Title Picture
గోల్డ్ రష్

ఈ కోర్సు చరిత్ర
ఈ ఫిలిం అప్రీసియేషన్ కోర్సు బెంగుళూరులో 30.10.1974 నుంచి 09.11.1974 వరకు పది రోజుల పాటు జరిగింది. అప్పుడు నేను ఆంధ్రప్రభ దినపత్రిక బెంగుళూరు ఎడిషన్ లో పనిచేస్తున్నాను. ఆ కోర్సు కార్యక్రమం రోజూ పొద్దున 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరుగుతుంది. మధ్యలో ఒంటిగంట నుంచి మూడు గంటల వరకు భోజన విరామం ఉంటుంది. మా బాస్ నన్ను ఆఫీసు డ్యూటీ మీద పంపించరు. అందుచేత పది రోజులు సెలవు పెట్టేశాను. అప్రీసియేషన్ కోర్సు లో బోలెడు నోట్స్ రాసుకున్నాను. అలాంటి వాటి పట్ల మా బాస్ కు బొత్తిగా ఆసక్తి లేదు. ఆ నోట్స్ ఆధారంగా నేను రాసిన వ్యాసాన్ని 1978లో 'ప్రజాతంత్ర'కు ఇచ్చాను, అప్పటికి నేను 'ప్రభ' హైదరాబాద్ ఎడిషన్ లో పనిచేస్తున్నాను. అదీ ఈ వ్యాసం కథ.

  • నం.పా.సా

పూనాలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా కలిసి ఇటీవల పది రోజుల పాటు బెంగుళూరులో 'కళాసంపద' సంస్థ ఆధ్వర్యాన ఫిల్మ్ అప్రీసియేషన్ కోర్సును నిర్వహించాయి. కర్ణాటక చలనచిత్ర వాణిజ్యమండలి, సుచిత్ర ఫిలిం సొసైటీ కూడా ఈ కోర్సు నిర్వహణకు సహకరించాయి.

పూనా ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో డైరెక్షన్ కోర్సు చదివే వారికి ఫిల్మ్ అప్రీసియేషన్ (చలన చిత్ర అవగాహన) ఒక పాఠ్యాంశం. ఇది ఇంతకాలం ఇన్ స్టిట్యూట్ విద్యార్థులకే తప్ప బయటి వారికి అందుబాటులో లేకుండా ఉంది. చలన చిత్రాల పట్ల ప్రజలలో ఉత్తమాభిరుచిని పెంపొందింపజేయాలంటే ఈ కోర్సును క్రమంగా ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకు రావాలని ఇన్ స్టిట్యూట్ భావించింది. కొద్దినెలల క్రితం మొదటి సారిగా పూనాలో నెల రోజులు ఈ కోర్సును నిర్వహించింది. అది జయప్రదమైంది. ఇటువంటి కోర్సు కోసం చలనచిత్ర కళాభిమానులు ఎంత తహతహతో ఎదురుచూస్తున్నారో అప్పుడు తెలిసింది. అయితే ఒక్క పూనాలో మాత్రం నిర్వహించినందువల్ల లాభం లేదు. దూరప్రాంతాల వారు నెల రోజులు పూనాలో మకాం పెట్టాలంటే అందుకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ప్రజలను పూనా ఇన్ స్టిట్యూట్ కు రప్పించడం కాదు-ఇన్ స్టిట్యూటే ప్రజల వద్దకు వెళ్ళాలి. చలన చిత్రాల నాణ్యం పెరగాలంటే ప్రజల అభిరుచి పెరగాలి. అందుకోసం ప్రతి రాష్ట్ర రాజధానిలోనూ ప్రచార దీక్షతో ఇటువంటి కోర్సును విరివిగా నిర్వహించడం అవసరమని ఇన్ స్టిట్యూట్ భావించింది.

ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ శ్రద్ధను గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలనే ఉద్దేశంతో 'కళాసంపద' సంస్థ కర్ణాటక రాష్ట్రంలోని వారికోసం బెంగుళూరులో ఈ కోర్సును నిర్వహించడానికి ఇన్ స్టిట్యూట్ ను, నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ను ఆహ్వానించింది. పూనా నగరానికి వెలుపల ఇటువంటి కోర్సును నిర్వహించడం ఇదే మొదటిసారి. పూనాలో వలె నెల రోజులు నిర్వహిస్తే రాష్ట్రంలోని ఇతర పట్టణాల నుంచి వచ్చేవారు, బెంగుళూరులో బస, భోజనం ఖర్చులు భరించడం కష్టమవుతుందనే ఉద్దేశంతో కోర్సును పది రోజులకు తగ్గించారు.

