Title Picture
రాజాహరిశ్చంద్ర

1895 డిసెంబరు 28వ తేదీన ల్యూమెరీ సోదరులు పారిస్ లో ప్రప్రథమంగా తమ 'సినిమెటోగ్రాఫ్'ను ప్రదర్శించి, ప్రపంచానికి సినిమాను పరిచయం చేశారు. ఆ తర్వాత ఏడు నెలలకే 1896 జూలైలో బొంబాయి ప్రేక్షకులు 'సజీవంగా కదిలే ఛాయాచిత్రాల' విడ్డూరాన్ని చూసి ముగ్ధులైనారు. అంటే మన దేశానికి సినిమా వేంచేసి 80 సంవత్సరాలు దాటింది.

బొంబాయిలో 'ల్యూమెరీప్రోగ్రాం' తొలి ప్రదర్శనలను తిలకించి ముగ్ధులైన వారిలో హరిశ్చంద్ర సఖారాం భట్వాడేకర్ ఒకరు. ఆయన వెంటనే ఒక మూవీ కెమేరాను దిగుమతి చేసి బొంబాయిలో ఒక కుస్తీపోటీని ఫిల్ము తీశాడు. ఆ విధంగా ఆయన 1896లోనే భారతదేశంలో చలన చిత్రాల తయారీకి ప్రారంభోత్సవం చేశాడు. పూనా రేసులను ఒక చిన్న చిత్రంగా తీశాడు. ఆర్.పి. పరంజపే అనే యువకుడు కేంబ్రిడ్జి యూనివర్సిటీలో గణితంలో ప్రథముడుగా ఉత్తీర్ణుడై తిరిగి వచ్చినప్పుడు ఆయనకు పూలమూలలతో ఘన స్వాగత మిచ్చిన సంఘటనను కూడా ఆయన చలన చిత్రంగా తీశాడు. బహుశా మన దేశంలో తొలి న్యూస్ రీలు అదే. భట్వాడేకర్ ఒక ప్రొజెక్టర్ ను దిగుమతి చేసి ఊరూరూ తిరిగి విదేశీ చిత్రాలను, తాను తీసిన చిన్న చిత్రాలను ప్రదర్శించడం ప్రారంభించారు. తర్వాత మన దేశంలో మరి కొందరుకూడా చిన్న చిన్న 'టాపికల్' చిత్రాలను తీయడం ప్రారంభించారు.

1898లో అమెరికాలో ఏసుక్రీస్తును గురించిన ఒక నాటకంలోని కొన్ని భాగాలను ఫిల్ముగా తీశారు. 1903లో అదేవిధంగా మన దేశంలో హీరాలాల్ సేన్ అనే ఆయన ఒక నాటకంలోని కొన్ని భాగాలను ఫిల్ముగా తీశాడు. 1903లోనే అమెరికాలో ఇ.ఎస్. పోర్టర్ 'ది గ్రేట్ ట్రెయిన్ రాబరీ' అనే ఎనిమిది నిమిషాల కథాచిత్రాన్ని నిర్మించాడు. ప్రపంచంలో మొదటి ఫీచర్ ఫిల్మ్ అదే.

ఆ రోజుల్లో మన దేశంలో సినిమాలకు ప్రత్యేకంగా థియేటర్లు లేవు. ఆరుబైట, హోటళ్ళలో, నాటకశాలల్లో సినిమాలు చూపించేవారు. జెంషెడ్జీ ఫ్రాంజీ మదన్ 1907లో ప్రప్రథమంగా కలకత్తాలో ఎల్ఫిన్ స్టోన్ పిక్చర్ ప్యాలెస్ అనే సినిమా థియేటర్ ను నిర్మించారు.

