాటల్లోకి దింపి ఉపాయంతో ఆ నోటును అతని వద్ద నుంచి తీసుకున్నాడు. అదే సమయంలో జడ్జీ బద్రీ ప్రసాద్ ధనిరాం ఇంటికి వస్తూ ఉండటం చూశాడు కైలాస్. తన కొడుకు గుట్టు బైటపడకుండా ధనిరాంకు డబ్బు చెల్లించడానికి వస్తున్నాడేమో, తాను కనుపిస్తే బావుండదని తెరచాటున దాక్కున్నాడు. తలుపుతీయగానే బద్రీ ప్రసాద్ లోపలికి వచ్చాడు. ధనిరాంను కత్తితోపొడిచాడు. అతని చేతికి గ్లవ్స్ (తొడుగులు) ఉన్నాయి. గప్చిప్ గా లైట్లు ఆర్పేసి వెళ్ళిపోయాడు. ఈ దృశ్యాన్ని కళ్ళారా చూసిన కైలాస్ కొయ్యబారిపోయాడు. జడ్జి ఈ పని చేయడం అతనికి ఆశ్చర్యంగా ఉంది. ఇంతలో ఒక పిల్లి టేబుల్ మీద ఉన్న పాలగిన్నెను పడగొట్టింది. కైలాస్ తేరుకుని అక్కడ ఉండటం ప్రమాదం అని తెలిసి పారిపోయాడు. ఒలికిపోయిన పాలు ధనిరాం శవం వరకు చారకట్టాయి. కొంత సేపటికి కాలియా (నానా పల్సికర్) అనే ఒక దొంగ మేడకిటికీ తెరచి ఉండటం చూసి పంపు గొట్టాల మీదుగా ఎక్కి శవం వున్న గదిలో ప్రవేశించాడు. చీకటిలో కనుపించక పాల మీద అడుగు వేసి కాలుజారి సరాసరి శవం దగ్గరకు వెళ్ళి పడ్డాడు. శవం చేతికి తగిలేసరికి ఏమీటోనని తడిమాడు. ఆ చీకటిలో కత్తి పిడిని కూడా పట్టుకున్నాడు. అసలు విషయం గ్రహించి, దొంగతనం మాట మరిచి గబగబ మళ్లీ కిటీకీ నుంచీ గొట్టాల మీదుగా కిందికి దిగి వచ్చాడు. గస్తీ కాస్తున్న పోలీసులు అతన్ని వెంటనే పట్టుకుని పోలీసు స్టేషన్ కు తీసుకు వెళ్ళారు.

హత్యకేసు విచారణ ప్రారంభమవుతుంది. అమాయకుడైన ఆ దొంగను హంతకుడని ఆరోపించారు. చేతులకున్న రక్తపు మరకలు, పాల మీద వేసిన అడుగులు, కత్తి పిడి మీద వేలి ముద్రలు సాక్ష్యం. నిజం ఒక్క కైలాస్ కే తెలుసు. ఏమీ ఎరుగని వాడిలా బద్రీప్రసాద్ ఈ కేసు విచారణకు పూనుకొన్నాడంటే అసహ్యం వేసింది కైలాస్ కు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి, కాలియా తరపున న్యాయవాదిగా కోర్టులో హాజరైనాడు. హత్య జరిగిన తర్వాత ఆ రాత్రి ధనిరాం ఇంటి తలుపులు తెరచే ఉన్నాయి. హత్యచేసింది కాలియాయే అయితే కిటికీలో నుంచి కిందికి దిగవలసిన అవసరం ఏముంది? అంటే అంతకు ముందే ఆ ఇంటికి ఎవరో వచ్చారన్నమాట. అందుకు నిదర్శనంగా టేబుల్ మీద రెండు గ్లాసులలో పానీయం వుంది. ఈ వాదంతో కైలాస్ కాలియా హంతకుడు కాదని తేల్చివేశాడు. ఇంత జరిగినా బద్రీప్రసాద్ తాను హంతకుడని లొంగిరాకపోవడంతో హంతకుని పేరు బైట పెట్టక తప్పింది కాదు. బద్రీప్రసాద్ హత్య చేస్తూ ఉండగా తను కళ్ళారా చూశానని వాదించాడు. జడ్జి తన స్థానాన్ని ఖాళీ చేసి బోనులో నిలబడ్డాడు.

