Title Picture

జవం గల కథ, జీవం గల పాత్రలు, నిర్దుష్టమైన సన్నివేశాల చిత్రీకరణతో సగటు తెలుగు సాంఘిక చిత్రాల అవధిని అధిగమించింది సారథి స్టూడియోస్ వారి 'కులదైవం'. భారతీయ ఉమ్మడి కుటుంబాలలో సహజమైన ఆనందం, విషాదం, ఉల్లాసం, కల్లోలం, అనురాగం, అసూయ, ఆప్యాయత, అపోహ, పశ్చాత్తాపం సమపాళలో మేళవించుకుని, భారత సంప్రదాయమంత నిండుగా, నిరాడంబరంగా ఉంది. 'కులదైవం'. 16 వేల పైచిలుకు నిడివిలో ఒక్క అడుగైనా ప్రేక్షకులకు విసుగు పుట్టించకుండా, అడుగడుగునా సానుభూతిని చూరగొన్నది.

ఆంగ్లేయ ప్రభావానికి ఎంతలోనైనా భారతీయ సంప్రదాయం ఇంకా ఎలా నిలచిఉందో, అలాగే ఉమ్మడి కుటుంబాలలో చిచ్చుపెట్టటానికి ఎవరెంత ప్రయత్నించినా, ఆస్తులను విడదీసినా, హార్ధిక సంబంధాన్ని, రక్త సంబంధాన్ని త్రెంచలేరనీ, అయితే ఈ కల్లోలంలో ఎవరో బలికాక మానరనీ నిరూపించటం 'కులదైవం' ఆశయం. ఈ విధంగా శిథిలమై తిరిగి చిగిర్చిన భారత సంప్రదాయానికి ప్రతిబింబంగా 'కులదైవం' రూపొందింది. తండ్రి చనిపోతూ పెద్ద కొడుకు చేతిలో ఆస్తి ఏమీ ఉంచలేకపోయినా మిగతా ముగ్గురి పిల్లలనూ పెంచి పెద్ద చేసే భారం మాత్రం ఉంచాడు. తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం పెద్ద కొడుకు రత్నం, తమ్ముళ్ళను కంటికి రెప్పలా కాపాడుతాడు. చదువు మానివేసి బట్టల మూటలు బుజాన వేసుకుని ఊరూరూ తిరిగి అమ్ముకునే వర్తకం ప్రారంభించాడు. క్రమంగా వ్యాపారం వృద్ధిచేసి సొంతదుకాణం పెట్టుకున్నాడు. దుకాణం నానాటికి వృద్ధి అయింది. తమ్ముళ్ళు వృద్ధిలోకి వచ్చారు. బుద్ధిమంతులయినారు. అన్నమాట జవదాటరు. పెద్ద తమ్ముడు రాము ప్లీడరు అయ్యాడు. రెండో తమ్ముడు రాజు డాక్టర్ అయ్యాడు. కడసారి వాడు గోపి ఇంకా చదువుతున్నాడు. పిల్లవాణ్ణి ప్రసవించి భార్య మరణించటం వల్ల, పసివాని కోసం రెండో వివాహం చేసుకున్నాడు రత్నం. శాంత (అంజలీదేవి) పేదకుటుంబంలో పుట్టినదైనా చదువు, సంస్కారం, గుణం ఉన్నది. రత్నం ఇద్దరు తమ్ముళ్ళకు వివాహం చేశాడు. రాజు భార్య ప్రభ (ఆదోని లక్ష్మి) గృహప్రవేశం చేస్తూనే కల్లోలం వెంట పెట్టుకుని వస్తుంది. శాంత మీద మండిపడుతూ ఉంటుంది. ఆమె ప్రోత్సాహంతో రాము భార్య అరుణ (కృష్ణకుమారి) కూడా అపోహలకు లోనై ఇంటిని నరక ప్రాయంగా చేస్తుంది. భార్యతో గోలపడలేక రాజు ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. అరుణ అన్న ప్రకాశ్ ఉమ్మడి కుటుంబ విచ్చిత్తికి పూనుకుంటాడు. చెల్లెలి కాపురాన్ని సరిదిద్దాలనే వంకతో వ్యాపారంలో జోక్యం కలుగచేసుకుంటాడు. పంపకాలు ఏర్పాటు చేస్తాడు. రత్నం ఆస్తిని పంచివేసి తాను గ్రామం చేరుకుని కాలక్షేపం చేస్తూ ఉంటాడు. వ్యాపారాన్ని నాశనం చేస్తాడు ప్రకాశ్. కుటుంబ విచ్చిత్తికి మనోవ్యాధితో మంచం పట్టుతాడు రత్నం. వ్యాధి క్రమంగా ముదురుతుంది. చివరికి అంతా పశ్చాత్తాపపడే ఘట్టం వచ్చేసరికి రత్నం మరణిస్తాడు. శాంత విధవ చెల్లెలు లతను గోపీకి ఇచ్చి వివాహం చేస్తారు.