సంఖ్య ఎక్కువైతే తరగతిని నిర్వహించడం కష్టమని భావించడం చేత ఈ కోర్సును 70 మందికి మాత్రం పరిమితం చేశారు. 'కళాసంపద' వారు లాభాపేక్ష లేకుండా కేవలం కోర్సు నిర్వహణకు అయ్యే ఖర్చు కోసం మాత్రమే ఫీజుని నిర్ణయించారు. యోగ్యతలను బట్టి విద్యార్థులను ఎంచుకున్నారు. కోర్సుకు హాజరైన వారిలో జర్నలిస్టులు, రచయితలు, లెక్చరర్లు, నాటకాల దర్శకులు, రంగస్థల నటులు, ఫిలిం సొసైటీలవారు, సినిమాటోగ్రఫీ చదువుకున్న విద్యార్థులు, సినిమా రంగంలోని వివిధ శాఖలలో కొద్దిపాటి అనుభవం ఉన్నవారు, ప్రభుత్వోద్యోగులు ఉన్నారు. ఇరవై యేళ్ళ యువకుల నుంచి యాభై యేళ్ళ నడి వయస్కుల వరకు ఉన్నారు. ఓ 13 మంది స్త్రీలున్నారు.

Picture
సతీశ్ బహదూర్, పి.కె.నాయర్

కోర్సులో ఫిల్మ్ ఆప్రీసియేషన్ కు సంబంధించిన తరగతులన్నింటినీ పూనా ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన ప్రొఫెసర్ సతీశ్ బహదూర్ నిర్వహించారు. భారత చలన చిత్ర చరిత్రకు సంబంధించిన తరగతులను నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ క్యూరేటర్ పి.కె.నాయర్ చివరి రెండు రోజుల్లో నిర్వహించారు. మధ్యలో ఒక రోజు అతిథి ఉపన్యాసకుడుగా బి.వి.ధరప్ భారత చలన చిత్ర ఆర్థిక వ్యవస్థ గురించి ప్రసంగించారు.

కోర్సు కార్యక్రమం మూడు విభాగాలుగా ఉంది. థియరీ బోధన, చలన చిత్రాల ప్రదర్శన, చలన చిత్రాలపై చర్చ. పది రోజులలో 13 ఫీచర్ ఫిల్ములు (కథా చిత్రాలు) 6 డాక్యుమెంటరీలు, 20 షార్ట్ ఫిల్ములు ప్రదర్శించారు. ఇవికాక భారత చలనచిత్ర చరిత్ర విభాగంలో దాదాపు 30 కథా చిత్రాలలోని కొన్ని భాగాలను మచ్చుతునకలుగా చూపించారు.

Picture
'ఇన్ టాలరెన్స్', 'ది పేషన్ ఆఫ్ జోన్ ఆఫ్ ఆర్క్', 'ఐవాన్ ది టెరిబుల్'
Picture
'యుగెట్సు మొనోగటారీ', 'వైల్డ్ స్ట్రాబెరీస్', 'హిరోషిమా మోన్ అమోర్'
Picture
'బ్రెత్ లెస్', 'మేఘేఢాకా తారా'