Picture
దాదా ఫాల్కే

ఫాల్కే శకం

1912లో ఢూండి రాజ్ గోవింద్ ఫాల్కే చలన చిత్ర రంగంలో ప్రవేశించే నాటికి మన దేశంలో విదేశీ చిత్రాలదే పై చేయిగా వుండేది. ఆయన దేశంలో తొలి కథా చిత్రం 'రాజాహరిశ్చంద్ర'ను నిర్మించి భారతీయ చలన చిత్ర చరిత్ర గతిని పూర్తిగా మార్చి వేశారు. రాజా హరిశ్చంద్రకు సరిగా ఏడాది ముందే 1912 మే 18వ తేదీన బొంబాయిలో దాదా సాహెబ్ ఆర్.జి. టోర్నీ తీసిన 'పుండలీక్' చిత్రం విడుదలయింది. ఈ విషయం ఇటీవల కొత్తగా వెల్లడి కావడంతో దేశంలో మొదటి కథా చిత్రం 'పుండలీక్' అని కొందరు భావిస్తున్నారు. కాని, నిజానికి పుండలీక్ పూర్తిగా ఫొటోగ్రాఫ్ చేయబడిన నాటకం మాత్రమే.

ఫాల్కే బహుముఖ ప్రజ్ఞావంతుడు. భారత చలన చిత్ర పితామహుడనే గౌరవానికి అన్ని విధాలా తగినవాడు. ఆయన చిత్రాలకు ఆయనే నిర్మాత, దర్శకుడు, రచయిత, కెమెరామన్, సెట్ డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్. ఆయన తన చిత్రాలను తానే ఎడిట్ చేసుకునేవాడు. ప్రాసెసింగ్ కూడా స్వయంగా చేసుకునేవాడు. ఆయన ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఆయన చిత్రాలలో అవసరాన్ని బట్టి ఏదో ఒక వేషం వేస్తూ ఉండేవారు.

చిత్ర నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఆయన ఫిల్మ్ రీళ్ళను, ప్రొజెక్టర్ ను, తెరను రెండెడ్ల బండిలో వేసుకుని గ్రామాలకు వెళ్ళి, బేడా టిక్కెట్టుతో ప్రదర్శించే వారు. ఆయన చిత్రాలు బర్మా, సింహళ దేశాలలో కూడా ప్రదర్శింపబడినాయి.

ఫాల్కే సినిమాను సామాన్య ప్రజల వినోద సాధనంగానే తప్ప, విద్యావంతులను రంజింపజేయగల కళా ప్రక్రియగా భావించలేదనే చెప్పాలి. అందుకే ఆయన తన చలన చిత్ర శైలికి ప్రాతిపదికగా మన ప్రాచీన సంస్కృత నాటక సంప్రదాయాన్ని కాక, తన కాలం నాటికి బాగా ప్రచారంలో వున్న కంపెనీ నాటకాలశైలిని స్వీకరించాడు. పురాణ గాధలలో మాయలు, మంత్రాలు ఉంటాయి. కనుక ట్రిక్ ఫొటోగ్రఫీని కూడా ప్రవేశపెట్టాడు. ఆ విధంగా ఆయన మన దేశంలో కమర్షియల్ సినిమాకు ఒక ఒరవడి పెట్టాడు. ఈనాటి వరకు మన కమర్షియల్ సినిమా ఫాల్కే ఫార్ములాను దాటి బైటపడలేక పోయింది.

ఫాల్కే మొత్తం 128 చిత్రాలు తీశాడు. వాటిలో 106 కథా చిత్రాలు. అన్నీ పౌరాణికాలే. 'టాకీ' అవతరణతో ఆయన బాగా దెబ్బతిన్నాడు. ఆయన తీసిన కొద్దిపాటి టాకీ చిత్రాలు విజయవంతం కాలేదు. 1934లో 'గంగావతరణం' అనే చిత్రంతో ఆయన సినిమా రంగం నుంచి నిష్క్రమించాడు. 1944లో కీర్తి శేషుడయ్యాడు.

