బహుముఖాలుగా కాంతులను తనలో యిముడ్చుకొని చిత్రవిచిత్ర వర్ణాలతో ప్రకాశించే స్పటికంలా సచిన్ దేవ్ బర్మన్ ప్రతిభ సంగీత ప్రపంచంలో బహుముఖాలుగా ప్రకాశిస్తోంది. చలన చిత్ర సంగీతంలో ఎన్ని రకాల అభిరుచులు ఉండటానికి సాధ్యమో, అన్ని రకాల సంగీతాన్ని విరజిమ్మగల ఫౌంటెన్ బర్మన్. బర్మన్ సంగీతం అందమైన పెంకి పిల్ల లాంటిది. చలాకీగా అమాయికంగా, అడవుల్లో సెలయేళ్ళవెంట చెంగు చెంగున గంతులు వేస్తూ, కిలకిల నవ్వుతూ పరిగెత్తుతుంది. అంతలో అల్లరి చేస్తూ, కాలికందినదంతా తన్నేస్తూ, మారాముచేస్తూ గుణుస్తుంది. కాసేపటికి ముగ్ధగా వింతహొయలు ప్రదర్శిస్తుంది. నెరజాణలా నయగారాలు చూపుతుంది. ప్రేయసిగా విరహపడుతుంది. ప్రేమ చూపుతుంది. శరత్ వర్ణించే స్త్రీలా వినయమూ, భక్తి, కరుణ, వాత్సల్యమూ ప్రదర్సిస్తుంది. మాతృమూర్తిగా జోలపాడుతుంది. పల్లెపడుచుగా చేలగట్లపై అమాయికంగా పాటలు పాడుకుంటుంది. ఆంగ్లోయిండియన్ పిల్లలా రాక్కెన్ రోల్ చేస్తుంది.

బర్మన్ సృష్టించలేంది లేదు. ఆయన సాహసానికి అంతులేదు. ప్రయోగాలు చెయ్యటం ఆయనకి ఆదర్శం, అలవాటు. నిలకడ నీటిలా పాచిపట్టకూడదు సినిమా సంగీతం. క్షణక్షణం మార్పుకు లోనవుతూ ఉండాలి. సంగీతమేకాదు. ప్రపంచంలో ఏదైనా అంతే; మార్పులేనిదే మానవుడు జీవించలేడు. ఈ సత్యాన్ని గ్రహించే బర్మన్, సంగీత ప్రపంచంలో విధివిరామం లేకుండా, మూలమూలలనీ వెతుకుతూ, కొత్తకొత్త తీరు తెన్నులు శోధిస్తూ, పరిచయం చేస్తున్నాడు. ఈ అన్వేషణలో ఆయనకు తృప్తిలేదు. గమ్యం లేదు. పురోగమిస్తున్నకొద్దీ దిక్చక్రంలా, మృగతృష్ణలా దూరమవుతుంటుంది. ఈ అన్వేషణలో ఆయన ఒక్కసారైనా విసుగుతో ఉస్సురని నిట్టూర్చడు. 'జీవునివేదన'ను సంతోషంగా స్వీకరిస్తాడు. ఎందరు ఎన్ని విధాల విమర్శించినా ఆయన విశ్వాసం కొంచమైనా సడలదు. తను ఏది సృష్టించినా అమృతం కాగలదనే నమ్మకం ఉంది. సంప్రదాయపు నేలను విడచి సాముచేయగల్గటం ఆయన కొక్కడికే చెల్లింది. అయినా, అవసరమనుకున్నప్పుడు స్వచ్చమైన శాస్త్రీయ సంగీతం చేపట్టుతాడు. చిత్రాలలో నేపథ్య సంగీతం పట్ల శ్రద్ధచూపే బహుకొద్దిమందిలో ఆయన ఒకరు. చిత్రం స్థాయి దిగజారిపోతున్నప్పుడు, దర్శకునికి అండగా నిలబడి, అతడు చెప్పలేక పోయినదాన్ని, తాను వ్యాఖ్యానంచేసి, దర్శక, రచయితల పరువు కాపాడటం ఆయనకు అలవాటైపోయింది. నేపథ్య సంగీతం కోసం ఆయనకి కావలసినవి కొన్ని శబ్దాలు. రాగాలు, తాళాలు, శ్రుతులు యివేవీ అక్కర్లేదు. తెరమీద ప్రేక్షకులు చూసే విషయాలు మరింత స్థిరంగా వారి మనస్సుల్లో నిలిచిపోయేందుకు తగిన శబ్దాలను దృశ్యానికి ఉపశ్రుతిగా ఆయన ఉపయోగిస్తాడు. ఆ శబ్దాలు, సితార్, వాయులీన్ మొదలయిన వాద్యాల ద్వారా ఉత్పత్తి అయినవి కావచ్చు, లేదా పిట్టల అరుపులు, రైళ్ళు పోతున్న శబ్దాలు కావచ్చు. తలుపు చెక్కల చప్పుడు కావచ్చు. శబ్దం, దృశ్యానికి ఆలంబనంగా ఉండి మరింత ఆహ్లాదకరంగా చేసే ఉపశ్రుతిగా ఉండాలిగానీ, మొత్తం దృశ్యాన్నే మింగివేయ కూడదని తెలుసుకున్న కొద్ది మందిలో ఆయన ఒకరు. చాలా లలితంగా, శ్రుతివేస్తాడాయన.