ఫీచర్ ఫిల్ములు ఇవి : డి.డబ్ల్యు.గ్రిఫిత్ తీసిన సైలెంట్ ఫిల్మ్ 'ఇన్ టాలరెన్స్' (1916); చార్లీచాప్లిన్ తీసిన సైలెంట్ ఫిల్మ్ 'గోల్డ్ రష్' (1925); కార్ల్ డ్రెయర్ తీసిన సైలెంట్ ఫిల్మ్ 'ది పేషన్ ఆఫ్ జోన్ ఆఫ్ ఆర్క్' (1928); ఆర్సన్ వెల్స్ తీసిన 'సిటిజన్ కేన్' (1941); సెర్గీ ఐసెన్ స్టయిన్ తీసిన 'ఐవాన్ ది టెరిబుల్' మొదటి భాగం (1944); రెండవ భాగం (1958); అకిరా కురొసావా తీసిన 'రాషొమాన్' (1950); కెంజీ మిజోగూచి తీసిన 'యుగెట్సు మొనోగటారీ' (1953); ఇంగ్మార్ బెర్గ్ మన్ తీసిన 'వైల్డ్ స్ట్రాబెరీస్' (1957); అలైన్ రెనే తీసిన 'హిరోషిమా మోన్ అమోర్' (1959); జీన్ లూక్ గొడార్డ్ తీసిన 'బ్రెత్ లెస్' (1959); ఋత్విక్ ఘటక్ తీసిన 'మేఘేఢాకా తారా' (1960). వీటిలో 'ఇన్ టాలరెన్స్', 'గోల్డ్ రష్', 'సిటిజన్ కేన్', అమెరికన్ చిత్రాలు. 'ఐవాన్ ది టెరిబుల్' రెండు భాగాలు రష్యన్ చిత్రాలు. 'ది పేషన్ ఆఫ్ జోన్ ఆఫ్ ఆర్క్', 'హిరోషిమా', 'బ్రెత్ లెస్' ఫ్రెంచి చిత్రాలు. 'రాషొమాన్', 'యుగెట్సు మొనోగటారీ' జపాన్ చిత్రాలు. 'వైల్డ్ స్ట్రాబెరీస్' స్వీడిష్ చిత్రం. పథేర్ పాంచాలీ', 'మేఘే ఢాకాతారా' భారతీయ (బెంగాలీ) చిత్రాలు.

Picture
'నానూక్ ఆఫ్ ది నార్త్', 'సాంగ్ ఆఫ్ సిలోన్', 'లాస్ట్ జర్నీ'

డాక్యుమెంటరీలు-రాబర్డ్ ఫ్లాహెర్టీ తీసిన సైలెంట్ ఫిల్మ్ 'నానూక్ ఆఫ్ ది నార్త్', (1922); బేసిల్ రైట్ తీసిన 'నైట్ మెయిల్'; 'సాంగ్ ఆఫ్ సిలోన్' (1934); బెర్ట్ హాన్ స్ట్రా తీసిన 'డెల్టా ఫేస్ వన్'; సత్యజిత్ రే తీసిన 'రవీంద్రనాథ్ టాగోర్' (1961); భారత ప్రభుత్వపు ఫిల్మ్స్ డివిజన్ తీసిన 'లాస్ట్ జర్నీ' (మహాత్మాగాంధీ అంత్యక్రియలు).

Picture
'పా డె డూ', 'బిగ్ సిటీ బ్లూస్', 'హాపీ యానివర్సరీ'

షార్ట్ ఫిల్ములలో కెనడా దర్శకుడు నార్మన్ మెక్ లారెన్ తీసిన 'లవ్ యువర్ నైబర్', 'ఓపెనింగ్ స్పీచ్', 'పా డె డూ', కెనడా దర్శకుడు రాబర్డ్ వెరాల్ తీసిన 'ఎనర్జీ అండ్ మేటర్', చార్లెస్ వాన్ డెర్ లిండెన్ తీసిన 'బిగ్ సిటీ బ్లూస్', పియరీ ఇటాక్స్, జె.సి.కారిర్ తీసిన 'హాపీ యానివర్సరీ', టెరీశాండర్స్ తీసిన 'పోర్ట్రేట్ ఆఫ్ జూబిన్ మెహతా' ముఖ్యమైనవి.

Picture
'రాషొమాన్', 'పథేర్ పాంచాలీ'

కథా చిత్రాలలో 'రాషొమాన్', 'పథేర్ పాంచాలీ' చిత్రాలను ప్రధాన పాఠ్యాంశాలుగా నిర్ణయించారు. ఆ రెండు చిత్రాల పూర్తి స్ట్రిప్టులు విద్యార్థులకు పంచి పెట్టారు. ఆ చిత్రాలను రెండేసి సార్లు చూపించారు. వాటిపై సుదీర్ఘమైన చర్చలు జరిగాయి. మిగిలిన వాటిలో 'ఐవాన్ ది టెరిబుల్', 'మేఘేఢాకాతారా' చిత్రాలపైన కూడా చర్చలు జరిగాయి.

