'రాజకీయ చైతన్యం' అనే డాబుసరి పేరుతో సమాజంలో రాజకీయోన్మాదం నానాటికీ పెరిగిపోతున్నది. రాజకీయాలతో సమాజం గౌలు కంపుకొడుతున్నది. వీధివీధికి రాజకీయ వాదులు కుక్కగొడుగులవలె తలెత్తుతున్నారు. రాజకీయ కబంధహస్తాల కౌగిట్లో సమాజం నలిగిఉక్కిరిబిక్కిరి అవుతున్నది. రాజకీయాల విషప్రభావం ఏదో విధంగా ప్రతివ్యక్తి జీవితంపైన ప్రసరిస్తూనే ఉంది. రాజకీయాలు గుమ్మందాటి ఇంట్లోకి, వంటింట్లోకి, బెడ్ రూమ్ లోకి, బాత్ రూమ్ లోకి కూడా వచ్చాయి.
శాసన సభ్యులై, పార్లమెంటు సభ్యులై, మంత్రులై "దేశానికి సేవ చేయడానికి, దేశాన్ని ఉద్ధరించడానికి, దేశమాత పాదాలముందు తమ సర్వస్యం నైవేద్యంగా పెట్టడానికి" రాజకీయ వాదులు మొదటిరోజు మొదటి ఆటకు పావలాటిక్కెట్ క్యూలో జనంలాగా కుమ్ముకుని, కొట్టుకొని, జుట్టుపీక్కుని, చొక్కాలు చింపుకుంటున్నారు. 'దేశ సేవ' చేసే అవకాశం కోసం ముష్టి వాళ్ళను సైతం ముష్టెత్తుతున్నారు. కాకాసురులనుసైతం ఆర్థిస్తున్నారు. 'దేశ సేవ' కోసం కుమ్ములాటలో తలలు బ్రద్దలు కొట్టుకుంటున్నారు. ఇళ్ళు తగలెట్టుకుంటున్నారు. 'దేశసేవ' కోసమే మొగుడూ పెళ్ళాలు, తండ్రీకొడుకులు, అన్నదమ్ములు, అత్తాకోడళ్ళు బద్ధశత్రువులైపోతున్నారు.
దేశసేవ, ప్రజాసేవ చేయాలంటే రాజకీయాల్లోదిగాలి, ఎన్నికల్లో గెలవాలి, శాసనసభ్యుడు కావాలి, మంత్రి కావాలి. అది తప్ప మరోమార్గం లేదు. ఎంత పెద్దపదవిలో వుంటే దేశానికి అంత గొప్పసేవ చేస్తున్నట్లు లెక్క. 'ప్రజాసేవకుడు' అనేమాటకు ఇప్పటి అర్థం 'మంత్రి' లేక 'రాజకీయనాయకుడు' అని. డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, కళాకారులు, రైతులు-వీరెవ్వరూ ప్రజాసేవకులు కారు. దేశ సేవకులు అంతకన్నా కారు.
ప్రజాసేవ రంగంలో దిగడానికి, మంత్రి కావడానికి విద్యార్హత, సమర్థత, చిత్తశుద్ధి-ఇవేవీ అక్కర్లేదు. ఎల్డీసీ ఉద్యోగానికైనా ఎస్సెల్సీ పాసవ్వాలిగానీ, మంత్రి కావడానికి అదీ అక్కర్లేదు; అధికారకాంక్ష, జనాన్ని బుట్టలో వేసుకునే ఒడువు వుంటే చాలు. ఈనాడు నూటికి తొంభైమంది రాజకీయ నాయకులకు వున్న ముఖ్య 'అర్హతలు' ఇవే. కొందరికి విద్య, సమర్థతకూడా 'పొరపాటున' వుంటే వుండవచ్చు. కాని, వారు నాయకులు కావడానికి కారణం మాత్రం అవికావు. ఇక చిత్తశుద్ధి అనేది మరీ అపురూపమైన దినుసు. అది నూటికి ఒక్కరిలో వున్నా సంతోషించవలసిందే. నిజానికి నేటి రాజకీయ రంగంలో చిత్తశుద్ధి అనర్హతే అవుతున్నది.
నిశానీదారుడైనా సరే మంత్రి అయితే సర్వజ్ఞుడవుతాడు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మరుక్షణం నుంచి అతడి నోటి వెంట వెలువడేవన్నీ వేదవాక్కులు. నిరక్షరాస్యుడిని మంత్రించితే అతడు వేదపండితుల మహాసభకు ప్రారంభోత్సవం చేయగలడు. పట్టుశాలువ కప్పించుకోగలడు. మహా పండితులకు సైతం ఉద్బోధలు చేయగలడు.
