విలాయత్ ఖాన్ సితార్ వాదన పద్ధతి, శైలి, ఆయన వాయించే 'గత్'లు పూర్తిగా ఆయన సొంతం. శతాబ్దాలుగా వాడుకలో ఉన్న పద్ధతికి స్వస్తి చెప్పి, గాత్ర సంగీతాన్ని అనుకరిస్తూ సితార్ పై ఒక సరికొత్త పద్ధతిని ఆయన ప్రవేశపెట్టారు. దానిని 'గాయకీ అంగ్' అంటారు. ఆ పద్ధతిని విలాయత్ ఖాన్ ప్రవేశపెట్టారు కనుక అది 'విలాయత్ ఖానీ బాజ్' అయింది. ('బాజ్' అంటే వాయించే పద్ధతి-లేక టెక్నిక్) ఆయన వాయించే 'గత్'లు కూడా ప్రత్యేక శైలిలో ఉంటాయి. వాటిని 'విలాయత్ ఖానీ గత్' లని అంటారు. సితార్ పై 'గాయకీ అంగ్'ను ప్రవేశపెట్టడం ద్వారా, అనేకానేక చిత్రమైన, క్లిష్టమైన గమకాలను, 'బోల్'లను పలికించడం ద్వారా విలాయత్ ఖాన్ సితార్ హోదాను ఎన్నో రెట్లు పెంచి, భారతీయ వాద్యాలలో దానికి అత్యున్నత స్థానం కల్పించారు. దానికొక పరిపూర్ణత నిచ్చారు.

మామూలుగా గాత్రంలో పలికే గమకాలన్నీ వాద్యాలపై పలకవు, అలాగే వాద్యాలపై పలికే గమకాలన్నీ గాత్రంలోనూ పలకవు. వాద్యాలలో కూడా కొన్నింటిపై పలికే గమకాలు మరికొన్నింటిపై పలకవు. కమానుతో వాయించే సారంగి వంటి వాద్యాలపై పలికే గమకాలు సితార్ వంటి మీటు వాద్యాలపై పలకవు. అలాగే సితార్ పై పలికే గమకాలు కొన్ని సారంగి పైన పలకవు. శహనాయి పైన మాత్రమే పలికే గమకాలు కొన్ని, వేణువుపైన మాత్రమే పలికే గమకాలు కొన్ని ఉన్నాయి. గమకాల విషయంలో గాత్రానికి అతి సమీపంగా ఉండేది సారంగి. దాని తర్వాత చెప్పుకోదగినవి వైలిన్, తార్ శహనాయి, దిల్రుబా. ఇవన్నీ కమానుతో వాయించే వాద్యాలు. గాత్రంలోనూ, ఈ కమాను వాద్యాలలోనూ స్వరాలు-ఒకదాని తర్వాత ఒకటిగా, విడివిడిగా కాక-ఒక దానిలో నుంచి ఇంకొక దానిలోకి ప్రవహిస్తున్నట్లుగా ఏకధారగా వినిపిస్తాయి. అందుకే గాత్ర సంగీతానికి ప్రక్క వాద్యాలుగా వాటిని ఉపయోగిస్తారు. గాయకుడు పాడే గమకాలను దాదాపు యథాతథంగా వాటిపై పలికించవచ్చును. సితార్ వంటి మీటు వాద్యాలపై ఇది సాధ్యం కాదు కాని, విలాయత్ ఖాన్ దీనిని సాధ్యం చేశారు.