Picture
లూమిఎర్ సోదరులు

లూమిఎర్ సోదరులు (Lumière Brothers) 1896లో సినిమాను కనుగొన్నప్పటి నుంచి ఇప్పటివరకు సినిమా క్రమ వికాసాన్ని ప్రొఫెసర్ బహదూర్ పెక్కు చిత్రాలను ప్రదర్శిస్తూ బోధించారు. లూమిఎర్ సోదరులు సృష్టించిన ఏడు చిత్రాలు చూపించారు. ఒక్కొక్క చిత్రం ఒక్కొక్క నిమిషం నడిచే ఒక్కొక్క షాట్. ఆ రోజుల్లో ఎడిటింగ్ లేదు. కెమెరా మూవ్ మెంట్ లేదు. ఒక దృశ్యం ఎదుట కెమెరాను నిలబెట్టడం, స్విచ్ ఆన్ చేసి కొంతసేపు ఉంచి స్విచ్ ఆఫ్ చేయడం. ఆ దృశ్యాలు కొందరు నటిస్తుంటే తీసినవిగా కనిపించవు. ఒక ఫ్యాక్టరీ గేటు తెరవగానే కార్మికులంతా బయటకు గుంపులు గుంపులుగా వస్తున్న దృశ్యం ఒక షాట్. అక్కడికదే ఒక చిత్రం. 'రైలు ప్లాట్ ఫారం మీదకు వచ్చుట' అనేది ఇంకొక నిమిషం చిత్రం. 'నౌకాశ్రయం వద్ద ప్రయాణీకులు ఓడదిగి వచ్చుట' ఇంకొక చిత్రం. 'లూమిఎర్ ప్రోగ్రాం'లో ఈ మాదిరివి ఏడు ఉన్నాయి. ఆ రోజుల్లో అవి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. కదిలే బొమ్మలను చూపగలగడమే వారు సాధించిన అద్భుతకార్యం. వారు ప్రపంచమంతా తిరిగి, ప్రధాన నగరాలన్నింటిలోనూ తమ 'చలనచిత్రాలను' ప్రదర్శించి బాగా డబ్బు చేసుకున్నారు.

Picture
జార్జి మెలీస్

వారి తర్వాత సినిమాను ఒక వినోద సాధనంగా కొంతవరకు కళా ప్రక్రియగా కూడా ముందుకు తీసుకుపోయిన వాడు జార్జి మెలీస్. ట్రిక్ ఫొటోగ్రఫీకి అతడు మూల పురుషుడని చెప్పవచ్చు. అతడు స్వయంగా ఐంద్రజాలికుడు. తన ఇంద్రజాల విద్యను కెమెరా ఎదుట ప్రదర్శించి చిత్రాలు నిర్మించాడు. అతడి చిత్రాలలో నటీనటులు నటించడం, సెట్స్ ఉపయోగించడం జరిగింది. 1902లో అతడు నిర్మించిన 'హైడ్రోథెరపీ', 'ట్రిప్ టు మూన్' అనే ఇంద్రజాల, హాస్య చిత్రాలు చూపబడినాయి. ఆ చిత్రాలలో కూడా కెమెరా మూవ్ మెంట్ లేదు. అయితే విడివిడిగా తీసిన షాట్స్ ని ఒక క్రమంలో అతుకుపెట్టడం వరకు వచ్చింది. షాట్స్ అన్నీ మీడియం షాట్సే.

Picture
ది గ్రేట్ ట్రెయిన్ రాబరీ

1903లో పోర్టర్ తీసిన 'ది గ్రేట్ ట్రెయిన్ రాబరీ' ప్రపంచం మొత్తం మీద మొదటి ఫీచర్ ఫిల్మ్ (కథా చిత్రం) అని చెప్పవచ్చు. ఇది పావుగంటలోపు చిత్రం. మొదటిసారిగా ఇందులో కొన్ని లాంగ్ షాట్స్ ఉపయోగించబడినాయి. కొందరు దొంగలు తుపాకులతో రైలుపై దాడి చేసి, ప్రయాణీకులను దోచుకుని పారిపోవడం ఒక కథలాగా ఆసక్తిదాయకంగా చూపించాడు దర్శకుడు. దీనిని మొదటి థ్రిల్లర్ చిత్రంగా కూడా చెప్పవచ్చు.