జస్టిస్ ఝా విచారణ ప్రారంభించారు. ఈ లోగా కైలాస్ బద్రీప్రసాద్ డైరీని సంగ్రహించి కోర్టులో సమర్పించాడు. హత్య చేయాలని కుతూహలంగా ఉందని బద్రీప్రసాద్ రాసిన దానిని ఝా చదివి వినిపించాడు. అనుమానం ధ్రువపడింది. తాను హత్య చేయలేదని వాదించడానికి బద్రీప్రసాద్ కు ఏ ఆధారం దొరకదు. ఆయనను దోషిగా నిర్ణయించారు. శిక్ష కూడా నిర్ణయించారు.

బద్రీప్రసాద్ హంతకుడనడానికి కైలాస్ ప్రత్యక సాక్ష్యం తప్ప ఆధారం లేదు. కాని నిజంగా ఆయనేనా హంతకుడు? కావచ్చును. కాకపోనూ వచ్చును. కైలాస్ అబద్ధం చెబితే బద్రీప్రసాద్ ను రక్షించగలిగేవారు లేరు. కైలాస్ అబద్ధం చెప్పకపోయినా అతని కళ్ళు అతన్ని మోసం చేసి ఉండవచ్చు. కాని అలా అని కైలాస్ మాత్రం ఎలా ఊహిస్తాడు? కాలియాను అన్యాయంగా శిక్షించబోతూ ఉంటే హంతకుడు బద్రీప్రసాద్ కాదని ఎలా చెప్పగలడు? చివరికి కోర్టు తీర్పు చెప్పబోతూ ఉండగా ఒక అద్భుతం జరిగింది. అందరూ నాలుకలు కరుచుకొన్నారు. లెంపలు వాయించుకున్నారు. కథ సుఖాంతమయింది. ఆ అద్భుతం జరగకుండా ఉంటే ఎంత దారుణం జరిగేది అని ఈ చిత్రం చట్టాన్ని సవాలు చేస్తుంది.

ఆ అద్భుతం ఏమిటో చెబితే పాఠకులు ఈ చిత్రాన్ని చూడరు. చూసినా ఆనందించలేరు. ఆ రహస్యం ముందే చెబితే దర్శకుని శ్రమ అంతా వృధా అవుతుంది.

సలీల్ చౌదరి సంగీతం చిత్ర స్థాయికి తగ్గ విధంగా ఉంది. సాధారణంగా హిందీ చిత్రాలలో వినిపించని కొత్త బాణీలో, హాలీవుడ్ క్రైం చిత్రాలను జప్తికి తెచ్చే విధంగా ఉంది ఆయన సంగీతం. ఈ చిత్రంలో ఒక్క పాట కూడా లేకపోవడం విశేషం.

ఈ చిత్రంలో నటన స్థాయి కూడా చాలా ఉన్నతంగా ఉంది. అందరూ చాలా మితంగా, నిబ్బరంగా నటించారు. ముఖ్యంగా అశోక్ కుమార్, నానాపల్సికర్ ల నటన ప్రశంసనీయంగా ఉంది.

నిర్మాత, దర్శకుడు: బి.ఆర్.ఛోప్రా; కథ: సి.జె.పావ్రీ; మాటలు: అఖ్తర్-ఉల్-ఇమాన్; సంగీతం: సలీల్ చౌధురి; ఛాయాగ్రహణం: ఎం.ఎస్.మల్హోత్రా; తారాగణం: అశోక్ కుమార్, రాజేంద్ర కుమార్, నందా, మహమూద్, నానా పల్సికర్, దివాన్ షరార్, జీవన్, ఓం ప్రకాశ్, మన్ మోహన్ కృష్ణ, శశికళ, ఇఫ్తికార్ వగైరా...

నండూరి పార్థసారథి
(1961 ఆగస్టు 6వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది)

Previous Post Next Post