మూగ చిత్రాల కాలంలో చలన చిత్ర పరిణతికి దోహదం చేసిన వారిలో ధీరేన్ గంగూలీ, చందూలాల్ షా, హిమాంశురాయ్ చెప్పుకోదగినవారు. వీరు ఫాల్కే శైలికి పూర్తిగా భిన్నమైన చిత్రాలను నిర్మించారు. ధీరేన్ గంగూలీ 1921లో 'ఇంగ్లండ్ రిటర్డ్న్' అనే హాస్య చిత్రాన్ని తీశాడు. దేశంలో మొదటి సాంఘిక చిత్రం అదే. అంటే 'రాజాహరిశ్చంద్ర' తర్వాత ఎనిమిదేళ్ళు పౌరాణిక చిత్రాలు ఎడతెరిపి లేకుండా రాజ్యమేలాయన్న మాట. గంగూలీ 1922లో హైదరాబాద్ లో లోటస్ ఫిలిం కంపెనీ నెలకొల్పి చాలా హాస్య, వ్యంగ్య చిత్రాలు నిర్మించాడు. 1924లో 'రజియా బేగం' అనే చరిత్రాత్మక చిత్రంతో బాగా దెబ్బతిని, కలకత్తాకు తిరిగి వెళ్ళాడు. అక్కడ ఆయన, దేవకీ బోస్ కలిసి తీసిన చిత్రాలు విదేశాల నుంచి దిగుమతి అవుతున్న టాకీల ధాటికి తట్టుకోలేక అపజయం పొందడంతో గంగూలీ, బోస్, పి.సి. బారువా 1930లో బి.ఎన్. సర్కార్ ప్రారంభించిన న్యూ థియేటర్స్ లో చేరిపోయారు.

1924లో రంగంలో ప్రవేశించిన చందూలాల్ షా కూడా సాంఘిక చిత్రాలే తీశాడు. 1925లో ఆయన తీసిన 'గుణసుందరి' అప్పట్లో విప్లవాత్మక చిత్రం అనిపించుకున్నది. ఆ చిత్రంలో అప్పటి 'బ్యూటీక్వీన్' గోహార్ నటించింది. తర్వాత 'టైపిస్ట్ గర్ల్' అనే చిత్రంలో ఆయన సులోచనా రూబీ మెయర్స్ ను తెరకు పరిచయం చేశారు. (ఈమెకు మూడు సంవత్సరాల క్రితం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వబడింది). చందూలాల్ షా తర్వాత రంజిత్ ఫిలిం కంపెనీ నెలకొల్పి 130 పైగా చిత్రాలు తీశాడు.

హిమాంశురాయ్ ఇంగ్లండ్ లోనూ, జర్మనీ లోనూ శిక్షణ పొందిన ఉన్నత విద్యావంతుడు. ఆయన ఒక జర్మన్ ఫిలిం కంపెనీతో కలిసి 'లైట్ ఆఫ్ ఏషియా' (1925), 'త్రో ఆఫ్ డైస్', 'షిరాజ్' (1926) చిత్రాలను నిర్మించాడు. జర్మన్ డైరెక్టర్ ఫ్రాంజ్ ఆస్టెన్ ఆ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. గౌతమ బుద్ధుని జీవితం ఇతి వృత్తంగా గల 'లైట్ ఆఫ్ ఏషియా' చిత్రం కళా ప్రమాణాల దృష్ట్యా మన దేశంలో తయారైన మూగ చిత్రాలన్నింటిలోకి మేలైనదిగా చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లోనే హిమాంశురాయ్, దేవికారాణి దంపతులైనారు. ఇద్దరూ కలిసి 'బాంబే టాకీస్' సంస్థను ప్రారంభించి పెక్కు చిత్రాలు నిర్మించారు.

'రాజాహరిశ్చంద్ర' నుంచి 'ఆలం ఆరా' వరకు మనదేశంలో సుమారు 1300 మూగ చిత్రాలు తయారయ్యాయి. కాని, కళా ప్రమాణాల దృష్ట్యా మనం గర్వించదగిన చిత్రం వాటిలో ఒక్కటి కూడా లేదు. 1915 నాటికే అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీలలో సినిమా-నాటక ప్రభావం నుంచి విముక్తమై-ఒక స్వతంత్ర కళా ప్రక్రియగా అభివృద్ధి చెందింది. గ్రిఫిత్, ఐసెన్ స్టైన్, పుడోవ్కిన్, చాప్లిన్ తీసిన సైలెంట్ చిత్రాలను చలన చిత్ర కళా ప్రియులు ఇప్పటికీ ఆరాధిస్తున్నారు. ప్రపంచానికి తొలి సినిమా పాఠాలు నేర్పిన గొప్ప దర్శకులు వారు. కాని మన సైలెంట్ చిత్రాలు ఫొటో గ్రాఫ్ చేసిన నాటకాల లాగా ఉండేవి. వాటిలో చాలా చిత్రాలు పౌరాణికాలు. అవి మొరటుగా ఉండి ఉత్తమాభిరుచిగల వారికి నచ్చేవి కావు.

