Title Picture
కంట తడి పెట్టించగల చిత్రాలు

'జేబుదొంగ', 'కన్యకాపరమేశ్వరీ మహాత్మ్యం' (డబ్బింగు) చిత్రాలు రెండూ కొంచెం హెచ్చు తగ్గుగా ఒకే స్థాయిలో ఉన్నాయి. ఈ రెండు చిత్రాలూ కూడా ప్రేక్షక హృదయాలను కలచివేయగల విధంగా, ప్రేక్షకులలో తీవ్రమైన పశ్చాత్తాపాన్ని రేకెత్తించగల విధంగా రూపొందించబడ్డాయి. ఏ కారణాల వల్లనైతే నేమి ఈ చిత్రాలను చూస్తున్నంత సేపూ అన్ని వర్గాల ప్రేక్షకులు నవ్వుకొంటూ, దుఃఖిస్తూ, పశ్చాత్తాప పడుతూ, నిట్టూరుస్తూ ఉంటారు.

ఇవి ప్రత్యేకంగా నీతి ప్రబోధక చిత్రాలు కాకపోయినా వీటిని చూసిన తర్వాత ప్రేక్షకులు గొప్ప గుణపాఠాలు నేర్చుకుంటారు. వీటిలో 'జేబుదొంగ' సాంఘిక (స్టంటు-కం-నీతి ప్రబోధక) చిత్రం. ఈ చిత్రం చూసిన తర్వాత ప్రేక్షకునికి స్పురించే నీతి ఇది : "నువ్వు ఇప్పుడు చేసిన తప్పుకు పశ్చాత్తాపపడు. ఈ తప్పును తిరిగి ఎప్పుడూ చేయనని ప్రతిజ్ఞ చెయ్యి". క.ప.మహాత్మ్యం చిత్రం "దురాశ దుఃఖము చేటు" అనే నీతిని ప్రబోధిస్తుంది. ఇది దైవబలం మీద ఆధారపడిన చిత్రం. 'జేబుదొంగ' చిత్రానికి ఒక వర్గం వారి ఆదరాభిమానాలు, రెండో వర్గం వారి సానుభూతి లభించుతాయి. 'క.ప.మహాత్మ్యం' చిత్రానికి అన్ని వర్గాల సానుభూతి లభిస్తుంది. ఈ రెండు చిత్రాలలో కూడా కళావిలువలకోసం వెతుక్కునే పనిలేదు. రెండు చిత్రాలోనూ అగ్రశ్రేణి తమిళ నటీనటులు సమాన ఉజ్జీలో ఉన్నారు. వీరంతా కూడా మన మెజారిటీ ప్రేక్షకుల ఆదరాభిమానాలకు గురి అయిన వారే.

ఇక ఇప్పుడు రెండు చిత్రాలనూ విడివిడిగా పరిశీలిద్దాం :-

కన్యకాపరమేశ్వరీ మహాత్మ్యం

చలన చిత్రాలలో ముఖ్యంగా ఇటువంటి (పౌరాణిక-కం-జానపద) చిత్రాలలో కళావిలువలకు ప్రాధాన్యం లేదనీ, ఛాయాగ్రహణం నేత్ర పర్వంగా, శబ్దగ్రహణం నిర్దుష్టంగా లేకపోయినా వచ్చిన ప్రమాద మేమీ లేదనీ, భక్తి, మహిమ, పాతివ్రత్యం మొదలయినవి ఉంటే చాలుననీ భావించే వారికి ఈ చిత్రం నచ్చి తీరుతుంది. తెలుగు డబ్బింగు చిత్రాలపట్ల ప్రత్యేక అభిమానం గలవారు, శివాజీ గణేశన్ అభిమానులు కూడా ఈ చిత్రాన్ని చూడటం విధాయకం.

ఇది కన్యకాపరమేశ్వరి కథకాదు. ఆవిడ మహిమ కథ, ఆవిడ భక్తురాలి కథ. ఆ భక్తురాలు ప్రేమించిన వానిని వివాహమాడి, పతివ్రతయై, అనేక కష్టాలకు గురియై, అనేక అగ్ని పరీక్షలకు లోనై చివరకు పాతివ్రత్యం మహిమ వల్ల, క.ప.మహాత్మ్యం వల్ల కష్టాలను దాటుతుంది. సారాంశం ఇది.

