28 సంవత్సరాల క్రితం సైగల్ మరణించినప్పుడు దేశంలో లక్షలాది ప్రజలు ఆత్మబంధువును కోల్పోయినట్లు వెక్కి వెక్కి ఏడ్చారు. ఆ రోజు చాలా మంది అన్నం తినలేదు. సైగల్ తర్వాత మళ్ళీ ఘంటసాల ఏడిపించినట్లుగా జనాన్ని ఏ గాయకుడూ ఏడిపించలేదు. సినిమా సంగీతానికి సంబంధించినంత వరకు సైగల్ తర్వాత ఘంటసాల అంతటి గాయకుడు దేశం మొత్తం మీద మరొకరు లేరు. ఘంటసాల తెలుగు ప్రజలకు ఆత్మబంధువు. ప్రతి తెలుగు వాడికి ఆయన "మన ఘంటసాల". మూడు దశాబ్దాలపాటు ప్రతిరోజూ, ప్రతి పూటా రేడియోలో తన పాటలతో తెలుగు ప్రజలను ఆప్యాయంగా, చనువుగా పలకరించి, పరామర్శించిన ఘంటసాల ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో అకస్మాత్తుగా చెప్పాపెట్టకుండా ఎక్కడి నుంచో అర్జంటు టెలిగ్రామ్ వచ్చినట్లుగా వెళ్ళిపోయారు. ముందుగా చెబితే జనం అసలే భరించలేరని ఆయనకు తెలుసు. అందుకే వెళ్ళవలసిన రోజు దగ్గరపడినట్లు కొన్ని నెలల ముందే తనకు తెలిసినా జనానికి తెలియనివ్వలేదు.

ఆంధ్రప్రదేశంలో ఈ శతాబ్దంలో ఘంటసాలవలె జనాన్ని ఆకట్టుకున్న ప్రజాగాయకుడు మరొకరు లేరు. తన రంగంలో ఆయన అద్వితీయుడు. ప్రజాహృదయంలో అమరుడు. ఇంక కొత్త పాటలు పాడలేకపోయినా, పాతపాటలు ఇప్పటికీ రోజూ వినిపిస్తూనే ఉన్నాడు. తనని ప్రజలకు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. ప్రజల చేత తన పాటలు పాడిస్తూనే ఉన్నాడు. ఇంకా పాతికేళ్ళయినా రేడియోలో ఆయన పాటలు వినిపిస్తూనే ఉంటాయి. సైగల్ పాటల్లాగానే.

గాయకుడుగానూ, సంగీత దర్శకుడుగానూ కూడా ఘంటసాల ఎప్పుడూ ఎవరినీ అనుకరించలేదు. 1944లో ఆయన సినిమా రంగంలో ప్రవేశించేనాటికి ఆయనకు 22 ఏళ్ళు మాత్రమే. ఆ రోజుల్లో నాగయ్య సినిమా పాటలు, రాజేశ్వరరావు ప్రైవేట్ రికార్డులు బాగా ప్రచారంలో ఉన్నాయి. కాని, ఘంటసాల ఆ ఇద్దరినీ అనుకరించలేదు. గాయకుడుగా కొంచెం పేరులోకి వచ్చేనాటికే ఆయనకొక సొంత బాణీ ఏర్పడింది. పాతికేళ్ళ క్రిందటే జనం 'ఘంటసాల స్టయిలు' అంటూ ఉండేవారు. 'అద్వైత మూర్తి', 'సాంధ్యశ్రీ' పద్యాలతోనూ, ఇంకా ముందు 'స్వాతంత్ర్య సిద్ధి' వగైరా పద్యాలతోనూ ఆయన పద్యాలు పాడటంలో ఒక కొత్త స్టైలును ప్రవేశపెట్టారు. ఆ స్టైలు జనాన్ని వెర్రెత్తించేసింది. అది 'కురుక్షేత్రం', 'రామాంజనేయ యుద్ధం' వగైరా నాటకాలలోకి కూడా పాకింది. అప్పటి నుంచి పద్యం పాడటంలో ఘంటసాల ప్రభావం నుంచి తప్పించుకున్నవారు అరుదు. ఇప్పటికీ 'గొడ్డకాడ బుడ్డోళ్ళు' కూడా నాటకాల పద్యాలు ఘంటసాల స్టైల్లోనే పాడతారు. పాట పాడడంలో రాజేశ్వరరావుకు కూడా ఒక ప్రత్యేకమైన స్టైలు ఉంది కాని, అది సామాన్య జనానికి అందుబాటులోకి రాలేదు. ఆయనది మొదటి నుంచి కొంచెం 'హైబ్రో' స్టైలు.

