హిందూస్థానీ సంగీతం గురించి తెలుసుకోగోరే వారందరూ తప్పక చదవ వలసిన పుస్తకం పండిత్ రవిశంకర్ రచించిన 'My music, my life'. హిందూస్థానీ సంగీతం పట్ల ఆసక్తి ఉండి, శాస్త్ర పరిజ్ఞానం అంతగా లేని వారు తేలికగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఆయన ఆ పుస్తకాన్ని రచించారు. ప్రధానంగా పాశ్చాత్య దేశాల్లోని సంగీత ప్రియులను మనస్సులో పెట్టుకుని రచించారు. అందులో ఆయన తన (హిందూస్థానీ) సంగీతం గురించి, తన జీవితం గురించి సంగ్రహంగా అయినా సమగ్రంగా రాశారు. సంగీత శాస్త్రానికి సంబంధించిన వివరాల జోలికి మరీ ఎక్కువగా పోకుండా, భారతీయ సంగీతాన్ని గురించి - ముఖ్యంగా హిందూస్థానీ సంగీతాన్ని గురించి - తెలుసుకోవలసిన ముఖ్యాంశాలను వేటినీ విడిచి పెట్టకుండా చాలా పకడ్బందీగా రచించారు. 1/4 డెమీ సైజులో 160 పేజీలున్న ఈ పుస్తకంలో ఫొటోలు చిత్రాలు అరవై పైగా ఉన్నాయి. వికాస్ పబ్లికేషన్స్ (బొంబాయి) వారు ప్రచురించిన ఈ పుస్తకం వెల 40 రూపాయలు.

ఇందులో మొదట యెహూదీ మెనూహిన్ భారతీయ సంగీతం గురించి, రవిశంకర్ గురించి 'పరిచయం' రాశారు. తర్వాత రవిశంకర్ 'ఉపోద్ఘాతం'లో తన గ్రంథ రచనోద్దేశాన్ని వివరించారు. ఆ తర్వాత నాలుగు అధ్యాయాలున్నాయి - మొదటిది 'My Heritage' (నా వారసత్వం); రెండోది 'My Masters' (నా గురువులు); మూడోది 'My self' (నేను); నాలుగోది 'A Manual for the Sitar' (సితార్ పాఠాలు); చివర 'Glossary' (పారిభాషిక పద నిఘంటువు) ఉంది.

మొదటి అధ్యాయంలో భారతీయ సంగీత తత్వం గురించి, శాస్త్రం గురించి, చరిత్ర గురించి, సంప్రదాయాలను గురించి రాశారు. వేదకాలం నుంచి నేటి వరకు భారతీయ సంగీత పరిణామ క్రమాన్ని సింహావలోకనం చేశారు. నాదం, స్వరం, రాగం, తాళం మొదలైన వాటిని వివరించారు. హిందూస్థానీ సంగీతంలోని 'థాట్' (మేళకర్త)లను గురించి రాశారు. సంగీతంలో నవరసాలను గురించి చర్చించారు. ధ్రుపద్, ఖయాల్, ఠుమ్రీ, తరానా, టప్పా వంటి రీతులను వర్ణించారు. సితార్, సరోద్, శహనాయ్, వేణువు, సారంగి, దిల్రుబా, సుర్ బహార్, బీన్ వగైరా పెక్కు హిందూస్థానీ సంగీత వాద్యాల స్వరూప స్వభావాలను వివరించారు. ఆ వాద్యాల ఫొటోలు కూడా ప్రచురించారు.

రెండో అధ్యాయంలో 'నారదీయ శిక్ష' రచించిన నారదుని (క్రీ.శ. 1వ శతాబ్దం) మొదలుకొని నేటి వరకు ప్రముఖ సంగీత లక్షణకర్తలు, విద్వాంసులందరి గురించి రాశారు. 'నాట్యశాస్త్రం' రచించిన భరతుడు, 'బృహద్దేశి' రచించిన మతంగుడు, 'సంగీత రత్నాకరం' రచించిన శారంగదేవుడు, బహుముఖ ప్రజ్ఞావంతుడు అమీర్ ఖుస్రూ, స్వామిహరిదాస్, మియాఁతాన్ సేన్, బిలాస్ ఖాన్ మొదలైన వారందరినీ పరామర్శించి, చివరికి తన గురువుగారైన ఉస్తాద్ అల్లాయుద్దీన్ ఖాన్ గురించి, ఆయన గురువైన ఉస్తాద్ వజీర్ ఖాన్ గురించి రాశారు.

