Title Picture
ముళ్ళపూడి వెంకటరమణ

హాస్యానికి సంబంధించినంత వరకు ముళ్ళపూడి వెంకటరమణ గారు ఎవరికీ ఏమీ మిగల్చలేదేమోననిపిస్తుంది. ఏ చమత్కారాన్నీ, పదచిత్రాన్నీ ఆయన ప్రయోగించకుండా వదల్లేదు. ఎవరైనా హాస్య రచయితకి ఏదైనా బ్రిలియెంట్ ఐడియావస్తే అది తన మోస్ట్ ఒరిజినల్ ఐడియా అనుకుని కాగితం మీద పెట్టేముందు ఎందుకైనా మంచిదని రమణగారి సాహిత్యమంతటినీ ఒక్కసారి చూడడం మంచిది. అందులో ఎక్కడో ఈ ఐడియా కనిపించే ప్రమాదం ఉంది. అయితే, ఎవరైనా తమదనుకున్న ఐడియాని రాయకుండా వదిలేయాల్సిన అవసరం లేదు. అస్త్రసన్యాసం చేయాల్సిన పనీలేదు. ఇది నేను స్వానుభవంతో తెలుసుకున్న చెబుతున్న మాట.

నా సొంత ఐడియాలు, పదబంధాలు, చమత్కారాలు అనుకున్న వాటిలో కొన్నింటిని రమణగారు నాకన్నా ముందే రాశారన్న సంగతి ఇప్పుడు కొత్తగా తెలుసుకున్నాను. 1953-1963 మధ్యకాలంలో రమణగారు రాసినవి చాలా వరకు నేను చదివేశానని అనుకున్నాను. కాని, వాటిలో సగంలో సగం కూడా చదవలేదని ఈ మధ్య ఆయన 'సాహిత్యసర్వస్వం' సంపుటాలను తిరగేస్తున్నప్పుడు తెలుసుకున్నాను. అయితే, ఆ పదచిత్రాలు వగైరా నేను కాపీ కొట్టినవి కావు కనుక, అవి ఆయనకి ఎంత సొంతాలో నాకూ అంతే సొంతాలు. అంతేకాదు-ఆయన నా 'బుర్రకాయ ప్రవేశం' చేసి నేను రాయబోయే ఐడియాలని తస్కరించేశారా అని కూడా అనిపించేది. అంటే-'సమాన మనోధర్మం' అన్నమాట. 'పేరలల్ థింకింగ్' అని కూడా అనుకోవచ్చు.

రమణగారి కథలలో అత్యుత్తమమైనవి 1953-1963 మధ్యకాలంలో రాసినవేనని నా అభిప్రాయం. వాటిలో రెండు కథలను మాత్రం ఎంపిక చేసుకుని ఈ వ్యాసంలో ప్రస్తావిస్తున్నాను.

'మహారాజూ యువరాజూ' - అప్పుల వేటగాళ్ళ కథ. మహారాజు ఎన్.జీ.వో. పెళ్ళాం, పిల్లలు గలవాడు. యువరాజు పీహెచ్ డీ-అంటే ఫ్లాట్ ఫారం హీరో డెజిగ్నేట్. ఇద్దరూ అప్పులిచ్చే పేదరాశి పెద్దమ్మ ఇంటి దగ్గర కలిశారు. మహరాజు ఇత్తడి చెంబు, యువరాజు ఫౌంటెన్ పెన్ను తాకట్టు పెట్టారు. పెద్దమ్మ ఇద్దరికీ చెరో రూపాయి ఇచ్చింది. తర్వాత ఇద్దరూ వేటకు బయల్దేరారు. బజారు రోడ్డుకు వచ్చి ఆగారు. ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. "అయ్యా... తమరు ఎటువెళ్తారో చెప్పండి. నేను రెండో వైపు పోతాను" అంది యువరాజు మొహం. మహరాజు అర్థం చేసుకున్నాడు. "అబ్బే మీ ఇష్టం. మీరే నిర్ణయించుకోండి. భావిపౌరులు. దారి చూపాల్సిన వారు. మీరు దారి తియ్యండి. నేనే రెండో వైపు పోతాను" అంది అతని వాలకం. కాసేపు మీరంటే మీరనుకొని తర్వాత చెరో వైపు వెళ్ళారు.

మహరాజుకు ఆ పూట భోజనానికి ఓ సేరు బియ్యం అవసరం. జేబులో ఉన్న రూపాయి అందుకు సరిపోదు. సేరు రూపాయిన్నర చెప్పాడు షాపువాడు. మహరాజు బస్తా బేరం చేశాడు. ఓ అర్థ సేరు శాంపిల్ ఇస్తే ఇంటికి వెళ్ళి వండి చూసుకుని మళ్ళీ వచ్చి బస్తా తీసుకుంటానన్నాడు. షాపువాడు అదేం కుదరదన్నాడు.