టాకీ యుగం

1928లో విడుదలైన 'జాజ్ సింగర్' అనే అమెరికన్ చిత్రం ప్రపంచం మొత్తం మీద మొట్ట మొదటి పూర్తి నిడివి టాకీ చిత్రం. కాని, మన దేశంలో ప్రదర్శింపబడిన మొదటి టాకీ 'మెలోడీ ఆఫ్ లవ్' అనే అమెరికన్ చిత్రం. అది 1929లో మన దేశానికి వచ్చింది. టాకీల విడుదల చలన చిత్ర ప్రపంచంలో తీవ్ర సంచలనం కలిగించింది. ప్రజలు ఇక సైలెంట్ చిత్రాలను ఆదరించరనీ, రంగంలో ఉండదలుచుకుంటే టాకీ చిత్రాలు తీయడం తప్ప గత్యంతరం లేదనీ నిర్మాతలు గ్రహించారు. బహుభాషా నిలయమైన భారతదేశానికి ఇది మరీ పెద్ద సమస్య అయింది. ఈ భాషా సమస్య పరిష్కారానికి సంగీత నృత్యాలను ఉపయోగించుకోవచ్చునని నిర్మాతలు కనిపెట్టారు. భాష అర్థం కాకపోయినా పాటల కోసం, డాన్సుల కోసం అన్యభాషల వారు చూస్తారని ఊహించారు. వారి ఊహ నిజమే అయింది.

1931లో విడుదలైన తొలి భారతీయ టాకీ చిత్రం 'ఆలంఆరా' విపరీతంగా డబ్బు చేసుకుంది. ఇంపీరియల్ ఫిలిం కంపెనీ అనే బొంబాయి సంస్థ నిర్మించిన ఆ హిందీ చిత్రంలో డజను పాటలు, కొన్ని డాన్సులు ఉన్నాయి. ఆ చిత్రం హిట్ కావడంతో ప్రతి టాకీ చిత్రానికి పాటలు, డాన్సులు తప్పనిసరి అయినాయి. పాటలు శాస్త్రీయ శైలిలోకాక, జన సామాన్యం పాడుకోవడానికి వీలుగా ఉండడం కూడా తప్పనిసరి అయింది. ఆ ఏడాది దేశంలో 23 హిందీ చిత్రాలు, మూడు బెంగాలీ చిత్రాలు, తెలుగు, తమిళ భాషలలో చెరొక చిత్రం విడుదలైనాయి. మూకీ చిత్రాల కాలంలో గొప్పగా వెలిగిన కొన్ని సంస్థలు టాకీల అవతరణతో మూత పడ్డాయి. వాటిలో ఫాల్కే సంస్థ ఒకటి.

వైతాళికులు

టాకీయుగం ప్రారంభం కావడంతో భారతీయ చిత్రాల కళా ప్రమాణం పెరిగింది. మంచి అభిరుచి, సంస్కారం, కళాదృష్టిగల యువతరం మేధావులు కొందరు చలన చిత్ర రంగానికి నాయకత్వం వహించారు. వారిలో ముఖ్యులు-బి.ఎన్. సర్కార్, దేవకీబోస్, పి.సి. బారువా, శాంతారాం, దామ్లే, ఫతే లాల్, హిమాంశురాయ్ వీరందరూ ఒకే వయోవర్గం వారు. ఒకేసారి సినిమా రంగంలో ప్రవేశించారు. టాకీ యుగానికి వారు వైతాళికులు. విద్యావంతులను సైతం ఆకట్టుకోగల సమస్యాత్మక, కళాత్మక, వాస్తవిక చిత్రాలను వారు నిర్మించారు.