రాజకీయనాయకులు, మంత్రులు లేకుండా ఈనాడు ఏ సభ, సమావేశం జరగడానికి వీల్లేదు-అది చింతపండు వర్తకుల సభ కానివ్వండి, సంగీత మహాసభ కానివ్వండి, ఆగమశాస్త్ర సదస్సు కానివ్వండి, మంత్రిగారు వేదిక ఎక్కి ఉపన్యసిస్తేనే ఆ సభకు గానీ, సదస్సుకుగానీ సార్థకత. మంత్రిగారు లేని సభ పురోహితుడు లేని తద్దినంలాగా వుంటుంది. పల్లెటూళ్ళో పాయీఖానా దొడ్లకు ప్రారంభోత్సవం చేయాలన్నా మంత్రిగారు రావాలి. అధమపక్షం స్థానిక శాసనసభ్యుడైనా రావాలి.
ఈనాటి సమాజంలో రాజకీయనాయకులు క్షుద్రదేవతల్లాగా వెలిశారు. లైసెన్సులకోసం, పర్మిట్లకోసం, కళాశాలల్లో ప్రవేశం కోసం, ఉద్యోగాలకు సిఫార్సుల కోసం, ఋణాల మంజూర్లకోసం, ఇంకా అడుగడుగునా అనేకావసరాలకోసం, ప్రజలు ఈ క్షుద్రదేవతలను ఆరాధిస్తున్నారు. మేధావులు, కళాకారులు సైతం ఆత్మాభిమానం చంపుకుని రాజకీయ నాయకులను ఆశ్రయిస్తున్నారు. తమ సభలలో వారికి అగ్రాసనాలు ఇస్తున్నారు.
కోళ్ళ పెంపకం శాఖమంత్రిగారు త్యాగరాజ ఆరాధనోత్సవాలకు ప్రారంభోత్సవం చేస్తాడు. "త్యాగరాజులవారు శానా గొప్పవారు. ఆయన పాటలు, భజనలు, తత్త్వాలు రాశారు. అవి మంచి భక్తిగా శానా బాగుంటయ్యి. మనంకూడా అసుమంటియి రాయాలి. మనపిల్లగాళ్ళకి బాగా నేరిపించాలి" అని ఆయన అంటాడు. ఈమాటలనే పత్రికలవారు అభిభాషణలనీ, ఉద్బోధలనీ అంటూ వుంటారు. "త్యాగరాజస్వామి కీర్తనలు భక్తిరసప్లావితములైన అనర్ఘరత్నములనీ, వాటి ఉత్కృష్టతను అవగాహన చేసుకొని, అట్టి కీర్తనలను రచించడానికి నేటితరం వాగ్గేయకారులు కృషిచేయాలనీ మంత్రిగారు ఉద్బోధించారు". అని పత్రికలవారు సంస్కృత పదాలతో తాలింపు పెట్టి మంత్రిగారి ఉపన్యాసాన్ని ప్రచురిస్తారు.
'భక్తిరస భరితమైన
త్యాగరాజ కృతి రత్నములు'
'ఆధునిక వాగ్గేయకారులకు శిరోధార్యములని కోళ్ళ పెంపకం శాఖామంత్రి అభిభాషణ'-
అని డాబుసరిగా హెడ్డింగు పెడతారు. మర్నాడు పేపర్లో అది చదువుకుని మంత్రిగారు నిజంగా తాను అంత గొప్పగా మాట్లాడాననుకొని ఆత్మవంచన చేసుకుంటారు. వార్తాపత్రికల పుణ్యమా అని మంత్రులేకాదు-పంచాయతీ బోర్డు అధ్యక్షులు కూడా ఉద్బోధలు చేయడం ప్రారంభించారు.
మంత్రిగానీ, రాజకీయ నాయకుడు గానీ నిజంగా, పండితుడై వుంటే, మేధావుల సభలలో ప్రసంగించడంలో ఆక్షేపణ ఏమీ వుండదు. కాని, కేవలం అధికారంలో వుండడమే అర్హతగా భావించి వేదిక ఎక్కి హితబోధలు చేయడం హాస్యాస్పదం. తన ఉపన్యాసానికి సభాసదులు జేబురుమాళ్ళు అడ్డం పెట్టుకుని నవ్వుకుంటున్నారన్న జ్ఞానం వుండదు ఆయనగారికి.
