Title Picture

చలన చిత్రాల నిర్మాణంలో ప్రపంచం మొత్తం మీద రెండో స్థానం ఇండియాది. ఇండియాలో రెండోస్థానం తెలుగు వాళ్ళది. మన దేశంలో ఏటా సుమారు 600 కథా చిత్రాలు (ఫీచర్ ఫిల్ములు) తయారౌతున్నాయి. వీటిలో దాదాపు వంద చిత్రాలు తెలుగువి. ప్రాంతీయభాషల జనాభాలను, ఆ భాషలలో విడుదలవుతున్న చిత్రాల సంఖ్యలను పోల్చి చూస్తే అగ్రస్థానం తెలుగువాళ్ళదే.

చలన చిత్రాన్ని సృష్టించినవారు, దానికొక వ్యాకరణాన్ని రూపొందించి, భావ వ్యక్తీకరణకు సాధనమైన భాషగా దానిని తీర్చిదిద్దినవారు, సమగ్రమైన కళగా పెంపొందించినవారు యూరోపియన్లు, అమెరికన్లు, రష్యన్లు అయినప్పటికీ, వారి ననుసరించి చిత్ర నిర్మాణరంగంలోకి దిగడంలో భారతీయులు మరీ వెనకబడలేదు. మన దేశంలో అందరికంటే ముందుగా ఈ రంగంలోకి ప్రవేశించిన వారు మహారాష్ట్రులు, బెంగాలీలు అయినప్పటికీ తెలుగు వారు ఆట్టే వెనకబడలేదు. దక్షిణాదిని మిగిలిన భాషలవారి కంటే తెలుగువారే ఎప్పుడూ ముందడుగు వేస్తూ వచ్చారు. అయితే సాంకేతిక ప్రమాణాల విషయంలో మాత్రం పాశ్చాత్య చిత్రాలతో పోల్చితే భారతీయ చిత్రాలు, అందునా తెలుగు చిత్రాలు ఎప్పుడూ తీసికట్టుగానే ఉంటున్నాయి. 1939లో హాలీవుడ్ లో తయారైన భారీ వర్ణచిత్రం 'గాన్ విత్ ది విండ్'తో 'మాలపిల్ల', 'రైతుబిడ్డ' వంటి అప్పటి తెలుగు చిత్రాలను పోల్చి చూస్తే కెమెరావర్క్, సౌండ్ రికార్డింగ్, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే రైటింగ్, డైరెక్షన్ వంటి అన్ని శాఖలలోనూ తెలుగు చిత్రాలు అమెరికన్ చిత్రాల కంటే దాదాపు ఇరవై సంవత్సరాలు వెనకబడి ఉన్నట్లు అనిపిస్తుంది. 1939 నాటి తెలుగు చిత్రాలకంటే 1919 నాటి అమెరికన్, రష్యన్, జర్మన్, ఫ్రెంచ్, బ్రిటిష్ చిత్రాలు చాలా మెరుగ్గా కనిపిస్తాయి.

తెలుగు చిత్ర రంగానికి పితామహుడుగా రఘుపతి వెంకయ్య గారిని చెప్పుకోవచ్చు. 1910కి పూర్వమే ఆయన విదేశాల నుంచి ప్రొజెక్షన్ సామగ్రి దిగుమతి చేసి ఆంధ్ర ప్రాంతంలో చలన చిత్రాల ప్రదర్శనం ప్రారంభించాడు. ఆయన కుమారుడు ఆర్. ప్రకాశ్ పాశ్చాత్య దేశాలలో శిక్షణ పొందివచ్చి, 1923లో 'భీష్మ' మూకీ చిత్రం తీశాడు. మూకీ చిత్రాలకు భాషాభేదాలు లేవుకనుక. ఆ రోజుల్లో ఏ ప్రాంతంలో తయారైన చిత్రానికైనా దేశవ్యాప్తమైన మార్కెట్ ఉండేది. ఐదారు ప్రధాన భాషలలో టైటిల్స్ చూపేవారు. అప్పటి మూకి చిత్రాలలో అధికభాగం పౌరాణిక చిత్రాలు. వాటిని తీసినవారిలో తెలుగువారూ ఉన్నారు. అయితే నిర్మాణరంగంలో తెలుగువారు విజృంభించినది టాకీలు వచ్చిన తర్వాతనే.

టాకీయుగం

ఆ రోజుల్లో రాజమండ్రి, విశాఖపట్టణం వంటి ఆంధ్ర పట్టణాలలో కూడా ఫిలిం కంపెనీలుండేవి. 1931లో మన దేశంలో మొదటి టాకీ 'ఆలం ఆరా' విడుదలయింది. ఆ ఏడాది దేశంలో మొత్తం 28 టాకీలు విడుదలైనాయి. వాటిలో 23 హిందీవి, మూడు బెంగాలీవి. ఒకటి తెలుగు చిత్రం (భక్తప్రహ్లాద), మరొకటి తమిళ చిత్రం. దేశంలో మొదటి టాకీ విడుదలైన సంవత్సరంలోనే, మొదటి తెలుగు చిత్రాన్ని నిర్మించిన ఘనత హెచ్.ఎం. రెడ్డి గారికి దక్కింది. ఆ తర్వాత ఆయన తెలుగులో చాలా పౌరాణిక చిత్రాలు తీశారు. 1940 వరకు తెలుగులో వచ్చినవి చాలా వరకూ పౌరాణిక చిత్రాలే. పౌరాణిక నాటకాలకు నకళ్ళుగా కనిపించే ఆ చిత్రాలలో మాటల కంటే పాటలు, పద్యాలే ఎక్కువగా ఉండేవి. కొన్ని చిత్రాలలో 60, 70 పాటలు, పద్యాలు ఉండేవి. మూగ చిత్రాలు చూసి చూసి విసుగెత్తిపోయిన జనానికి ఈ చిత్రాలు గొప్ప వినోదాన్ని అందించాయి. అప్పటి చిత్రాలలో కొన్ని-'పాదుక', 'ద్రౌపదీ వస్త్రాపహరణం', 'ద్రౌపదీ మాన సంరక్షణం', 'లవకుశ', 'వీరాభిమన్యు', 'శ్రీకృష్ణతులాభారం', 'కృష్ణలీల', 'ధ్రువ-అనసూయ', 'విప్రనారాయణ', 'వేంకటేశ్వర మహాత్మ్యం'. అప్పటి ప్రముఖ నటులు-పారుపల్లి సత్యనారాయణ, పారుపల్లి సుబ్బారావు, వేమూరి గగ్గయ్య, బళ్ళారి రాఘవాచారి. అప్పటి నటీమణులు-సురభి కమలాబాయి, రామతిలకం, శ్రీరంజని (సీనియర్), కన్నాంబ, కాంచనమాల. అప్పటి దర్శకులు-హెచ్.ఎం. రెడ్డి. సి. పుల్లయ్య, పి. పుల్లయ్య.