మామూలుగా సితార్ పై ఏ స్వరానికా స్వరం విడివిడిగా-ఒక్కొక్క మెట్టుపై ఒక్కొక్క స్వరం-పలుకుతుంది. అది సితార్ అభ్యాసంలో ప్రాథమికదశ. కొన్ని శతాబ్దాల క్రిందట అలాగే వాయించేవారు. తర్వాత ఒక మెట్టు మీద మా మూలుగా పలికే స్వరం కాక, తీగని కొంచెం క్రిందికి లాగడం ద్వారా మరొక స్వరాన్ని పలికించడం తెలుసుకున్నారు. తర్వాత ఒకే మెట్టుమీద మూడు స్వరాలను పలికించడం నేర్చుకున్నారు. ఒక మెట్టు మీద వేలు ఉంచి, తీగ లాగడం ద్వారా ఒక స్వరం నుంచి ఇంకొక స్వరం మీదకు జారడాన్ని 'మీండ్' అంటారు. ఈ 'మీండ్'లో సితార్ శక్తి చాలా తక్కువగా ఉన్నదనే ఉద్దేశంతో విలాయత్ ఖాన్ ముత్తాత సాహెబ్ దాద్ ఖాన్ గారు సితార్ నిర్మాణంలో కొన్ని మార్పులు చేసి, దానికి 'సుర్ బహార్' అని పేరు పెట్టారు. ఆయన సుర్ బహార్ పై ఒకే మెట్టు మీద 'మీండ్' ద్వారా ఏడు స్వరాలను -అంటే 'స' నుంచి 'స' వరకు -పలికించగలిగారు. విలాయత్ ఖాన్ తాతగారు ఇమ్ దాద్ ఖాన్, తండ్రి ఇనాయత్ ఖాన్ సితార్, సుర్ బహార్ వాద్యాలు రెండింటిలోనూ ప్రవీణులు. ఇమ్ దాద్ ఖాన్ సితార్ పై విపరీతమైన వేగాన్ని, మాధుర్యాన్ని, చిత్ర విచిత్ర గమకాలను సాధించి, 'ఇమ్ దాద్ ఖానీ బాజ్'ను ప్రవేశపెట్టారు. ఇనాయత్ ఖాన్ అదే టెక్నిక్ లో వాయిస్తూ సితార్ పైనే 'మీండ్' ద్వారా నాలుగైదు స్వరాలు పలికించగలిగారు. ఈ ప్రయోగాలలో విలాయత్ ఖాన్ ఇంకా చాలా ముందుకు పోయాడు. 'మీండ్'లో అద్వితీయ ప్రావీణ్యాన్ని సాధించడమేకాక, 'గాయకీ అంగ్' ద్వారా ఆయన సితార్ వాదనంలో అది వరకు లేని ప్రవాహగుణాన్ని సాధించగలిగారు.

సితార్ కు 'మీండ్' ప్రాణం వంటింది. 'మీండ్' లేకుండా ఊరికే మెట్లు దాటుకుంటూ వాయిస్తే జలతరంగ్, కాష్ఠతరంగ్, సంతూర్ వాద్యాలు వాయించినట్లే ఉంటుంది. స్వర ప్రస్తారంలో వంపుల సొంపులు ఉండవు. 'సంగీత రత్నాకరం'లోని పంచదశ గమకాలలో పేర్కొనబడిన 'కంపిత', 'లీన', 'ఆందోళిత', 'ఉల్లాసిత' గమకాలే ఈ 'మీండ్'. ఆ గమకాలన్నీ ఒకే వర్గానికి చెందినవి, అవన్నీ వీణ వంటి మెట్లుగల తంత్రీ వాద్యాలకు సంబంధించినవి; అవి తీగలాగడంలో వేర్వేరు రకాలు. 'మీండ్' వల్ల అందమైన వంపులను, వయ్యారాలను సాధించగలిగినప్పటికీ కేవలం దాని వల్ల ప్రవాహగుణం రాదు. గాత్ర సంగీతంలోని ప్రవాహగుణాన్ని సితార్ పై సాధించడానికి విలాయత్ ఖాన్ ఎంతో పరిశోధన చేశారు. పరిశ్రమ చేశారు. అసలు ఆయనకు ఈ ఊహ, సంకల్పం కలగడానికి కారణం ఆయన గాత్ర సంగీతంలో కూడా ప్రవీణుడు కావడం. తండ్రి పోయిన తర్వాత ఆయన కొంత కాలం మాతామహుడు బందేహసన్ ఖాన్ వద్ద, మేనమామ జిందాహసన్ ఖాన్ వద్ద గాత్ర సంగీతం నేర్చుకున్నారు. అంత చిన్న తనంలోనే ఆయన పాడుతూ, పాడిన దానిని సితార్ పై వాయించడానికీ ప్రయత్నించేవారు. ఆయన తల్లి కూడా తాను పాడి వినిపించి అదే విధంగా సితార్ పై వాయించమనేది. కాని, ఆయన ఆ విధంగా వాయించలేకపోయేవారు. దానితో ఆయనకు పట్టుదల పెరిగింది. 'ఇన్ని శతాబ్దాలుగా అందరూ సితార్ ను మామూలు పద్ధతిలోనే వాయిస్తున్నారు. గాత్ర సంగీతంలోని ధారాగుణాన్ని దీనిపై సాధించాలన్న ఊహ ఎవరికీ రాలేదు. వచ్చినా, కొంత ప్రయత్నించి, సాధ్యం కాదని వదిలేసి ఉంటారు. మనం దీనిని ఎందుకు సాధించకూడదు? అనుకుని, ఆయన రాత్రింబవళ్ళు దాన్ని గురించి ఆలోచించారు. రకరకాల ప్రయోగాలు చేశారు. చివరికి ఒకానొక పద్ధతిలో మీటుతూ స్వరానికి సపోర్టు ఇవ్వడం ద్వారా ధారాగుణాన్ని సాధించవచ్చునని కనిపెట్టారు. ఈ పరిశోధనద్వారా ఆయన సితార్ కు ఒక కొత్త డైమన్షన్, కొత్త 'ఇమేజ్' యిచ్చారు. ఈ టెక్నిక్ ఇప్పుడు చాలా ప్రసిద్ధమై, ప్రచారంలోకి వచ్చింది.

