Title Picture

భారత చలనచిత్ర రంగంలో సత్యజిత్ రాయ్ అవతరించిన తర్వాత ఆయన అడుగు జాడలలో నడుస్తూ 'న్యూవేవ్' చిత్రాలు నిర్మిస్తున్న యువ దర్శకులు బెంగాల్ లో సుమారు ఒక డజనుమంది ఉన్నారు. బెంగాల్ లో పుట్టిన ఈ 'న్యూవేవ్' (నవ తరంగం) ఇప్పుడు దక్షిణాది వరకు వచ్చింది.

కృత్రిమమైన బాక్సాఫీస్ అకర్షణలు లేకుండా, స్వల్ప వ్యయంతో, అత్యంత వాస్తవికంగా నిర్మించబడేవి 'న్యూవేవ్' చిత్రాలు. వీటిని నిర్మించడానికి చిత్తశుద్ధి, సాహసం, ప్రతిభ కావాలి, కానీ 'న్యూవేవ్' దర్శకులతో ఎక్కువ మందికి మొదటి రెండూ మాత్రమే ఉన్నాయి. వాస్తవికంగా చిత్రీకరిచటం అంటే కేవలం డాక్యుమెంటరీలాగా తీయటం కాదు; మాసిన గడ్డాలు, చిరిగిన బట్టలు, కూలిన గోడలు చూపించటం కాదు. వాస్తవికంగా చిత్రించటం అనేది సినీ వ్యాపారులు అవహేళన చేసేటంతటి సులభమైనదీ కాదు. 'న్యూవేవ్ దర్శకులు'గా చెలామణీ అవుతున్నవారు అనుకుంటున్నంత తేలికయినది కాదు. అయినా ఉత్తమమైన చిత్రానికి 'వాస్తవికత' ఒక్కటే కాదు ముఖ్యం. చిత్రం కళాత్మకంగా, ఒక సత్యాన్ని వెలువరించేదిగా ఉండాలి.

పైన వ్రాసిన వాక్యాలను నిరూపించే చిత్రం 'ఎపిజిల్', దీని నిర్మాత శ్రీమతి యమునా ఎస్. గిరి. కథ, సంభాషణలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం శంకర్ వి. గిరి నిర్వహించారు. సంగీతం వి. కృష్ణ మూర్తి, ఛాయాగ్రహణం జి. విందన్ నిర్వహించారు. జయలలిత, సంధ్య, జి.ఎస్. గోపాలకృష్ణన్, రమణమూర్తి, ఎమ్.వి. శ్రీకాంత్ ప్రభృతులు నటించారు. సుమారు గంటంపావు సేపు నడిచే ఈ చిత్రాన్ని మద్రాసులో 18 రోజుల వ్యవధిలో నిర్మించారు.

దక్షిణ భారతంలో, దక్షిణాది వ్యక్తి ఆంగ్ల భాషలో చిత్రాన్ని నిర్మించటం ఇదే ప్రథమం, నటీ నటులలో తెలుగువారు, తమిళులు, మళయాళీలు, కన్నడులు ఉన్నారు. డబ్బింగ్ అవసరం లేకుండా ఎవరి సంభాషణలు వారే పలికారు. పాటలు, డాన్సులు మొదలయిన హంగులు లేవు. ఇవి ఇందులోని విశేషాలు.

నిర్మాత సాహసం మినహా మెచ్చుకోతగ్గ అంశం మరేదీ ఈ చిత్రంలో కనిపించదు. దేశంలో దీనికి డబ్బు రాదని తెలిసికూడా తీశారు కనుక అది సాహసమనే చెప్పాలి. అయితే దేశానికి ఇప్పుడు అత్యవసరంగా ఉన్న విదేశ ద్రవ్యాన్ని ఇది అర్జించగలదని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేశారు. కాని చిత్రాన్ని చూస్తే-ఆయన ఆశ ఫలవంతం కాగలదని అనిపించదు.