అటు యువరాజు హోటల్ కి వెళ్ళాడు. అది ఇంగ్లీషు స్టైల్ హోటల్. కాఫీ తాగి, అణారకం సిగరెట్లు నాలుగు, అణా అగ్గిపెట్టె తెప్పించుకుంటే వెయిటర్ అర్థరూపాయి బిల్లు పళ్ళెంలో పెట్టి ఇచ్చాడు. యువరాజు దర్జాగా రూపాయి నాణెం వేశాడు. బిల్లు డబ్బులు పోనూ వెయిటర్ పళ్లెంలో రెండు పావలా కాసులు తెచ్చి ఇచ్చాడు. వాడు అణాలు, బేడాలు ఇస్తే దర్జాగా ఓ అణా టిప్ ఇద్దామనుకున్నాడు యువరాజు. టిప్ ఇవ్వకపోతే పరువు తక్కువ. ఇప్పుడు కనీసం పావలా టిప్ ఇవ్వక తప్పదు. సరే-చాలా స్టైల్ గా పావలా టిప్ ఇచ్చి, రెండో పావలా అతి నిర్లక్ష్యంగా జేబులో వేసుకున్నాడు. వెయిటర్ అంతకన్నా నిర్లక్ష్యంగా పావలా తీసుకున్నాడు.

కథ అంతా - మహరాజూ యువరాజుల దారిద్ర్యబాధ. చివరికి - తనకంటే మహరాజు జీవితమే నయమనుకున్నాడు యువరాజు. "ఎక్కడెక్కడ తిరిగినా కొంపకి చేరేసరికి 'వచ్చారా' అనడానికి భార్యా, 'నాన్నా' అనడానికి పిల్లలు... ఎన్ని కష్టాలున్నా కలోగంజో తాగుతూ ఆనందాన్వేషణలో ఉన్న సుఖాన్నో, సౌఖ్యాన్వేషణలో ఉండే ఆనందాన్నో పొందవచ్చు. నా అన్న వాళ్ళుంటారు. గృహమే కదా స్వర్గ సీమా".. అనుకున్నాడు.

సరిగ్గా అదే సమయానికి మహరాజుకి యువరాజు గుర్తుకొచ్చాడు. "ఏ సంసార తాపత్రయం లేని స్వేచ్ఛా జీవి. పక్షిలా విహరిస్తాడు. ఉంటే తింటాడు. లేకపోతే గుక్కెడు నీళ్ళు తాగి కడుపులో కాళ్ళెట్టుకు పడుకుంటాడు. బెంగా, బెడతా ఉండదు. అతని పనే హాయి" అనుకున్నాడు.

"నిద్రకుపక్రమిస్తున్న మహరాజూ, యువరాజూ కూడా ఆకారం ఏర్పడని, తమకే అర్థం కాని ఈ కోరికలని నెరవేర్చవలసిందని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఒకే ముహూర్తాన చేతులు జోడించి మనసారా నమస్కరించారు".

ఇది చివరి వాక్యం.

మరో గొప్ప కథ - 'కృతజ్ఞత'. అది హాస్యకథ కాదు. దీక్షితులు సద్ర్బాహ్మణుడు, బీదవాడు. సింగారం వణిక్ప్రముఖుడు. ఇద్దరివీ పూర్తిగా భిన్నమైన జీవిత విధానాలు. చిన్నప్పుడు పదేళ్ళ వయస్సులో గోలీకాయలాడుకుంటున్నప్పుడు మొదట పోట్లాడుకున్నా సింగారం దీక్షితులికి బెల్లపుజీళ్ళు ఇచ్చాడు. అప్పటి నుంచి ఇద్దరూ స్నేహితులైపోయారు. అంతకంతకు వాళ్ళ స్నేహం బలపడింది. ఊళ్ళో వాళ్ళకి చిత్రంగా ఉండేది వాళ్ళ స్నేహం. దీక్షితులు బీదవాడైనా నోరువిప్పి ఏనాడూ సింగారాన్ని కానీ అడగలేదు. సింగారం కూడా దీక్షితులి అవసరాలు తెలుసుకుంటూ అడక్కుండానే డబ్బోదస్కమో, సంభారాలో పంపేవాడు ఇంటికి.

వీళ్ళకథ అంతా సుబ్రహ్మణ్యం అనే ఆసామి పెదపంతులు అనే ఆయనకీ, చుట్టూ చేరిన వాళ్ళకీ చెబుతున్నాడు. మాటల సందర్భంలో పంతులు "మనిషన్నాక విశ్వాసం ఉండాలి. వెధవది కుక్కకి ఉంది కదండీ కృతజ్ఞత" అన్నాడు.

