Title Picture

(కథల సంపుటి. రచన : 'వాసమూర్తి'; ప్రచురణ : తెలుగు వెలుగు ప్రచురణలు, అమలాపురం; ప్రాప్తి స్థానం కొండపల్లి వీరవెంకయ్య అండ్ సన్స్, రాజమండ్రి. క్రౌన్ సైజు : 127 పేజీలు; వెల : 2 రూపాయలు)

'ఇందులోని కథలు స్పష్టంగా కాలక్షేపం కథలే. అందుకే ఒక అమ్మాయి అబ్బాయి కథ పేరే ఈ సంకలనానికి పెట్టబడింది. వీటిలో సూక్ష్మమైన మనోవిశ్లేషణా, విశిష్ట పాత్ర చిత్రణావంటివి కానరాకపోవచ్చు. అట్టివి కోరేవారు ఆశాభంగం చెందవచ్చు కూడా. అట్లాగని అన్ని కథలూ ప్రేమాయణాలు కావు, ఉట్టి ఊహల స్వారీలూ కావు. ఐదు కథలూ ఐదు తీరులుగా ఉంటాయి. వీనిలో కొన్ని "వాస్తవిక సంఘటనల నాధారంగా చేసికొని వ్రాసినవే'' అని రచయిత ముందు 'రెండు మాటులు'లో వ్రాశారు. ఈ మాటలు ఆయన మొహమాటం కోసం వ్రాశారేమో కాని, నిజానికి ఇవి కేవలం కాలక్షేపం కథలు కావు. ఈ కథలన్నింటిలోనూ ఏదో ఒక గొప్ప సత్యం దాగి ఉంది. ఆసత్యాన్ని రచయిత ఎలుగెత్తి చాటడుకానీ, దానిని పాఠకుడు స్పృశించగలడు.

ఇందులో 'పోస్ట్ మేన్ చేసిన తమాషా', 'ఐకమత్యం', 'జ్యోస్యం', 'అమ్మ', 'అన్వేషణ' అనే కథలు ఉన్నాయి. అన్నీ చాలా బావున్నాయి. ముఖ్యంగా-మొదటి రెండింటి కంటే చివరి మూడు కథలూ మరీ బావున్నాయి. పెద్ద పెద్ద భావాలు, శిల్పవైచిత్రి ఏమీ లేవు. కథలన్నీ అత్యంత వాస్తవికంగా, నిరాడంబరంగా ఉండి, నేరుగా మన హృదయంతో మాట్లాడుతున్నట్లు ఉన్నాయి. ఇంత మంచి కథలు తెలుగు సాహిత్యంలో చాలా అరుదుగా కనిపిస్తాయి. అందరూ-ముఖ్యంగా యువరచయితలందరూ చదివి తీరవలసిన పుస్తకం ఇది.

127 పేజీలు మాత్రమేగల ఈ చిన్న పుస్తకానికి ధర మాత్రం చాలా ఎక్కువగా ఉంది. చిన్న కథలను చదవగోరే పాఠకుల సంఖ్య చాలా ఎక్కువ. ధర ఎక్కువ పెట్టడం వల్ల ఇటువంటి పుస్తకాలు అందరికీ అందుబాటులో లేకుండా పోతున్నాయి. లోపల కాగితం శ్రేష్ఠమైనది కాకపోయినా ఇబ్బంది లేదు. చౌకరకం కాగితం వేసి ధర ముప్పావలా పెట్టితే సామాన్యులకు అందుబాటులో ఉంటుంది. పాఠకుల సంఖ్య పెరుగుతుంది.

నండూరి పార్థసారథి
(1964 మే 06వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమయింది)

Previous Post Next Post