Humor Icon

"అన్నట్లు రేపు కాక ఎల్లుండి పండగైతే నువ్వింకా పిండివంటలు కార్యక్రమం మొదలెట్టలేదే? ప్రతి ఏడాదీ ఈ పాటికి హడావుడిగా వుండేదానివి-వారం రోజుల ముందు నుంచీ ప్రారంభించి, ఐదారు రకాల స్వీట్లూ, మూడు నాలుగు రకాల హాట్లూ చేసేదానివి? ఏడెనిమిది ఇళ్ల వాళ్లకి పంచి పెట్టేదానివి?''

''ఆ... పిండివంటలు చేసినట్లే వుంది మీరు తెచ్చిపడేసే సంపాదనకి! ధరలు చూస్తే మండిపోతున్నాయి. ఏదో ఆ షాపువాడు అరువు యిస్తున్నాడు కాబట్టి పస్తులుండకుండా నెట్టుకొస్తున్నాం. ప్రతినెలా పద్దు పుస్తకంలో ధరలు చూస్తుంటే గుండె బేజారెత్తుతోంది. మీరేమో ఆ జీతం రాళ్ళు తీసుకొచ్చి నా మొహాన పారేసి 'నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో' అని నిశ్చితంగా కూర్చుంటారు. ధరల సంగతి చెప్పవచ్చినప్పుడల్లా 'ఆఫీసు పనితోనే ఛస్తుంటే ఆ ఎక్కౌంట్లు నాకు దేనికే చెబుతావు' అని విసుక్కుంటారు. వేరుసెనగనూనె కిలో తొమ్మిది రూపాయలు అమ్ముతోంది. నా బొంద - పిండివంటలేం చెయ్యను ఇంక?''

''నిన్నేమన్నా చెయ్యమన్నానుటే? ఇంకా మొదలెట్టలేదేమిటని అడిగాను అంతే. మిగతా వాళ్ళతో పోల్చిచూసుకుంటే మనం ఇంకా చాలా అదృష్టవంతులం తెలుసా? పిల్లా జెల్లా లేరు. కొత్త బట్టల్లేకపోయినా, పిండి వంటలు లేకపోయినా కూడా పండగ వెళ్ళ మారి పోతుంది. మా ఆఫీసులో పిల్లలు గల వాళ్లంతా ఒకటే గోల ధరలు మండిపోతున్నాయంటూ. పిల్లలు గల వాళ్లకి మరి ఆ ఖర్చులన్నీతప్పవుకదా? ఇంతకీ ఈ సారి పిండివంటల పంపిణీ కార్యక్రమం లేదన్నమాట. శుభం. లేనిపోని దండగ ఖర్చు.''

''దండగ ఖర్చని తేలిగ్గా చెప్పేశారు. దండగఖర్చు అయితే మాత్రం తప్పుతుందా? ఏదో లాంఛనం కోసం కొద్దిలో కొద్ది అయినా చెయ్యక తప్పదు. ఏడెనిమిదేళ్ల నుంచి పంచిపెడుతూ ఇవాళ మానేస్తే ఏం బావుంటుంది? నలుగురిలోనూ వెలితి పడిపోమూ? పక్కవాళ్లు తెచ్చి యిస్తే మళ్లీ మనం తీసుకెళ్లి ఇవ్వకపోతే తల కొట్టేసినట్లుండదుటండీ. పక్క వీధిలో వాళ్లకి ఇవ్వకపోయినా, కనీసం పక్కవాటాల్లో వున్న సుశీలకీ, రాజ్యలక్ష్మికీ అయినా ఇవ్వక పోతే బావుండదు. ఏదో తెలుగువాళ్లం. ఈ బెంగుళూరులో మూడు తెలుగు కుటుంబాలు ఒక్క ఇంట్లో ఉండడమే అపురూపం. మనలో మనమైనా ఇచ్చి పుచ్చుకోకపోతే ఏం బావుంటుంది? ఏమిటో... ఆలోచిస్తున్న కొద్దీ మతిపోతోంది. ఆ పక్క వీధిలో మామీవాళ్లు తెచ్చియిస్తే మళ్లీ వాళ్లకి ఇవ్వకపోతే బావుండదు. ఏం మర్యాదలో ఏమిటో! అసలు ఇటువంటివి పెట్టుకోనే కూడదు. ఒకసారి మొదలు పెడితే తరువాత మానుకోవడం కష్టం.''

''ఈ సమస్య నీకు ఒక్కదానికే కాదు లెద్దూ. పిల్లలు లేని దానివి నువ్వే ఇంత చేటు ముందూ వెనకా ఆలోచిస్తుంటే వాళ్లు మాత్రం ఆలోచించకుండా వుంటారా? బ్రతకడమే కష్టంగా వుంటే ఇంక మర్యాదలు కూడానా? ఈ సంవత్సరం వాళ్లెవ్వరూ తెచ్చి ఇవ్వరు చూడు.'' ''సరేలెద్దురూ మీకేం-అలాగే అంటారు.''

''సరే నీ ఇష్టం. బడ్జెట్ ఎడ్జస్టు చెయ్యాల్సినదానివి నువ్వు''.

''ఇష్.... నెమ్మదిగా మాట్లాడండి. పక్క వాళ్లు వినగలరు. ఇంట్లో పిండివంటలు ప్రారంభిస్తే తడిసి మోపెడవుతుంది. పైగా మరీ అంత కొద్దిగా చెయ్యడం మనకు చేతకానూ కాదు. అందుకే ఏం చేద్దామా అని రాత్రంతా ఆలోచించాను. నిన్న రస్సెల్ మార్కెట్ వేపు వెళ్లినప్పుడు కనుక్కున్నాను. అప్సరా స్వీట్ హోం వుంది చూడండి. అందులో స్వీటు కిలో పది రూపాయలుట. విడిగా కొంటే ఒక్కొక్క ముక్క పావలా. రకానికి ఒక ముక్క చొప్పున ఐదు ముక్కలు తీసుకురండి. బూందీ, కారప్పూసా చెరో పావలా పెట్టి తీసుకురండి. సుశీలకీ, రాజ్యలక్ష్మికీ మాత్రం ఇస్తాను. అంతా కలిపి రెండు రూపాయలలోపున తెమిలిపోతుంది''.

