మెహ్దీహసన్, ఆయనకు కుడివైపు పోలీస్ ఆఫీసర్ సదాశివరావు, ఎడమవైపు బాపు

రిపబ్లిక్ పండుగనాటి రాత్రి రవీంద్ర భారతిలో అడుగు పెట్టే భాగ్యం లభించిన వారికి నిజంగా అది మరపురాని మధురసంగీత విభావరి. ఆ రాత్రి మెహ్దీహసన్ కచేరీ విన్న భాగ్యవంతులు ఆశ్రవణానందాన్ని ఒక అమూల్యానుభవంగా స్మృతుల పేటికలలో భద్రపరచుకుంటారు.

స్వాగతవచనాలతో, పరిచయాలతో కార్యక్రమం ప్రారంభమయింది. ముఖ్య అతిధిగా గవర్నర్ శ్రీమతి శారదాముఖర్జీ హాజరైనారు. ఔచిత్యం తెలిసిన సంస్కారవంతురాలు కనుక ఆమె ప్రసంగమేమీ చేయకుండా నిర్వాహకుల తరపున ఒక వెండి చార్మినార్ ప్రతిమను మెహ్దీహసన్ కు బహూకరించి ఊరుకున్నారు. మరెవరైనా రాజకీయ నాయకుడైతే భారత పాకిస్థాన్ సత్సంబంధాల ఆవశ్యకత గురించి కనీసం అరగంటసేపు అనర్గళంగా అభిభాషించి ఉండేవారు.

మెహ్దీహసన్ తన వెంట వచ్చిన కళాకారులను శ్రోతలకు పరిచయం చేశారు. తబ్లా వాయించే పీర్ బక్ష్ జన్మస్థలం, హర్మోనియం వాయించే మొహమ్మద్ హుస్సేన్ జన్మస్థలం రాజస్థాన్ (మెహ్దీ జన్మస్థలం కూడా రాజస్థానే) 'ఎల్కా' అనే ఎలెక్ట్రానిక్ వాద్యం వాయించే తసదుఖ్ హుస్సేన్ షాద్ జన్మస్థలం లాహోర్. వీరు ఇప్పటికి పదిహేనేళ్ళుగా మెహ్దీహసన్ కు ప్రక్క వాద్యాలు వాయిస్తున్నారు. వీరుకాక, మెహ్దీజ్యేష్ఠ పుత్రుడు ఇరవయ్యేళ్ళ తారీఖ్ హుస్సేన్ కూడా తండ్రి వెంట వచ్చాడు.

భారత దేశాన్ని సందర్శించాలని తాను ముప్ఫయ్యేళ్ళుగా కలలు కంటున్నాననీ, ఇప్పటికి తన కలలు నిజమైనాయనీ మెహ్దీ హసన్ అన్నారు. ఆయన రాకకోసం ముప్పయ్యేళ్ళుగా ఎదురు చూస్తున్న శ్రోతలు కూడా కొందరు కచేరీకి వచ్చి వారిలో ఉన్నారు. గాయకునికి, శ్రోతలకు మధ్య మధుర సమాగమానికి చిహ్నంగా రవీంధ్రభారతి ప్రాంగణమంతా విద్యుద్దీపతోరణాలతో అలంకరించారు. ప్రతి చెట్టుకు, గుబురుకు రంగు రంగుల దీపాలు గుత్తులు గుత్తులుగా అమర్చారు.

రాత్రి సరిగ్గా పది గంటలకు 'ఫూల్ హీ ఫూల్ ఖిల్ ఉఠే' అనే సలీం గిలానీ గజల్ తో కచేరీ ప్రారంభించారు మెహ్దీహసన్. మల్హార్, బహార్, కేదార్ రాగాల మేళనంతో మనోజ్ఞంగా వసంత ఋతుశోభను ఆవిష్కరించారు. కోకిల కూజితాలతో, వికసిత కుసుమాలతో రవీంద్ర భారతిని సుందర నందనంగా మార్చి వేశారు. ఆ తర్వాత మూడున్నర గంటల సేపు శ్రోతలను మంత్ర ముగ్ధులను చేసి ఆ నందనంలో ఆనంద విహారం చేయించారు. కీరవాణి, భైరవి, యమన్, భీంపలాసి, దేశి, జింఝాటి, ఖమాస్, పహాడీ, రాగేశ్వరి, తిలంగ్, నటభైరవ్ రాగాల సురభిళ సుమాల మాలలతో మనస్సులను మత్తిలచేశారు.