Picture
వి.శాంతారాం

ప్రభాత్ ఫిలిం కంపెనీ

1921 నుంచి 1928 వరకు మహారాష్ట్ర ఫిలిం కంపెనీలో ఉండి పెక్కు చిత్రాలలో నటించి, కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించిన శాంతారాం 1929లో కొల్హాపూర్ లో ప్రభాత్ ఫిలిం కంపెనీ ప్రారంభించాడు. (శాంతారాం ఇంటి పేరు వనకుదురు. ఆయన పూర్వులు ఆంధ్ర నుంచి మహారాష్ట్రకు వలస పోయారట). ఆయన దర్శకత్వం వహించిన తొలి టాకీ 'అయోధ్యా కా రాజా' (హిందీ, మరాఠీ) 1932లో విడుదలయింది. 63 నుంచి ఆయన 'వి. శాంతారాయ్ ఫిలింస్' పేరిట చిత్రాలు నిర్మిస్తున్నాడు. 1921 నుంచి ఆయన నటించిన, దర్శకత్వం వహించిన, నిర్మించిన చిత్రాల సంఖ్య దాదాపు వంద. మన దేశంలో ఇన్ని చిత్రాల అనుభవం మరెవ్వరికీ లేదని చెప్పవచ్చు.

Picture
బిమల్ రాయ్

న్యూ థియేటర్స్

భారత చలన చిత్ర చరిత్రలో న్యూ థియేటర్స్ సంస్థ అనేక విధాల సాటిలేనిది. అంత దీర్ఘకాలం అన్ని చిత్రాలను-అన్ని మంచి చిత్రాలను అందించిన సంస్థ, అంత మంది ప్రతిభావంతులను పోషించిన సంస్థ మరొకటి లేదు. 1931లో బి.ఎన్. సర్కార్ కలకత్తాలో ఆ సంస్థను నెలకొల్పారు. అప్పట్లో న్యూథియేటర్స్ స్టూడియో దేశం మొత్తం మీద అత్యంత ఆధునాతనమైనది. ఆ సంస్థ వెలువరించిన తొలి చిత్రం 'దేనా పోనా' (బెంగాలీ). చివరి చిత్రం 1955లో వెలువడిన 'బకుల్'. సర్కార్ ఏ చిత్రానికీ దర్శకత్వం వహించలేదు. కాని, ప్రతిభను పసిగట్టడంలో ఆయనకు గొప్ప ప్రతిభ ఉన్నది. దేవకీబోస్, బారువా, నితిన్ బోస్, ఫణి మజుందార్, బిమల్ రాయ్ వంటి గొప్ప దర్శకులు, సైగల్, పహరీ సన్యాల్, పృధ్వీరాజ్ కపూర్ వంటి గొప్ప నటులు, ఆర్.సి. బోరాల్, పంకజ్ మల్లిక్, తిమిర్ బరన్ వంటి గొప్ప సంగీత దర్శకులు న్యూ థియేటర్స్ లో పనిచేశారు.

1941లో న్యూ థియేటర్స్ స్టూడియోలో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి పెక్కు చిత్రాల నెగిటివ్ లు దగ్ధమైపోయాయి. అది ఆ సంస్థకు మొదటి పెద్ద దెబ్బ. 1942లో సైగల్, బారువా, దేవకీబోస్ వంటి ముఖ్యులు సంస్థ నుంచి నిష్క్రమించడం మరొక దెబ్బ. 1950 తర్వాత చౌకబారు ఆకర్షణలతో కూడిన కమర్షియల్ చిత్రాల ధాటికి తట్టుకోలేక న్యూ థియేటర్స్ చిత్రాలు బాగా దెబ్బతిన్నాయి. 1955లో 'బకుల్' చిత్రంతో సంస్థ మూతబడింది. 1956లో సర్కార్ ప్రొడక్షన్స్ పేరుతో 'అమర్ సైగల్', 'బంధన్' అనే రెండు చిత్రాలను సర్కార్ నిర్మించాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన చిత్రం తీయలేదు.