''అదేమిటి, రకానికి ఒక్కటితెస్తే ఏం సరిపోతుంది? మూడేసి తేవద్దూ? మనకీ, వాళ్లిద్దరికీ కావద్దూ?''.

''ఇష్... బిగ్గరగా మాట్లాడవద్దన్నానా? మనకి అంత ఖరీదైనవి దేనికిలెద్దురూ. ఏదో శాస్త్రానికి కాస్త పాయసం చేసి పడేస్తాను''

''అయితే మట్టుకు రెండేసి తీసుకురావద్దూ?''

''ఆ వివరాలన్నీ మీకు దేనికి? నేనేదో చేస్తానుగా. నేను చెప్పినట్టు సాయంత్రం ఆఫీసునుంచి వచ్చేటప్పుడు అలా వెళ్లి అవి పట్టుకురండి''.

''నీది యమబుర్ర. మొత్తానికి ఏదో పెద్దప్లానే వేశావు. అవునుగానీ... మన పక్కవాటాల్లోంచి కూడా పిండివంటల వాసన రావడం లేదే? వాళ్లు కూడా నీలాగే పొదుపు పథకాలు వేస్తున్నారేమిటి?''

''ఎవరి తిప్పలు వాళ్లు పడతారు. మనకి దేనికి? మీకెప్పుడూ బుద్ది పక్క ఇళ్లల్లోంచి వచ్చే వాసనలమీదే వుంటుంది''.

గోడలకి చెవులుంటాయనే అనుమానంతో వరలక్ష్మీ వెంకట్రావులు ఎంత నెమ్మదిగా మాట్లాడుకున్నప్పటికీ, వాళ్ల సంభాషణలో కీలకమైన భాగం అప్పటికే పక్కవాటాలోని సుశీల చెవిని పడింది - పడక తప్పదు. ఎందుకంటే వరలక్ష్మి వంటింటికీ, సుశీల వంటింటికీ మధ్య ప్లైవుడ్ పార్టిషన్ మాత్రమే అడ్డం వుంది. అదీగాక సుశీలవి అసలే పాము చెవులు. ఆ చెవుల్లో ఒకదాన్ని ఎప్పుడూ ప్లైవుడ్ పార్టిషన్ కి అంటించి వుంచుతుంది. అది ఆమెకి చాలా అవసరం. అందులో దుర్పుద్ది, కుట్ర ఏమీలేదు. ఎందుకంటే సుశీల ఎప్పుడూ ఇటు పక్కనున్న వరలక్ష్మి తోనూ, అటు పక్కనున్న రాజ్యలక్ష్మితోనూ వంతులు వేసుకుంటూ వుంటుంది. వంతులు వేసుకోక తప్పదు. ఎందుకంటే వాళ్లిద్దరూ కూడా తనతో అలాగే వంతులు వేసుకుంటారు. ముగ్గురూ కొంచెం ఇంచుమించు ఒకే వయస్సువాళ్లు. ముగ్గురూ తెలుగువాళ్లు. ముగ్గురి ఆర్థిక స్తోమతు దాదాపు ఒకటే. సుశీలకి, రాజ్యలక్ష్మికి మాత్రం చెరో చంటిపిల్లాడూ వున్నారు. అందుకని ముగ్గురూ ఒకరితో ఒకరు వంతులు వేసుకుంటారు. స్టైల్సులోగానీ, మర్యాదల్లోగానీ, ఇంట్లో వస్తు సామగ్రి విషయంలోగానీ, సినిమాలు చూడడంలోగానీ మిగిలిన ఇద్దరిలో ఎవరైనా తనని మించిపోతున్నారేమోనని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా కనిపెడుతూ వుంటారు. అవతలి వాళ్ల ముందు మనం తేలిపోకూడదనేదే వాళ్ల తాపత్రయం. పండక్కి ఒక అమ్మాయి కొత్త చీర కొనుక్కుంటే, మిగిలిన ఇద్దరూ కూడా అప్పుచేసి అయినా కొత్త చీరలు కొనుక్కోవలసిందే. పిండి వంటల విషయంలో కూడా అంతే. పక్కవాళ్లిద్దరూ ఏమీ చెయ్యకపోతే మనమూ ఏమీ చేయనక్కర్లేదు. వాళ్లు చేస్తే మాత్రం మనం చెయ్యక తప్పదు-అది వాళ్ల పాలసీ.

''ఏం పిండివంట చేస్తున్నావు వర్లక్ష్మీ'' అని పార్టిషన్ అవతల నుంచి అడుగుతుంది సుశీల.

''ఏమిటో... వంట్లో ఓపికలేదు సుశీలా... ఏదో శాస్త్రానికి కాస్త పాయసం, వడలు చేసి పడేశాను'' అంటుంది వరలక్ష్మి.