1930-40 దశకంలో దేశం మొత్తం మీద అత్యుత్తమ చిత్రాలు అందించే విశిష్ట సంస్థలుగా కొల్హాపూర్ లోని ప్రభాత్ ఫిలిం కంపెనీ, కలకత్తాలోని న్యూ థియేటర్స్, బొంబాయిలోని బాంబే టాకీస్ పేరు పొందాయి. అత్యాధునికమైన సాంకేతిక సామగ్రి ఆ సంస్థల వద్దనే ఉండేది. తొలి తెలుగు టాకీ చిత్రాలు కొన్ని కొల్హాపూర్ లోనూ, కలకత్తాలోనూ తయారైనాయి.

తెలుగు, తమిళ ప్రజల ఉమ్మడి రాజధానిగా ఉండిన మద్రాసు నగరం సుమారుగా 1937-47 మధ్యకాలంలో నాలుగు దక్షిణాది భాషల ఉమ్మడి సినీ రాజధానిగా రూపుదిద్దుకున్నది. 1937 నాటికి బెజవాడలో రెండు, రాజమండ్రిలో రెండు, నెల్లూరు, విశాఖపట్టణాలలో చెరి ఒకటి ఫిలిం కంపెనీలు ఉండేవి. తర్వాత క్రమంగా ఆంధ్రప్రాంతంలోని సంస్థలు అంతరించి, తెలుగు చిత్రాల నిర్మాణానికి మద్రాసు కేంద్రమయింది. టాకీ యుగం తొలి సంవత్సరాలలో ఏటా మూడేసి, నాలుగేసి తెలుగు చిత్రాలు తయారవుతూ ఉండేవి. క్రమంగా సంఖ్య పెరుగుతూ వచ్చి, 1940లో 14 చిత్రాలు, 1941లో 15 చిత్రాలు, విడుదలైనాయి. ఆ తర్వాత-బహుశా ద్వితీయ ప్రపంచయుద్ధ ప్రభావం వల్ల, ఆర్థిక మాంద్యం వల్ల-తెలుగు చిత్రాల నిర్మాణం బాగా తగ్గి పోయింది. ఏటా ఏడెనిమిది చిత్రాలు మాత్రమే విడుదలయేవి. 1945లో ఐదే చిత్రాలు విడుదలయినాయి. కాని, తక్కువ చిత్రాలు తయారైన ఆ కాలంలోనే తెలుగు వారు గర్వించదగిన ఉత్తమ చిత్రాలు-న్యూథియేటర్స్, ప్రభాత్, బాంబే టాకీస్ చిత్రాలతో సరితూగే చిత్రాలు-తయారైనాయి. వాహినీవారి 'వందేమాతరం', 'సుమంగళి', 'దేవత', 'పోతన', 'స్వర్గసీమ', 'వేమన', నాగయ్య తీసిన 'త్యాగయ్య'. భరణీవారి 'లైలామజ్నూ' ఆ కాలంలో వచ్చినవే. మూడు గంటలసేపు ప్రేక్షకులకు వినోదకాలక్షేపం అందించడమే పరమాశయంగా, బాక్సాఫీస్ ఫార్ములాతో జానపద చిత్రాలను నిర్మించడం కూడా ఆ రోజుల్లోనే ప్రారంభమయింది. జెమినీ వారి 'బాలనాగమ్మ', 'చంద్రలేఖ', ప్రతిభావారి 'బాలరాజు', 'ముగ్గురు మరాఠీలు', ఇంకా 'కీలుగుర్రం', 'రక్షరేఖ' వంటి చిత్రాలు ఆర్థికంగా గొప్ప విజయాన్ని సాధించాయి. 'చంద్రలేఖ' తమిళ చిత్రమైనప్పటికీ తెలుగు కామెంటరీతో తెలుగు చిత్రాల కంటే ఎక్కువ డబ్బు చేసుకుంది. దక్షిణాదిని అప్పట్లో అంత భారీ చిత్రం మరొకటి రాలేదు. 'చంద్రలేఖ' చిత్రాన్ని హిందీలో కూడా తీశారు. హిందీలో కూడా ఆ చిత్రం అఖండ విజయం సాధించడంతో-అప్పటి వరకు తెలుగు, తమిళ భాషలలో మాత్రమే చిత్రాలు నిర్మిస్తూ ఉండిన జెమినీ వాసన్ వరసగా హిందీలో కూడా చిత్రాలు తీయడం ప్రారంభించారు. దేశంలోని అగ్రశ్రేణి చిత్ర నిర్మాణ సంస్థలలో జెమినీ ఒకటి అయింది. జెమినీ చిత్రాలు అన్ని భాషలలోనూ ఆర్థికంగా విజయం సాధించాయి. 'చంద్రలేఖ' చిత్రంతో సాలూరి రాజేశ్వరరావు అఖిలభారత స్థాయిలో ప్రఖ్యాత సంగీత దర్శకుడుగా గుర్తింపు పొందారు. ఆ చిత్రంలో ఆయన పెక్కు విదేశీ బాణీలను ప్రవేశపెట్టి, వాద్య సమ్మేళనంలో అదివరకెవ్వరూ చేయని కొన్ని కొత్త ప్రయోగాలు చేశారు. జెమినీ వారి 'బాలనాగమ్మ', 'మంగళ', 'చక్రధారి', 'అపూర్వ సహోదరులు' చిత్రాలకు కూడా ఆయనే సంగీతం సమకూర్చారు.