హిందీలో సినిమా గాయకులకు కొదవలేదు. వారు ఒక్కొక్కరు ఒక్కొక్క తరహా పాటలు బాగా పాడతారు. కాని, మనకున్నది ఒక్కగాను ఒక్క ఘంటసాల. రఫీ, తలత్ మహమ్మద్, ముఖేశ్, కిషోర్, మన్నాడే, హేమంత్-అందరినీ మనం ఘంటసాలలోనే చూసుకుంటున్నాం. ఒక్క ఘంటసాల పదిరకాల గాయకుల పెట్టు. ఆయన ఉన్నంత కాలం "తెలుగు సినిమాల్లో ఫలానా రకం పాట పాడగలిగేవారు లేరు కదా" అని మనం ఎప్పుడూ విచారపడలేదు. ఫలానా హీరోకి ఆయన గొంతు సరిపోలేదన్న వ్యాఖ్యానం ఎప్పుడూ వినలేదు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత మన సంగీత దర్శకులకు చాలా అవస్థగా ఉంది. ఎవరి చేత పాడించుకోవాలో తెలియకుండా ఉంది. చీకట్లో తడుముకున్నట్లుగా ఉంది. ఇది వరకు సంగీత దర్శకుడికి బొత్తిగా సత్తా లేకపోయినా ట్యూనులో పసలేకపోయినా ఘంటసాల పాడితే చాలు జనం వినేవారు. ఆయన పాడిన ప్రతిపాటా హిట్ అయ్యేది. ఆయన పేరు చెప్పుకుని డొక్కశుద్ధి లేనివారు కూడా సంగీత దర్శకులుగా చెలామణీ అయ్యారు. ఇప్పుడు ట్యూను బావున్నా సరైన గాయకుడు లేక పాటలు దెబ్బతింటున్నాయి.

సినిమా పాట హిట్ కావాలంటే దాని ట్యూను సంగీత జ్ఞానం లేని వాళ్ళు కూడా ఒకటి రెండు సార్లు వింటే పట్టేసేటట్లుగా ఉండాలి. 'గొడ్డకాడ బుడ్డోళ్ళు', రైళ్ళలో చిడతలు వాయిస్తూ ముష్టేత్తుకునే వాళ్ళు కూడా పాడుకోవడానికి వీలుగా ఉండాలి. కాలేజీ కుర్రాళ్ళు ఈల పాడుకునేందుకు వీలుగా ఉండాలి. ఎంత హిట్ అయినప్పటికి సినిమా పాటలకి ఆయుర్దాయం తక్కువ. కొత్త పాటలు మార్కెట్లోకి రాగానే పాతవి మూలపడతాయి. జనం సినిమా పాటలని ఒకసారి చప్పరించి అవతల పడేస్తూ ఉంటారు. కాని, సినిమా పాటల్లో కూడా పాత పడనివి, నిత్య నూతనంగా వినిపించేవి ఉంటాయి. అటువంటివి నూటికి ఐదో ఆరో ఉంటాయి. ఘంటసాల పాడిన పది వేల పైచిలుకు పాటల్లో చాలా భాగం చౌకబారు పాటలే. అయితే అందుకు ఆయన బాధ్యుడు కాడు. ఆయన స్వయంగా సంగీతం సమకూర్చిన పాటల్లో మంచివి చాలానే ఉన్నాయి. శ్రోతలు తరచుగా కోరే పాతపాటల్లో చాలా పాటలు ఘంటసాలవే. వాటి ట్యూనులు ఘంటసాలవో, రాజేశ్వరరావువో అయి ఉంటాయి.

