Title Picture

భరణీ వారి సరికొత్త చిత్రం 'బాటసారి' అనేక విధాల విశేషంగా, ప్రశంసనీయంగా ఉంది. ఫలితం మాట అటుంచి, అసలు ఒక తెలుగు దర్శక నిర్మాత, ఇప్పటి పరిస్థితులలో, ఆర్థిక ప్రయోజనాన్ని ఆశించకుండా, చిత్తశుద్ధితో ఇటువంటి విషాదాంత చిత్ర నిర్మాణానికి పూనుకోవడమే విశేషం. ఈ చిత్రంలో ఇంకా ముఖ్యంగా విశిష్టత ఇతివృత్తంలోనే ఉంది. ఈ ఇతివృతం తెలుగు వెండి తెరకు సరికొత్తది. 'బాటసారి' నిర్మాణం దక్షిణాది ఫిలిం రంగంలో పెద్ద సాహసకృత్యం.

ఈ చిత్రంలో నాయకుడు డ్యూయెట్లు పాడే షోకేలాకాదు. డాబు, దర్పం ఉన్నవాడు కాదు. నాయిక మిడిసిపడే గడుసు పడుచు కాదు. చిట్ట చివర ఒక్క సన్నివేశంలో తప్ప ఒకరి నొకరు తాకరు. అంతకు ముందు కూడా ఒకటి రెండు సందర్భాలలో మాత్రమే ఒకరి నొకరు చూసుకుంటారు. ఇందులో నాయకుడు పాటలు పాడడు. మాటలు కూడా చాలా అరుదుగా ఆడతాడు. ట్రేడ్ మార్క్ విలన్ లేడు. ఈ చిత్రంలో పెద్ద విలన్ విధి. అతనే అంతటినీ నడిపిస్తాడు. ఇవన్నీ ఈ చిత్రంలోని విశేషాలు. వీటితోపాటు నిడివి కూడా విశేషంగానే ఉంది. (తెలుగు చిత్రం నిడివి పదహారు వేల అడుగులకు లోపు ఉంటే విశేషమే). ఇవన్నీ కాక అసలు చిత్రం పేరులోనే ఉంది విశేషం. ఈ రకం చిత్రం తెలుగు సినిమా రంగం 30 ఏళ్ళ చరిత్రలో రాలేదు.

సరికొత్త ఇతివృత్తం కాబట్టి సవిస్తరంగా చెప్పుకోవచ్చును. ఇందులో నాయకుడు సురేంద్రనాథ్ (నాగేశ్వరరావు). సవతి తల్లి గారాబంతో పెరిగినవాడు. పరధ్యానం మనిషి. చదువులో తప్ప ఎందులోనూ చురుకుతనం లేనివాడు. ఇల్లు, తల్లి, తండ్రి, పుస్తకాలు తప్ప మరో ప్రపంచం అతనికి తెలీదు. బుద్ధిమంతుడు, యోగ్యుడు, నెమ్మదస్తుడు. ఎం.ఎ. పరీక్ష యూనివర్సిటీలో ఫస్ట్ గా పాసయ్యాడు. పై చదువులకు ఇంగ్లండ్ వెళ్తానంటే అమ్మా, నాన్నా కోప్పడ్డారు. ప్రపంచ జ్ఞానం మీద ఆసక్తి పుట్టి పంజరంలో నుంచి తప్పించుకుని మద్రాసు చేరాడు. అక్కడ ఉద్యోగాల కోసం తిరిగి తిరిగి అప్పారావు (బి.ఆర్. పంతులు) గారనే శ్రీమంతుని ఇంటికి చేరాడు. ఆయన ఇతన్ని చేరదీసి ఆదరించాడు. తన చిన్న కూతురు ప్రమీల (బేబీ శశికళ)కు పాఠాలు చెబుతూ, తన ఇంట్లోనే ఉండమన్నాడు. ఆయన పెద్ద కూతురు మాధవి (భానుమతి) బాల వితంతువు. ఆ ఇంటి వ్యవహారాలన్నీ ఆమే చక్కదిద్దుతూ ఉంటుంది. అతిధులకు మర్యాద లోపం రాకుండా ఏర్పాట్లు చేయడం ఆమె తన బాధ్యతగా నిర్వహిస్తుంది. వినయం, ఒద్దిక గల మనిషి. కరుణామయి. తన చెల్లెలి ద్వారా సురేన్ విషయాలన్నీ కనుక్కుంటూ, అతనికి ఏలోపం రాకుండా ఏర్పాట్లు చేయిస్తుంది. అతన్ని చూడకుండానే అతని మనస్తత్వాన్ని అర్థం చేసుకుంది.