Picture
డి.డబ్ల్యు.గ్రిఫిత్

సినిమాను ఒక కళా ప్రక్రియగా మలచి, అభివృద్ధి పరచినవాడు డి.డబ్ల్యు.గ్రిఫిత్. చలన చిత్ర కథనానికి ఆయన ఒక ఒరవడి పెట్టాడు. 1915లో ఆయన నిర్మించిన 'బర్త్ ఆఫ్ ఎ నేషన్', 1916లో నిర్మించిన 'ఇన్ టాలరెన్స్' చలన చిత్ర కళావికాస చరిత్రలో అతి ప్రధానమైనవి. వీటిలో 'ఇన్ టాలరెన్స్' చిత్రం ఈ కోర్సులో ప్రదర్శించబడింది. ఇందులో గ్రిఫిత్ ప్రప్రథమంగా క్లోజప్ ప్రవేశపెట్టాడు. అంతే కాక, కథనశైలిలో విప్లవం సృష్టించాడు. ఈ మధ్య మృణాల్ సేన్ 'కలకత్తా71' చిత్రంలో నాలుగు కథలను చెప్పినట్లుగా గ్రిఫిత్ ఆ రోజుల్లోనే ఒక చిత్రంలో నాలుగు కథలు చెప్పాడు. కెమెరా వర్క్, ఫిలిమ్ ఎడిటింగ్ అని చెప్పదగిన వాటిని మొదటగా ప్రవేశపెట్టినవాడు గ్రిఫిత్.

Picture
'ది బ్యాటిల్ షిప్ పొటెమ్కిన్'లో ఒడెస్సా స్టెప్స్ షాట్

1925లో రష్యన్ దర్శకుడు సెర్గీ ఐసెన్ స్టయిన్ 'ది బ్యాటిల్ షిప్ పొటెమ్కిన్' చిత్రంలో ఎడిటింగ్ తో అత్యద్భుతమైన ఫలితాలను సాధించాడు. ఆ చిత్రంలో అతి ముఖ్యమైన సన్నివేశం ఒడెస్సా స్టెప్స్ సీక్వెన్స్. సినిమాలో ఎడిటింగ్ ప్రాముఖ్యానికి అదొక గొప్ప ఉదాహరణ. చలన చిత్ర కళకు సంబంధించిన ప్రతి పుస్తకంలోనూ 'పొటెమ్కిన్' ప్రస్తావన-ముఖ్యంగా ఒడెస్సాస్టెప్స్ సీక్వెన్స్ ప్రస్తావన-తప్పనిసరిగా ఉంటుంది. ఈ కోర్సులో ఆ సీక్వెన్స్ తాలూకు ఒక రీలును మాత్రం చూపించారు.

థియరీ బోధనలో ప్రొఫెసర్ బహదూర్ 'షాట్స్' దగ్గర్నించి ప్రారంభించాడు. 'విజుయల్ షాట్స్', 'సౌండ్ షాట్స్', 'ఎడిటింగ్', 'కంటిన్యుటీ', 'కంపోజిషన్', 'కెమెరా పొజిషన్', 'కెమెరా మూవ్ మెంట్', 'లైటింగ్'లను వివరించారు. లాంగ్ షాట్, మీడియం షాట్, క్లోజప్, ట్రాక్ షాట్, పాన్, టిల్ట్, క్రేన్ షాట్-వగైరాలను గురించి చెప్పారు. ఎడిటింగ్ లో కట్, డిజాల్వ్, వైప్, ఫేడౌట్, ఫేడిన్ లను వివరించారు. 1934లో కింగ్ వైడర్ తీసిన 'అవర్ డెయిలీ బ్రెడ్' అనే చిత్రంలో ఛానెల్ డిగ్గింగ్ సీక్వెన్స్ (కొండ మీద నుంచి కాలువను త్రవ్వే సన్నివేశం)ను ప్రదర్శిస్తూ ఈ వివరాలన్నింటినీ ఆయన బోధించారు. ఆ సీక్వెన్స్ కు ఆయన ఎనాలసిస్ ప్రతులు విద్యార్థులకు పంచిపెట్టారు. ఆ సీక్వెన్స్ లో 'డిజాల్వ్' ఉపయోగించడం ఉద్దేశం ఎమిటో, 'ఫేడ్స్' ఎందుకు ఉపయోగించారో, 'పాన్', 'టిల్డ్'ల ప్రయోజనం ఏమిటో వివరించారు.