''నేనూ ఆట్టే ఏమీ చెయ్యదలచుకోలేదు వర్లక్ష్మి. బొబ్బట్లూ, పులిహోర చేశాను'' అంటుంది సుశీల. నిజానికి అప్పటికి బొబ్బట్లు మాత్రమే చేసివుంటుంది ఆమె. వరలక్ష్మి రెండు చేసింది కనుక, తనూ రెండు చేసినట్లు చెబుతుంది. చెప్పిన తర్వాత పులిహోర చేయటం మొదలు పెడుతుంది. రాజ్యలక్ష్మి అప్పటికి అసలు పిండివంటలే చేసి వుండదు. వీళ్లిద్దరినీ సంప్రదించి, వీళ్లు ఏమి చేశారో కనుక్కొని, అప్పుడు మొదలుపెడుతుంది. ''ఏమిటో... పిల్లాడితో తెమల్లేదర్రా. నెమ్మదిగా మొదలుపెట్టి చెయ్యాలి'' అనేది. వీళ్లు ఒక్కొక్కటే చేస్తే తనూ ఒక్కటే చేస్తుంది. వీళ్లు రెండేసి చేస్తే తనూ రెండు చేస్తుంది. తర్వాత భోజనాల వేళ ఒకరి పిండివంటలు ఒకళ్లకి ఇచ్చిపుచ్చుకుంటారు రుచి చూడమని. మూడు కుటుంబాల వాళ్లు మూడు రెళ్లు ఆరు పిండివంటలతో భోజనం చేస్తారు. దీపావళికి మాత్రం వారం రోజులు ముందుగా మొదలుపెట్టి ఐదారు స్వీట్లూ, రెండు మూడు హాట్లూ చేసి, పండగరోజు ఐదారు కుటుంబాలకి పంచిపెట్టుకునేవారు.

ఈ సంవత్సరం ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ముగ్గురు ఇల్లాళ్ళకూ ఏం చెయ్యడానికి పాలుపోవడంలేదు. పిండి వంటలు ఎవరు ముందు మొదలు పెడతారా అని ఒకళ్లతో ఒకళ్లు వంతు వేసుకుని ఎవరూ చెయ్యలేదు. పక్క ఇంట్లోంచి పిండి వంటల వాసన వచ్చినప్పుడు చూద్దాంలే అని ఎవరికి వారే మెదలకుండా వూరుకున్నారు. కాని, ఇలా వంతులు వేసుకుని మానేసినట్లు తనను గురించి మిగిలిన ఇద్దరూ ఏమనుకుంటారోనని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. తను చెయ్యడం లేదు కనుక, మిగిలిన ఇద్దరూ కూడా చెయ్యకపోతే గొడవ లేదు. కాని, వాళ్లు చెయ్యడం లేదుకదా అని తను ఆదమరచి వుంటే, రహస్యంగా బజారు నుంచి తెప్పించి, పండగనాటి పొద్దున తీసుకొచ్చియిస్తే తనకి తల కొట్టేసినట్లుంటుంది. పోనీ తనూ రహస్యంగా బజారు నుంచి తెప్పించి, వాళ్లని పూల్సు చెయ్యచ్చు. కాని, తనకే డబ్బులు వదులుతాయి. వాళ్లిద్దరూ చక్కగా పైసా ఖర్చు లేకుండా తను ఇచ్చినవి తిని కూర్చుంటారు. తాము ఇవ్వలేకపోయినందుకు ఏదో తెలివిగా కల్పించి, సంజాయిషీ చెప్పుకుంటారు. అప్పుడు తనే ఫూల్ కావాలి. ఇలా ఎవరికి వారే మిగిలిన ఇద్దరినీ అనుమానిస్తూ వుండడంతో అణ్వస్త్ర రాజ్యాలమధ్య పరస్పర అవిశ్వాసం వల్ల, భయం వల్ల ఏర్పడే ఉద్రిక్త పరిస్థితి వీళ్ళ మధ్య ఏర్పడింది. ఈ ప్రతిష్టంభన తొలగిపోతే బావుండునని ముగ్గురూ అనుకుంటున్నారు కాని, ఎవరు చొరవ తీసుకోవాలో తెలియక, తెగించలేక మెదలకుండా వూరుకున్నారు.

చివరికి నిన్న వరలక్ష్మి సాహసించి చొరవతీసుకుంది -ఈ ప్రతిష్టంభనను తొలగించి, పరస్పర విశ్వాస పూరితమైన ప్రశాంత వారావరణాన్ని నెలకొల్పడానికి.

''ఏమిటోనర్రా... పండగొస్తోందన్న హుషారేలేదు. ఏం వుంటుంది - ధరలు ఇలా మండిపోతోంటే? మనలాంటి మధ్య తరగతి వాళ్లని బతకనిచ్చేట్లున్నారా ఈ దుకాణాల వాళ్లు. దోచేస్తున్నారు నిలువునా? వేరుసెనగ నూనె కిలో తొమ్మిది రూపాయలు అమ్ముతుంటే ఏం కొంటాం, ఏం తింటాం? నూనె ధరకి దడిసి వేపుడు కూరలు ఎప్పుడో మానేశాం. ఇప్పుడు కూర పోపులో వెయ్యడానికి క్కూడా చెయ్యి రావడంలేదు. ఆ అరవ మామీల్లాగా ఏదో ఇంత సాంబారు, రసం పోసుకుని తినాలనిపిస్తోంది? వాటికైతే అన్నంలోకి నెయ్యిలేకపోయినా ఫరవాలేదు.''

సుశీలకి కాస్త ధైర్యం వచ్చింది. వరలక్ష్మి కూడా తన స్థాయిలోనే వుందని తెలుసుకుని సంతృప్తి చెందింది.

''అయ్యో రాత! ఇంకా నెయ్యి సంగతి చెబుతున్నావా వర్లక్ష్మి. నెయ్యి వేసుకోవడం ఎప్పుడో మానేశాను, మా ఆయనకి మాత్రం ఏదో కాస్త అభికరించినట్లుగా నేతిగరిటె విదుపుతున్నాను. ఏం చేస్తాం, కిలో 22 రూపాయలు అమ్ముతుంటే? ఒకప్పుడు నెయ్యి లేకుండా ముద్ద దిగేది కాదు. ఇప్పుడు నెయ్యి వేసుకుంటే దాని ధర జ్ఞాపకం వచ్చి ముద్ద దిగదు. ఆ స్థితికి వచ్చింది చివరికి బతుకు''.