విలాయత్ ఖాన్ మేనల్లుడు ఉస్తాద్ రయిస్ ఖాన్ ఈ 'గాయకీ అంగ్'లో సితార్ అత్యద్భుతంగా వాయిస్తారు. విలాయత్ ఖాన్ తమ్ముడు ఉస్తాద్ ఇమ్రాత్ ఖాన్, శిష్యులు పండిత్ గిరిరాజ్, అరవింద్ పారిఖ్, శిష్యురాలు కళ్యాణీ రాయ్ కూడా ఈ పద్ధతిలోనే వాయిస్తారు. ఈ 'గాయకీ అంగ్' ఆలాప్ లోనూ, విలంబిత్ గత్ లోనూ వ్యక్తమవుతుంది. జోడ్, ఝాలా, ధ్రుత్ గత్ లలో ఇది కనిపించదు.

సితార్ పై విలాయత్ ఖాన్ ఆలాప్, విలంబిత్ గత్ లు వింటుంటే ఖయాల్ వింటున్నట్లుగా అనిపిస్తుంది. కచేరీలో చివర మంచి మూడ్ లో ఉన్నప్పుడు, పట్టలేనంత ఇన్ స్పిరేషన్ వచ్చినప్పుడు ఒక్క నిమిషం సితార్ ఆపుచేసి ఆయన ఖయాల్ పాడడం మొదలు పెడతారు. శ్రోతలు పారవశ్యంతో సొక్కి సోలిపోతారు. ఆయన పాడడం ఆపి, పాడిన దానిని సితార్ పై వాయించి చూపుతారు. వేగంగా తానాలు పాడుతూ, వాటిని మళ్ళీ సితార్ పై వాయిస్తారు. 'గాయకీ అంగ్' సితార్ పై ఎలా ఉంటుందో అప్పుడు బాగా తెలుస్తుంది. ఆయన ఎంత అద్భుతంగా సితార్ వాయించినా, గొంతు విప్పి పాడడం ప్రారంభించేసరికి సితార్ సిగ్గుతో తలవంచుకున్నట్లు అనిపిస్తుంది. ఆయన గాత్ర సంగీత కచేరీలు ఎందుకు చేయరో తెలియదు గాని, ఆయన సితార్ సంగీతం కంటే గాత్ర సంగీతం ఎన్నో రెట్లు గొప్పగా ఉంటుంది.

నండూరి పార్థసారథి
(1974 ఆగస్టు 9వ తేదీన ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమయింది)

Previous Post Next Post