రాగ సౌందర్యం, దాని నిర్మితి (Structure), దాని ఒంపుసొంపులు (contours) అన్నీ విలంబ ఆలాపనలోనే స్పష్టంగా వెల్లడి అవుతాయి.

క్రికెట్ ఆటలో బౌలర్ అతి వేగంగా, బలంగా బంతి విసురుతాడు. బాట్స్ మన్ అంత వేగంగా, బలంగా సిక్స్ కొడతాడు. స్టేడియంలో ప్రేక్షకులు ఆహాహాకారాలు చేస్తారు. టీవీలో చూసే మనకీ త్రిల్లింగ్ గా అనిపిస్తుంది. తర్వాత ఆ దృశ్యాలను టీవీలో ప్రత్యేకంగా స్లో మోషన్ లో చూపిస్తారు. బౌలర్ బంతి విసిరినప్పటి అతడి ఆంగిక చాలనం, విన్యాసం, భంగిమ అతి స్పష్టంగా స్లోమోషన్ లో కనిపిస్తుంది. అది డాన్స్ లో నర్తకి ఆంగిక చాలనం లాగా కనిపిస్తుంది. అలాగే బాట్స్ మన్ బంతిని బలంగా, వేగంగా కొట్టినప్పుడు అది ఎంత ఎత్తుకు, ఎంత దూరం, ఎంత వేగంగా వెళ్ళి ఎక్కడ పడిందో స్పష్టంగా కనిపించేది కూడా స్లోమోషన్ లోనే. 'ఆహా... వాటే షాట్' అనిపిస్తుంది.

రాగాలాపనలో అలాగే విలంబంగా పాడినప్పుడే రాగంలోని స్వరసంపుటి గమకాలతో ఎలా ఆవిష్కారమవుతుందో వెల్లడి అవుతుంది. గానంలో ఇది చాలా అవసరం. ఇది హిందూస్థానీ పద్ధతిలో ఉంది. కర్ణాటకంలో లేదు. ముందు విలంబలయలో రాగనిర్మితిని, స్వరాల, స్వరసంపుటుల బిహేవియర్ ను స్పష్టంగా చూపించిన తర్వాత-అంటే రాగస్వరూప స్వభావాలను ఆవిష్కరించడం అయ్యాక - ఆ తర్వాత స్వరాలతో ఎంత వేగంగానైనా, ఎన్ని రకాలుగా నైనా చిత్ర విచిత్ర విన్యాసాలు చేయవచ్చు. ఎంతగానైనా ప్రావీణ్యాన్ని ప్రదర్శించవచ్చు.

ఇలా-విలంబంగా ఆలాపన చేసే పద్ధతి సహజంగా భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఉన్నదే. కాని, అది హిందూస్థానీ, కర్ణాటక సంగీత పద్ధతులుగా చీలిపోయిన తర్వాత హిందూస్థానీ పద్ధతిలో నిలిచింది, కంటిన్యూ అయింది. కర్ణాటక పద్ధతిలో దాన్ని వదిలేశారు. మనోధర్మగాన పద్ధతి సగటున హిందూస్థానీ సంగీతంలో నూటికి 90 వంతులు ఉంటే కర్ణాటకంలో అది సుమారుగా నూటికి 60 వంతులే ఉంటోంది. హిందూస్థానీ కచేరీలో ప్రధాన రాగాన్ని గంటసేపు గానం చేస్తే కర్ణాటకంలో సుమారు పదిహేను, ఇరవై నిమిషాలే గానం చేస్తారు. విలంబగానం దాదాపు మృగ్యం. ముందు పూర్వాంగంలో గానం చేయడం, క్రమంగా ఉత్తరాంగంలోకి ప్రవేశించడం, తార స్థాయిలోకి వెళ్ళడం. ఇదంతా హిందూస్థానీలోనే కనిపిస్తుంది.