ఈ చిత్రం చూస్తుంటే పాతికేళ్లనాడు సురభికమలాబాయి, సి.ఎస్.ఆర్. నాయికా, నాయకులుగా నటించిన వేంకటేశ్వర మహాత్మ్యం చిత్రం, ఇంకా ఆనాటి కొన్ని ఇతర పౌరాణిక చిత్రాలు జ్ఞాపకానికొస్తుంటాయి. సాంకేతికంగా ఈ చిత్రం ఆనాటి చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో ఉంది.

అయితే ఈ చిత్రం తాజాదని చెప్పడానికి వీలులేదు. ఎన్.ఎస్.కృష్ణన్ బ్రతికివున్న రోజుల్లో తీసిన చిత్రం ఇది. అందుకే ఆయన ధరించిన పాత్ర 'అనివార్య' కారణాల వల్ల మధ్యలో నిష్క్రమిస్తుంది. ఇందులో ఎవరు బాగా నటించారని అడిగితే చెప్పడం కష్టమే. అందరూ సమానంగానే నటించారు. గణేశన్ శక్తినంతా ధారపోసి నటించారు. ఇందులో అతనికి కత్తి యుద్ధాలు చేతకావు.

ఈ చిత్రంలో 8 పాటలు ఉన్నాయి. వీటిలో 'విరహిణి నినుకోరే' అన్న జావళీ బావున్నట్టు అనిపిస్తుంది. ఈ చిత్రం అఖండ ఆర్థిక విజయాన్ని సాధిస్తే అది 'కన్యకాపరమేశ్వరి మహాత్మ్యం'.

జేబుదొంగ

భానూ ఫిలింస్ వారు సమర్పించిన ఎ.ఎల్.ఎస్. ప్రొడక్షన్సు వారి 'జేబుదొంగ' డబ్బింగు చిత్రం. సాధారణంగా అందరూ ఆశించే విధంగానే ఉంది. ఇది ప్రధానంగా స్టంటు చిత్రం. తర్వాత నీతి ప్రబోధక చిత్రం. కాబట్టి సగటు ప్రమాణపు వినోదానికి ఏమీ కొదవుండదు.

అల్లారుముద్దుగా పెంచిన కన్నతల్లిని పోషించడానికి కూడా సంపాదన లేక ఒక అబ్బాయి జేబులు కొట్టడం ప్రారంభిస్తాడు. తల్లికి తెలియకుండా దొంగతనాలు సాగిస్తాడు. చిత్రం సగం గడిచేసరికి తప్పు తెలుసుకుంటాడు. పశ్చాత్తాపపడుతాడు. ఈలోగా ఒక యువతిని ప్రేమిస్తాడు. చివరికి అతను చెయ్యని నేరం అతనిపై పడుతుంది. నేరం చేసింది విలన్. నిజాన్ని బైటపెట్టడానికి సాహసాలు చేస్తాడు. చివరికి ధర్మం జయిస్తుంది.

ఈ చిత్రంలో 8 పాటలు ఉన్నాయి. వీటిలో ఒకటి రెండు పాటలు బాగానే ఉన్నాయి. "ఛాయాగ్రహణం నేత్రపర్వంగా ఉంది. శబ్దగ్రహణం నిర్దుష్టంగా ఉంది".

సరోజాదేవి, ఆమె నటన ఆకర్షణీయంగా ఉన్నాయి. రామచంద్రన్, నంబియార్ల నటన, స్టంటు చిత్రాభిమానులకు అద్భుతంగా ఉన్నాయి.

దర్శకుడు: పి. నీలకంఠం; మాటలు: మహారధి; పాటలు: అనిసెట్టి; సంగీతం: టి.ఎం. ఇబ్రహీం; నేపథ్య గానం: ఘంటసాల, రాజా, శ్రీనివాస్, పిఠాపురం నాగేశ్వరరావు, జిక్కి, జానకి, వైదేహి, సరస్వతి; తారాగణం: ఎం.జి.రామచంద్రన్, బి.సరోజాదేవి, తంగవేలు, నంబియార్, నాగయ్య, ఎం.ఎస్.రాజం, ఎం.సరోజ, రీటా వగైరా...

తెలుగు సినిమా మార్కెట్టులో ప్రస్తుతం నెలకొని ఉన్న 'వాతావరణం' దృష్ట్యా 'జేబుదొంగలు' చిత్రం బాగా డబ్బు చేసుకోగలదనడంలో సందేహం లేదు.

నండూరి పార్థసారథి
(1961 సెప్టెంబర్ 22వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది)

Previous Post Next Post