వరలక్ష్మినీ, సుశీలనీ చూసి ధైర్యం తెచ్చుకుని, ఇక రాజ్యలక్ష్మి విజృంభించింది.

''అవునర్రా... ఈ ధరలు తగ్గి, మళ్లీ ఇది వరకటిలాగా తృప్తిగా ఎప్పుడు భోంచెయ్యగల్గుతామో గానీ... నానా అవస్థగానూ వుంది. మా ఆయనకి పొద్దునపూట ఏదో ఒక టిఫిన్ చెయ్యకుండా వుండేదాన్నికాదు. ఇప్పుడు ఏ టిఫిన్ చెయ్యాలనుకున్నా ధైర్యం చాలడం లేదు. మినపట్లు పోద్దామంటే మినప్పప్పు కిలో మూడుంబావలా. పెసలు వట్టి చౌకబారుగా చూసేవాళ్లం ఇది వరకు. ఇప్పుడు వాటి ధర అన్నింటినీ మించిపోయింది. ముష్టి బొంబాయి రవ్వ కిలో రెండు రూపాయలు దాటితే! అందుకే పెసరట్లకి, ఉప్మాకీ కూడా మొహం వాచిపోయినట్లుంది. అందుకే ఎప్పుడైనా ఇడ్లీలు మాత్రం వేస్తున్నాను. వాటికైనా ఎంతపని? రేషన్ బియ్యం తీసుకొచ్చి, పాలిష్ పట్టించి, చెరిగి, ఏరి, జల్లించి, రవ్వపట్టించి చెయ్యాలి''.

ఇలా కాసేపు ధరల సంగతి చర్చించారు. కాని, అసలు సంగతి-దీపావళి పిండివంటల సంగతి-మాత్రం ఎవరూ ఎత్తలేదు. దానికి మళ్లీ ఎవరు చొరవ తీసుకోవాలా అని చూస్తున్నారు. దానికీ మళ్లీ వరలక్ష్మీ తెగించింది. ''....అందుకే ఈ సారి పండగ పిండి వంటలంటూ ఏమీ పెట్టుకోలేదు ఇంతవరకు''.

ఆ మాటలు విని సుశీలకి చాలా సంబరం కలిగింది. కాని, 'ఇంతవరకు' అనే మాట మాత్రం బొత్తిగా రుచించలేదు. హల్వాలో పలుగురాయి వచ్చినట్లు అనిపించింది. ఇంత వరకు ఏమీ పెట్టుకోలేదంటే రేపో ఎల్లుండో మొదలుపెడుతుంది కాబోలు. ఆమె చేస్తే తనూ చెయ్యక తప్పదు. 'ఇంతవరకు' అనే మాటతో వరలక్ష్మి మిగిలిన ఇద్దరినీ సస్పెన్సులో బిగించింది. నిజంగా పిండి వంటలు ప్రారంభించుదామనే 'దుర్బుద్ధి'తో ఆమె అలా అనలేదు. మిగిలిన ఇద్దరినీ ఉడికించుదామనే ఉద్దేశం కూడా లేదు. ఒక వేళ వాళ్లిద్దరూ ధరలు ఎంత మండిపోతున్నా సంప్రదాయం కోసం చెయ్యాలనుకొంటున్నారేమో, తను ఇప్పుడే తెగేసినట్లు ఏమీ చెయ్యడం లేదని చెప్పేస్తే వెలితి పడినట్లవుతుందేమోనని, తర్వాత కావాలంటే ఎలాగైనా సర్దుబాటు చేసుకోవడానికి వీలుగా ఆ మాట పడేసింది.

పిండి వంటలు చేసే ఉద్దేశం ఏకోశానో వరలక్ష్మికి వుంటే ఆ వుద్దేశాన్ని ఎలాగైనా విరమింప జేయాలనుకుంది సుశీల.

''ఈ కరువు కాలంలో బతకడమే కష్టంగా వుంటే ఇంకా పిండివంటలేమిటి వర్లక్ష్మి... ఇహ ఆ గత వైభవాన్ని తలుచుకోవడం మానేస్తే మంచిది'' అంది.

''అవును సుశీలా... అసలు మొదలుపెట్టకుండానే వుండాలిగానీ, మొదలు పెడితే అంతా తడిసి మోపెడవుతుంది. మరీ అంత సుతారంగా కొద్దికొద్దిగా మనం చెయ్యలేము. అసలు దీపావళికి పిండి వంటలు పంచిపెట్టుకునే ఆచారం మన తెలుగు వాళ్లకి లేనేలేదు. పక్కవీధిలో అరవ మామీలని చూసి మనం మొదలుపెట్టాం, పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు'' అంది వరలక్ష్మి.

''అవును వరలక్ష్మి... మనం లేనిపోని ఎచ్చులకి పోయి మొదలెట్టాం. తీరా మొదలెట్టిన తర్వాత ఠక్కున ఒక్కసారి మానేస్తే వెలితి పడిపోతామేమోనని మనసు పీకుతూవుంటుంది'' అంగి రాజ్యలక్ష్మి.