కచేరీలో మొత్తం 13 గజళ్ళుగానం చేశారు. వాటిలో ఆరు-మనదేశంలో విడుదలైన ఆయన రెండు లాంగ్ ప్లే రికార్డులలో ఉన్నవి. 'ఫూల్ హి ఫూల్ ఖిల్ ఉఠే', 'గులోం మే రంగ్ భరే' (పైజ్ అహమ్మద్ ఫైజ్) 'మొహబ్బత్ కర్నేవాలే' (హఫీజ్ హోషి యార్ పురీ) 'బాత్ కర్నీముఝే ముష్కిల్' (బ్రహదూర్ షా జాఫర్), 'గుల్షన్ గుల్షన్ షోలాయి గుల్కీ' (అష్ఘర్ సలీం), 'దేఖ్ తో దిల్ కెహ్ జాన్ సే' (మీర్ తాభి మీర్) ఇవి కాక మిగిలిన వాటిలో కూడా చాలా గజళ్ళు టేపుల ద్వారా మెహ్దీహసన్ అభిమానులకు బాగా పరిచయమైనవే.

కచేరి ప్రథమార్ధంలో ఆరు గజళ్ళు, ద్వితీయార్థంలో ఏడు గజళ్ళు వినిపించారు. ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలో పాడిన గజళ్ళు ఎక్కువ రంజకంగా ఉన్నాయి. ప్రథమార్థంలో పాడిన వాటిలో 'రంజిష్' అనే గాలిబ్ గజల్ అద్భుతంగా ఉంది. యమన్ రాగంలో ఆ గజల్ ను 17 నిమిషాల సేపు పాడారు.

'షోలాథా జల్ బుఝా' అనే గజల్ ను కీరవాణి, భైరవి రాగాల మేళనంతో వినిపించారు. 'అజ్మత్' పాకిస్థానీ చలన చిత్రంలోని 'జిందగీ మెతో సభీ ప్యార్ కియా' అనే గజల్ ను భీంపలాసీ రాగంలో వినిపించారు. 'దేశీ' రాగంలో 'దోనో జహాముఝే మొహబ్బత్ మే' అనే గజల్ గానం చేశారు. ద్వితీయార్థంలో 'గున్ చాయే షౌక్ లగాయే' అనే అంజుమన్ గజల్ ను రెండు మూడు రాగాల మేళనంతో మెహ్దీహసన్ పాడిన తీరు అతి మనోహరంగా ఉంది. గజల్ కు కూర్చిన వరస అతిక్లిష్టంగా, సాధారణ గాయకులెవరూ పాడలేని విధంగా ఉంది.

శ్రోతల కోరికపై 'బాత్ కర్నీ...' గజల్ ను అందుకొంటూ మెహ్దీహసన్ శాస్త్రీయ సంగీత వైభవాన్ని గురించి ఐదు నిమిషాలు ప్రస్తావించారు. "మీరు కోరిన ఈ గజల్ ను 1956 నుంచి పాడుతున్నాను. ఇప్పటికీ ఇది పాత పడలేదు. ఎప్పటికీ పాతపడదు. ప్రతి కచేరీలో శ్రోతలు దీనిని కోరుతూనే ఉంటారు. ఇంకా కొన్ని గజళ్ళను 1953 నుంచి పాడుతున్నాను. వీటికి శాస్త్రీయ రాగాలను ఉపయోగించాను. వీటి ఆకర్షణకు ప్రధాన కారణం అదే. భైరవి, మాల్కౌస్, దర్బారీ, యమన్, దుర్గ... ఇంకా ఎన్నో గొప్ప రాగాలు మనకు ఉన్నాయి. వీటి ఆకర్షణ శాశ్వతమైనది. పాప్ సంగీతం లాగా పదిహేను రోజుల్లో పాతబడి, మూలబడేవి కావు. ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఈ దేశాలన్నింటిదీ ఒకే సంస్కృతి, ఒకే సంగీతం" అని ఆయన అన్నారు. ఆవేశంలో ఈ మాటలు చెపుతూ ఆయన భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని చదివారు. 'సుర్ మే ఈశ్వర్ దిఖ్తాహై' (నాదంలో ఈశ్వరుడు కనిపిస్తాడు) అని ఆయన అన్నారు.

