రవిశంకర్, అల్లారఖా, జాకీర్ హుస్సేన్

రవిశంకర్ హేమంత సంగీత విభావరి

విశ్వవిఖ్యాత సితార్ విద్వాంసుడు రవిశంకర్ షష్ట్యబ్దిపూర్తిని పురస్కరించుకొని ఆయన పట్ల గౌరవ సూచకంగా, ఆయనకు అంకితంగా హైదరాబాద్ లోని 'సుర్ మండల్' సంస్థవారు, వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీవారు సంయుక్తంగా 'మ్యూజిక్ ఈజ్ గోల్డ్' ఫెస్టివల్ అనే పేరుతో నాలుగు రోజుల పాటు ఘనంగా సంగీత నృత్యోత్సవాన్ని నిర్వహించారు. డిసెంబరు 27న కుమారి శోభానాయుడు కూచిపూడి నృత్యంతో ప్రారంభమై, 30వ తేదీన పండిత్ రవిశంకర్ సితార్ కచేరీతో ముగిసిన ఈ ఉత్సవంలో చిట్టిబాబు, పండిత్ భీమ్ సేన్ జోషి, పండిత్ శివకుమార్ శర్మ, పండిత్ హరిప్రసాద్ చౌరసియా, ఉస్తాద్ అల్లారఖా, ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ వంటి పలువురు ప్రముఖ విద్వాంసులు పాల్గొన్నారు. ప్రతి రోజూ సాయంత్రం ఆరు నుంచి రాత్రి ఒంటి గంటన్నర వరకు కచేరీలు జరిగాయి. చివరి రాత్రి రవిశంకర్ కచేరీ పూర్తి అయేసరికి రెండున్నర అయింది. అగ్ర శ్రేణికి చెందిన ఇంతమంది ఉత్తరాది, దక్షిణాది కళాకారులు ఒకే ఉత్సవంలో కచేరీలు చేయడం గొప్ప విశేషం. 'సుర్ మండల్' వారు, వజీర్ సుల్తాన్ కంపెనీ వారు ఈ మాదిరి ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించాలని సంకల్పించారు.

రవి-రఖా కచేరీ

పండిత్ రవిశంకర్, తబ్లా నవాజ్ అల్లారఖాల కచేరి రాత్రి 10-45 గంటలకి ప్రారంభమయింది. హిందూస్థానీ సంగీత సంప్రదాయం ప్రకారం సరిగా ఆ సమయంలో గానం చేయదగిన అతి గంభీర రాగం 'కౌశీకానడ'తో పండిత్ జీ కచేరీ మొదలుపెట్టారు. 'మాల్కౌస్', 'దర్బారీ' - రెండూ సీరియస్ రాగాలే. ఆ రెండింటి ఛాయలతో పడుగూ పేకగా కలనేత నేసిన 'కౌశీకానడ' ఇంకా సీరియస్ గా ఉంటుంది. ఆలాప్, జోడ్, ఝాలా, గత్ లతో మొత్తం గంటన్నర సేపు ఆ రాగాన్ని వాయించారు పండిత్ జీ. ఆలాప్ అరగంట సేపు వాయించారు. దాదాపు మొదటి ఇరవై నిమిషాలసేపు మందకొడిగా నడిచింది. రాగ భావంలో మనస్సును నిమగ్నం చేయడానికి పండిత్ జీ చాలా ప్రయత్నం చేయవలసి వచ్చింది. ఆలాప్ సగం గడిచిన తర్వాత ఆయన క్రమక్రమంగా మూడ్ లోకి వచ్చారు. జోడ్ ప్రారంభమయ్యే సమయానికి రాగ స్వరూపం స్పష్టంగా ఆవిష్కృతమై పండిత్-జీకి ఏకాగ్రత కుదిరింది. జోడ్, ఝాలా గొప్పగా ఉన్నాయి. తర్వాత గత్ లో అల్లారఖా తబ్లా దరువులు ఉప్పెనలా విరుచుకు పడడంతో పండిత్ జీ ఉత్సాహం పుంజుకున్నారు. అక్కడి నుంచి చివరి దాకా కచేరీ ఉత్సాహ భరితంగా, రంజకంగా సాగింది. మామూలుగా వాద్య సంగీత కచేరీలలో తబ్లా పక్క వాద్యంగానే ఉండిపోతుంది. ప్రధాన వాద్యాన్ని విధేయంగా అనుసరించే సహధర్మచారిణిగా వ్యవహిరిస్తుంది. కానీ అల్లారఖా తబ్లా అల్లాకాదు. అది ఇంచుమించుగా సితార్ తో సమాన ఫాయాలో నిలబడుతుంది. అందుకే రవి-రఖాల కచేరీ జుగల్ బందీలాగా కనిపిస్తుంది. పండిత్ జీ ఎప్పుడైనా కాస్త నిర్వేదంలో పడితే అల్లారఖా ఆయన్ని కవ్వించి, రెచ్చగొట్టి మూడ్ లోకి లాక్కువస్తారు. అల్లారఖా తబ్లా వాయిస్తుండగా రవి శంకర్ సితార్ డల్ గా ఉండడానికి వీల్లేదు. వాళ్ళ కచేరి 'దాంపత్యం' అటువంటిది.

