ప్రాక్పశ్చిమ సంగీతాల మధ్య వారధి నిర్మించిన పండిత్ రవిశంకర్ పన్నెండేళ్ళ క్రితం ప్రప్రథమంగా 'ఇండో-జాజ్' సంగీత రూపకల్పనకు ప్రయత్నించారు. ఆయన విదేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో భారతీయ సంగీతాన్ని విశేషంగా ప్రచారం చేశారు. అమెరికాలో కొందరు జాజ్ కళాకారులు ఆయన సంగీతం వల్ల ఆకర్షితులై, ఆయనతో కలిసి ఒక కొత్త ప్రయోగం చేశారు. 'ధాని' రాగం ఆధారంగా రవిశంకర్ ఒక చిన్న జాజ్ రచన చేసి ఇవ్వగా, వారు దానిని 'ఇంప్రువైజ్' చేసి వాయించారు. అది హిందూస్థానీ రాగంగానూ, అమెరికన్ జాజ్ గానూ కాక, ఒక అందమైన, విచిత్రమైన రచనగా, రవిశంకర్ కల్పనా చాతురికి గీటురాయిగా రూపొందింది. అది 'ఫైర్ నైట్' (Fire night) అనే పేరుతో, నాలుగున్నర నిమిషాల అంశంగా ఒక లాంగ్ ప్లే రికార్డు (EALP 1288)లో వెలువడింది. అదే రికార్డులో ఆ జాజ్ కళాకారులు రవిశంకర్ తో కలిసి 'పథేర్ పాంచాలీ' థీమ్ మ్యూజిక్ ను 'ఇంప్రువైజ్' చేసి ఏడు నిమిషాలసేపు వాయించారు కూడా. ఆ రికార్డు దేశ విదేశాలలో విశేషంగా సంగీత ప్రియుల మన్ననలను చూరగొన్నది.

అమెరికాలోని జాజ్ వాద్య బృందాల వారు విదేశాలలో పర్యటిస్తూ, జాజ్ ను విరివిగా ప్రచారం చేస్తున్నారు. జాజ్ వాద్య బృందాలు మన దేశాన్ని కూడా తరచుగా సందర్శిస్తున్నాయి. 1965లో అమెరికాలోని ఇండియానా విశ్వవిద్యాలయం తాలూకు జాజ్ బృందం వారు మన దేశానికి వచ్చి ప్రధాన నగరాలలో కచేరీలు చేశారు. వారు మద్రాసు వచ్చినప్పుడు కర్ణాటక సంగీత కళాశాలను సందర్శించి, మన వాద్యాలను పరిశీలించారు. వారు మ్యూజిక్ అకాడమీ హాలులో కచేరీ చేసినప్పుడు ప్రసిద్ధ మృదంగ విద్వాంసుడు శ్రీ టి.వి. గోపాల కృష్ణన్ ను వేదికమీదికి ఆహ్వానించారు. జాజ్ బృందంలో డ్రమ్స్ వాయించే అతను, శ్రీ గోపాలకృష్ణన్ కలిసి అద్భుతంగా లయ విన్యాసం చేశారు. ఆ ప్రయోగం శ్రోతలను ఉర్రూత లూగించింది.

ఐదేళ్ళ క్రిందట ప్రముఖ సంగీత దర్శకులు శంకర్ జైకిషన్ 'రాగా జాజ్ స్టైల్' అనే పేరుతో ఒక లాంగ్ ప్లే రికార్డు (ECSD 2377) విడుదల చేశారు. అందులో 11 హిందూస్థానీ రాగాలను జాజ్ పద్ధతిలో వినిపించారు. రాగ లక్షణాలను పూర్తిగా పాటించారు. శాక్జోఫోన్, ట్రంపెట్, పియానో, ఎలెక్ట్రికల్ గిటార్, డ్రమ్స్ వంటి పాశ్చాత్య వాద్యాలను, సితార్, వేణువు, తబలా వంటి భారతీయ వాద్యాలను ఉపయోగించారు. ఉస్తాద్ రయిస్ ఖాన్ సితార్ వల్ల ఈ రికార్డులోని సంగీతానికి శాస్త్రీయ సౌరభం అబ్బింది. ఆయన సితార్ లేకపోతే ఈ ప్రయోగం చాలా దెబ్బతిని ఉండేది. ఈ రికార్డులో ఐదు రాగాలు చాలా బావున్నాయి. మిగిలిన వాటిలో కొన్ని మామూలు శంకర్-జైకిషన్ సినిమా ట్యూనులుగానే ఉన్నాయి. కొన్ని బ్యాండు మేళం మాదిరిగా ఉన్నాయి. ఇందులో ట్రంపెట్, శాక్జోఫోన్ లు శివరంజని రాగం వాయిస్తుంటే విరహోత్కంఠితయైన భారతీయ కావ్యనాయిక సిగరెట్ తాగుతూ, బార్ లో విస్కీ గ్లాసు పట్టుకుని, విరహపడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఏమైనా 'ఇండో-జాజ్' రూపకల్పనకు ఒక ప్రయత్నంగా శంకర్ జైకిషన్ ల ప్రయోగాన్ని అభినందించవలసి ఉంది.