మూడో అధ్యాయంలో తన కుటుంబ విశేషాలను, తన జీవిత విశేషాలను రాశారు. మరీ చిన్నతనంలో గడిపిన రోజులు, తర్వాత అన్నగారైన ఉదయశంకర్ తో కలిసి పారిస్ లో గడిపిన రోజులు, ఉస్తాద్ అల్లాయుద్దీన్ ఖాన్ తో పరిచయం, మైహర్ గ్రామంలో ఆయన వద్ద శిష్యుడుగా గడిపిన కాలం, 'ఆకాశవాణి' లో ఉద్యోగం, విదేశ పర్యటనలు... వీటినన్నింటినీ కథలాగా చెప్పారు.

చివరి అధ్యాయంలో సితార్ కు సంబంధించిన ప్రాథమిక పాఠాలు ఇచ్చారు. సితార్ ను శ్రుతి చేయవలసిన పద్ధతి, తీగెలు బిగించవలసిన పద్ధతి, సితార్ వాయించడానికి కూర్చునే పద్ధతి, పట్టుకొనే పద్ధతి ఫొటోల సహాయంతో, రేఖా చిత్రాల సహాయంతో వివరించారు. పది 'థాట్' రాగాల ఆరోహణ-అవరోహణలు ఇచ్చారు. రేఖా చిత్ర సహాయంతో సితార్ పై స్వరస్థానాలను చూపి, తంతులపై ఎడమ చేతి వ్రేళ్ళు ఎలా పెట్టాలో, కుడిచేతి చూపుడు వ్రేలుతో ఎలా మీటాలో ఫొటోల సహాయంతో చూపించారు. సరిగమలు అభ్యాసం చేసేపద్ధతి, 'బోల్'లు అభ్యాసం చేసే పద్ధతి వివరించారు. ఆ తర్వాత కృంథన్, జమ్ జమా, మీండ్ వంటి గమకాలను అభ్యాసం చేసే పద్ధతి వివరించారు. 21 రాగాలలో 'సర్గమ్'లు ఇచ్చారు.

రవిశంకర్ దగ్గర సితార్ నేర్చుకోవాలన్న తహతహ ఎంతో మందికి ఉంటుంది. కాని, అందరికీ ఆయన దగ్గర నేర్చుకునే అవకాశం లభించదు. లభించినా, సరిగమల దగ్గర్నించి నేర్పడం ఆయనకు సాధ్యం కాదు. ఈ పుస్తకంలో ఆయన ఇచ్చిన పాఠాలన్నీ ఆయన శిష్యుల దగ్గరో, ప్రశిష్యుల దగ్గరో బాగా నేర్చుకుని, సాధన చేసి అప్పుడు ఆయన దగ్గరకు వెడితే ఆయన నేర్పుతారు. ఆ ఉద్దేశంతోనే ఆయన ఈ పుస్తకంలో ఆ పాఠాలు యిచ్చారు. దేశ విదేశాలలో ఆయనకు దాదాపు ఆరు వందలమంది శిష్యులున్నట్లు అంచనా. అందరికీ ఆయన యిచ్చే ప్రాథమిక పాఠాలు యివే. సితార్ నేర్చుకొనే వారికి, నేర్పే వారికి కూడా ఈ పాఠాలు ఎంతో ఉపయోగపడతాయి.

హిందూస్థానీ సంగీత ప్రియులు, ముఖ్యంగా సితార్ ప్రియులు, ఇంకా ముఖ్యంగా రవిశంకర్ అభిమానులు కొనుక్కోదగిన పుస్తకం యిది.

నండూరి పార్థసారథి
(1974 జూలై 12వ తేదీన ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమయింది)

Previous Post Next Post