అంతలో వరలక్ష్మి భర్త, రాజ్యలక్ష్మి భర్త ఇళ్లకు చేరడంతో సమావేశానికి అంతరాయం ఏర్పడింది. ముగ్గురూ ఎవరి ఇళ్లకు వాళ్లు చేరారు. సుశీలకి మాత్రం వరలక్ష్మి, రాజ్యలక్ష్మిల వరస ఎంత మాత్రం నచ్చలేదు. 'ఈ సంవత్సరం పిండి వంటల పంపిణీ ప్రసక్తిలేదు' అని వాళ్లిద్దరూ ఖచ్చితంగా తెగేసినట్లు చెప్పలేదు. ఇద్దరూ ఏదో చేసేటట్టే వున్నారు. సమావేశం ఇంకా కొంతసేపు సాగివుంటే వాళ్లిద్దరి చేత ఆ మాట కక్కించి వుండేది తను. అప్పుడు తనకి ప్రశాంతంగా నిద్రపట్టేది. ఇప్పుడు వాళ్లిద్దరూ ఏం అఘాయిత్యం చేస్తారోనని భయంగా వుంది. అయితే రాజ్యలక్ష్మి విషయంలో అంతగా భయం లేదు. ఆమె ఎప్పుడూ చివరి దాకా ఆగి, మిగిలిన ఇద్దరూ ఏం చేస్తే తనూ అది చేస్తూంది. అందుకని వరలక్ష్మిని మాత్రం జాగ్రత్తగా కనిపెట్టి వుండాలి. ఆ ఉద్దేశంతోనే ఒక చెవిని పార్టిషన్ ప్లైవుడ్ కి అంటించి వుంచింది.

ఇవాళ వరలక్ష్మి వెంకట్రావుల వంటింటి సంభాషణ విన్న తర్వాత తన అనుమానమే నిజమయిందనుకుంది సుశీల. అయితే వరలక్ష్మి రకానికో స్వీటు చొప్పున ఒక్క ప్లేటుకి సరిపోయేవే తెప్పించి ఇద్దరికీ ఎలా పంచి పెడుతుందా అని సందేహం వచ్చింది. ఇందులో ఏదో గొప్ప కుట్ర వుందనుకుంది. వరలక్ష్మి భర్తకు కూడా చెప్పలేదంటే అది ఎంత పెద్ద కుట్ర అయివుండాలి? దానిని ఎలాగైనా ఛేదించాలని అనుకుంది. ఆ రోజు పగలంతా తపస్సు చేసినంత తీవ్రంగా, ఏకాగ్రచిత్తంతో ఆలోచించింది. చివరికి ఆ రహస్యాన్ని కనిపెట్టేసింది. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు భక్తునికి కలిగినంత సంతోషం కలిగింది. ఇంత గొప్ప ఉపాయాన్ని కనిపెట్టిన వరలక్ష్మి ప్రతిభకు మనస్సులోనే జోహారు లర్పించింది. అంత గొప్ప రహస్యాన్ని పరిశోధించ గలిగినందుకు తన ప్రతిభను కూడా తను మెచ్చుకుంది.

సాయంత్రం భర్త ఆఫీసునుంచి తిరిగి వచ్చి పడక గదిలో విశ్రాంతి తీసుకుంటూ వుండగా స్వీట్లు తీసుకురావాలి డబ్బులిమ్మని అడిగింది సుశీల.

''అదేమిటి ఈ సారి ఇంట్లో చెయ్యడం లేదా''? అని అడిగాడు అతను.

''లేదండీ... ఇంట్లో పిండివంటలు మొదలుపెడితే చాలా అయిపోతుంది. ఇది వరకులాగా ఈ సారి అంతమందికి పంచిపెట్టాలనుకోవడం లేదు. కరువు కాలంలో ధరలు మండిపోతుంటే ఆ సంప్రదాయాలన్నీ పెట్టుకుంటే బతకడం కష్టం. అందుకని వరలక్ష్మికి, రాజ్యలక్ష్మికి మాత్రం ఇద్దామనుకుంటున్నాను'' అంది సుశీల.

ఈ మాటలు పక్క వాటాలో వున్న రాజ్యలక్ష్మికి వినిపించాలనే వుద్దేశంతోనే అన్నది. సుశీల పడకగదికి, రాజ్యలక్ష్మి వంటింటికీ మధ్య కూడా ప్లైవుడ్ పార్టిషన్ వుంది. అందుకని వీళ్ల మాటలు వాళ్లకి వినిపించాలంటే గట్టిగా మాట్లాడాల్సిన అవసరంలేదు. మామూలుగా మాట్లాడినా వినిపిస్తాయి. సుశీల ఆశించినట్లుగానే ఆమె మాటలు రాజ్యలక్ష్మి చెవినపడ్డాయి. వరలక్ష్మి కనిపెట్టిన, సుశీల పసిగట్టిన ఉపాయం జయప్రదం కావాలంటే ఆ మాటలు రాజ్యలక్ష్మికి వినిపించడం అవసరం. అయితే తనకు వినిపించాలనే వుద్దేశంతోనే సుశీల మాట్లాడిందని రాజ్యలక్ష్మికి అనుమానం రాకూడదు. నిజంగానే అటువంటి అనుమానం రాజ్యలక్ష్మికి రాలేదు. తన చెవులకు పదును ఎక్కువ కనుక ఆ మాటలు వినిపించాయనుకుంది. 'వరలక్ష్మి స్వీట్లు తెప్పిస్తోందన్నమాట. లేక పోతే సుశీల ఎందుకు తెప్పిస్తుంది? వాళ్లిద్దరూ తెప్పిస్తున్నారు కనుక రేపు నేనూ తీసుకురావాలి' అనుకుంది మనస్సులో.

''అయితే ఎంత ఇమ్మటావు''? అని అడిగాడు సుశీల భర్త.

''ఓ రెండు రూపాయలివ్వండి'' అంది సుశీల.

''అదేమిటి? వాళ్ళిద్దరికీ మనకీ తీసుకురావడానికి రెండు రూపాయలు ఏం చాలుతుంది?''