విలంబగానంలోనే, ఒక్కొక్క స్వరాన్ని స్పర్శిస్తూ, దాని చుట్టూ గమకాల అల్లిక చేస్తూ ముందుకు సాగడం, ఒక స్వర సంపుటిని పూర్తిగా మధించిన తర్వాతనే మరొక సంపుటివైపు కదలడం... ఇదంతా caressing, fondling (లాలించడం) లాగా ఉంటుంది. అంటే రాగం యొక్క అందాలను అన్ని కోణాలలో నుంచి స్పృశించడం అన్నమాట. ఆ రాగంలో ఎన్నిరకాల స్వరమేళనాలు (permutations and combinations) చేయడానికి వీలుంటుందో అన్నింటినీ ట్రై చేస్తాడు. కర్ణాటక గాయకులకు అంత తీరిక ఉన్నట్లు కనిపించదు. హడావుడి, స్పీడు ఎక్కువ. రాగం సంగతేదో ఫటాఫట్ తేల్చేయాలన్నట్లు తొందర ఎక్కువ. ఇదీ ఒక రకంగా 'మనోధర్మం' అని కూడా చెప్పవచ్చు. వ్యక్తిగత మనోధర్మం, సమాజ మనోధర్మం, జాతి మనోధర్మం-ఇలా కూడా ఉంటాయి. రాగ స్వభావాన్ని బట్టి treatment మారుతుంది. గంభీర ప్రకృతి గల రాగంలో విలంబ ఆలాపన ధ్యానంలాగా సాగుతుంది-మంద్రస్థాయిలో.

కర్ణాటక సంగీత కచేరీలో ఎవరైనా గొప్ప విద్వాంసుడు ఒక ప్రధాన రాగాన్ని విస్తృతంగా ఇరవై నిమిషాల సేపు, లేదా అరగంట సేపు గానం చేసినా అది మెథడికల్ గా ఒక స్థాయి తర్వాత మరొక స్థాయికి వెళ్ళడం, క్రమంగా వేగం పెంచడం ఉండదు, మూడు స్థాయిల్లో, మూడు వేగాల్లో (విలంబ, మధ్య, ద్రుతలయల్లో) ఒకేసారి చుట్టబెట్టేసినట్లే, హడావిడిగా పరుగెత్తినట్లే ఉంటుంది. ఈ పద్ధతికి కర్ణాటక సంగీత శ్రోతలు బాగా అలవాటు పడిపోయారు. అందుకని వాళ్ళకి (వాళ్ళలో చాలా మందికి) హిందూస్థానీ పద్ధతి నచ్చదు.

హిందూస్థానీలో రాగానికి ప్రాధాన్యం; కర్ణాటకంలో తాళానికి ప్రాధాన్యం. హిందూస్థానీ గాత్ర సంగీతంలో సాహిత్యం సాధారణంగా రెండే లైన్లు (స్థాయి, అంతర) ఉంటుంది. కర్ణాటకంలో పల్లవి, అనుపల్లవి, చరణంలో సాహిత్యం చాలానే ఉంటుంది. కొన్ని కృతులలో (వాగ్గేయ రచనలలో) ఒకటి కంటే ఎక్కువ చరణాలు కూడా ఉంటాయి. ఆ సాహిత్య మంతటినీ పూర్తిగా, స్పష్టంగా పాడవలసిందే. దాటవేయడం కుదరదు. హిందూస్థానీ పద్ధతిలో ఖ్యాల్ లోని రెండు లైన్లనైనా స్పష్టంగా అర్థమయ్యేట్లు పాడరు. అర్థం కావాల్సిన అవసరం లేదన్నట్లు-ఒక్క ముక్క కూడా అర్థం కాకుండా-పాడుతారు. కొందరు ఆ రెండు లైన్లు (స్థాయి, అంతర) కూడా పూర్తిగా పాడరు. స్థాయిని మాత్రం ఒకసారి పాడి, తర్వాత అందులోని ఏదో ఒక పదాన్ని మాత్రం ఆధారంగా తీసుకుని విన్యాసాలు చేస్తారు. ఈ పద్ధతి సరికాదు, మార్చుకోవడ అవసరం. లేదంటే 'తరానా' బోల్స్ తో పాడేసుకోవచ్చు. సాహిత్యం అంటూ ఉన్నాక దాన్ని గౌరవించడం, అర్థవంతంగా పాడడం అవసరం.