Picture
దేవికారాణి, హిమాంశురాయ్

బాంబే టాకీస్

విదేశీ చిత్ర సంస్థలతో, విదేశీ సాంకేతిక నిపుణులతో కలిసి చిత్రాలు తీసిన తొలి భారతీయుడు హిమాంశురాయ్. 'ఎమెల్కా' జర్మన్ సంస్థ సహకారంతో మూడు సైలెంట్ చిత్రాలు తీసిన తర్వాత ఆయన ఒక బ్రిటిష్ సంస్థ సహకారంతో 'కర్మ' (ఫేట్) అనే టాకీ చిత్రాన్ని హిందీ, ఇంగ్లీషు భాషల్లో నిర్మించాడు. అందులో ఆయన, ఆయన భార్య దేవికారాణి ప్రధానపాత్రలు ధరించారు. దేశ విదేశాలలో ఆ చిత్రం విశేష ప్రశంస లందుకున్నది. దేవికారాణి 'ఫస్ట్ లేడీ ఆఫ్ ది ఇండియన్ స్క్రీన్' అనిపించుకుంది. 1934లో హిమాంశురాయ్ భారీ యెత్తున బాంబేటాకీస్ సంస్థను నెలకొల్పాడు. ఆ సంస్థ నిర్మించిన 'అఛూత్ కన్య' (1936) చిత్రం దేశంలో విశేష సంచలనం కలిగించింది. అందులో హరిజన యువతిగా దేవికారాణి, ఆమెను ప్రేమించిన బ్రాహ్మణ యువకునిగా అశోక్ కుమార్ నటించారు. 1940లో హిమాంశురాయ్ ఆకాలమరణంతో బాంబేటాకీస్ చిత్రాల నాణ్యం క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. 1945 వరకు దేవికారాణి ఆ సంస్థను నిర్మహించింది. తర్వాత ఆమె కూడా నిష్క్రమించింది. 1952లో సంస్థ మూత బడింది.

1930, 1940 దశాబ్దాలలో విరివిగా, విజయవంతంగా చిత్రాలను నిర్మించిన మరి కొన్ని సంస్థలు-ఇంపీరియల్, వాడియా, రంజిత్, మినర్వా, మెహబూబ్, ఈస్టిండియా ఫిలిం కంపెనీలు. వాడియా సంస్థ 'హంటర్ వాలీ' వంటి స్టంటు చిత్రాలను ఎక్కువగా నిర్మించింది. సైగల్ 1942లో కలకత్తా నుంచి బొంబాయికి మకాం మార్చిన తర్వాత రంజిత్ సంస్థ నిర్మించిన 'తాన్ సేన్', 'సూరదాస్', 'హర్ జాయ్', 'భవరా', 'షాజహాన్' వంటి పెక్కు చిత్రాలలో నటించాడు. 1946లో మరణించే వరకు సైగల్ భారత చిత్ర సీమలో తొలి సూపర్ స్టార్. 1945 ప్రాంతంలో రంగంలోకి ప్రవేశించినవారిలో బిమల్ రాయ్, రాజ్ కపూర్, అబ్బాస్ లను చెప్పుకోవాలి. అబ్బాస్ 1949లో 'ధర్తీకీ లాల్' చిత్రాన్ని తీశాడు. ఆ చిత్రం మాస్కో, పారిస్, లండన్ లలో విమర్శకుల ప్రశంసలందుకున్నది. తర్వాత ఆయన 'మున్నా', 'పరదేశి', 'చార్ దిల్ చార్ రహే', 'ఆస్మాన్ మహల్', 'సాత్ హిందుస్థానీ' చిత్రాలను తీశారు. ఆర్థికంగా ఆయన చిత్రాలన్నీ దెబ్బతిన్నాయి. రాజ్ కపూర్ ఎక్కువగా వ్యాపార ధోరణి చిత్రాలే తీసినా, 'ఆవారా' 'జాగ్తేరహో', 'బూట్ పాలిష్' వంటి మంచి సమస్యాత్మక చిత్రాలు కూడా కొన్ని తీశాడు. బిమల్ రాయ్ న్యూథియేటర్స్ లో మొదట కెమెరా మన్ గా, తర్వాత దర్శకుడుగా పనిచేసి, తర్వాత బొంబాయికి మకాం మార్చి, స్వయంగా 'దో బిఘా జమీన్', 'మధుమతి', 'సుజాత' వంటి పెక్కు చిత్రాలు తీశారు. 'పరిణీత', 'బిరాజ్ బహు', 'దేవదాస్' వంటి శరత్ నవలలకు ఆయన గొప్పగా రూపకల్పన చేశారు.

