Title Picture

'ఇల్లరికం' (రజతోత్సవ) చిత్రాన్ని నిర్మించి ఆంధ్రపేక్షకుల విశేష ఆదరాభిమానాలను చూరగొన్న ప్రసాద్ ఆర్ట్ పిక్చర్సువారు అంతకంటే మరొక మెట్టు ఉన్నతస్థాయిలో భార్యాభర్తలు చిత్రాన్ని నిర్మించారు. తెలుగు చలన చిత్రాభిమానుల అభిరుచులకు అనుగుణంగా అన్ని హంగులను ఏర్పికూర్చి, అధిక వ్యయప్రయాసల కోర్చి వారు ఈ చిత్రాన్ని వినోదాత్మకంగా రూపొందించారు.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్మారావు (గుమ్మడి) గారికి ఇద్దరు పుత్రులు. పెద్దతను రామానందం (రేలంగి), అతని భార్య తాయారు (సూర్యకాంతం). వారి సంసారం ఒక చిన్న ప్రహసనం. ధర్మారావు గారి రెండవ కొడుకు ఆనంద్ (నాగేశ్వరరావు) హీరో; మెడికల్ విద్యార్థి; అవివాహితుడు. కంటికి నదరుగా కనుపించిన కాంతల వెంట బడుతూ, విశృంఖలంగా ప్రవర్తించే దక్షిణ నాయకుడు. హేమలత (గిరిజ) అనే ఒక వన్నెల విసనకర్ర అతన్ని వల్లో వేసుకుంది. ఈ వ్యవహారమంతా తెలుసుకున్న ధర్మారావు గారు అతన్ని చదువు మాన్పించి, పట్నం నుంచి ఇంటికి రప్పించాడు. కాని, ఇక్కడ కూడా అతను అదే విధంగా ప్రవర్తించసాగాడు. అయితే శారద (కృష్ణకుమారి) అనే పడుచు పంతులమ్మ అతనికి గట్టిగా బుద్ధిచెప్పింది. ఆమెను లొంగదీసుకోవాలని అతను పడ్డ పాట్లు వృధా అయినాయి. ఆమె పరాభవించినకొద్దీ అతనికి ఆమెపై ప్రేమ అధికమవుతుంది. ఆమెను తప్ప మరొకరిని పెళ్ళి చేసుకోనని ఖండితంగా చెప్పాడు. ధర్మారావు గారు వెళ్ళి శారద తండ్రి (రమణారెడ్డి)తో మాట్లాడాడు. కూతురుతో సంప్రదించకుండానే ఆయన సరేనన్నాడు. శారదకు ఇష్టం లేకుండానే పెళ్ళి జరిగిపోతుంది. బలవంతంగా ఆమె ప్రేమను చూరగొనలేని ఆనంద్ తన ధోరణి మార్చుకుని, తానే లొంగిపోయి ఆత్మార్పణం చేసుకుని, ఆమెను ప్రసన్నురాలిని చేసుకున్నాడు. కాని ఈ లోగా పట్నం నుంచి హేమలత ఇతన్ని వెంటాడుతూ వచ్చి వీరి కాపురంలో చిచ్చుపెట్టాలని చూస్తుంది. ఆమెను ఇంతకు ముందే వివాహమాడిన అంజనేయులు (పద్మనాభం) అనే అతను ఈ చర్యలు సహించలేక ఆమెను హత్యచేసి, ఆ నేరం ఆనంద్ మీదకు నెట్టివేస్తాడు. హేమలతకు, ఆనంద్ కు ఉన్న పూర్వసంబంధం ఎరిగివున్న ధర్మారావు గారు ఆనందే ఈ హత్య చేశాడని నమ్మి అతనికి ఉరిశిక్ష విధించమని కొడుక్కి వ్యతిరేకంగా కోర్టుకెక్కాడు. చివరకు శారద తన భర్త నిరపరాధి అని నిరూపించడానికై అపరాధపరిశోధన ప్రారంభించి విజయం పొందుతుంది. అంతా సుఖంగా ఉంటారు.

డాక్టర్ లక్ష్మి రచించిన తమిళ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నవల తమిళ పాఠకుల విశేష మన్ననలు పొందటమే కాక, మద్రాసు ప్రభుత్వ బహుమతిని కూడా పొందింది. తొలి ప్రయత్నమే అయినా, మూడు గంటల పాటు కావలసినంత వినోదాన్ని సమకూర్చిన యువ దర్శకుడు ప్రత్యగాత్మ అభినందనీయుడు.

రాజేశ్వరరావు గారి సంగీతం సంతృప్తికరంగా ఉంది. సుశీల పాడిన 'ఏమని పాడెదనో ఈ వేళ' అన్న పాట చాలా హాయిగా ఉంది. శ్రీశ్రీ, పిచ్చేశ్వరరావు గార్ల రచన షడ్రసోపేతంగా, శైలి నలభీమపాకంగా ఉంది.

నాగేశ్వరరావు, కృష్ణకుమారి, రేలంగి, గుమ్మడి, రమణారెడ్డి, గిరిజ, పద్మనాభం ప్రభృతులు ఎంతో సమర్థవంతంగా నటించారు. 'పెళ్ళికానుక' చిత్రంలో ఎంతో ప్రశంసనీయంగా నటించిన కృష్ణకుమారి ఈ చిత్రంలో మరొక మెట్టు ఉన్నత స్థాయిలో నటించింది. అంత మితంగా, నిరాడంబరంగా, అందంగా నటించడం ఆమెకే సాధ్యమనిపించింది.

నిర్మాత: ఎ.వి. సుబ్బారావు; స్ర్కీన్ ప్లే, దర్శకుడు: ప్రత్యగాత్మ; కథ: డాక్టర్ త్రిపురసుందరి (లక్ష్మి); మాటలు: శ్రీశ్రీ, పిచ్చేశ్వరరావు; పాటలు: శ్రీశ్రీ, కొసరాజు, ఆరుద్ర; సంగీతం: రాజేశ్వరరావు; ఛాయాగ్రహణం: సి. నాగేశ్వరరావు; తారాగణం: నాగేశ్వరరావు, కృష్ణకుమారి, రేలంగి, సూర్యకాంతం, గుమ్మడి, నిర్మల, రమణారెడ్డి, సంధ్య, పద్మనాభం, గిరిజ, అల్లురామలింగయ్య వగైరా.

నండూరి పార్థసారథి
(1961 ఏప్రిల్ 2వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post