''స్వీట్లు ధరలు మండిపోతున్నాయి. అంత ఖరీదైనవి మనకి దేనికిలెండి. ఏదో శాస్త్రానికి ఏ చక్రపొంగలో చేసిపడేస్తాను. పక్కవాళ్లిద్దరికీ మాత్రం స్వీట్లు పంచిపెడతాను. రకానికి ఒకటి చొప్పున ఐదు స్వీట్లు, రెండు కారపు సరుకులు తెచ్చిసరిపెడతాను''. ఈ మాటలు రాజ్యలక్ష్మికి వినిపించకూడదనే వుద్దేశంతో చాలా నెమ్మదిగా చెప్పింది సుశీల. తను తపస్సు చేసి సాధించిన ఆ రహస్యం రాజ్యలక్ష్మి చెవినపడడం ఆమెకు ఇష్టం లేకపోయింది.

నిజంగానే ఆ మాటలు రాజ్యలక్ష్మికి వినిపించలేదు. తనకు వినిపించనంత నెమ్మదిగా సుశీల చెప్పిందంటే అందులో ఏదో కుట్ర వుందని అనుమానించింది రాజ్యలక్ష్మి. కుంపటి మీదపప్పు మాడిపోతున్నా లక్ష్యపెట్టకుండా, పార్టిషన్ కి మరింత దగ్గరగా జరిగి వినడానికి ప్రయత్నించింది.

భార్య ఆంతర్యాన్ని గ్రహించలేకపోయిన భర్త నెమ్మదిగా మాట్లాడాలని తెలియక ''అదేమిటీ-ఒక్కొక్కస్వీటు తెచ్చి ఇద్దరికి ఎలా పంచిపెడతావ్?'' అని గట్టిగానే అడిగేశాడు. 'కొంప ముణిగింది' అనుకుంది సుశీల.

''ష్.... నెమ్మదిగా మాట్లాడండి... నేనేదో సర్దుబాటు చేస్తాను. ఆ వివరాలన్నీ మీకు దేనికి?'' అని భర్తని మందలించింది.

సుశీల ఒక్కొక్క స్వీటే తెప్పిస్తోందని రాజ్యలక్ష్మి అర్థం చేసుకుంది. అయితే దాని అంతరార్ధం ఏమిటో తెలియలేదు. ఇందులో ఏదో గొప్ప ఐడియా ఉందని ఆ ఐడియాని వరలక్ష్మి దగ్గర్నుంచి సుశీల తస్కరించి వుంటుందని గ్రహించింది రాజ్యలక్ష్మి. ఆ రాత్రి చాలాసేపు దాన్ని గురించే రిసెర్చి చేసింది. వరలక్ష్మికి వున్నంత ఒరిజినాల్టీ లేకపోయినా సుశీలకున్నపాటి రహస్య గ్రహణశక్తి రాజ్యలక్ష్మికి లేకపోలేదు. ఆ రహస్యాన్ని ఆమె కూడా కనిపెట్టేసింది.

ఆ మర్నాడు భర్త ఆఫీసుకు వెళ్లిన తర్వాత, వంటయిన తర్వాత సుశీల మర్కెట్ కి బయలుదేరింది. ఆమె వెళ్లిన 15 నిమిషాలకి రాజ్యలక్ష్మి బయలుదేరింది. సుశీల కూరలు, స్వీట్లు కొనుక్కుని వస్తూవుండగా మార్కెట్ బయటే రాజ్యలక్ష్మి కనిపించింది.

''కూరలు కొనడం అయిందా?'' అని ప్రశ్నించింది రాజ్యలక్ష్మి.

''ఆ.... ఏదో అయిందనిపించా. ధరలు మండిపోతున్నాయి కొనేటట్లుగా వున్నాయా? ఏదో శాస్త్రానికి పావుకిలో చొప్పున తీసుకున్నాను. పండగనాడు కూర లేకుండా తినలేంకదా? వంకాయలు కిలో రూపాయిన్నర'' అంటూ ధరలు ఏకరవు పెట్టింది సుశీల.

''నువ్వు బయల్దేరడం చూశాను. నీతోనే వద్దామనుకున్నాను కానీ, అప్పటికి నేనింకా తెమల్లేదు. నాకోసం నిన్ను నిలబెట్టడం దేనికని వూరుకున్నాను. నీకు మళ్లీ ఇంటి దగ్గర పనుందేమో పాపం వెళ్లు'' అంది రాజ్యలక్ష్మి.

''మరే రాజ్యలక్ష్మీ వెడతాను చాలా పనుంది'' అని వెళ్లింది సుశీల.

కొంతసేపు కూరల బేరంచేసి, కావలసినవి కొనుక్కుని, మిఠాయి దుకాణం వున్న సందులోకి వచ్చింది రాజ్యలక్ష్మి. ఎందుకో అనుమానం వచ్చి చూసేసరికి, సందు చివర పళ్ల దుకాళంలో పళ్ల బేరం చేస్తున్నట్లు నటిస్తూ తనని గమనిస్తున్న సుశీల కనిపించింది. తను ఆమెను చూడనట్లే నటిస్తూ మిఠాయి దుకాణం దగ్గరకు వెళ్లి బేరం ఆడింది. తనను చూడగానే సుశీల పళ్ల బేరం ముగించి అక్కణ్నించి వెళ్లిపోయింది. ఆమె వెళ్లిన తర్వాత స్వీట్లు కొనకుండానే రాజ్యలక్ష్మి బయలుదేరింది.

''పండగకదా అరిటిపళ్లన్నా లేకపోతే బావుండదని కొనబోతే డజను రూపాయిన్నరకి తక్కువ ఇవ్వనన్నాడు రాజ్యలక్ష్మీ'' అన్నది సుశీల ఇంటికి వచ్చిన తర్వాత.