Picture
రఘుపతి వెంకయ్య

తెలుగు సినీమా కథ

భారత చిత్ర రంగానికి ఫాల్కేవలె ఆంధ్ర చలన చిత్ర రంగానికి రఘుపతి వెంకయ్య గారిని పితామహుడుగా చెప్పుకోవచ్చు. 1910లో పూర్వమే ఆయన ప్రొజెక్షన్ సామగ్రి దిగుమతి చేసి, ఆంధ్ర ప్రాంతంలోనూ, దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ చలన చిత్రాల ప్రదర్శనం ప్రారంభించాడు. ఆయన కుమారుడు ఆర్. ప్రకాశ్ హాలీవుడ్ లో తర్ఫీదు పొంది వచ్చి 1923లో 'భీష్మ' మూకీ చిత్రం తీశారు. 1931లో తొలి తెలుగు టాకీ చిత్రం 'భక్తప్రహ్లాద'ను హెచ్.ఎం. రెడ్డి నిర్మించారు. తర్వాత ఆయన, సి. పుల్లయ్య పెక్కు పౌరాణిక చిత్రాలు తీశారు. తెలుగులో తొలి సమస్యాత్మక సాంఘిక చిత్రాలు తీసిన వారు గూడవల్లి రామబ్రహ్మం, బి.ఎన్. రెడ్డి. సారధి సంస్థను ప్రారంభించి గూడవల్లి వారు 'మాలపిల్ల' (1938), 'రైతుబిడ్డ' తీశారు. హెచ్.ఎం.రెడ్డి నిర్మించిన 'గృహలక్ష్మి' (1937) సాంఘిక చిత్రానికి పనిచేసిన బి.ఎన్.రెడ్డి వాహినీ సంస్థను ప్రారంభించి 'వందేమాతరం', 'సుమంగళి', 'దేవత', 'స్వర్గసీమ', 'మల్లీశ్వరి', 'బంగారు పాప' చిత్రాలు తీశారు. వాహినీ సంస్ధ పేరిట కె.వి. రెడ్డి 'పోతన', 'వేమన', 'గుణసుందరి', 'పెద్దమనుషులు' చిత్రాలు తీశారు. 'బంగారు పాప' వరకు వాహినీ సంస్థ వెలువరించిన చిత్రాలన్నీ దేవకీబోస్, బారువా, శాంతారాం, చిత్రాలతో పోల్చదగినవి. 'బంగారుపాప' తర్వాత వాహినీ చిత్రాల స్థాయి తగ్గింది. నాగయ్య తీసిన 'త్యాగయ్య', వేదాంతం రాఘవయ్య తీసిన 'దేవదాసు', యల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించిన విజయావారి 'షావుకారు', కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన 'పాతాళభైరవి', భరణీ రామకృష్ణ తీసిన 'విప్రనారాయణ', 'బాటసారి', బాపు తీసిన 'సాక్షి', 'సంపూర్ణ రామాయణం' తెలుగులో ఉత్తమ చిత్రాలుగా చెప్పుకోవచ్చు.

Picture
హెచ్.ఎం. రెడ్డి, గూడవల్లి రామబ్రహ్మం

న్యూ సినిమా అవతరణ

1955 అక్టోబరులో 'పథేర్ పాంచాలీ' చిత్రం విడుదల భారత చలన చిత్ర చరిత్రలో ఒక సువర్ణ ఘట్టం. దేశ విదేశాలలో ఆ చిత్రానికి లభించినన్ని అవార్డులు ఇప్పటి వరకు మరి ఏ భారతీయ చిత్రానికి లభించలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆయన అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రాలనదగిన 21 కథా చిత్రాలను, 3 డాక్యుమెంటరీలను తీశాడు. ఆయన తీసిన కథా చిత్రాలన్నీ బెంగాలీవే. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఆయన చిత్రాలన్నీ ఏదో ఒక బహుమతిని సంపాదించుకున్నాయి. కడచిన 20 ఏండ్లలో ఆయనకు లభించినన్ని అంతర్జాతీయ బహుమతులు ప్రపంచంలో ఏ దర్శకునికి లభించలేదు. కడచిన 50 సంవత్సరాలలో అత్యుత్తమ దర్శకుడుగా బ్రిటిష్ ఫెడరేషన్ ఆఫ్ ఫిలిం సొసైటీస్ ఆయనను ఎన్నిక చేసింది. దేశంలో ఫాల్కే ఫార్ములాను పూర్తిగా ధిక్కరించి, తనకు ముందు చిత్రాలు తీసిన ఏ దర్శకుడినీ అనుకరించకుండా, పూర్తిగా కొత్త పద్ధతిలో, డాక్యుమెంటరీ వాస్తవికతతో, అత్యంత కళాత్మక మైన చిత్రాలు తీసిన మొదటి దర్శకుడు సత్యజిత్ రే.

