Title Picture

దర్శకత్వం: శోభనాద్రిరావు; రచన: రామ్ చంద్; సంగీతం: అశ్వత్థామ; మాటలు: సదాశివబ్రహ్మం; నటీనటులు: అమరనాథ్, కృష్ణకుమారి, గిరిజ, సి.యస్.ఆర్., హేమలత, సూర్యకళ, కీ.శే.ఆర్.నాగేశ్వరరావు, బాలకృష్ణ, వర్మ వగైరా. నేపథ్య గానం: పి.నాగేశ్వరరావు, పి.బి.శ్రీనివాస్, సుశీల, వైదేహి, జమునారాణి.

చిత్రం చెప్పలేనంత అసహ్యంగా ఉన్నదీ అంటే, ఎంత అసహ్యంగా ఉన్నదో చూద్దామని సరదాపడి చూసే పండిత ప్రేక్షకులు కూడా ఉంటారు. అటువంటి వారు నూటికి ఐదుగురు ఉన్నా మన తెలుగు సినిమా పరిశ్రమ చాలా అభివృద్ధి చెందుతుంది. ప్రతి తెలుగు చిత్రంలోనూ ఏదో ఒక విశేషం ఉంటుంది. చాలా బాగా ఉండటమో, బొత్తిగా బాగుండక పోవటమో, హాస్యంగా ఉండటమో, హాస్యాస్పదంగా ఉండటమో... ఏదైనా ఒక విశేషమే. నవ్వుకొనేందుకో, అవహేళన చేసేందుకో, ఎందుకో ఒకందుకు ప్రేక్షకులు అన్ని చిత్రాలనీ చూస్తూనే ఉంటారు. పదిహేను, ఇరవై సంవత్సరాల నాడు తెలుగు సినిమాల్లో దర్శకత్వం, కెమెరావర్కు ఎలా ఉండేదో చూడనోచుకోని వారికి మహదవకాశం కల్పించటం 'జగన్నాటకం'లోని విశేషం. ఈ చిత్రం చూచాక 'నాటకానికీ, సినిమాకీ ఆట్టే తేడాలేదు' అని కొందరు, 'దర్శకత్వం అంటే అట్టే కష్టం కాదు, ఫర్వాలేదు' అని మరికొందరు, 'కెమేరా వర్కు అని గోరంత దాన్ని కొండంత చేసి చెబుతారు గాని, స్విచ్ నొక్కి వదిలిపెడితే పిక్చరంతా తీసెయ్యలేదూ, మరీ బడాయిగానీ' అని మరికొందరూ దురభిప్రాయపడతారు.

చిత్రంలోని పాత్రలన్నీ ఎల్లప్పుడూ ప్రేక్షకులవైపుకే తిరిగి మాట్లాడుతూ ఉంటాయి. ఒక్కొక్క సన్నివేశం ఒకటి, రెండు షాట్లలోనే ముగుస్తుంది. ఆ ఒకటి, రెండు షాట్లలో కూడా కెమేరా కదలదు; ఫీల్డులో పాతిన క్రాస్టాపులా నేలకు మేకులు కొట్టుకొని నిలబడి ఉంటుంది. సన్నివేశం తర్వాత సన్నివేశం అన్నీ దాదాపు మిడ్ షాట్ లోనే కెమేరాకు ఎట్టఎదటగా గడిచిపోతాయి. మిడ్ షాట్ లో కెమేరా ఫీల్డు ఉన్నంత మేరా సెట్టు వేసి, స్విచ్ నొక్కుతారు. పాత్రలు సంభాషణలు అప్పజెప్పుతాయి. సన్నివేశం లోనికి కొత్త పాత్రలు ప్రవేశించవలసి వస్తే అవే కెమేరా ఫీల్డులోకి రావాలి. నిష్క్రమించాల్సివస్తే కెమేరా ఫీల్డు నుండి వారే వెళ్ళిపోవాలి. కెమేరాకు అనుగుణంగా పాత్రలు కదలవలసిందేగాని, కెమేరా మాత్రం ఉన్నచోటు నుంచి కదలదు. కొన్ని సన్నివేశాలు మరీ హాస్యాస్పదంగా ఉన్నాయి. కెమేరాఫీల్డును సుద్ద ముక్కతో గిరిగీసి అందులో పాత్రలను వదిలి, కెమేరా స్విచ్ నొక్కి, "మీరు నటించేసెయ్యండి ఫరవాలేదు, మేం అలా వెళ్ళి కాఫీతాగి వస్తాం" అని దర్శకుడు, కెమేరా మాన్ వెళ్ళిపోయినట్లు తోస్తుంది.

భక్త దంపతులకు లేకలేక ఒక వంశోద్ధారకుడు పుట్టటం, వాడు నాస్తికుడుగా, శత మొండిగా మారటం, భార్య పాతివ్రత్య మహిమవల్ల ఇంటిలోని గిన్నెలూ, చెంబులూ గాలిలో ఎగరటం, తులసికోట నడిచిరావటం, తనను కొట్టటానికి వచ్చిన వాడిచేతిలో కర్ర పాముగా మారటం వంటి మహిమలు కొన్ని చూడటం వల్ల చివరికి భక్తుడై, ముక్తుడవటం - ఈ సుపరిచితగాథ 'జగన్నాటకం'.

సగటుకంటే తక్కువ స్థాయిలో ఉన్న అనేక తెలుగు పౌరాణిక చిత్రాల సంభాషణలను కుప్పగా పోగువేసుకొని, రచన అనే పేరుతో రామ్ చంద్, దర్శక నిర్మాతల అభిరుచులకు అనుగుణంగా ఎడిట్ చేసారు. ఆ ఎడిటింగులో కూడా, "దేవుడు లేడు, ఉంటే చూపించు"? "దేవుడున్నాడు, లేకపోతే ఈ ప్రపంచమే లేదు, నువ్వే లేవు" అనే పునరుక్తులు అతిగా దొరలాయి.

అలాగే ఆశ్వత్ధామ కూడా ఎప్పటెప్పటి పాటల వరసలనో పెల్లగించి తీసి రీసెర్చి చేసి, స్వరాలను కలగలుపుచేసి, తమాషాగా ఎడిట్ చేసి పాటలకు తొడిగారు.

ఏమైనా ఈ చిత్రం 1960లో రాతగినది కాదు. ఈ మధ్య కొన్ని చిత్రాలకు పట్టిన గతి చూస్తే, ఈ చిత్రానికి ఆర్థిక విజయం చేకూరగలదేమోనని సందేహం కలుగకమానదు.

చిత్రమంతటిలోనూ కృష్ణకుమారి, సి.యస్.ఆర్., హేమలతలను విడిగా చెప్పుకోవాలి. రామ్ చంద్ రాసిన సంభాషణల అవధిలో అంతకన్నా చక్కగా నటించటం ఇంకెవరికీ చేతకాదనిపిస్తుంది.

నండూరి పార్థసారథి
(1960 ఏప్రిల్ 24వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది.)

Previous Post Next Post