1940 దశకంలో మరొక గొప్ప సంగీత దర్శకుడు నాగయ్య. 'వందేమాతరం' నుంచి 'వేమన' వరకు వాహినీ వారి చిత్రాలన్నింటికీ ఆయన సంగీతం సమకూర్చారు. ఆ చిత్రాలలో పాటలన్నీ విశేషంగా ప్రజాదరణ పొందాయి, గాయకుడుగా, సంగీత దర్శకుడుగా ఆయన ప్రతిభ 'త్యాగయ్య'లో ఇంకా ఎక్కువగా ప్రకాశించింది. అది ఆయన సొంత చిత్రం. గాలి పెంచెల నరసింహారావు సంగీతం సమకూర్చిన 'బాలరాజు' చిత్రంలోని పాటలన్నీ 'హిట్' అయ్యాయి. ఆ చిత్రం విడుదలైన తర్వాత మూడు నాలుగు సంవత్సరాల పాటు ఆ పాటలు ఆంధ్రదేశమంతటా మారుమ్రోగాయి. సుబ్బరామన్ సంగీతం సమకూర్చిన 'లైలామజ్నూ' చిత్రంలో పాటలు కూడా అలాగే హిట్ అయ్యాయి. 'బాలరాజు'లో ఎస్. వరలక్ష్మి పాటలు, 'లైలామజ్నూ'లో భానుమతి పాటలు ఇప్పటికీ చాలా మందికి మధురస్మృతులుగా మిగిలిపోయాయి.

1938, 1955 సంవత్సరాల మధ్య కాలం తెలుగు చలన చిత్ర చరిత్రలో సువర్ణాధ్యాయమని చెప్పవచ్చు. తెలుగు సినిమా ఒక కళా ప్రక్రియగా అభివృద్ధి చెందడానికి దోహదం చేసిన ముఖ్యమైన చిత్రాలన్నీ ఆ కాలంలోనే వచ్చాయి. దర్శకత్వంలో బి.ఎన్. రెడ్డి., కె.వి. రెడ్డి., ఎల్.వి. ప్రసాద్, రామకృష్ణల ప్రతిభ, సంగీత దర్శకత్వంలో రాజేశ్వరరావు, సుబ్బరామన్, ఘంటసాలల ప్రతిభ నటనలో భానుమతి, నాగేశ్వరరావు, ఎస్.వి. రంగారావు, గోవింద రాజు సుబ్బారావు, లింగమూర్తి వంటి వారి ప్రతిభ, ఈ మూడు రంగాలలోనూ నాగయ్య ప్రతిభ ఉన్నత శిఖరాలనందుకున్నది ఆ కాలంలోనే. అప్పటికీ ఇప్పటికీ కూడా తెలుగు సినిమా రంగం గర్వించదగిన మహోన్నతులు బి.ఎన్. రెడ్డి., నాగయ్య 'త్యాగయ్య' చిత్రం ఒక్కటి చాలు-దేశం మొత్తం మీద నాగయ్య అంతటి కళాకారుడు, అంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి మరొకరు లేరనడానికి. 'త్యాగయ్య' చిత్రానికి నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు ఆయనే. ఆ చిత్రానికి ఆయనే కథ, స్క్రీన్ ప్లే రచించారు. 'త్యాగయ్య'గా ఆయనే నటించి ఆయనే పాడుకున్నారు. సంగీత విద్వాంసులను సైతం ముగ్ధులను చేశారు. తెలుగులో అత్యుత్తమ చిత్రాలను పదింటిని ఏరినా, ఐదింటినే ఏరినా, వాటిలో తప్పకుండా 'త్యాగయ్య' ఒకటి అవుతుంది. మోతాదు మించకుండా, నిగ్రహంతో, సహజంగా నటించడం ఏలాగో నేర్చుకోవాలంటే నటులందరూ నాగయ్య నటించిన 'దేవత', 'పోతన', 'వేమన', 'త్యాగయ్య', 'చక్రధారి', 'బీదలపాట్లు', 'నా ఇల్లు', 'రామదాసు' చిత్రాలు చూడాలి.

గూడవల్లి, బి.ఎన్. రెడ్డి

1940కి పూర్వం - తెలుగు సినిమా రంగం పురాణ కాలక్షేపం చేస్తున్న రోజుల్లో-అభ్యుదయ భావాలతో రంగంలోకి ప్రవేశించి, సమాజంలో చైతన్యం తీసుకురాగల సాంఘిక చిత్రాలను తీసినవారు గూడవల్లి రామబ్రహ్మం, బి.ఎన్. రెడ్డి. ఇద్దరూ ఇంచుమించు ఒకేసారి సినీ రంగంలోకి ప్రవేశించారు. అప్పట్లో రామబ్రహ్మం గారు 'ప్రజామిత్ర' పత్రికను నిర్వహిస్తూ ఉండేవారు. కలాన్ని కత్తిలాగా ఉపయోగించిన జర్నలిస్టుగా ఆయన అప్పటికే గొప్ప పేరు తెచ్చుకున్నారు. తెలుగు దేశంలో సోషలిస్టు భావాలను ప్రచారం చేసిన తొలి పాత్రికేయుడు బహుశా ఆయనే. బి.ఎన్. రెడ్డి, బి.ఎన్. కె ప్రెస్ నడుపుతూ ఉండేవారు. దేవకీబోస్ తీసిన 'సీత' చిత్రం చూసి ముగ్ధుడై, కేవలం వ్యాపారంగా, కాలక్షేప సాధనంగా ఉన్న తెలుగు సినిమాను ఒక కళగా తీర్చిదిద్దాలనే ఆశయంతో, సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి సినిమాను ఒక సాధనంగా ఉపయోగించాలనే సంకల్పంతో ఆయన సినీ రంగంలో ప్రవేశించారు. రామబ్రహ్మం గారి తొలి చిత్రం 'మాలపిల్ల' 1933లో విడుదలయింది. ఛాందసుడైన శ్రోత్రియ బ్రాహ్మణుని కుమారుడు ఒక మాలపిల్లను ప్రేమించడం 'మాలపిల్ల' ఇతివృత్తం. అస్పృశ్యతా నిర్మూలనాన్ని ప్రభోధించిన ఈ చిత్రానికి గుడిపాటి వెంకటచలం సంభాషణలు రచించారు. శ్రోత్రియ బ్రాహ్మణుడుగా గోవిందరాజు సుబ్బారావు గొప్పగా నటించారు. నాయికగా కాంచనమాల నటించింది.