చిన్నతనంలో చేసిన గారాబం పెద్దయిన తర్వాత ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో చూపటం ఈ చిత్రం ఉద్దేశం, కనీసం యాభై ఏళ్ళు గల ఒక తండ్రి తన గత జీవిత గాథను ఇరవై మూడేళ్ళ కొడుకుకు చెబుతున్నట్లుగా ఈ చిత్రం నడుస్తుంది. అమరనాథ్ అనే అబ్బాయి తల్లి గారాబంతో పెంకె ఘటంగా తయారవుతాడు. పెద్దవాడైనా ఆ బుద్ధి పోదు. తండ్రి మాటను లక్ష్యం చేయడు. వినయవతి, వివేకవతి అయిన పిల్లనిచ్చి పెళ్ళి చేస్తే బుద్ధిమంతుడవుతాడేమోననే ఉద్దేశంతో ఒక మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చేస్తారు. కానీ అతడు మారకపోగా తన అనుమానంతో పెళ్ళాన్ని నానా హింసలు పెడతాడు. ఆమెకు, తన స్నేహితుడైన ప్రేమ్ నాథ్ కు ప్రేమ సంబంధం ఉండదని అతని అనుమానం. పుట్టిన బిడ్డ తన బిడ్డ కాడని తృణీకరిస్తాడు. అతని హింసవల్లనే అమె కృశించి కృశించి మరణిస్తుంది. ఆమె మరణంతో అతనికి బుద్ధి వస్తుంది. అతడే ఇప్పుడు కొడుకుకు ఇదంతా చెప్పి తనలాగా చెడిపోవద్దని సందేశమిస్తాడు. అదీ కథ.

కథలో విశేషమేమీ లేదు. కథనంలో కూడా కొత్తదనం గానీ, ప్రతిభగానీ కనిపించలేదు. హృదయాన్ని స్పృశించగల సన్నివేశాలు లేవు. వాస్తవికంగా చిత్రించాలన్న ప్రయత్నం కనిపిస్తుందే కాని. చిత్రం చాలా అవాస్తవికంగా ఉంది. కథలోని రెండు కుటుంబాలూ ఏ భాషా ప్రాంతానికి చెందినవో దర్శకుడు చెప్పలేదు. చెప్పకపోయినా కనీసం ఆ కుటుంబాలు ఏదో ఒక భాషకు చెందినట్లుగా కూడా కనిపించవు. కుటుంబంలో ఒకరు తమిళుడుగానూ, ఇంకొకరు కన్నడం వారిలాగానూ, మరొకరు మళయాళీగా కనిపిస్తారు. ఇంగ్లీషు ఉచ్చారణ కూడా అందరిదీ ఒక్కమాదిరిగా ఉండదు. ఒకరు అరవ ఇంగ్లీషు, మరొకరు ఆంధ్ర ఇంగ్లీషు మాట్లాడుతారు. ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడగలగటం అవసరం కనుక, నాలుగు భాషల నుంచి నటీ నటులను ఎంచుకోవలసివచ్చింది. ఈ లోపానికి కారణం ఇదే. ఇంగ్లీషులో కాక దేశ భాషలోనే తీసి ఉంటే కొంత బాగుండేది.

మరొక పెద్ద లోపం వాతావరణ చిత్రణలో కనిపిస్తుంది. ఇందులో కథాస్థలం మద్రాసు. కథా కాలం సుమారు పాతికేళ్ళ క్రిందట. ఆనాటి కథలో ఈనాటి మద్రాసు దర్శనమిస్తుంది. నాయిక, ఆమె స్నేహితుడు బీచ్ దగ్గర గాంధీ విగ్రహం దగ్గర కలుసుకుంటారు. పాతికేళ్ళ క్రితం ఆ విగ్రహం లేదు. ఇంకా ఇందులో 1960 మోడల్ కార్లు కనిపిస్తాయి. దుస్తులు కూడా 1965 ఫాషన్ లో ఉంటాయి. కథా నాయకునికి బ్రహ్మాండమైన బంగళా, కారు ఉన్నాయి కానీ, అతనిలో హుందాతనం కనిపించదు. అతని కంటే అతని పేద స్నేహితుడు ధనవంతుడులాగా కనిపిస్తాడు.

నటీనటులలో ఎవరూ ప్రతిభావంతంగా నటించారని చెప్పలేము. ఉన్నంతలో సంధ్య, రమణమూర్తి, సంతృప్తికరంగా నటించారు. నాయకుడుగా గోపాలకృష్ణన్ నటన చాలా వెలితిగా ఉంది. నాయికగా జయలలిత కేవలం అలంకరించిన బొమ్మలాగా ఉంది. ముఖంలో భావాలను బొత్తిగా ప్రదర్శించలేకపోయింది. నేపథ్య సంగీతం మామూలు సినిమాల స్థాయిలోనే ఉంది. మిగతా అంశాలకంటే ఛాయా గ్రహణం కొంత సంతృప్తికరంగా ఉంది.

ఇటువంటి చిత్రాలకు మనదేశంలో థియేటర్లు దొరికే అవకాశం లేదుకనుక దీన్ని ఏ విధంగా విడుదల చేస్తారో చూడవలసి ఉంది. ఈ చిత్రాన్ని ఇటీవల పత్రికా విలేఖరుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఒక సరికొత్త ప్రయోగాన్ని సాహసంతో చేసినందుకు శంకర్ గిరి అభినందనీయులు.

నండూరి పార్థసారథి
(1965 జూలై 23వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమయింది)

Previous Post Next Post