బిమల్ రాయ్ ప్రొడక్షన్స్ కూ, నవకేతన్ సంస్థకూ ఆయన ఆస్థాన సంగీత దర్శకుడు. (వీటిలో బిమల్ సంస్థకు సలీల్ చౌధురీ కూడా ఆస్థాన విద్వాంసుడే) బర్మన్ సంగీతాన్ని స్థూలంగా రెండు విభాగాలుచేస్తే, ఒకరకం-బిమల్ రాయ్ చిత్రాలకు ఆయన సమకూర్చే సంగీతం, రెండవరకం-నవకేతన్ వారికి సరఫరా చేసే సంగీతం.

మొదటిరకం సంగీతంలో ఆయన అతి లలితమైన స్వరాలూ, శబ్దాలూ ప్రయోగిస్తాడు. సితార్, వేణువు, జలతరంగిణి, సరోద్ లను ఈ రకంలో ఉపయోగించుకుంటాడు. తలత్ కంఠాన్ని ఎరువు తెచ్చుకుంటాడు. 'సుజాత' చిత్రంలో ఈ రకం సంగీతపు పరమావధిని స్పృశించాడు. సుడులు తిరిగిపోయే సిగరెట్టు పొగలాగా, ప్రశాంతంగా ఉన్న నీళ్ళలో సన్నని బెడ్డ వేస్తే వచ్చే అలల చక్రాలలాగా సంగీతం హాయిగా ఉంది ఆ చిత్రంలో. ప్రథమ పురుషస్పర్శకు కన్యదేహంపై రేగే పులకలు, మనస్సులో కలిగే మధురోహలూ, సిగ్గుతో కుంచించుకుపోయే కన్య ముగ్ధ ప్రణయం, 'సుజాత'లో ఆయన ఎంత గొప్పగా వర్ణించాడో ఒక్కసారి చిత్రం చూసిన వారెవరూ ఎన్నటికీ మరువలేరు. ముఖ్యంగా (కన్యలు).

రెండవరకం సంగీతం నవకేతనవారికి సరఫరా చేసేది. యాభయ్యోపడిలో ప్రవేశించినా ఆయనలో యిప్పటికీ చల్లారని ఆకతాయితనం, పొగరు మోతుతనం, యౌవనసాహసం-ఈ చిత్రాలలో విశ్వరూపం దాల్చుతాయి. ఆయనలోని ఆత్మవిశ్వాసం, గర్వం, ఈ రకం సంగీతంలో గుబాళిస్తాయి. ట్రంపెట్ లూ, ఎకార్డియనులూ, పియానోలూ, గిటార్లూ, మొరాకోర్సులూ ఈ రకం సంగీతంలో ఉపయోగిస్తాడు. ఇంకా శివంఎత్తినప్పుడు, కారు హారన్ లూ, పళ్ళాలూ, గ్లాసులూ, చెంబులూ, తలుపు చెక్కలూ, చేతికీ కాలికీ అందిన ప్రతిఅడ్డమైనదాన్నీ ఉపయోగించిపారేస్తారేమో ననిపిస్తుంది. అటువంటి శబ్దాలను ఉత్పత్తి చేస్తాడు.