'పథేర్ పాంచాలీ' విడుదల తర్వాత తపన్ సిన్హా, మృణాల్ సేన్, రాజేన్ తరఫ్ దార్ వంటి ప్రతిభావంతులు కొందరు సత్యజిత్ రే చూపిన మార్గంలో పెక్కు గొప్ప చిత్రాలు తీశారు. ఋత్విక్ ఘటక్ స్వతంత్ర శైలిలో ప్రతిభావంతమైన చిత్రాలు తీశాడు. ఇటీవల కొన్ని సంవత్సరాలుగా దక్షిణాదిని కన్నడ, మళయాళ భాషలలో న్యూ సినిమా కోవకు చెందిన చిత్రాలు వెలువడుతున్నాయి. పట్టాభి తీసిన 'సంస్కార', గిరీశ్ కర్నాడ్ తీసిన 'కాడు', బి.వి. కారంత్ తీసిన 'చోమన దుడి'. వారిద్దరూ కలిసి తీసిన 'వంశవృక్ష', వాసుదేవన్ నాయర్ తీసిన 'నిర్మాల్యం', అదూర్ గోపాలకృష్ణన్ తీసిన 'స్వయంవరం', శ్యామ్ బెనెగల్ తీసిన 'అంకుర్', 'నిశాంత్', అవతార్ కౌల్ తీసిన '27 డౌన్' చెప్పుకోదగిన చిత్రాలు. ఈ దర్శకులందరిపైన సత్యజిత్ రే ప్రభావం అంతో యింతో ఉన్నది. వీరందరికీ భిన్నంగా స్వతంత్ర శైలిలో చిత్రాలు తీస్తున్న వారు మణికౌల్, కుమార్ సాహ్నీ. కౌల్ 'ఉస్కీ రోటీ', 'ఆషాడ్ కి ఏక్ దిన్', 'దువిధ' చిత్రాలను, సాహ్నీ 'మాయా దర్పణ్' చిత్రాన్ని తీశారు. ఈ చిత్రాలు మేధావులకు సైతం అర్థం కాకుండా ఆయోమయంగా ఉన్నాయనీ, ఇటువంటి చిత్రాలను ప్రోత్సహించరాదనీ పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆ చిత్రాలను 'పెర్సనల్ సినిమా'గా పేర్కొంటున్నారు.

ఒక వంక ఇటువంటి చైతన్య వంతమైన వాస్తవిక, కళాత్మక చిత్రాలు వస్తున్నా, మరో వంక కమర్షియల్ చిత్రాల ధోరణి యథాతథంగానే ఉంది. 1960 దశకంలోనే చిత్రాల స్థాయి బాగా దిగజారిపోయింది. 1970 తర్వాత సెక్స్, వైలెన్స్, అర్థం పర్ధం లేని పాటలు, డాన్సులు, వెకిలి హాస్యం విజృంబించాయి. ఒకవైపు రెండు లక్షలతో తీసిన 'నిర్మాల్యం', 'చోమన దుడి' చిత్రాలు బంగారు పతకాలు సంపాదిస్తుంటే, మరొక వైపు కోటి రూపాయలు పైగా ఖర్చు పెట్టి తీసిన 'షోలే' వంటి చిత్రాలు కోటానుకోట్లు గడిస్తున్నాయి. పరమ నాటురకం 'జై సంతోషిమా' వంటి చిత్రాలకు కూడా కనకవర్షం కురుస్తున్నది. ఏడాదికి 400 పైగా చిత్రాలు విడుదలవుతుంటే వీటిలో న్యూ సినిమా కోవకు చెందిన చిత్రాలు పట్టుమని పది కూడా ఉండడంలేదు. ఈ సంగతి గమనిస్తే మాత్రం మన సినిమా ఇంకా బాల్యావస్థలో ఉన్నదని అనిపించక మానదు.

నండూరి పార్థసారథి
(1976 నవంబర్ 14వ తేదీన ప్రజాతంత్రలో ప్రచురితమైనది.)

Previous Post Next Post