బి.ఎన్. రెడ్డి వాహినీ సంస్థను ప్రారంభించి తొలిచిత్రంగా 'వందేమాతరం' తీశారు. 1939లో ఆ చిత్రం విడుదలయింది. అదే సంవత్సరంలో రామబ్రహ్మం గారి 'రైతుబిడ్డ' విడుదలయింది. 'వందేమాతరం' చిత్రానికి దర్శకుడు, నిర్మాత, కథా రచయిత బి.ఎన్.రెడ్డి గారు. నాగయ్య, కాంచనమాల ప్రధాన పాత్రలు పోషించారు. విద్యావంతులలో నిరుద్యోగం, వరకట్న దురాచారం, వంటి సమస్యలను ఆ చిత్రంలో చర్చించారు. ఆ చిత్రానికి ఛాయాగ్రహణం నిర్వహించిన కె. రామనాథ్ స్క్రీన్ ప్లే కూడా రచించారు. రామబ్రహ్మం గారు 'రైతుబిడ్డ'లో పేద రైతుల సమస్యలను చర్చించారు. ఆ చిత్రంలో బళ్ళారి రాఘవాచారి, గిడుగు సీతాపతి, టంగుటూరి సూర్యకుమారి ముఖ్యపాత్రలు పోషించారు.

రామబ్రహ్మం, బి.ఎన్. రెడ్డి-ఇద్దరూ అభ్యుదయభావాలు గల ఆదర్శవాదులు, కళా ప్రియులు, వ్యాపార దృష్టితో కాక, సమాజ శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని చిత్రాలు తీశారు. అయితే వీరిద్దరిలో కళాకారుడిగా బి.ఎన్. రెడ్డి గొప్ప వాడనడంలో సందేహం లేదు.

వాహినీ శకం

వాహినీ సంస్థ ఆవిర్భావంతో తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక కొత్త శకం ప్రారంభమయింది. ఆ సంస్థ కళారంగంలో ఒక ఉద్యమాన్ని లేవదీసింది. ఈ ఉద్యమంలో బి.ఎన్.కు అండగా నిలబడిన వారు-ఛాయాగ్రాహకుడు కె. రామనాథ్, రచయిత సముద్రాల రాఘవాచార్య, నటుడు. సంగీత దర్శకుడు నాగయ్య, కళా దర్శకుడు ఎ.కె. శేఖర్. వీరు ఒక యూనిట్ గా పనిచేసి తయారు చేసిన చిత్రాలు-'వందేమాతరం', 'సుమంగళి', 'దేవత'. వితంతు వివాహ సమస్యను ఇతి వృత్తంగా తీసుకున్న 'సుమంగళి' 1940లో విడుదలయింది. అందులో నాగయ్య తప్ప మిగిలిన అందరూ కొత్తవారే నటించారు. కుమారి, మాలతి ప్రధాన పాత్రలు పోషించారు. ఆ చిత్రంలో మాలతి పాడిన 'వస్తాడే మా బావ' పాట పెద్ద హిట్ అయింది. ఆ చిత్రం శాంతారాం, పి.సి. బారువా వంటి ప్రముఖ దర్శకుల ప్రశంసలందుకున్నది. 1941లో విడుదలైన 'దేవత'లో నాగయ్య, కుమారి, సూర్యకుమారి ముఖ్య పాత్రలు పోషించారు.

'దేవత' తర్వాత రామనాథ్, శేఖర్ వాహినీ సంస్థ నుంచి నిష్క్రమించి జెమినీ సంస్థలో చేరారు. కె.వి. రెడ్డి వాహినీ వారి 'పోతన' చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహించారు. 1942లో విడుదలైన ఆ చిత్రం గొప్ప విజయాన్ని సాధించింది. 'పోతన'గా నాగయ్య అద్భుతంగా నటించారు. ఆ తర్వాత వాహినీ సంస్థ నుంచి 'స్వర్గసీమ' (1945), 'యోగివేమన' (1947), 'గుణసుందరి కథ' (1950), 'మల్లీశ్వరి' (1951), 'పెద్దమనుషులు' (1954), 'బంగారు పాప' (1955), 'రాజమకుటం' (1960), 'రంగులరాట్నం' (1966), 'బంగారు పంజరం' (1968) వెలువడినాయి. వీటిలో 'యోగి వేమన', 'గుణసుందరి కథ', 'పెద్దమనుషులు' చిత్రాలకు కె.వి. రెడ్డి దర్శకత్వం వహించారు. మిగిలిన వాటికి బి.ఎన్. రెడ్డి దర్శకత్వం వహించారు. 'యోగి వేమన' తర్వాత సముద్రాల, నాగయ్య కూడా వాహినీ సంస్థ నుంచి నిష్క్రమించారు.

కళా ప్రమాణాల దృష్ట్యా వాహినీ చిత్రాలన్నింటిలోకి అత్యుత్తమమైనవి 'మల్లీశ్వరి', 'బంగారు పాప'. 'మల్లీశ్వరి' చిత్రంలో శేఖర్ మళ్ళీ వాహినీ యూనిట్ లో చేరారు. ఆ చిత్రం బి.ఎన్.కు, శేఖర్ కు, రాజేశ్వరరావుకు, దేవులపల్లి కృష్ణశాస్త్రికి, భానుమతికి విశేషమైన కీర్తి తెచ్చింది. 'మల్లీశ్వరి' తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన అత్యుత్తమ సంగీత చిత్రంగా చెప్పవచ్చు. సంగీతం, సాహిత్యం, శిల్పం, నటన-అన్నీ ఆ చిత్రంలో అత్యున్నతస్థాయి నందుకున్నాయి. దర్శకత్వ ప్రతిభ విషయంలో బి.ఎన్. రెడ్డి 'బంగారుపాప' చిత్రంలో మరో మెట్టు పైకి ఎక్కాడు. పాలగుమ్మి పద్మరాజు సంభాషణలు, దేవులపల్లి పాటలు, ఎస్.వి. రంగారావు, జగ్గయ్యల నటన ఆ చిత్రాన్ని గొప్ప కళా ఖండంగా తీర్చిదిద్దారు.