ఆయన స్పర్శమాత్రానికే గిన్నెల్లోంచీ, చెంబుల్లోంచి, తలుపు చెక్కల్లోంచీ, సంగీతం చిమ్ముకుంటూ వస్తూంది. ఆయన తాకిందంతా సంగీతమే. రాగాలనూ, స్వరాలనూ, శాస్త్రాన్ని ఎడంకాలితో తన్నేయగల సాహసం వస్తుంది-స్వరాలను కంకర రాళ్లలా పోగేసుకుని చేతికొచ్చినట్లల్లా విసురుతాడాయన. ఆయన ఎల్లావిసిరినా అవి పొందికగా అతుక్కుంటాయి. కళ్ళుమూసుకుని సవ్యసాచిలా స్వరాలను వదులుతుంటాడు. ఈ విద్యలో ఈ సవ్యసాచికి ఎదురు నిలవగల ధీమా ఎవరికీ లేదనిపిస్తుంది. ఇంత అందమైన అల్లరీ ఆగం చేసేందుకూ, చేయించుకొనేందుకూ, ఆయనకు కిశోర్ కుమార్, ఆశాభోన్ స్లేలు కుడి ఎడమ భుజాలుగా చేరతారు.

కొన్నికొన్ని పాటలలో రాగం అసలు ఉండదు. వచనం స్థాయికి దిగజారిపోతుంది. తప్పతాగిన వాడి కూనిరాగంలాగా, జోరీగ గీపెట్టినట్లుగా ఉంటాయి.

ఒక గాయకుడు గొణుగుతూంటాడు; వాద్యాలు మూలుగుతూ ఉంటాయి; తాళం పడుతూ ఉంటుంది. అయినా ఎంతో హాయిగా ఉంటాయి. బర్మన్ లోని ఈ గర్వం, సాహసం, పొగరు 'చల్తీకానామ్ గాడీ' చిత్రంలో విశ్వరూపం దాల్చి, శ్రోతలందరికీ మత్తుజల్లి, వెర్రిపుల్లాయిలని చేసేశాయి. సినిమా అయిపోయింతర్వాత 'తమాషాగా ఉందే' అని శ్రోతలు బుర్రఝాడించు కుంటారు (చాదస్తుల తోసహా).

'శాస్త్రీయ సంగీతం 'ఓనమా'లు రాని ప్రతివాడూ చేసేదే యిది', అని కొందరు ఆక్షేపిస్తారుగానీ, బర్మన్ గొప్ప సంగీత విద్వాంసుడు. స్వయంగా గొప్ప గాయకుడు. 'సుజాత' చిత్రంలో ఆయన పాడిన పడవ పాట చలన చిత్ర సంగీతంలో అపూర్వం అంటే అతిశయోక్తి కాదు. ఆ జానపద గీతానికి, లేశమైనా సినిమా రంగువెయ్యకుండా, కరుణ, వేదన, బ్రతుకుబరువూ, కంఠపు ప్రతివంపులో తొణికిసలాడించాడు ఆయన. అవకాశం దొరికినపుడల్లా జానపద సంగీతాన్ని సినిమాల్లో ఉపయోగించు కునేందుకు ఆతృతపడే, యిద్దరు ముగ్గురిలో ఈయన ఒకడు.

బెంగాల్ సమీపంలోని త్రిపుర ఈయన పుట్టి పెరిగిన స్థలం కావటం వల్ల, ఈయన ఎన్ని రకాల సంగీతం సృష్టించినా, అన్నింటిలోనూ బెంగాలీ జానపద సంగీతఛాయలు పడుతూనే ఉంటాయి. గాంభీర్యం, చిలిపితనం, కరుణ, సాహసం, అనుభవం, పసితనం, ప్రౌఢత్వం, ముగ్ధత్వం-అన్నీ ఒక్కుమ్మడిగా వంటబట్టించుకున్న 'స్వరదేవ్' సచిన్ దేవ్ బర్మన్.

నండూరి పార్థసారథి
(1960 జనవరి 31వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమయింది)

Next Post