Title Picture

'హెల్మ టైటిస్' అనే తలనొప్పి వ్యవహారం

స్కూటర్లు, మోటారు సైకిళ్లు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలన్న నిబంధనను ప్రవేశ పెడతామని ప్రభుత్వం చెప్పడం ప్రారంభించి ఏడాది గడిచింది. ఈ నిబంధనను అమలు జరపడానికి ఇంకా సుముహూర్తం కుదిరినట్లు లేదు. 'ప్రజాభిప్రాయం' ప్రకారం ప్రభుత్వం దీనిని ఎప్పటికప్పుడు వాయిదావేస్తూ వచ్చింది. దీనిని స్కూటరిస్టులు, మోటార్ సైక్లిష్టుల ఇష్టాయిష్టాలకు వదిలి పెడితే హెల్మెట్లు ధరించే వారు నూటికి పదిమందైనా ఉంటారో లేదో అనుమానం. నిజానికి హెల్మెట్ ధరించడం చాలా చికాకైన విషయం. ఆ చికాకు అనుభవైకవేద్యం.

అసలు హెల్మెట్ దేనికి? ఏదైనా ప్రమాదం జరిగితే తలకు దెబ్బ తగలకుండా రక్షణ కోసమే కదా? స్కూటర్, లేదా మోటారు సైకిల్ నడిపే వ్యక్తి మాత్రం ఈ ఫైబర్ గ్లాస్ శిరస్త్రాణం ధరిస్తే చాలునా? వెనక కూర్చునే వ్యక్తి సంగతేమిటి? అతడికి, లేదా ఆమెకు మాత్రం రక్షణ అక్కర్లేదా? ప్రమాదం జరిగితే వెనక కూర్చునే వారికి కూడా గాయాలు తగులుతాయి కదా? మరి వారు కూడా హెల్మెట్ ధరించవలసిందేనా? ధరించవలసిందేనంటే భర్తవెంట సాయంత్రం సరదాగా స్కూటర్ పై షికారు వెళ్లే నవవధువు కూడా హెల్మెట్ నెత్తిన బోర్లించుకోవలసిందే. అప్పుడు లేడీస్ వాచ్, లేడీస్ చప్పల్స్ లేడీస్ అంబరిల్లాస్ లాగా లేడీస్ హెల్మెట్స్ డిజైన్ చేయాల్సి ఉంటుంది. భర్త నడుము చుట్టూ చేయి వేసి, ఎంతో ఒయ్యారంగా కూర్చునే అందమైన యువతి, తల నిండా మల్లె పూలు పెట్టుకొని, నుదుట నయాపైసంత కుంకుమ బొట్టు పెట్టుకొని, కళ్లకు కాటుక తీర్చిదిద్దుకొని, లక్ష్మీ కళ ఉట్టి పడుతూ ఉండే యువతి నెత్తిన హెల్మెట్ పెట్టుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుంది?

పోనీ వెనక కూర్చునే ఆడవాళ్లని-సౌందర్య దృష్టితో దయదలచి వదిలి వేసినా స్కూటర్లు నడిపే ఆడవాళ్లని మినహాయించడానికి వీల్లేదు కదా? మోటారు సైకిళ్లు నడిపే ఆడవాళ్లు కనిపించరు గానీ, స్కూటర్లు, మోపెడ్లు నడిపే సుందరీమణులు మననగరంలో బోలెడు మంది. వాళ్లంతా అరచేతి వెడల్పు జరీ అంచు ఉన్న కంచి పట్టు చీరకట్టుకున్నా, శ్రావణ మంగళవారం పేరంటానికి వెడుతున్నా నెత్తి మీద హెల్మెట్ పెట్టుకోకతప్పదు! వరూధినీ సౌందర్యాన్ని ఎంత వర్ణించినా తనివి తీరని అల్లసాని పెద్దన్న గారికి ఈ సంగతి తెలిస్తే స్వర్గంలోనే ఉరిపోసుకునే ప్రమాదం లేకపోలేదు!

ఇదంతా సరే - తలకాయలకు రక్షణ స్కూటరిస్టులకు, మోటారు సైకిలిస్టుల కేనా? మామూలు సైక్లిస్టులకు, రిక్షా సైక్లిస్టులకు అక్కర్లేదా? వారికి కూడా ఈ నింధన వర్తింజేస్తే ఇక హెల్మెట్ల పరిశ్రమ మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల గలదనడంలో సందేహం లేదు.

స్కూటర్ మీద పోతున్నప్పుడు హెల్మెట్ సమస్యకాదు గానీ స్కూటర్ దిగిన తర్వాత అదో పెద్ద సమస్యగా తయారవుతుంది. దాన్ని చంకన పెట్టుకొని తిరగాలి, లేదా జోలె సంచీ కొనుక్కొని, అందులో పెట్టుకొని భుజాన తగిలించుకోవాలి. సినిమాలకు వెడితే, హెల్మెట్లను ఒళ్లో పెట్టుకోవాలి-కాశీకి వెడుతూ పిల్లిని చంకన పెట్టుకు పోయినట్లే.

దేశంలో అనేక నగరాల్లో ఈ నిబంధనను అమలు జరుపుతున్నారు. హెల్మెట్లను గురించి ఎన్నో వ్యంగ్యోక్తులు వెలుపడ్డాయి. కార్టూన్లు వెలువడ్డాయి. ఒక కార్టూన్ లో ఒక స్కూటరిస్టు హెల్మెట్ చంకన బెట్టుకొని డాక్టర్ దగ్గరకు వెడతాడు. ''ఈ మధ్య ఒకటే తల నొప్పిగా ఉంటోందండీ'' అని ఫిర్యాదు చేస్తాడు. డాక్టర్ పరీక్షించి 'అబ్బే మరేం లేదు. ఇది 'హెల్మెటైటిస్' అనే కొత్త రకం జబ్బు' అని చెబుతాడు.

మన నగరంలో ఈ నిబంధన త్వరలో అమలులోకి వస్తుందనే వార్తలు వ్యాపించడంతో హెల్మెట్లు ధరించకుండానే స్కూటరిష్టులకు తలనొప్పి ప్రారంభమైంది.

నండూరి పార్థసారథి
(1978 అక్టోబర్ 2వ తేదీ ఆంధ్రప్రభలో ప్రచురితమైనది)

Previous Post Next Post