తెలుగు సంగీత దర్శకులలో రాజేశ్వరరావుకు, ఘంటసాలకు, కొంత వరకు పెండ్యాలకు మాత్రమే స్వతంత్రమైన శైలి ఉన్నది. వీరి ముగ్గురిలోనూ-హిట్ అయిన పాటల సంఖ్యను బట్టి చూస్తే-ఘంటసాలది అగ్రస్థానం. శాస్త్రీయ సంగీతంలో పరిచయం లేనివారు, శాస్త్రీయ సంగీతాన్ని చాదస్తపు సంగీతమని ఈసడించుకునేవారు ఘంటసాల పాటలను ఇష్టపడతారు. శాస్త్రీయ సంగీతపు వాసన తగలకుండా ఆయన తమకోసం స్పెషల్ గా పాడుతున్నారని వారు అనుకుంటారు. కాని, ఆయన అచ్ఛమైన శాస్త్రీయ రాగాల్లో వరసలు కూర్చుతున్నారనే రహస్యం వారికి తెలియదు. కాలేజీ కుర్రాళ్ళు పాడుకోదగిన పాటలకు కూడా ఆయన శాస్త్రీయ రాగాలను (సంకరం చేయకుండా) ఉపయోగించారు.

ఘంటసాల చిన్న తనం నుంచి కర్ణాటక సంగీత వాతారవణంలోనే పెరిగారు. ఆయన తండ్రి సూరయ్యగారు తరంగాలు గొప్పగా పాడేవారట. ఏడెనిమిదేళ్ళ వయస్సులోనే ఘంటసాల తరంగాలు నేర్చుకున్నారు. 'వినాయక చవితి' చిత్రంలో 'వాతాపి గణపతిం భజేహం' కృతిని పండితులు ఆక్షేపించరాని విధంగా ధాటీగా పాడారు. 'జయభేరి' (పెండ్యాల) చిత్రంలో 'మది శారదాదేవి మందిరమే' పాటతో చిన్న సైజు కచేరీ చేశారు. కర్ణాటక సంగీతంలో కచేరీ చేయగలిగినంతటి పాండిత్యం ఆయనకు ఉన్నది. అయినా ఆయన వరసలు కూర్చిన పాటలను పరిశీలిస్తే ఆయనపై హిందూస్థానీ సంగీత ప్రభావమే ఎక్కువగా కనిపిస్తుంది. ఆయన పాటల్లో యమన్ కళ్యాణ్, భూపాలీ, సింధుభైరవి, రాగేశ్వరి, భాగేశ్వరి, అహీర్ భైరవ్, భీమ్ పలాస్, మాల్కౌస్ రాగాలు తరచుగా వినిపిస్తూ ఉంటాయి. ఈ హిందూస్థానీ రాగాలకు సమమైన రాగాలు కర్ణాటక సంగీతంలో ఉన్నాయి. కాని, బాణీని బట్టి "ఇది హిందూస్థానీ రాగం, ఇది కర్ణాటక రాగం" అని పోల్చుకోవచ్చు. ఘంటసాల పాటలపై హిందూస్థానీ ముద్ర స్ఫుటంగా కనిపిస్తుంది. అయినా ఆయన పాడుతుంటే అచ్ఛమైన తెలుగుతనం ఉట్టిపడుతూ ఉంటుంది. 'భక్తజయదేవ' (రాజేశ్వరరావు) చిత్రంలో 'నీ మధు మురళీ' అనే పాటను, 'జగదేక వీరుని కథ' (పెండ్యాల) చిత్రంలో 'శివ శంకరీ' అనే పాటను హిందూస్థానీ శాస్త్రీయ సంగీతపద్ధతిలో ధాటీగా పాడారు. అంత నికార్సయిన శాస్త్రీయ సంగీతం పాడినా ఘంటసాల కనుక జనం మెచ్చారు. ఆ పాటలు హిట్ అయినా, అదే ఘంటసాల స్పెషల్ స్టైలు.

నండూరి పార్థసారథి
(1974 అక్టోబర్ 4వ తేదీన ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితమైనది)

Previous Post Next Post