'కౌశీకానడ' తర్వాత పండిత్ జీ 'హేమంత్' రాగాన్ని అందుకున్నారు. రవి శంకర్ గురువుగారు స్వర్గీయ ఉస్తాద్ అల్లా ఉద్దీన్ ఖాన్ ఈ రాగాన్ని సృష్టించారు. దీన్ని ప్రచారంలోకి తీసుకువచ్చింది రవిశంకరే. ఇదివరకు వసంతంలో వచ్చి 'వసంత పంచమ్' వినిపించిన రవిశంకర్ ఈసారి హేమంతంలో వచ్చి 'హేమంత్' వినిపించడం చూస్తే ఆయనకి రాగాల ఋతు, కాల నియమాల పట్ల శ్రద్ధ ఎక్కువ అనిపిస్తుంది. ఈ రాగంలో ఆయన విలంబిత్ గత్, ధ్రుత్ గత్, ఝాలా మొత్తం ముప్పావుగంట సేపు వాయించారు. దీని తర్వాత 'భటియార్' రాగంలో ఆలాప్, గత్ ఇరవై నిమిషాలు వాయించారు (ఆయన ఆ రాగం అందుకొనే సమయానికి రాత్రి ఒంటిగంటన్నర అయింది. సంప్రదాయం ప్రకారం ఆ రాగం గానం చేయవలసిన సమయం అది.) 'మార్వా' థాట్ జన్యమైన 'భటియార్' అతి క్లిష్టమైన, చిత్రమైన రాగం. 'మార్వా', 'లలిత్' రాగాల ఛాయలు కనిపించే ఈ రాగం ఉత్తరాంగ ప్రధాన సంపూర్ణ రాగం. సంచారం అతి వక్రంగా ఉంటుంది. 'మార్వా' లాగానే ఇదీ సీరియస్ రాగం. 'సింధుభైరవి' ఠుమ్రీతో పండిత్ జీ కచేరీ ముగించారు. రవిశంకర్ అభిమానులకి ఆ ఠుమ్రీ చిరపరిచితమైనదే. కచేరీ క్లైమాక్స్ లో రవి, రఖా అలవాటు ప్రకారం సవాల్-జవాబ్ తో శ్రోతలకు హుషారెక్కించి పదేపదే హర్షధ్వానాలందు కున్నారు. 'వాహ్' అంటూ పండిత్ జీ 'ఉస్తాద్ జీతో కరచాలనం చేయడంతో శ్రోతలందరూ ముక్తకంఠంతో "వాహ్...వాహ్...క్యామజా ఆయా" అంటూ ప్రతిధ్వనించారు.

కచేరీ మజాగా ఉన్నమాట నిజమే కాని, రవిశంకర్ కచేరీలకి ఆనవాయితీగా హాజరయే పాత కామందులకు మాత్రం ఈ కచేరీలో కొత్తదనం కనిపించలేదు. అంతా ఇది వరకు విన్నట్లే అనిపించింది. పండిత్ జీకి మంచి మూడ్ కల్పించడానికి తగిన వాతావరణం, ఏర్పాట్లు లేకపోవడం కూడా ఇందుకు ఒక కారణం. రవీంద్రభారతిలో గాని, లాల్ బహదూర్ ఇండోర్ స్టేడియంలో గాని ఈ కచేరీలను నిర్వహిస్తే బాగుండేది. అలా కాకుండా లేడీ హైదరీక్లబ్ ఆవరణలో షామియానా వేసి కచేరీలు జరిపించారు. వేదిక సరిగా కనిపించక శ్రోతలు కుర్చీలు జరుపుకోవడం, కొందరు ధూమపానం చేయడం (కచేరీ నిర్వాహకులు సిగరెట్ కంపెనీవారే కదా అనుకుని ఉంటారు), బైటి నుంచి కారు హారన్లు ధాటిగా వినిపించడం, అసలు వేదికే సుఖంగా లేకపోవడం... వీటన్నింటి ప్రభావం కచేరీలన్నింటిపై కనిపించింది.

తండ్రీ కొడుకుల తబ్లా ఖేల

రవిశంకర్ జీ కచేరీకి ముందు ఉస్తాద్ అల్లారఖా, ఆయన కుమారుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ తబ్లా జుగల్ బందీతో అరగంటసేపు శ్రోతల చెవుల తుప్పు వదిలించారు. కాసేపు విడివిడిగా, కాసేపు ఉమ్మడిగా రకరకాల లయ విన్యాసాలతో, చిత్రవిచిత్ర చమత్కారాలతో, ప్రతిభావంతంగా వాయించారు. వారు ఒక విడత వాయించి ఆపగానే శ్రోతలు పెద్దగా హర్షధ్వానాలు చేశారు. ఆనందం పట్టలేక కొందరు ఈలలు కొట్టారు. ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ అన్నివిధాలా తండ్రికి తగ్గ తనయుడుగా ప్రశంసలందుకున్నాడు. పద్ధెనిమిదేళ్ళ పిల్లాడుగా కనిపించే జాకీర్ ఇరవైఎనిమిదేళ్ళ యువకుడు. అతడు ఇప్పటికప్పుడే పదమూడు, పధ్నాలుగేళ్ళుగా కచేరీలు చేస్తున్నాడు. పదిహేడోయేట మొదటిసారి ఒక ఎల్.పి. రికార్డులో (ఇంద్రనీల్ భట్టాచార్య సితార్ కు) తబ్లా పక్క వాద్యం వాయించాడు. ప్రస్తుతం అతను కాలిఫోర్నియాలోని ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ సంగీత పాఠశాలలో తబ్లా అధ్యాపకుడుగా ఉన్నాడు. కచేరీల కోసం ఇండియా వచ్చి వెడుతూ ఉంటాడు. అగ్రశ్రేణి తబ్లా వాదకులతో ఒకడుగా అతనికిప్పుడు దేశంలో బోలెడు గిరాకీ ఉంది.

నండూరి పార్థసారథి
(1980 డిసెంబర్ 31వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది)

Previous Post Next Post