శ్రీమతి ప్రభావతి సరస్వతి బెంగాలీలో రచించిన ఈ కథ లోగడ 'కులదైవం' అనే పేరిట తమిళ తెరమీదకు అనువదించబడింది. ఆ తర్వాత తమిళం నుంచి హిందీ తెరకు, హిందీతెర నుంచి ఇప్పుడు తెలుగుతెరకు అనువాదమయింది. అనువాదకులు, దర్శకుడు జి. కబీర్ దాస్.

'పయనించే ఓ చిలుకా' అనే నేపధ్య గీతంతో 'టైటిల్స్' ప్రారంభమవుతాయి. ఆ పాటకు కూర్చిన సంగీతం, ఘంటసాల పాడిన తీరు, పాటను చిత్రీకరించిన తీరు చాల చక్కగా ఉన్నాయి. రాగవరస హిందీ నుంచి తెచ్చుకున్నదైనా, హిందీ పాటకంటే చాలా బావుంది. టైటిల్స్ అయిపోయిన తరువాత ప్రథమ సన్నివేశం చాలా పేలవంగా ఉంది. చిత్రం పూర్వార్దంకంటే ఉత్తరార్ధం చాలా బిగువుగా ఉంది. పూర్వార్ధంలోని ప్రారంభ సన్నివేశాలన్నీ పేలవంగానే ఉన్నాయి. కథ సాగుతున్న కొద్దీ జవం, పుంజుకొన్నది. ఉమ్మడి కుటుంబ వాతావరణం ముచ్చటగా ఉంది.

చిత్రం విజయానికి కేవలం నటీనటులే బాధ్యులనిపిస్తుంది. కథ, సన్నివేశాలు, ఏ కొద్ది చోట్లనో మినహా, మిగతా 'షాట్స్' కూడా హిందీ చిత్రం 'భాభీ' సమకూర్చి పెట్టినవే కనుక, ఆ ఖ్యాతి దర్శకునికి చెందదు. భాష, నటీనటులు, సంగీతం, మినహా మిగతా చిత్రంలో 'భాభీ'కీ దీనికీ ఏమీ తేడా కనుపించదు. కేవలం ఆ చిత్రానికి ఇది అనువాదం మాత్రమే. దర్శకుని వ్యక్తిత్వం, కనుపించేందుకు అవకాశం లేదు. చిత్రం ఇంత ఉన్నతస్థాయిలో ఉండటానికి రచన కారణంగా కనుపించదు. మామూలు సగటు ధోరణిలోనే సాగింది రచన. కొసరాజు గారి పాటల రచన చౌకబారుగా ఉంది. జూనియర్ సముద్రాల పాటలలో కూడా కొత్తదనం లేదు. వేణు సంగీతం ఈమధ్య ఆయన కూర్చిన ఇతర చిత్రాల సంగీతం కంటే బాగుంది. ఉన్నతొమ్మిది పాటలలోనూ రెండు పాటల వరసలు హిందీ చిత్రం నుంచి తెచ్చుకున్నవి.

గుమ్మడి, అంజలీదేవిల నటన ప్రత్యేకంగా చెప్పుకోతగింది. 'మాయింటి మహలక్ష్మి' చిత్రం తర్వాత గుమ్మడి మరొకసారి చిరస్మరణీయమైన నటనను ప్రదర్శించాడు. భాభీ చిత్రంలోని బల్రాజ్ సహానీ నటనను మరిపించగలిగాడాయన. అలాగే 'ఇలవేలుపు' తర్వాత అంజలీదేవి మళ్ళీ అంత అద్భుతంగా నటించింది, కంటతడిబెట్టించింది. భర్త మరణానంతరం ఆమె ప్రదర్శించిన, నిరాడంబరత, సహనం, నిబ్బరం మరపురానివి. మిగిలినవారిలో చలం, గిరిజల నటనలను ప్రధానంగా చెప్పుకోవాలి. విధవవేషంలో గిరిజ అంత నిండుగా నటించగలగటం, గుండెపగిలే శోకాన్ని చలం అంత చక్కగా ప్రదర్శించగలగటం విస్మయాన్ని కల్గించాయి. కులాసా సన్నివేశాలలో వారిద్దరి నటనా మామూలుగానే ఉంది. జగ్గయ్య, కృష్ణకుమారి, ఆదోని లక్ష్మి, పెరుమాళ్ళు మొదలయినవారి నటనలు ఉచితంగా ఉన్నాయి. రేలంగి ఇందులో అతిధి నటుడు. ఆట్టే ఇబ్బంది పెట్టకుండా, అతిధిలాగానే వచ్చి కాసేపు కులాసా చేసి పోతూ ఉంటాడు. రచయిత : కొండేపూడి ; సంగీతం : వేణు ; దర్శకుడు : కబీర్ దాసు.

నండూరి పార్థసారథి
(1960 ఫిబ్రవరి 28వ తేదీన ఆంధ్రప్రభ సంచికలో ప్రచురితమైనది)

Previous Post Next Post