ఆ కంఠ మాధుర్యాన్ని వర్ణించడానికి ఎలా ఉపక్రమించాలి? ఆ మధుర గళాన్ని దేనితో ఉపమించాలి? హోరుగాలితోనా, మహోద్ధత జలపాతంతోనా, వీణా ఝణఝణత్కారంతోనా, ఎగిరెగిరి పడే నిర్ణద్ర సముద్ర తరంగాల నిరంతర ఘోషతోనా, దూర దిగంతాల వైపు ఎగిరిపోయే స్వేచ్ఛా విహంగ విశృంఖలత్వంతోనా? దేనితో ఉపమించాలి? దాన్ని వర్ణించడానికి ఎలా ఉపక్రమించాలి?

మూడు దశాబ్దాల పాటు ఆ కంఠం శ్రోతలను ఉర్రూత లూగించింది, మంత్ర ముగ్ధ సర్పాల వలె ఆడించింది, తిరుగులేని విధంగా శాసించింది, తనకు తానే సాటిగా భాసించింది. నేడు ఆ కంఠం శాశ్వత నిద్రాసముద్రంలోకి జారిపోయింది. మధుమాసం ఇంకా మటుమాయం కాకుండానే ఎలకోయిల కలకూజితం ఎందుకనో అర్థంతరంగా ఆగిపోయింది. ఎదఎదలో తుద లేని వ్యథను మిగిల్చి, జ్ఞాపకం వచ్చినప్పుడల్లా చురుక్కుమనిపించే ఒక దుఃఖపు నిప్పురవ్వను రగిల్చి, ఆ మధుర గానం ఆకస్మికంగా అనంతంలో అంతర్లీనమైంది. "కోయి హమ్ దమ్ నరహా, కోయి సహారా నరహా..." అని దూర గగనాంచలాల నుంచి హవాహుమాయిలా తేలివచ్చే పాట విన్నప్పుడల్లా ఏ రసిక హృదయంలో జననాంతర సౌహృదాలు మేలుకుని, అవ్యక్త పర్యుత్సుకత తహతహలాడించకుండా ఉంటుంది?

"రూప్ తేరా మస్తానా, ప్యార్ మేరా దీవానా..." అంటూ ఏ గులాబీపొదలలోనో మూగిన తుమ్మెదల రొదలలాంటి రహస్యపు గుసగుసల పాట చిలిపిగా పలకరించినప్పుడల్లా ఏ రస ప్రపంచం పులకరించకుండా ఉంటుంది? ఆ మధుర కంఠం శాశ్వతంగా మూగవోయింది. అది ఇక కొత్త పాటలు పాడదు, కొత్త అనుభవాలు అందివ్వదు. కాని, అది మిగిల్చిన పాత పాటలు మాధురీ జగత్తుకు పూలబాటలు వేస్తూనే ఉంటాయి. నిత్యనూతన గాంధర్వ సీమలకు మనలను తీసుకుపోతూనే ఉంటాయి.

నండూరి పార్థసారథి
(1987 అక్టోబర్ 14వ తేదీన ఆంధ్రప్రభలో ప్రచురితమైనది)

Previous Post Next Post