త్యాగయ్య గారి రచనల్లో ఆర్తి, వేదన సహజంగా ఉంటుంది, ఆత్మావలోకనం (Introspection) ఉంటుంది. కాని, ఆ రచనలను కచేరీలలో గానం చేసేవారిలో ఆ లక్షణాలేవీ కనిపించవు. అది 'కచేరీ పద్ధతి' అనుకోవాలి. ఉదాహరణకు 'నగుమోము గనలేని' కృతిని తీసుకోవచ్చు. తన ఇష్టదైవం నగుమోమును గనలేని త్యాగయ్య ఆర్తి ఆ రచనలో కనిపిస్తుంది. నాగయ్య గారు తన 'త్యాగయ్య' చిత్రంలో ఆ రచనను ఎంతో ఆర్తితో గానం చేశాడు. అంతే-ఆ కృతిని అలా పాడిన వారు అప్పటి నుంచి ఇప్పటి దాకా ఎవరూ లేరు. బాలమురళీగారి నగుమోమే శ్టాండర్డ్ గా మిగిలిపోయింది. అందరూ అలాగే కులాసాగా, విలాసంగా పాడుతున్నారు కచేరీల్లో. నాగయ్య గారి త్యాగయ్య (1946) కంటే పూర్వం ముసిరి సుబ్రహ్మణ్యం గారి 'నగుమోము' గ్రామఫోన్ రికార్డు వచ్చింది. అందులో ఆయన 'పాడవలసిన విధంగానే' పాడాడు. ఆ తరం వాళ్ళు ముసిరి, బాలమురళి నగుమోములను పోల్చి చూసుకుంటూ ఉంటారు. కచేరీల్లో ముద్దుస్వామి దీక్షితులు కృతుల పరిస్థితీ అంతే. కచేరీల పద్ధతే అది.

హిందూస్థానీ గాత్రం, వాద్య సంగీత కచేరీలలో జిమ్మిక్కులూ, చమక్కులూ, ఆహాహాలూ, ఓహోహోలూ ఉంటాయి. కాని, అవన్నీ ఆలాపన దశ దాటిన తర్వాత మధ్యలయ, ద్రుతలయ రచనల గానంలోనే కనిపిస్తాయి. అయితే, చివరిదాకా పారవశ్యస్థితిని maintain చేయడం కూడా కొన్ని ఘరానాలలో కొందరి గానంలో కనిపిస్తుంది. ఇవన్నీ మనోధర్మానికి సంబంధించిన విషయాలు - శాస్త్రానికి సంబంధించినవి కావు. ఇలా పాడాలనీ, ఇలాగే పాడాలనీ 'శాస్త్రం' చెప్పడం లేదు.

రాగాలాపన, తానం, స్వర ప్రస్తారం, హిందుస్థానీ వాద్య సంగీతంలోని ఆలాప్, జోడ్, ఝాలా-ఇవి మనోధర్మగానం క్రిందకు వస్తాయి. వీటికి సాహిత్యం ఉండదు, తాళ బద్ధమైన రచన ఉండదు. గాయకుడు, వాద్య కళాకారుడు అప్పటికప్పుడు కల్పించి గానం చేసే పద్ధతి యిది. ఇటువంటిది (బహుశా) ప్రపంచంలో మరెక్కడా లేదని చెప్పవచ్చు-భారతీయ శాస్త్రీయ సంగీతంలో మాత్రమే కనిపించే ప్రత్యేకమైన పద్ధతి ఇది. ఎన్ని నదులు వచ్చి కలిసినా తన 'స్వస్వభావాన్ని' కోల్పోనిది మన శాస్త్రీయ సంగీతం.