"చూడు పంతులూ... మనుషుల బతుకులు సూత్రాలమీద నడవ్వు. నువ్వు నాకు మహోపకారం చేశావనుకో. నేను నీకు విశ్వాసం కొద్దీ వెయ్యి రూపాయలు దొరికే ఛాన్సు ఇప్పించాను. నా వల్ల డబ్బొచ్చిందనే విశ్వాసంతో నువ్వు నాకు వంద రూపాయలిస్తావు. నా పరిస్థితుల కొద్దీ 'ఛా... వీడు నాకు వందే ఇచ్చాడు కృతఘ్నుడు' అంటాను నేను. 'చూశావా... వీడికి వంద కరుకులు దోసిట్లో పోస్తే అవి పుచ్చుకుని నన్ను తిడుతున్నాడు' అంటావు నువ్వు. నా దృష్టిలో నీకు విశ్వాసం లేదు. ఇలాంటివి ఇదమిత్థమని చెప్పలేం. నీ కళ్ళ ఎదుట మంచివాడు ఆప్రదిష్టపాలై అడుక్కు తింటుంటే... ఒక్కొక్కసారి నువ్వే ఆ మంచి వాడవైతే నీకీ కృతజ్ఞతలో నమ్మకం పోతుంది" -అంటూ ఆ స్నేహితుల కథ చెప్పాడు సుబ్రహ్మణ్యం గారు.

"దీక్షితులు, సింగారం యాభై ఏళ్ళ నుంచి స్నేహితులు. సింగారం పెంపుడు కుక్క విశ్వాసం లేకుండా ఆ స్నేహితుల మధ్య అపోహలు కల్పించింది. మరి అన్నేళ్ళ స్నేహం ఏ గంగలో కలిసిందో కానీ ఇద్దరూ ఇప్పుడు పరమ శత్రువులు. వచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వాడు వెధవంటాడు సింగారం. వెధవన్నర అంటాడు దీక్షితులు. ఇలాంటివి చూస్తే కృతజ్ఞతనే మాటలో అర్థం కనిపించదు. స్వార్థం కనిపిస్తుంది. దానికోసం వెతకడం కంటే ఆంధ్రుల్లో ఐకమత్యం సాధించడం సులభమేమో అనిపిస్తుంది" అన్నాడు సుబ్రహ్మణ్యం గారు.

అసలు జరిగిన కథ. సింగారం ఒకసారి మొక్కు తీర్చుకోడానికి కొండకు బయలుదేరాడు-సకుటుంబంగా. వెడుతూ వెడుతూ దీక్షితులికి ఒక పని అప్పగించాడు. సింగారం దీక్షితుల రెండు చేతులూ పట్టుకున్నాడు. "ఇవి చేతులు కావు కాళ్ళు అనుకో. మన యాభయ్యేళ్ళ స్నేహం గుర్తు తెచ్చుకో. నేను నీకు చేసిన ఉపకారాలన్నింటికీ బదులుగా ఇవాళ నాకు ఒక్క సాయం చేయాలని నా ప్రార్థన" అంటూ వాగ్ధానం చెయ్యమన్నాడు.

"నీ మాట నేను త్రోసిరాజంటానా? నా ప్రాణం అర్పించినా నీ రుణం తీర్చుకోగలనోయ్? గాయత్రి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నీకేం సహాయం కావాలో చెప్పు" అన్నాడు దీక్షితులు.

"నేను తిరుపతి నించి తిరిగి వచ్చేవరకు నా ప్రాణతుల్యమూ, నా బిడ్డ వంటిదీ అయిన 'టైగర్'ని నీ కళ్ళలో వత్తులు పెట్టుకుని కాపాడాలి. ఈ భూ ప్రపంచంలో నా పరోక్షాన దాన్ని పాలించి రక్షించే వాళ్ళు ఇంకెవ్వరూ లేరు. టైగర్ ఎంతో పెంకెది. కాస్త అజాగ్రత్తగా ఉంటే అది ఓఘాయిత్యప్పనులు చేసి ప్రాణం మీదకు తెచ్చుకుంటుంది. నీకు తెలియనిదేముంది" అన్నాడు సింగారం.

'ఓస్ ఇంతే కదా' అనుకున్నాడు దీక్షితులు. సింగారం తన జేబు గడియారాన్ని దీక్షితులుకి బహూకరించాడు. తన పాలేరు చేత తన పాడి ఆవును కూడా దీక్షితులి ఇంటికి పంపించాడు. తను వచ్చేవరకు పాడి కమ్మగా భోంచేయమన్నాడు.

సింగారం వెళ్ళిన దగ్గర్నించి అతడి కుక్క దీక్షితులికి నరకం చూపించింది. అది ఊళ్ళోని కుక్కలన్నింటి మీదికి ఎగబడేది. గొలుసు పెట్టి కట్టేసినా తప్పించుకుని పోయేది. కొందరిని కరిచేది. దీక్షితులిని కూడా కరిచింది. చివరికి ఊళ్ళో జనం దాన్ని పట్టుకుని చంపేశారు. తిరుపతి నుంచి తిరిగి వచ్చిన సింగారం భోరుమని ఏడిచాడు. విశ్వాసఘాతకుడివని దీక్షితులిని నానా మాటలు అన్నాడు. దీక్షితులు మళ్ళీ తలెత్తుకు తిరగలేదు.

అదీ కృతజ్ఞత కథ.

నండూరి పార్థసారథి
(2016 ఫిబ్రవరి 23వ తేదీన ప్రచురితమయింది)

Previous Post Next Post