Title Picture

ప్రయోజనాత్మకం అనే పేరుతో వినోదాత్మకమైన చిత్రాలు నిర్మించటం దేవానంద్ కు అలవాటు. హత్యలు ఖూనీలు చూసి చూసి విసుగెత్తిన జనానికి విశ్రాంతి నివ్వాలని ఆయన సంకల్పం. 'కాలా బజార్'లో ఆశించినంత హాయి ఉంది.

కథ విషయం అటుంచి సాంకేతికంగా 'కాలా బజార్' చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నది.

ఈ చిత్రానికి దర్శకత్వం కథ, స్క్రీన్ ప్లే, సంభాషణల రచన విజయానంద్ నిర్వహించాడు. కధకుడుగా ఆయన పరాజయం పొందాడని చెప్పవచ్చును. ఏదో చెప్పబోయి మరేదో చెప్పి, సవరించుకోబోయి మరిచిపోయి కంగారు పడి ఆశుకవిత్వం చెప్పాడాయన. సంగీత దర్శకుడు ఎస్.డి.బర్మన్, ఛాయాగ్రాహకుడు వి.రాత్రా, శబ్దగ్రాహకుడు జె.ఎం. బారట్, నటుడు దేవానంద్ ఆయనకు పూర్తిగా సహకరించారు. ఉక్కబోసే థియేటరులో కూర్చున్నా ఉదకమండలపు చల్లని వాతావరణాన్ని స్పృశింపచేయగల విధంగా ఊటీలోని దృశ్యాలను నేత్రపర్వంగా చిత్రించాడు ఛాయాగ్రాహకుడు. ప్రతి సన్నివేశంలోనూ వాతావరణం చాలా సహజంగా ఉంది.

ఆయా వాతావరణాలకు అనుగుణంగా ఎస్.డి. బర్మన్ సంగీతం సమకూర్చాడు. అలవాటు ప్రకారం ఆయన అద్భుతమైన ప్రయోగాలు చేశాడు. ఆయన సంగీతం ఏదేశానికీ, ఏసంప్రదాయానికీ చెందదు. విశ్వజనీనమైనది. లేక ఆ సంగీతానికి బర్మన్ సంప్రదాయం అని ఒక ప్రత్యేక తరగతిగా స్థానం యివ్వవచ్చును. 'ఖోయా ఖోయాచాంద్ ఖులా ఆస్మాన్' అనే గీతం ఎన్నాళ్ళకైనా స్మృతిపధంలో సుడులు తిరుగుతూనే ఉంటుంది. మొత్తం చిత్రంలో ఉన్న 7 పాటలూ చాలా బాగున్నాయి. రఫీ తన మామూలు ధోరణికి భిన్నంగా బర్మన్ సంగీతమంత లలితంగా పాడాడు. శబ్ద గ్రహణం కూడా అంత సున్నితంగానూ ఉంది.

రఘువీర్ అనే నిజాయితీ గల బస్ కండక్టరు (దేవానంద్) ఒక ప్రయాణీకునితో పోట్లాట వల్ల ఉద్యోగాన్ని కోల్పోతాడు. గౌరవమైన ఉద్యోగమేదీ దొరకదు. సినిమాహాలు వద్ద బ్లాక్ మార్కెట్టులో టిక్కెట్లు హెచ్చుధరకు అమ్మే వ్యాపారం అతన్ని ఆకర్షిస్తుంది. పెట్టుబడికోసం ఒక లాయరు (చేతన్ ఆనంద్) వద్ద దొంగతనం చేస్తాడు. ఆ డబ్బుతో ఒక ముఠాను చేరదీసి వ్యాపారం ప్రారంభిస్తాడు. లక్షలు గడిస్తాడు. (కథకుని అతిశయోక్తి అలంకారం) సగటు హిందీ చిత్రంలోని బ్రహ్మాండమైన సెట్టు అంత భవనంలో కాపురం పెట్టుతాడు. అతనికి ఒక తల్లి (లీలాచిట్నిస్) - చెల్లెలు (నందా) తమ్ముడు (సునీల్ కుమార్) కూడా ఉన్నారు. వాళ్ళకు కథతో నిమిత్తం లేదు. అప్పుడప్పుడూ భజన చేసుకుంటూ కనిపిస్తారు. ఇలా ఉండగా ఒకనాడు సన్నజాజి పువ్వులా బక్క పలుచని అల్కా అనే అందమైన అమ్మాయి (వహీదా) అతనికి తటస్థపడుతుంది. చెలికత్తెలు కొన్న బ్లాక్ మార్కెట్టు టిక్కెట్లను ఆమె ధైర్యంగా చించి వేస్తుంది. అంత అందమైన అమ్మాయి ఆపని చేసేసరికి అతనిలో పరివర్తన ప్రారంభమవుతుంది. పశ్చాత్తాప పడతాడు. తర్వాత ఆమె వెంట పడతాడు. ఆమెకూ నంద్ అనే కాలేజీ విద్యార్థి (విజయానంద్)కీ జరిగే ప్రేమ కలాపాలను కళ్ళారా చూస్తూ గుటకలు మింగుతూ సమయం కోసం బ్యాగ్రౌండులో పొంచి ఉంటాడు.