'బంగారుపాప' తర్వాత వాహినీ చిత్రాల కళా ప్రమాణాలు కొంత దిగజారాయి. ఇతర సంస్థలకు బి.ఎన్. దర్శకత్వం వహించిన రెండు చిత్రాలు-'భాగ్యరేఖ', 'పూజాఫలం' కూడా ఆయన నుంచి ఆశించదగిన ప్రమాణంలో లేవు. బాక్సాఫీస్ ఫార్ములాకు ఆయన కూడా తల ఒగ్గవలసి వచ్చింది.

1938-55 సువర్ణాధ్యాయంలో చెప్పుకోదగిన మరికొన్ని ఉత్తమ చిత్రాలు-రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన భరణీ వారి 'లైలామజ్నూ', 'విప్రనారాయణ', ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన విజయావారి 'షావుకారు', కె.వి. రెడ్డి దర్శకత్వంలో వచ్చిన విజయావారి 'పాతాళభైరవి', వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో వచ్చిన వినోదావారి 'దేవదాసు'. ఈ చిత్రాలలో సంగీత సాహిత్యాలు, దర్శకత్వ ప్రతిభ ఉన్నత స్థాయినందుకున్నాయి. అవి ఆర్థికంగా కూడా విజయవంతమైనాయి. రామకృష్ణ మంచి అభిరుచి గల దర్శకుడు, అయితే ఆయన దర్శకత్వం వహించిన డజను చిత్రాలలో మూడు నాలుగు మాత్రమే మంచి చిత్రాలుగా చెప్పదగినవి. 'విప్రనారాయణ' తర్వాత రెండు మూడు నాసి చిత్రాలు తీసిన రామకృష్ణ మళ్ళీ 'బాటసారి' (1961) చిత్రంలో తన ప్రతిభను నిరూపించుకున్నారు. విజయా సంస్థ 1950లో అవతరించింది. ఆ సంస్థ తొలి చిత్రం 'షావుకారు' ప్రసాద్ దర్శకత్వంలో తయారైన చిత్రాలన్నింటిలోకి ఇది నాణ్యమైనది, భిన్నమైనది. ప్రసాద్ ఇతర చిత్రాలలో కనిపించని సహజత్వం ఈ చిత్రంలో కనిపిస్తుంది. ప్రధాన పాత్రలో గోవిందరాజు సుబ్బారావు, ఒక చిన్న పాత్రలో ఎస్.వి. రంగారావు గొప్పగా నటించారు. జానకికి ఇదే తొలి చిత్రం. విజయావారి రెండో చిత్రం 'పాతాళభైరవి' ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన జానపద చిత్రాలన్నింటిలోకి నాణ్యమైనది. ఆ చిత్రంలోని పాటలే కాదు-మాటలు కూడా హిట్ అయినాయి. ఈ చిత్రంలో రంగారావు తెలుగు చిత్రసీమలో ప్రథమ శ్రేణి నటుడుగా గుర్తింపు పొందాడు. రామారావు గ్లామర్ హీరోగా, కె.వి. రెడ్డి 'బాక్సాఫీస్ బ్రహ్మ'గా పేరు తెచ్చుకున్నారు. ఆర్థిక విజయసాధనకు అవసరమైన హంగులన్నీ ఉన్నప్పటికీ ఈ చిత్రంలో చౌకబారు తనం ఒక్క ఫ్రేంలో కూడా కనిపించదు. 'జానపద చిత్రమంటే ఇలా ఉండాలి' అనిపించే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దడానికి పింగళి నాగేంద్రరావు సాహిత్యం, ఘంటసాల సంగీతం, మార్కస్ బార్ ట్లే ఛాయాగ్రహణం ఎంతో దోహదం చేశాయి.

'దేవదాసు' చిత్రంతో వేదాంతం రాఘవయ్య తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేశారు. 'దేవదాసు'కు ముందు గాని, ఆ తర్వాత గాని ఆయన సగటు స్థాయిని మించిన చిత్రాన్ని తీయలేదు. ఆయన చేతుల్లో శరత్ రచన ఖూనీ అయిపోతుందనుకున్న ప్రేక్షకుల అంచనాను ఆయన తలక్రిందులు చేశారు. ఆయన, సముద్రాల, నాగేశ్వరరావు కలిసి 'దేవదాసు'ను గొప్పగా తీర్చిదిద్దారు. ఆ చిత్రంలో నాగేశ్వరరావు సూపర్ స్టార్ అయ్యారు. 'దేవదాసు' కోసమే ఆయన పుట్టాడని అన్నారు ప్రేక్షకులు.

1938-55 మధ్యకాలంలో సగటు స్థాయిని దాటిన మరికొన్ని మంచి చిత్రాలు-సి. పుల్లయ్య గారి 'పక్కింటి అమ్మాయి', పి. పుల్లయ్య గారి 'కన్యాశుల్కం', 'అర్ధాంగి', కె.ఎస్. ప్రకాశరావు గారి 'దీక్ష'. 1955 వరకూ తెలుగు హీరోయిన్లలో ప్రథమ స్థానం భానుమతిది. ఆ తర్వాత స్థానం సావిత్రికి లభించింది. 'దేవదాసు'తో గొప్పగా పేరు తెచ్చుకున్న సావిత్రి, తర్వాత చిత్రాలలో తన నటనా స్థాయిని కాపాడుకున్నది. పాతికేళ్ళ తర్వాత 'దేవదాసు మళ్ళీ పుట్టాడు' చిత్రంలో పార్వతి పాత్రను మళ్ళీ అంత చక్కగా పోషించింది.