ఫిల్మ్ ఒక ప్రత్యేకమైన భాష. అన్ని భాషలలాగానే దీనికీ వ్యాకరణం ఉన్నది. పుస్తకం చదివి అర్థం చేసుకోవాలంటే భాష తెలిసి ఉండాలి. సినిమాను అర్థం చేసుకోవాలంటే సినిమా భాష తెలిసి ఉండాలి. సినిమా ఒక పుస్తకం లాంటిది. ఒక్కొక్క సీక్వెన్స్ ఒక్కొక్క అధ్యాయం వంటిది. వ్యాకరణం తెలియకపోయినా, పాఠశాలలో నేర్చుకొనక పోయినా, నిరక్షరాస్యులు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. ఇతరుల మాటలను అర్థం చేసుకుంటూనే ఉన్నారు. అలాగే సినిమా వ్యాకరణం తెలియకపోయినా చూసి 'కొంతవరకు' అర్థం చేసుకోవచ్చు. పుస్తకం అయినా సినిమా అయినా అర్థం చేసుకోవడంలో అనేక స్థాయిలున్నాయి. భాష తెలిసినా అందరికీ అన్ని పుస్తకాలూ అర్థం కావు. అర్థం కాని పుస్తకాలను వ్యాఖ్యానాల సహాయంతో అర్థం చేసుకోవచ్చు. కొన్ని పుస్తకాలు ఎన్నోసార్లు చదివితే గాని అర్థం కావు. వాటిలో ఎన్నో నిగూఢార్థాలు ఉంటాయి. సినిమాలూ అంతే. మనకు అర్ధం కానివన్నీ చెత్త సినిమాలను కోవడం మన అజ్ఞానానికి నిదర్శనం. 'భగవద్గీత', 'రామాయణం', 'భారతం' వంటి వాటిపై వందలాది వ్యాఖ్యాన గ్రంథాలు వెలువడ్డాయి. ఇంకా వెలువడుతూనే ఉన్నాయి. ప్రతి తరంలోనూ వెలువడుతూనే ఉంటాయి. కాని, సాహిత్యానికి ఉన్న చరిత్ర సినిమాకు లేదు. సినిమా పుట్టి ఇంకా ఎనభైయేళ్ళు కాలేదు. అయినా ఐసెన్ స్టయిన్, పుడోవ్కిన్, కురొసావా, అర్సన్ వెల్స్, డిసీకా, రెన్వా, సత్యజిత్ రే వంటి ప్రముఖుల చిత్రాలు కొన్ని కావ్యస్థాయి నందుకున్నాయి. వారిని గురించి, వారి చిత్రాలను గురించి ఇప్పుడిప్పుడు ఉద్గ్రంథాలు వెలువడుతున్నాయి. 'పొటెమ్కిన్', 'ఐవాన్ ది టెరిబుల్', 'సిటిజన్ కేన్', 'రాషొమాన్', 'బైసికిల్ థీవ్స్', 'పథేర్ పాంచాలీ' వంటి చిత్రాలను పాఠ్య గ్రంథాలుగా అధ్యయనం చేస్తున్నారు. వాటిపై పరిశోధనలు జరుపుతున్నారు. 30 ఏళ్ళ క్రిందట వెలువడిన కొన్ని చిత్రాలపై ఈనాడు థీసిస్సులు వస్తున్నాయి.

Picture
'సిటిజన్ కేన్', 'బర్త్ ఆఫ్ ఎ నేషన్'

సినిమా గురించి లోతుగా తెలుసుకోవాలనుకునేవారికి 'ఫిలిం అప్రీసియేషన్ కోర్సు' అతి ముఖ్యమైన మొదటి మెట్టుకాగలదు. ప్రతి విశ్వవిద్యాలయంలోనూ స్వల్ప కాలికమైన కోర్సుగా దీనిని ప్రవేశపెట్టడం అవసరం. బెంగళూరు విశ్వవిద్యాలయంలో ఈ కోర్సును ప్రవేశపెట్టాలనుకుంటున్నట్లు ఈ పది రోజుల కోర్సుకు ప్రారంభోత్సవం చేసిన విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు నరసింహయ్య చెప్పారు. ఈ కోర్స్ ను విశ్వవిద్యాలయాలు గానీ, కళాశాలలు గానీ, మరి ఏ సంస్థలు గానీ నిర్వహించదలచినట్లయితే పూనా ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్, నేషనల్ ఫిలిం ఆర్కైవ్ పూర్తి సహాయం అందజేయగలవని ప్రొఫెసర్ సతీష్ బహదూర్, పి.కె.నాయర్ హామీ ఇచ్చారు.

మన ఆంధ్రప్రదేశ్ లోని ఫిలిం సొసైటీలు కూడా ఇటువంటి అప్రీసియేషన్ కోర్సులు నిర్వహించడం, చలన చిత్రాల పట్ల ప్రేక్షకుల అభిరుచి పెంచడానికి ప్రచార దీక్షతో కృషి చేయడం ఎంతో అవసరం.

నండూరి పార్థసారథి
(1978 నవంబర్ లో ప్రజాతంత్రలో ప్రచురితమైనది.)

Previous Post Next Post