తను గూఢచారం చేస్తున్నట్లు రాజ్యలక్ష్మి అనుమానించ కూడదనే ఉద్దేశంతో సుశీల ఆ మాట అంది. సుశీల ఏ ఉద్దేశ్యంతో అన్నదో రాజ్యలక్ష్మి గ్రహించేసింది.

మర్నాడు దీపావళి పండుగ. ముగ్గురు ఇల్లాళ్లూ తలంట్లు పోసుకొని, పూజలు చేసుకుని, వంటలు పూర్తి చేసుకున్నారు. వరలక్ష్మి ఒక స్టీలు ప్లేటులో ఐదుస్వీట్లు, రెండు హాట్లు సర్ది, దానిపై ఒక ఆకుపచ్చ సిల్కు రుమాలు కప్పి, సుశీల ఇంటికి వెళ్లింది. ''ఈ సారి ఇంట్లో ఏమీ చెయ్యలేదు సుశీలా. ఏదో కొంచెం బజారు నుంచి తెప్పించాను. ఇన్ని సంవత్సరాలుగా సంప్రదాయంగా చేస్తున్నాంకదా, కనీసం తెలుగు వాళ్ళం మనలో మనమైనా పంచిపెట్టుకోక పోతే పండగలా వుండదు అనిపించింది. ఏదో ఉన్నంతలో కాస్త అయినా ఇచ్చిపుచ్చుకోవడాలు లేకపోతే ఇంక ఆప్యాయతలు ఏం వుంటాయి చెప్పు'' అంది.

''అవును వరలక్ష్మీ... ఏదో ఇన్నాళ్లూ ఇరుగు పొరుగు అక్క చెల్లెళ్లలా వుంటున్నామా మరి? ఆంధ్రా విడిచి ఇంత దూరం వచ్చినందుకు ఇక్కడ నాకు నువ్వు, నీకు నేను కాకపోతే ఇంకెవరున్నారు చెప్పు? అందుకే ఆలోచిస్తే నాకూ అనిపించింది మనలో మనమైనా ఇచ్చిపుచ్చుకోకపోతే బావుండదని. నిన్ననే వెళ్లి పట్టుకొచ్చాను స్వీట్లు'' అంది సుశీల.

''వెళ్ళొస్తాను సుశీలా బోలెడు పనుంది. మళ్లీ సాయంత్రం కలుద్దాం'' అని వెళ్లింది వరలక్ష్మి. స్వీట్లు ఇచ్చినందుకు థాంక్సు చెప్పింది సుశీల.

వరలక్ష్మి ఇచ్చిన ప్లేటుపైన రుమాలు కూడా తీసి చూడలేదు సుశీల. ఓపదినిమిషాలు ఆగి, నిన్నతను తెచ్చిన స్వీట్లు ఒక స్టీలు ప్లేటులో సర్ది, పైన వరలక్ష్మి కప్పినమాదిరి ఆకుపచ్చ సిల్కు రుమాలే కప్పి, వరలక్ష్మి ఇంటికి వెళ్లి ఇచ్చింది. వరలక్ష్మి థాంక్సు చెప్పింది. ''మనలోమనకి థాంక్సు ఏమిటి వరలక్ష్మి?'' అంది సుశీల.

తర్వాత ఐదు నిమిషాలు ఆగి సుశీల వరలక్ష్మి తనకు ఇచ్చిన ప్లేటును వున్నపళంగా అలాగే తీసుకెళ్లి రాజ్యలక్ష్మికి ఇచ్చింది. మరి కాసేపటికి వరలక్ష్మి తనకు సుశీల ఇచ్చిన ప్లేటును వున్నపళంగా-దానిపై ఆకుపచ్చ సిల్కు రుమాలుతో సహా-తీసుకెళ్లి రాజ్యలక్ష్మికి ఇచ్చింది.

'పొద్దున్నుంచి పిల్లాడితో తెమల్లేదు వరలక్ష్మీ. నువ్వూ సుశీల తీసుకొచ్చియిచ్చారు. నేను యివ్వడం పడనేలేదు. గడపదాటేందుకు వీల్లేకుండా పనితోనే సరిపోతోంది'' అంది రాజ్యలక్ష్మి.

వరలక్ష్మి అటు వెళ్లగానే ఆమె ఇచ్చిన ప్లేటును తీసుకెళ్లి సుశీలకి ఇచ్చింది రాజ్యలక్ష్మి. ఓ ఐదు నిమిషాలు ఆగి సుశీల ఇచ్చిన ప్లేటును వరలక్ష్మికి ఇచ్చింది సుశీల, వరలక్ష్మి ఆకుపచ్చ సిల్కు రుమాళ్లు చూసి, 'మనతో వంతుగా రాజ్యలక్ష్మి కూడా ఆకుపచ్చ రుమాళ్లే సంపాదించిందే' అనుకున్నారు మనసులో.

భోజనాలసమయంలో వెంకట్రావు ''ఏదీ... మీ ఫ్రెండ్సు పంపిన స్వీట్లు ఇలా పడెయ్యి చూస్తాను'' అన్నాడు.

వరలక్ష్మి ప్లేటు తీసుకొచ్చి పై రుమాలు తీసింది. ''ఇదేంటీ ఇవి నేను తెచ్చినవేనే? ఇవి వాళ్లకివ్వలేదా ఏమిటి?'' అన్నాడు వెంకట్రావు. వాటిని చూస్తూ ఆశ్చర్యంతో కొయ్యబారి పోయింది వరలక్ష్మి. తన ప్లేటు సుశీల నుంచి రాజ్యలక్ష్మి మీదుగా తనకి తిరిగి వచ్చింది. తలకొట్టేసినట్లనిపించింది. అయితే సుశీల ప్లేటు తన నుంచి రాజ్యలక్ష్మి మీదుగా తిరిగి సుశీలకి చేరివుంటుంది. రాజ్యలక్ష్మి తన ప్లేటు సుశీలకీ, సుశీల ప్లేటు తనకీ ఇచ్చిందన్నమాట. అయితే రాజ్యలక్ష్మి అసలు స్వీట్లు కొననేలేదన్నమాట. ''అయ్యబాబోయే! దీని తెలివి తేటలు మండిపోనూ'' అనుకొంది.