1940 దశకంలో బాగా తగ్గిపోయిన తెలుగు చిత్రాల సంఖ్య 1950 నుంచి క్రమంగా పెరిగింది. 1948-49 సంవత్సరాలలో ఏడేసి చిత్రాలు మాత్రమే విడుదలైనాయి. 1950లో ఒక్క సారిగా చిత్రాల సంఖ్య 18కి పెరిగింది. 1960 నాటికి సంఖ్య యాభై దాటింది. 1970 నాటికి అరవై దాటింది. ఇప్పుడు ఏటా సుమారు వంద చిత్రాలు తయారవుతున్నాయి. చిత్రాల సంఖ్యలో 1959 వరకు మనది దేశంలో నాల్గవ స్థానం. మొదటి మూడు స్థానాలు-హిందీ, తమిళం, బెంగాలీ రంగాలవి. 1960 నుంచి మనం బెంగాలీలను దాటి మూడో స్థానంలోకి వచ్చాం. 1970 తర్వాత తమిళులను కూడా మించిపోయిన రెండో స్థానంలోకి వచ్చాము. నిర్మాణ వ్యయంలో, భారీతనంలో ఇప్పుడు తెలుగు చిత్రాలు హిందీ చిత్రాలతో పోటీ పడుతున్నాయి. క్రిందటి సంవత్సరం తెలుగులో వచ్చినన్ని సినిమాస్కోప్ చిత్రాలు హిందీలో కూడా వచ్చినట్లు లేవు.

మద్రాసులో చలనచిత్ర పరిశ్రమ వ్రేళ్ళూనుకోవడానికి, విస్తరించడానికి తెలుగు వారు చేసిన కృషి గురించి ఇక్కడ కొద్దిగా చెప్పుకోవలసి ఉంది. 1950 నాటికే మద్రాసు నగరం మనదేశంలో బొంబాయి తర్వాత చెప్పుకోదగిన పెద్ద చలన చిత్ర నిర్మాణ కేంద్రంగా అన్ని హంగులను సమకూర్చుకొన్నది. అప్పటికే మద్రాసులో దాదాపు 15 స్టూడియోలుండేవి. అప్పట్లో తెలుగునాడు, తమిళనాడు ఒకే రాష్ట్రంగా ఉండేది. తెలుగు వారికి, తమిళులకు మద్రాసు ఉమ్మడి రాజధానిగా ఉండేది. ఎప్పుడో వేరు పడవలసి వస్తుందనీ, మద్రాసు నగరం మనకు కాకుండా పోతుందనీ ఎవరూ ఊహించకపోవడం వల్ల, మద్రాసు వంటి పెద్ద నగరం ఇంకొకటి మనకు లేకపోవడం వల్ల, అప్పటి కింకా హైదరాబాద్ మనది కాకపోవడం వల్ల మన సినీ నిర్మాతలందరూ తమ సంపదనంతటినీ మద్రాసులో గుప్పించారు. బ్రహ్మాండమైన స్టూడియోలు, లేబరేటరీలు, థియేటర్లు నిర్మించారు. చలనచిత్ర కేంద్రంగా మద్రాసు అభివృద్ధికి బహుశా తమిళుల కంటే తెలుగు వారే ఎక్కువ కృషి చేశారు. విజయ, వాహిని, భరణి, శోభనాచల స్టూడియోలు తెలుగు వారివే. వాహినీ స్టూడియో-మన దేశంలోనే కాదు-ఆసియా మొత్తం మీద పెద్ద స్టూడియో. ఈ స్టూడియోలో ఉన్న హంగులు బొంబాయి స్టూడియోలలో కూడా లేవు. మద్రాసులో తెలుగు, తమిళ చిత్రాలేకాక, కన్నడ, మళయాళ చిత్రాలు కూడా తయారవుతూ ఉండేవి. 'చంద్రలేఖ' నాటి నుంచి మద్రాసు స్టూడియోలో హిందీ చిత్రాల నిర్మాణం కూడా ప్రారంభమయింది. క్రమంగా చిత్రాల సంఖ్యలో మద్రాసు బొంబాయిని మించిపోయింది.

అప్పుడూ ఇప్పుడూ కూడా తెలుగు నిర్మాతలు ఇతర భాషలలో చిత్రాలు నిర్మిస్తున్నారు. తెలుగు దర్శకులు, సాంకేతిక నిపుణులు, నటీనటులు ఇతర భాషా చిత్రాలకు పనిచేస్తున్నారు. తెలుగు నేపథ్యగాయనీ గాయకులు ఇతర భాషా చిత్రాలలో పాడుతున్నారు. మొట్టమొదటి కన్నడ చిత్రం 'సతీసులోచన'కు దర్శకత్వం వహించినవారు తెలుగువాడైన వై.వి. రావు. ఇటీవల కాలంలో పేకేటి శివరాం, ఆమంచర్ల శేషగిరిరావు కన్నడంలో పెక్కు విజయవంతమైన చిత్రాలు తీశారు. కన్నడంలో 'సంస్కార' చిత్రాన్ని తీసి రాష్ట్రపతి సువర్ణ పతకం సంపాదించిన పట్టాభిరామరెడ్డి తెలుగువాడే. రాజేశ్వరరావు, పెండ్యాల, ఘంటసాల, బాలమురళీ కృష్ణ పెక్కు కన్నడ చిత్రాలకు సంగీతం సమకూర్చారు. మొన్న మొన్నటి వరకు కన్నడ చిత్రాలలో ప్రముఖ నటీమణులందరూ తెలుగువారే. తెలుగు వారు తమిళరంగంలో కూడా రాణించారు. నాగయ్య, కన్నాంబ, భానుమతి, అంజలీదేవి, ఎస్. వరలక్ష్మి, సావిత్రి తమిళంలో అగ్రశ్రేణి తారలుగా వెలుగొందారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రులకు అన్యాయం జరుగుతున్నట్లు భావించడం వల్ల మనం ఆందోళన సాగించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాము. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు మనమే శ్రీకారం చుట్టాము. కాని, తమిళులతో ఆస్తులు పంచుకోవడంలో మనం భర్తీ చేసుకోలేనంతటి నష్టానికి గురియైనాము. మనం కష్టపడి చెమటోడ్చి అభివృద్ధి చేసిన మద్రాసు నగరమే మనకు పరాయిదై పోయింది. ఆంధ్రులు ఉన్నచోటనే ఉండి ప్రవాసాంధ్రులై పోయారు. భాషాదురభిమానాలు పెరిగిపోవడంతో మద్రాసులోని తెలుగువారికి పరాయి పంచన కాలక్షేపం చేస్తున్నామనే అసంతృప్తి ఏర్పడింది.

