Title Picture

అపరాధ పరిశోధక చిత్రాలపట్ల ప్రత్యేకాభిమానం గలవారికి, శక్తి సామంత చిత్రాలను ఇది వరకు విరివిగా చూసిన వారికి 'జాలీనోట్' చిత్రం ఆశాభంగం కలిగించకపోవచ్చును. అపరాధ పరిశోధన తన అభిమానశాఖగా గ్రహించి శక్తిసామంత శక్తి వంచన లేకుండా కృషిసలుపుతున్నారు. ఈ శాఖలో ఆయన చెప్పుకోదగ్గ ప్రావీణ్యం సంపాదించారు. ఆయన చిత్రాలపై ప్రజలకు ఇటీవల విపరీతంగా మోజు పెరిగింది. ఈమధ్య ఆయన తీసిన చిత్రాలన్నీ విశేషంగా డబ్బు చేసుకున్నాయి.

దొంగనోట్లు ముమ్మరంగా చెలామణి అవుతున్న ఈ తరుణంలో అదే ఇతివృత్తంతో నిర్మించిన ఈ చిత్రం ప్రజలలో కావలసినంత ఉత్సాహాన్ని రేకెత్తించగలదనడంలో సందేహం లేదు. చెప్పుకోదగ్గ కథ ఏమీ లేకపోయినా, పాత్రలన్నీ ట్రేడ్ మార్కువే అయినా, సంగీతం మామూలుగానే ఉన్నా, నటనలో విశేషం లేకపోయినా, చిత్రీకరణలో కొత్తదనం లేకపోయినా, చెప్పుకోదగిన ప్రావీణ్యం ఉండటం చేత, ఉత్కంఠ పోషించబడటం చేత ఈ చిత్రం ఆర్థికంగా విజయవంతమౌతుంది.

హీరో చిన్నతంలోనే అతని తల్లిదండ్రులిద్దరికీ ఎడబాటు కలుగుతుంది. తన స్మృత్యర్థం తండ్రి కొడుకు (హీరో) మెడలో ఒక గొలుసు వేస్తాడు. ఇది కథాకాలం నాటికి సుమారు ఏ 15 సంవత్సరాల క్రితమో జరిగిన (ఫ్లాష్ బాక్) సంఘటన. కథాకాలం నాటికి హీరో సి.ఐ.డి. ఆఫీసరు. దొంగనోట్ల కేసును చేపట్టి, డ్యూటి కోసం కోటి వేషాలు వేసి, అపరాధాన్ని పరిశోధించి, ఈ కర్మకాండలో ఒక పడుచుపిల్ల (ప్రెస్ రిపోర్టర్)ను ప్రేమించి క్లైమాక్సులో దుష్టులచేత చిక్కుతాడు. దొంగనోట్ల ముద్రాపకుడు ఇతని తండ్రే అవుతాడు. ఇతని మెడలో గొలుసు చూసి కొడుకని తెలుసుకుంటాడు. పశ్చాత్తాపపడి చివరికి చచ్చిపోతాడు. దుష్టులు పోలీసులకు చిక్కుతారు. చిత్రం మొత్తం మీద ఒక్కచోట-దుష్టుడు దొంగ నోట్ల సూట్ కేసుతో పారిపోతుంటే హీరో వెంటాడి పట్టుకున్న దృశ్యాన్ని మాత్రం దర్శకుడు అద్భుతంగా చిత్రీకరించాడు. ఆ ఒక్క దృశ్యం హాలీవుడ్ డిటెక్టివ్ చిత్రాలను తలపింపచేసింది. మొత్తం మీద ఆదిలో ఉన్నంత గొప్పగా అంతంలో లేదు.

నయ్యర్ సంగీతం మోతగా ఉంది. టైటిల్ సంగీతం మాత్రం అద్భుతంగా, బొంబాయి చిత్రాలలో ఈమధ్య ఎన్నడూ విననంత గొప్పగా ఉంది. మొత్తం ఎనిమిది పాటలున్నాయి. వీటిలో రెండు పాటల వరసలు హాయిగా ఉన్నాయి. సంగీతం కంటే, దర్శకత్వం కంటే, ఛాయాగ్రహణం మరొక మెట్టు ఉన్నతస్థాయిలో ఉన్నది. నటీనటులంతా మామూలు తరహాలో నటించారు. వినోదం కోసం ఒకసారి చూడతగిన చిత్రం.

దర్శకత్వం: శక్తి సామంత; సంగీతం: ఒ.పి.నయ్యర్; తారాగణం: దేవానంద్, మధుబాల, బిపిన్ గుప్త, ఓం ప్రకాశ్, మదన్ పూరి, హెలెన్, కుందన్, టున్ టున్ వగైరా.

నండూరి పార్థసారథి
(1961 ఫిబ్రవరి 5వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post