'మై నజర్ సే' అనే గజల్ ను 25 నిమిషాలు గానం చేశారు. కచేరీలో అన్నింటి కంటే ఎక్కువ సేపు పాడిన గజల్ ఇదే. ఇందులో ప్రధానరాగం 'తిలంగ్'. మధ్యలో ఒక చోట 'జోగ్' రాగాన్ని మిళాయించారు. నటభైరవ్ లో పాడిన 'జో చాహతేహో' గజల్ చాలా కొత్త తరహాగా ఉంది. నటభైరవ్ వంటి గంభీర రాగాన్ని మరెవ్వరూ గజల్ కు ఉపయోగించి ఉండరు.

శ్రోతల కోరికపై 'దేఖ్ తో దిల్ కెహజాన్ పే' గజల్ ను గానం చేసి 1-30 గంటలకు కచేరీ ముగించారు మెహ్దీహసన్.

తసదుఖ్ హుస్సేన్ వాయించిన ఎల్కా వాద్యం వల్ల కచేరీకి ఎంతో నిండుతనం వచ్చింది. కాసేపు పియానోలాగా, కాసేపు ఆర్గన్ లాగా, కాసేపు వంద వాద్యాల సమ్మేళనంలాగా వినిపించే ఆ వాద్యాన్ని ఆయన ఎంతో అవలీలగా, సమర్థంగా వాయించారు. ఆ వాద్యంపై ఆయనకు ఉన్నంత అధికారం భారత ఉపఖండంలో మరెవ్వరికీ లేదట.

మామూలుగా అరగంటసేపు మాత్రమే కూర్చునే గవర్నర్ ఈ కచేరీలో రాత్రి ఒంటి గంట వరకు కూర్చున్నారు. మెహ్దీ సంగీతం ఎంత రంజకంగా ఉన్నదో దీన్ని బట్టి తెలుస్తుంది.

మెహ్దీహసన్ తో పత్రికా గోష్ఠిలో ఎడమవైపు నుంచి మోహన్ హెమ్మాడి, శోభా శంకర్, శంకు, సదాశివరావు, వెనక వరసలో బాపు, కుడివైపు చివర నండూరి రామమోహనరావు, నం.పా.సా

హాలులోకి ఎవ్వరూ టేప్ రికార్డర్లు తీసుకురాకుండా నిర్వాహకులు గట్టిగా ఏర్పాటు చేశారు. ఇంత గొప్ప సంగీతం గాలిలో కలిసిపోయింది కదా అని బాధ పడ్డారు సంగీత ప్రియులు. కచేరీకి 500, 200, 100 రూపాయల టిక్కెట్లు పెట్టారు. సంగీతాభిమానం ఉన్నా ఆర్థిక స్తోమతులేని ఎందరో ఈ కచేరీని వినలేకపోయారు. ఈ సంగతి మెహ్దీహసన్ గ్రహించారు. సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే టిక్కెట్లతో త్వరలోనే హైదరాబాద్ లో మరో కచేరీ చేస్తానని ఆయన వాగ్దానం చేశారు.

నండూరి పార్థసారథి
(1978 జనవరి 29వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది)

Previous Post Next Post