నైజాం సంస్థానం మూడు చెక్కలై తెలంగాణా ప్రాంతం ఆంధ్రలో చేరి, 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరించడంతో హైదరాబాద్ నగరం మనకు దక్కింది. తెలుగు వారికి కొంత ఉపశమనం కలిగింది. నష్టం కొంత భర్తీ అయినట్లయింది. తెలుగు సినిమా రంగం దృష్టి హైదరాబాద్ మీదకు మళ్ళింది. అయితే, మద్రాసులో సొంత స్టూడియోలున్న వారు మకాం మార్చడం సాధ్యం కాదు. స్టూడియోలను అమ్ముకోవలసిందేగాని, తరలించడం సాధ్యం కాదు కదా? మద్రాసులో స్టూడియో వ్యాపారం లాభసాటిగా ఉన్నప్పుడు వాటిని అమ్ముకోవలసిన పనేముంది? మద్రాసులో సొంత స్టూడియో లేని సంపన్న నిర్మాతలు ఎవరైనా హైదరాబాద్ వచ్చి స్టూడియో నెలకొల్పవచ్చు. కాని, స్టూడియో ఉంటేచాలదు. లేబరేటరీలు, రికార్డింగు సదుపాయాలు కావాలి. సాంకేతిక నిపుణులు, నటీనటులు, ఇతర కళాకారులు అందుబాటులో ఉండాలి. మద్రాసులో స్థిరపడిన తెలుగు సినీ కళాకారులకు నాలుగు దక్షిణాది భాషలలో గిరాకీ ఉంది. దానిని వదులుకుని వారు హైదరాబాద్ వస్తారా? హైదరాబాద్ లో నిర్మించే ప్రతిచిత్రానికీ మందీమార్బలమంతటినీ మద్రాసు నుంచి రప్పించాలంటే నిర్మాణ వ్యయం పెరుగుతుంది.

కష్టనష్టాలెన్ని ఉన్నా వాటిని ఎదుర్కోవడానికి సిద్ధపడి వై. రామకృష్ణప్రసాద్ గారు 1958లో హైదరాబాద్ లో శ్రీ సారధీ స్టూడియోస్ ను నెలకొల్పారు. తెలుగు చిత్ర పరిశ్రమను మద్రాసు నుంచి తెలుగు దేశానికి తరలించే మహోద్యమానికి నాంది పలికిన ఘనత ఆయనదే. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబ్సిడీ పథకం ద్వారా ఈ ఉద్యమాన్ని పోషించింది. ఆంధ్రప్రదేశ్ లో తయారైన ప్రతి చిత్రానికి మొదట 50 వేల రూపాయల సబ్సిడీ ఇచ్చేవారు. తరువాత సబ్సిడీని లక్ష రూపాయలకు పెంచారు. రాష్ట్రంలో స్టూడియోల నిర్మాణానికి ప్రభుత్వం ఋణాలు ఇచ్చింది. ఈ సహాయం ఫలితంగా రాష్ట్రంలో చలన చిత్ర పరిశ్రమ వ్రేళ్ళూనుకుంది. హైదరాబాద్ లో ఇప్పుడు ఐదు స్టూడియోలున్నాయి. ఏటా తెలుగులో విడుదలవుతున్న చిత్రాలలో సగానికి పైగా ఇప్పుడు హైదరాబాద్ లోనే తయారవుతున్నాయి.

ఇప్పుడిక మళ్ళీ వెనక్కి తిరిగి తెలుగు సినిమా తీరుతెన్నులను పరిశీలిద్దాం. 1931 నుంచి 1937 వరకూ పౌరాణిక చిత్రాల శకం. 1938 నుంచి 1947 వరకు ప్రబోధాత్మక సాంఘిక చిత్రాల శకం. 1948 నుంచి 1955 వరకు కళాత్మక చిత్రాల శకం అయితే, 1956 నుంచి వ్యాపార సరళి ఫార్ములా చిత్రాల శకం ఆరంభమయింది. 1956 నుంచి రాశి పెరుగుతూ వాసి తగ్గుతూ వచ్చింది. పోటీ, ధనాకర్షణ ఎక్కువైనాయి. వీటి ప్రభావం వల్ల అదివరకు శుభ్రమైన చిత్రాలు నిర్మించిన వారే 1956 నుంచి అవాస్తవికమైన చౌకబారు చిత్రాలు నిర్మించడం ప్రారంభించారు. చిత్రాలలో శృంగారం మోతాదు హెచ్చి అశ్లీలంగా మారింది. రెండర్ధాల బూతు పాటల జోరు హెచ్చింది. కేబరే డాన్సులు, రేప్ సీనులు, హింస, వెకిలి హాస్యం చోటు చేసుకున్నాయి. మెలోడ్రామా పతాక స్థాయినందుకుంది. భారీ సెట్టింగులు, ఊటీ కాశ్మీర్ ఔట్ డోర్ షూటింగులు, కొండల్లో, జలపాతాల్లో ఫైటింగులు ఎక్కువైనాయి. అనుమానాల పెనుతుఫానులతో, కడగండ్ల వడగండ్లతో, కన్నీటి వరదలతో కుటుంబ గాధా చిత్రాలు మహిళాలోకాన్ని ముంచి ఎత్తాయి, కత్తి, కర్ర, కుక్క, గుర్రం ఫార్ములాతో కాంతారావు, కృష్ణకుమారి, రాజనాల, బాలకృష్ణ కాంబినేషన్ తో విఠలాచార్య మార్కు జానపద చిత్రాలు పామరజనాన్ని వెర్రెత్తించాయి. ఫర్లాంగు పొడుగు దీర్ఘాల పద్య రత్నాలతో, ట్రిక్ ఫోటో గ్రఫీతో పాత పౌరాణికాలన్నీ మళ్ళీ కొత్త వేషాల్లో తయారైనాయి. ప్రతిభా దారిద్ర్యం ఎక్కువయింది. కళాకారులకు తీరిక తగ్గింది. దర్శక నిర్మాతలకు ఓపిక తగ్గింది. మొత్తం మీద అందరిలో శ్రద్ధ తగ్గింది. నెల రోజుల్లో సినిమా తీసేసి, మరుసటి నెలలో లక్షలు రాబట్టుకోవాలనే దురాశ ఎక్కువయింది. సినిమా వ్యాపారస్థాయి నుంచి జూదం స్థాయికి దిగజారింది.