ఈ రికార్డు వచ్చిన తర్వాత ఏడాదికి తమిళ సంగీత దర్శకుడు టి.కె. రామమూర్తి 'ఫాబ్యులస్ నోట్స్ అండ్ బీట్స్ ఆఫ్ కర్ణాటిక్ జాజ్' అనే పేరుతో ఒక రికార్డును (ECSD 2410) వెలువరించారు. ఇందులో ఆయన పది కర్ణాటక రాగాలను జాజ్ పద్ధతిలో వినిపించారు. ఇది శంకర్-జైకిషన్ రికార్డుకంటే బావుంది. 'ఇండో-జాజ్'ను రూపొందించడంలో పాశ్చాత్య వాద్యాలకంటే వీణ, నాదస్వరం, డోలు వంటి కర్ణాటక సంగీత వాద్యాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల బ్యాండు మేళంలాగా, సినిమా సంగీతం లాగా కాక, నిజమైన 'కర్ణాటక-జాజ్' సంగీతంగా రూపొందింది.

ఈ రికార్డు తర్వాత జోహారియట్, జాన్ మేయర్ ల రికార్డు ఒకటి ''ఇండో-జాజ్ ఫ్యూజన్స్'' అనే పేరుతో వెలువడింది (SEX 6122). ఇందులో కొన్ని హిందూస్థానీ రాగాలను జాజ్ పద్ధతిలో వినిపించారు.

జాజ్ సంగీత కచేరీలో ఇంప్రువైజేషన్ కు అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది. అందుచేత వాద్య బృందంలోని వారందరికీ గొప్ప కల్పనా చాతుర్యం ఉండితీరాలి. ఒక వ్యక్తి తన వాద్యంపై వాయిస్తూ ఒక చెణుకు విసిరితే, గబుక్కున ఆ చెణుకును మరొక వ్యక్తి అందిపుచ్చుకుని ఒకరి ఐడియాని మరొకరు తన్నుకుపోతూ ఉంటారు. ఇదంతా ఒక ఫుట్ బాల్ ఆటలాగా సాగుతుంది.

బాలమురళీకృష్ణ (గాత్రం), చిట్టిబాబు (వీణ), ఎం.ఎస్. గోపాలకృష్ణన్ (వైలిన్), ఎస్. రమణి (వేణువు), షేక్ చినమౌలా సాహెబ్ (నాదస్వరం), టి.వి. గోపాలకృష్ణన్ (మృదంగం), వినాయక రామ్ (ఘటం), ఓలేటి వెంకటేశ్వర్లు (గాత్రం), లాల్గుడి జయరామ్ (వైలిన్) వంటి ఉత్సాహవంతులు, ప్రతిభావంతులు అయిన విద్వాంసులు ఒకసారి ప్రయోగాత్మకంగా 'కర్ణాటక-జాజ్' కచేరీ చేస్తే అద్భుతంగా ఉంటుంది. బాలమురళీకృష్ణ పాడుతుండగా మధ్యలో చిట్టిబాబు విరుచుకు పడవచ్చు. ఆయన కోకిల కూత వాయిస్తూ ఉండగా, మధ్యలో షేక్ చినమౌలా నాదస్వరంతో దాడి చేయవచ్చు. అందరూ కర్ణాటక సంగీతం వినిపిస్తూ ఉండగా, మధ్యలో హఠాత్తుగా ఓలేటి వెంకటేశ్వర్లు గారు హిందూస్థానీ ప్రారంభించవచ్చు. 'మీకు వచ్చినపాటి నాకూ వచ్చు' అంటూ ఎం.ఎస్. గోపాలకృష్ణన్ కూడా హిందూస్థానీలో విజృంభించవచ్చు. మధ్యలో బాలమురళీకి ఒళ్ళుమండి, అసలు రాగం వదిలిపెట్టి ఇంకో రాగం అందుకోవచ్చు. దానితో ఇక ఎవరు తోచిన రాగం వారు వాయిస్తూ, ఒక అందమైన రాగమాలికను తయారు చేయవచ్చు.

అయితే ఇటువంటి ప్రయోగం కళాకారుల మధ్య పరస్పర గౌరవం, అవగాహన, సమన్వయం ఉన్నప్పుడే జయప్రదమవుతుంది.

నండూరి పార్థసారథి
(1974 ఏప్రిల్ 12వ తేదీన ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమయింది)

Previous Post Next Post