ఒకసారి తన స్నేహితురాలు మనోరమ (దేవిక)కు ఉత్తరం వ్రాస్తూ సురేన్ విచిత్రమైన మనిషి అనీ, అతనికి అన్నీ అమర్చే బాధ్యత తనపై పడిందనీ వ్రాసింది. ఆ ఉత్తరం చూసి, మాధవి మనస్సు సురేన్ పై లగ్నమయిందని తెలుసుకుంది మనోరమ. ఆ సందేహాన్నే వెలిబుచ్చుతూ మాధవికి ఉత్తరం వ్రాసింది. మాధవి ఆమెను 'పిచ్చి పిల్ల'గా జమకట్టి ఊరుకుంది. ఒకసారి మాధవి తన మేనత్తకు ఆరోగ్యం సరిగా లేదని తెలిసి బెంగుళూరు వెళ్ళింది. ఆమె వెళ్ళిన మరునాటి నుంచి సురేన్ కు వేళకు అన్నమూ, నీళ్ళూ కూడా రావడం కష్టమయింది. అతని పరిస్థితిని తెలుసుకొని ప్రమీల, అక్కయ్యకు ఉత్తరం వ్రాసింది. మాధవి వెంటనే మద్రాసుకు బయలుదేరివచ్చింది.

మాధవి వచ్చిందని వినగానే సురేన్ ఆనందం పట్టలేకపోయాడు. ఆమెను చూడాలని ప్రమీలను తోడుతీసుకుని ఆమె గదికి వెళ్ళాడు. మాధవి నిశ్చేష్టురాలయింది. వెంటనే సురేన్ ను తీసుకు వెళ్ళమని ప్రమీలను శాసించింది. సురేన్ బాధపడ్డాడు. మాధవి గదికి సురేన్ వెళ్ళడం చూసిన నౌకర్లు గుసగుసలు ప్రారంభించారు. ఆమె మనస్సులో తుఫాను రేగింది.

ప్రమీలకు సరిగా చదువు చెప్పడం లేదని ఆమె సురేన్ ను మందలించింది. ఆమె కొని ఇచ్చిన కళ్ళజోడును అక్కడే విడిచి ఆ రాత్రే సురేన్ ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. కళ్ళజోడు లేకపోవడంతో చూపుసరిగా కనుపించక బండి క్రిందపడ్డాడు. ఆస్పత్రిలో కలవరింతల వల్ల తెలుసుకొని డాక్టర్లు అతని తండ్రికీ, అప్పారావు గారికీ కబురు పంపారు. ఆస్పత్రి నుంచి విడుదలయిన తర్వాత సురేన్, తండ్రితో కలిసి స్వగ్రామం చేరుకున్నాడు. మాధవి ప్రతిక్షణం అతని హృదయంలో మసలుతూనే వుంది.

సురేన్ తాతగారు జమీందారు. ఆయన మరణించడంతో సురేన్ జమీకి ప్రభువైనాడు. తల్లిదండ్రులు అతనికి బలవంతంగా పెళ్ళిచేశారు.

తర్వాత అప్పారావు గారు మరణించారు. ఆయన కుమారుడు శివచంద్రుని (రమణమూర్తి)కి వివాహమయింది. ఇంటి బాధ్యత వదినకు అప్పగించి మాధవి అత్తవారింటికి వెళ్ళిపోయింది. ఆమె భూమికి కౌలుదారుగా ఉన్న పుల్లయ్య (వంగర), జమీందారీ మేనేజరు (లింగమూర్తి) కలిసి కుట్ర చేసి ఆమె భూమిని కాజేసి ఇంటిని కూడా వేలానికి తెచ్చారు. ఇదంతా సురేన్ పేరిట జరిగింది. మాధవి సురేన్ ను కలుసుకోకుండా చేశాడు మేనేజరు. నిస్సహాయురాలై ఆమె వెళ్ళిపోయింది. తర్వాత ఇది తెలిసి సురేన్ మాధవి కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు. అతనికి ఎన్నాళ్ళ నుంచో ఉన్న గుండె జబ్బు తిరగబెట్టింది - చివరికి ఆమె ఒడిలో ప్రాణాలు వదిలాడు. ఆమె జీవితం కూడా ఆ క్షణంలోనే అంతమయింది.

మొదటి నుంచి చివరి వరకు ఇంత విషాదంతో నడిచే ఈ కథను ఎంచుకోవడంలో నిర్మాతగా రామకృష్ణ చూపిన సాహసాన్ని ఎంతైనా అభినందించాలి.