గమకాలు-శ్రుతులు

అతి మందస్మితం నుంచి అట్టహాసం దాకా హాసంలో ఎన్నో రకాలున్నాయి. ఆ భేదాలన్నింటినీ చూపించాలంటే అది గమకాలతోనే సాధ్యం.

భారతీయ శాస్త్రీయ సంగీతంలో రాగాల గానం అంతా ఒంపులు, వయ్యారాలతో, హొయలతో సాగుతుంది. అవన్నీ గమకాలతోనే వ్యక్తమవుతాయి. గమకరహిత గానం భారతీయం అనిపించుకోదు. అది పాశ్చాత్య సంగీతంలోని కీబోర్డు గానంలా ఉంటుంది.

గమకాలలో శ్రుతుల వినియోగం ఔచిత్యవంతంగా - అంటే సందర్భోచితంగా, తగుమోతాదులో ఉండాలి. అప్పుడే రాగం సౌందర్యవంతంగా ఉంటుంది. గమక ప్రయోగాలలో శ్రుతుల విలువలు సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి. శ్రుతుల తూకం ఎప్పుడూ ఒకే రకంగా, సమానంగా ఉండదు, ఉండకూడదు కూడా. అన్ని సందర్భాలలోనూ ఔచిత్యం, సౌందర్య దృష్టి ప్రధానం. నిజానికి ఔచిత్యమే సౌందర్యం.

మనోధర్మం అంతా గమక ప్రయోగ శైలిలోనే ఇమిడి ఉంటుంది. గాయకుని కళా వ్యక్తిత్వం, కళా ధర్మం అంతా గమకాలలోనే వ్యక్తమవుతుంది.

రాగభావాలు-భావరాగాలు

గాయక భావుకుని మనస్సు నుంచి తొలి రాగం అంకురించి ఇప్పటికి సుమారుగా 1500 సంవత్సరాలై ఉంటుంది. నాటి నుంచి నేటిదాకా ఎందరు గాయకుల మనస్సుల నుంచి, హృదయాల నుంచి ఎన్నెన్ని రాగాలు పొంగి, ఉప్పొంగి, ఉరవళ్ళతో, పరవళ్ళతో ప్రవహించాయో! ఇంకా ఎన్నెన్ని భావాలు రాగాలుగా హృదయాలను చీల్చుకొని రావడానికి ఉవ్విళ్ళూరుతున్నాయో; అసహనంతో కుతకుతలాడిపోతున్నాయో!

రాగమనే భావన భారతీయత నుంచే అంకురించింది. రాగాన్ని భారతీయుడే భావన చేయగలడు. కొన్ని విత్తనాలు కొన్ని దేశాలలోనే మొలకెత్తగలవు.

శతాబ్దాల కాల గమనంలో ఎన్నెన్నో రాగాలు అంతరించిపోయాయి-లేదు-మరుగున పడిపోయాయి. నిజానికి అవే మళ్ళీమళ్ళీ చిన్నచిన్న కొత్త కొత్త మార్పులతో అవతరిస్తున్నాయి. అవి అజరామరాలు. భావాలూ అంతే. భావాలు అంతరించవు. గాలిలో, అదృశ్యాలుగా మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అవి మనలని విడిచిపోలేవు.

ప్రపంచంలో ప్రతి రోజూ ఎందరో జనులు మరణిస్తున్నారు, జన్మిస్తున్నారు. మరణించిన వారే మళ్ళీ జన్మిస్తున్నారేమో! వారే మళ్ళీ మరణిస్తున్నారు! భావాలూ అంతే, రాగాలూ అంతే. ఏ రాగమూ శాశ్వతంగా అంతరించిపోదు.

నండూరి పార్థసారథి
(మే 14, 2021లో వ్రాసినది)

Previous Post Next Post