నంద్ పైచదువులకు ఇంగ్లండు వెళ్ళిన తరుణం కనిపెట్టి ఆమె జీవితంలోనికి బలవంతాన చొరబడుతాడు. ఆమె మనస్సులో నంద్ రూపాన్ని చెరిపేసేందుకు పూనుకొని అంతపనీ చేస్తాడు. ఊటీ కొండలలో ఆమె తన రెండవ ప్రేమ కథను ప్రారంభించుతుంది. అతడు పూర్తిగా మంచివాడై తన ప్రేయసి లాగానే తన మొదటి కథను మరిచిపోయి తెల్ల బజారు వర్తకం ప్రారంభించి తనముఠాలో అందరినీ సంస్కరించి ఆ బజారులో వదులుతాడు. నాయికా నాయకులిరువురూ 'పానకం' త్రాగుతూండగా నంద్ అనే 'పుడక' ఇంగ్లండు నుంచి వస్తాడు.

కానీ అడ్డుపడడు. తాను అక్కడ యింకో పిల్లను ప్రేమించడం పూర్తి చేశాననీ అల్కాను కూడా అదే పని చెయ్యమనీ అంటాడు. చేశానంటుంది ఆమె. అప్పుడు మళ్ళీ ఒక పోలీసు అనే పుడక అడ్డుపడి పాత కథను జ్ఞాపకం చేసి అతన్ని కోర్టుకి ఎక్కిస్తాడు. వాదోప వాదాలూ సస్పెన్సు అనంతరం కథ సుఖాంతమవుతుంది.

నటీనటులలో ముందు వహిదా రహమాన్ ను చెప్పి తర్వాత దేవానంద్ ను చెప్పటం సమంజసం. వహిదా నటన చాలా నిరాడంబరంగా నిండుగా ఉంది. అంగ సౌష్ఠవం కూడా లేకపోవటం వల్ల ఆమెను హాలీవుడ్ తార ఆడ్రీ హెప్బర్న్తో పోల్చాలనిపిస్తుంది. దేవానంద్ నటన మామూలుగానే హాయిగా ఉంది. అయితే అతని పాత్రకు వ్యక్తిత్వం లేదు. ముందు మంచివాడు తర్వాత చెడ్డవాడౌతాడు. అందమైన అమ్మాయిని చూసేసరికి మళ్ళీ మంచివాడౌతాడు. ప్రేమికులమధ్య యిరకాలని ప్రయత్నించి ఆమెను రెచ్చగొట్టి తన వైపుకు తిప్పుకుంటాడు. అతనిపై ప్రేక్షకులకు గౌరవం కలగదు-కాసేపు నవ్వించాడనే కృతజ్ఞత తప్ప. చేతన్ ఆనంద్ పాత్ర చిన్నదైనా చక్కగా ఉంది. ఆయన చక్కగా నటించాడు. విజయానంద్ నటుడిగా రాణించలేదు.

నండూరి పార్థసారథి
(1960 మార్చి 6వ తేదీన ఆంధ్రప్రభ సంచికలో ప్రచురితమైనది)

Previous Post Next Post