చెప్పుకోడానికి కథ ఇంత పొడుగువున్నా ఇందులో ప్రాధాన్యం కథకు కాదు- రెండు మనస్తత్వాల చిత్రణకు. ఆ చిత్రణకు ఆలంబనంగానే మిగతా ఉపపాత్రలు, సన్నివేశాలు.

సురేన్ పాత్ర

సురేన్ అమాయకుడు, పరధ్యానం మనిషి. జోడు పెట్టుకుని కూడా ఎప్పుడూ దేన్నో తడుముకొంటుంటాడు. నీరసంగా, దిగులుగా ఉంటాడు. అతనికి అపకారచింత లేదు. ఉపకార చింత కూడా లేదు. అసలు ఏ చింతాలేదు. స్వార్థం లేదు. పరార్థం లేదు. అతను ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నట్లు ఉంటాడు. దేన్ని గురించో మనకు తెలీదు. అతనికీ తెలీదు. సృష్టించిన శరత్ బాబుకైనా తెలుసోలేదో. ఎందుకంటే అతనికి ఆర్థిక సమస్యలేదు. అతన్నెవరూ కొట్టలేదు, తిట్టలేదు. బంధువులంతా అతన్ని ప్రేమించినవారే. పైగా గారాబంగా పెరిగాడు. పరీక్ష ఎన్నడూ తప్పినవాడు కాదు. ఏ అమ్మాయినీ ప్రేమించలేదు. ఆరోగ్యం సమస్య లేదు. కవి, గాయకుడు, భావుకుడు, సౌందర్యోపాసకుడు కాడు. భగవధ్యానమా అంటే అదీకాదు. ఆశలు, ఆశయాలు లేవు. ప్రపంచాన్ని గురించి, రాజకీయాలను గురించి ఆలోచించడు. ప్రపంచంలో అతనికి తెలిసింది ఒక్కటే ఉంది-లెక్కలు చేయడం. 24 గంటలూ లెక్కలను గురించే ఆలోచిస్తున్నట్టూ ఉండడు. కాబట్టి అతను ఆలోచించే దేమిటో మనకు తెలీదు. అతను ఎవ్వరికీ అర్థం కాడు. బహుశా అతను అనుభవించేది జీవుని వేదనేమో. చిత్రం ద్వితీయార్ధంలో అతను మాధవీ ధ్యానంలో నిమగ్నుడౌతాడు కనుక అతని దిగులు మనకు సమంజసంగానే ఉంటుంది. ఈ పాత్ర చిత్రీకరణలో-ముఖ్యంగా పూర్వార్థంలో-ఇతరులకు అతను ఏవిధంగా కనిపిస్తున్నాడో చిత్రీకరించారు గానీ, తనలో తాను అతను ఏవిధంగా ఉన్నదీ చిత్రించలేదు. అందుచేత ప్రేక్షకుడు-కథలోని మిగతా పాత్రలవలె-అతనిని మూడవ వ్యక్తిగా చూడగలడే కాని, తానై అతనితో ఏకీభవించి ఆ మనస్తత్వాన్ని అవగాహన చేసుకోలేడు.

మాధవి పాత్ర

మాధవి పాత్ర విషయంలో అలాగాక ప్రేక్షకుడు స్వయంగా ఆమె పాత్రతో ఏకీభవించగలడు. కథలోని ఇతర పాత్రలు చూసిన తీరుగాకాక, ఆమెను ఆమెగానే చిత్రీకరించారు. ఆమె పాత్ర చిత్రీకరణ సమగ్రంగా ఉంది. ఆమె కరుణామయి. ఉపకార చింతన తప్ప మరో భావం ఆమెకు లేదు. ఆమె అతన్ని అభిమానించింది. అతన్ని చూడకుండానే అన్నీ అడిగి తెలుసుకుని అతని స్వభావాన్ని అర్థం చేసుకుంది. అతనికి అన్ని సౌకర్యాలు చేయించింది. తను ఊరి నుంచి రాగానే అతను ఆనందం పట్టలేక చెల్లెలిని తీసుకుని తనగదికి వచ్చి తన ఇబ్బందులు చెప్పుకుంటే ఆమె హృదయం ఎంతో సంబరపడింది. కాని అంతలో సంప్రదాయం, కట్టుబాట్లు, తన స్థితి జ్ఞాపకం వచ్చి గాభరాపడి తన గది నుంచి వెళ్ళిపొమ్మని కఠినంగా చెప్పింది. తర్వాత నౌకర్లలో గుసగుసలు ప్రారంభంకావడంతో ఆమె మనస్సు క్షోభపడుతుంది. 'మనస్సులో స్థానం ఇచ్చావు గనుక, జీవితంలో కూడా స్థానం ఇవ్వాలని స్నేహితురాలు చెబితే కంగారు పడింది; తల్లడిల్లింది. తను అతనిని ఆదరించనూ లేదు, తరిమివేయనూ లేదు. అతనిని అభిమానిస్తున్నాని తాను ఒప్పుకోవడానికి కూడా ఆమె భయపడింది. శీలం జ్ఞాపకం వచ్చింది. శీలం అంటే ఆమెకు ఖచ్చితమైన అభిప్రాయం ఉన్నట్టు తోచదు. మనస్సులో స్థానం ఇచ్చినా ఫరవాలేదుకాని, శరీరాన్ని కాపాడుకోవడమే శీలమని ఆమె అభిప్రాయం. ఆత్మవంచన చేసుకుంది- అంతకన్న ఏమీ చేయలేదుకనుక. ఆ పరిస్థితులలో సగటు సంస్కారం గల ఏభారతీయ స్త్రీ అయినా అలాగే ప్రవర్తిస్తుంది. అందుకే ఆమె పాత్ర సృష్టి సహజంగానే ఉంది.