1962 నుంచి తెలుగు సాహితీ రంగంలో రచయిత్రులు విజృంభించారు. వారి సీరియల్ నవలలను సగటు పాఠకులు విపరీతంగా ఆదరించడంతో నిర్మాతల దృష్టి నవలా మణుల నవలలపై పడింది. 1964లో ఒక ప్రముఖ రచయిత్రి నవల తెరకెక్కి ఆర్థిక విజయం సాధించడంతో-అప్పటి వరకు కథా దారిద్ర్యంతో బాధపడుతూ, ఇతర భాషలలోని శతదినోత్సవ రజతోత్సవ చిత్రాలను తెలుగులోకి తర్జుమా చేస్తున్న నిర్మాతలందరూ రచయిత్రుల నవలలకోసం ఎగబడడం ప్రారంభించారు. గిరాకీతో పాటు ఉత్పత్తి పెరగడం సహజంకదా. రచయిత్రులు సినిమా ఫార్ములాతో పుంఖానుపుంఖంగా నవలలు ఉత్పత్తి చేశారు. ఈ విధంగా రచయిత్రులను ప్రలోభపెట్టడం ద్వారా తెలుగు సినిమా తాను భ్రష్ఠం కావటమేకాక కాల్పనిక సాహిత్యాన్ని కూడా భ్రష్ఠం చేసింది. తెలుగు సినిమాలో సెట్టింగులన్నీ అట్టమేడలైతే రచయిత్రుల నవలల్లో సన్నివేశాలన్నీ గాలిమేడలు. తెలుగు సినిమాల్లో లాగానే రచయిత్రుల నవలల్లో కూడా వాస్తవికత అపురూపమైపోయింది.

1956 నుంచి 1975 వరకు ఇరవై సంవత్సరాల కాలంలో కేవలం వ్యాపార దృష్టితో కాక-కళా దృష్టితో, శ్రద్ధతో, నిజాయితీతో, ప్రతిభావంతంగా తీసిన చిత్రాలను - భరణీ వారి 'బాటసారి', బాపు తీసిన 'సాక్షి', 'సంపూర్ణ రామాయణం', 'సీతాకళ్యాణం' వంటి వాటిని-వేళ్ళమీద లెక్కించవచ్చు.

1976లో తెలుగు చిత్రరంగంలో సంతోషించదగిన ఒక కొత్త ధోరణి తలఎత్తింది. పొరుగునున్న కన్నడ, మళయాళ చిత్రరంగాలలోని మేధావుల ప్రభావం వల్ల తెలుగులో కూడా నిరాడంబర, వాస్తవిక, కళాత్మక చిత్రాల నిర్మాణం ప్రారంభమయింది. ఒకవైపు ధనిక వర్గం వారు నలభై, యాభై లక్షల వ్యయంతో అర్థం పర్థం లేని దండగమారి సినిమా స్కోప్ కలర్ చిత్రాలు తీస్తూ ప్రేక్షత్రకుల మానసిక ఆరోగ్యాన్ని ఖరాబు చేస్తున్నా, మరొక వైపు ప్రతిభ, నిజాయితీ గల యువతరం మేథావులు రెండు లక్షలతో, నిరాడంబరంగా, పూర్తిగా కొత్త పద్ధతిలో శుభ్రమైన చిత్రాలు తీస్తున్నారు. ఇటువంటి చిత్రాలు ఘనవిజయం సాధించకపోయినా, పెట్టుబడిని తిరిగి రాబట్టుకోగలుగుతున్నాయి. ఈ 'ఆఫ్ బీట్' చిత్రోద్యమం అంతకంతకు బలమౌతున్నది. హైదరాబాద్ కేంద్రంగా ఈ ఉద్యమం విస్తరిల్లుతున్నది. స్టూడియో ఫ్లోర్లతో, సెట్టింగులతో నిమిత్తం లేకుండా పల్లెలలో, సహజ పరిసరాలతో ఈ చిత్రాల నిర్మాణం జరుగుతున్నది. సినిమా అనుభవం లేని రచయితలు, కవులు, కళాశాల అధ్యాపకులు, రంగస్థల నటులు ఈ చిత్రాలలో పనిచేస్తున్నారు.

అంతర్జాతీయ ఖ్యాతి నార్జించిన మృణాల్ సేన్, శ్యాం బెనగల్ కూడా తెలుగులో చిత్రాలు ('ఒక ఊరి కథ', 'అనుగ్రహం') నిర్మించడంతో ఈ ఉద్యమానికి మరింత బలం చేకూరింది. తెలుగులో ఈ రకం చిత్రాలకు మంచి భవిష్యత్తు ఉందనే విశ్వాసం ఏర్పడుతున్నది. జాతీయ అంతర్జాతీయ వేదికలపై తెలుగు వారు గర్వంగా తలఎత్తుకో గలిగేటట్లు చేసేవి ఈ ఆఫ్ బీట్ చిత్రాలే. 'ఊరుమ్మడి బతుకులు', 'చలిచీమలు', 'ప్రాణం ఖరీదు' ఈ కోవకు చెందినవే.

నండూరి పార్థసారథి
(మే-1979 డెట్రాయిట్ - మిచిగాన్ ప్రత్యేక సంచికలో ప్రచురితమైనది)

Previous Post Next Post