సరిగ్గా అదే సమయంలో పక్కవాటాలో సుశీల కూడా తన ప్లేటు చూసుకుని రాజ్యలక్ష్మిని గురించి ''దీని తెలివితేటలు మండిపోనూ'' అనుకుంది. తనూ, వరలక్ష్మీ ఒక్కో ప్లేటు కొని ఇద్దరికీ, పంచిపెడితే రాజ్యలక్ష్మి అసలు ఒక్క ప్లేటు కూడా కొనకుండా ఇద్దరికీ పంచి పెట్టింది.

వరలక్ష్మి ఆశ్చర్యం నుంచి గబుక్కున తెప్పరిల్లుకుని, ''వాళ్లు కూడా మనం కొన్న చోటనే మనం కొన్న స్వీట్లే కొన్నట్లున్నారు లెండి. అనుకోకుండా అందరివీ ఒకటే అయ్యాయి'' అని భర్తకు సర్ది చెప్పింది. స్వీట్లు భర్తకు వడ్డించి, ప్లేటు అవతలకి తీసుకెళ్లి అది నిజంగా తనదవునో కాదో అని చూసింది. దానిమీద తను చెక్కించిన పేరు కూడా కనిపించడంతో నమ్మక తప్పలేదు.

పొరుగువాళ్లు ఎవరైనా స్వీట్లు, పిండి వంటలు తెచ్చియిస్తే సాయంత్రం లోపుగా ప్లేటు కడిగేసి, రుమాలుతోసహా వాపసు ఇచ్చేయటం అలవాటు. ఇప్పుడు ఈ ప్లేటు, రుమాలు తనవే అయినా వుంచుకోవడానికి వీల్లేదు. అలా వుంచుకుంటే ఇసక తక్కెడ, పేడ తక్కెడలాగా ముగ్గురికీ ఒకరి బండారం ఒకరికి బైట పడిపోతుంది! అందుకని వరలక్ష్మి ప్లేటు కడిగి, తుడిచి, దాన్ని రుమాలును రాజ్యలక్ష్మికి తిరిగి ఇచ్చేసింది. సుశీల కూడా ప్లేటు, రుమాలు రాజ్యలక్ష్మికి తిరిగి ఇచ్చింది. తర్వాత రాజ్యలక్ష్మి సుశీల ప్లేటును వరలక్ష్మికి, వరలక్ష్మి ప్లేటును సుశీలకు ఇచ్చేసింది. ఆ తర్వాత వరలక్ష్మి సుశీల ప్లేటును సుశీలకు ఇచ్చేసింది. సుశీల వరలక్ష్మి ప్లేటును వరలక్ష్మికి ఇచ్చేసింది.

మధ్యాహ్నం కాఫీల వేళకి మూడేసి చేతులు మారి ఎవరి ప్లేట్లు వాళ్ళకి చేరాయి. సుశీల, వరలక్ష్మి తాము తెచ్చిన ఒక్కొక్క రకం స్వీట్లు, హాట్లు అన్నీ భర్తలకే పెట్టారు. వీళ్లు తినలేదని భర్తలకేం తెలుసు? తాము తినలేదంటే బండారం బైట పడుతుందని తిన్నామని చెప్పారు సుశీల వరలక్ష్మి.

సాయంత్రం వరండాలో సమావేశమయ్యారు ముగ్గురు ఇల్లాళ్లూ. అసలు మిగతా ఇద్దరితో మాట్లాడడానికి మొహం చెల్లలేదు వరలక్ష్మికి. కాని, రాజ్యలక్ష్మే వచ్చి పరామర్శించడంతో బైటికిరాక తప్పలేదు.

''మీ ఇద్దరి స్వీట్లూ చాలా బావున్నాయర్రా ఎక్కడ తెచ్చారో గానీ''? అంది రాజ్యలక్ష్మి.

వరలక్ష్మికి తల కొట్టేసినట్లయింది. సుశీలకి మాత్రం అలా అనిపించలేదు ''నువ్వు ఇచ్చినవి మాత్రం? ముఖ్యంగా బాదుషా ఎంత బావుందో చెప్పలేను. కదు వర్లక్ష్మి''? అంది. వరలక్ష్మి ''అవునవును చాలా బావుంది. అదేమిటి? అసలు స్వీట్లన్నీ బావున్నాయి. ఈ ఏడాది స్వీట్లు స్పెషలనుకో'' అంది.

''మొత్తం మీద పండగ చాలా సరదాగా గడిచిందర్రా'' అని రాజ్యలక్ష్మి అంటే, మిగిలిన ఇద్దరూ ఆమెతో ఏకీభవించక తప్పలేదు.

''మరీ పెద్ద ఎచ్చులకి పోకుండా ప్రతి ఏడాదీ ఇలాగే ఏదో సింపుల్ గా మనలో మనం పంచి పెట్టుకుంటే బావుండేట్లు వుందర్రా'' అని రాజ్యలక్ష్మి అంటే ''అవును మరే'' అని తలవూపారు సుశీల, వరలక్ష్మి.

నండూరి పార్థసారథి
(ఈ రచన-ఆంధ్రసచిత్ర వారపత్రిక 1974 ఏప్రిల్ 5వ తేదీ సంచికలో ప్రచురితమయింది)

Previous Post Next Post