Bhanumathi Picture
భానుమతి

మొత్తం మీద చిత్రం పూర్వార్థంలో కంటే ఉత్తరార్థంలో మెరుగ్గా ఉంది. ముఖ్యంగా పతాక సన్నివేశాలు మరీ గొప్పగా ఉన్నాయి. మామూలుగా కంట తడిపెట్టడం అలవాటు లేని వారికి కూడా కళ్ళు చెమరుస్తాయి చివరి సన్నివేశాలలో.

శరత్ బాబు, సముద్రాల, రామకృష్ణ కలిసి సృష్టించిన మేరకు నాగేశ్వరరావు సురేన్ పాత్రను అద్భుతంగా, అనన్య సామాన్యంగా పోషించాడు. దేవదాసు, విప్రనారాయణ చిత్రాల తర్వాత తిరిగి ఆయన నటన ఈ చిత్రంలో అంత ప్రమాణాన్ని అందుకుంది. ఈ చిత్రంలో నాగేశ్వరరావు నాగేశ్వరరావుగా కాక సురేన్ గా కనిపిస్తాడు. ఎవరికైనా ఏ కారణం చేతనైనా ఆయన నటన సంతృప్తికరంగా లేకపోతే వారు ఆ లోపాన్ని పాత్రకు ఆపాదించాలి గాని ఆయనకు కాదు. భానుమతి ఈ పాత్రకు న్యాయం చేయలేదని భావించిన వారికి భంగపాటు కలుగుతుంది. ఆ పాత్రను అంతచక్కగా పోషించడం-కనీసం తెలుగులో-మరొక నటికి చేతకాదు. మెజారిటీ తెలుగు నటీమణుల లాగా ఆమె అస్తమానం కన్నీళ్ళు పెట్టదు. నిగ్రహంతో మితంగా నటించింది ఆమె.

ఈ చిత్రంలో ఏడు పాటలున్నాయి. ఇతివృత్తం దృష్ట్యా ఈ పాటలు చిత్రానికి అవసరమైనవి కావు. చిట్టచివరి పాట బొత్తిగా అనవసరమనిపిస్తుంది. పాటల వరసలు మెచ్చుకోదగ్గవిగా లేవు. మూడు పాటలు హాయిగా ఉన్నాయి; కాని ఆ హాయి భానుమతి కంఠస్వరంలో ఉంది- వరసలలో కాదు. నేపథ్య సంగీతం ఈ చిత్రానికి అవసరమైనంత బాగాలేదు. సముద్రాల రచన చక్కగా ఉంది. మరణిస్తూ సురేన్ మాట్లాడిన మాటలు చాలా కాలం జ్ఞాపకం ఉంటాయి. కెమెరా పనితనం పతాక సన్నివేశాలలో (ఔట్ డోర్) చక్కగా ఉంది. స్టూడియో సన్నివేశాలలో సగటుగా ఉన్నది.

మంచి చిత్రాలను నిర్మించాలన్న సాహసం, చిత్త శుద్ధిగల నిర్మాతలు, దర్శకులు తెలుగురంగంలో కనీసం ఇద్దరు ముగ్గురైనా ఇంకా మిగిలివున్నారన్న సంతృప్తి చాలు మనకు. నిర్మాతగా రామకృష్ణ ఆదర్శ ప్రాయుడు.

నండూరి పార్థసారథి
(1961 జూలై 2వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post