ఏదైనా సభకు ప్రారంభోత్సవం చేయడానికి, లేదా అధ్యక్షత వహించడానికి తనకున్న అర్హత ఏమిటని రాజకీయనాయకుడు ఒక్కనాడైనా తనను తాను ప్రశ్నించుకోడు. "సంగీతాన్ని గురించి నాకేమి తెలుసయ్యా? ఎవరైనా గొప్ప సంగీత విద్వాంసుడిచేత ప్రారంభోత్సవం చేయించండి" అని కోళ్ళమంత్రి, లేదా గొర్రెల మంత్రి అనడు. పొట్టకోస్తే అక్షరమ్ముక్క లేనివాడు కూడా స్నాతకోపన్యాసానికి సిద్ధం.
ఈ పదేళ్ళలో గ్రామీణ ప్రజలకు, విద్యార్థులకు ఉద్బోధచేయని రాజకీయ నాయకుడు లేడు. పదవిలోకి రావడానికి, పదవిని కాపాడుకోవడానికి ఎంతటి నీచానికైనా పాల్పడ గలిగినవారు దేశంలో నైతిక ప్రమాణాలు దిగజారిపోతున్నాయని వేదికఎక్కి ఆవేదన వ్యక్తం చేస్తారు. ప్రాచీన సంప్రదాయాలను, ధర్మాలను పునఃప్రతిష్టించాలని, భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించాలనీ, ఉద్ఘాటిస్తారు. "మన చర్యలు దేశాన్ని బలహీన పరుస్తున్నాయా?" అని ప్రజలు ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు చెబుతారు. 'ఆత్మవిమర్శ' అనేమాటకు అర్థం తెలిస్తే వారు ఇటువంటి వాగుడు వాగరు.
ప్రజలు మోస్తుంటే పల్లకీ ఎక్కి వూరేగే రాజకీయనాయకులు, ఇతరుల చేత చాకిరి చేయించి, ఆ చాకిరీ తామే చేసినట్లు ఇత్తడి బిళ్ళలపై చెక్కించుకుని, మూర్ఛరోగులవలె మెడలో కట్టుకు తిరిగే రాజకీయనాయకులు, నిస్స్వార్థసేవ గురించి బోధిస్తారు. ఎయిర్ కండిషన్ భవనంలో నివసిస్తూ, ప్లిమత్ కారులో కరువుప్రాంతాల్లో పర్యటించే రాజకీయనాయకుడు ఇతోధికంగా చెమటోడ్చి పనిచేయాలని ఎండలో బండరాళ్ళు పగలకొట్టే కార్మికులకు విజ్ఞప్తి చేస్తాడు; సోలెడు బ్రాందీ గుటకాయస్వాహా చేసి, తిక్క తలకెక్కుగా, గుక్క తిప్పుకోకుండా ఒక్క బిగిని మద్యపాన దురాచారాన్ని గురించి ప్రవచించగలడు. పొద్దున వీరేశలింగం వర్థంతి సభలో ప్రజలందరూ ఆ మహనీయుని అడుగుజాడల్లో నడవాలని హితవుచెప్పి, మధ్యాహ్నం సనాతన హిందూధర్మ పరిషత్తుకు అధ్యక్షత వహించి, సాయంత్రం కాబరే నృత్య ప్రదర్శనకు ప్రారంభోత్సవం చేయగలడు.
ఒక పార్టీ పేరు చెప్పుకుని వోట్లు సంపాదించుకుని, శాసన సభలో చొరబడి, నెలతిరక్కుండా పార్టీకి విడాకులిచ్చి, మరోపార్టీని తగులుకుని, తనకు వోట్లు వేసిన వేలాది ప్రజలను మూకుమ్మడిగా మోసం చేయడానికి ఏమాత్రం సంకోచించనివాడు రాజకీయవాది. అధికారపు గాలివాటు ఎటువుంటే అటు తిరిగే గాలికోడి రాజకీయవాది. ఈ ఆకలియుగంలో ప్రజలను కాల్చుకుతినడానికి అవతరించిన నరహింసావతారం రాజకీయవాది.
ఆత్మగౌరవం, ఆత్మాభిమానం, ఆత్మవిమర్శ, నిజాయతీ రాజకీయవాదుల నిఘంటువుల్లో దొరకని పదాలు. అతడు దూషణభూషణలకు అతీతుడు. పూలను, రాలను కూడా నవ్వుతూ స్వీకరించగలడు. ఎవడైనా కుళ్ళుకోడి గ్రుడ్డు మొహానవిసిరితే జేబురుమాలుతో తుడిచేసుకుని, "ఓహో! ఎంత గురిగా విసిరావోయ్. ఈ గురిని, ఈ శక్తిని దేశాభ్యుదయానికి వుపయోగించుకోవాలి" అని మెచ్చుకోగలడు.
ఈనాడు అన్నింటికంటే ఘరానాగా చెలామణి అవుతున్నది రాజకీయరంగం. వార్తా పత్రికలలో 75 శాతం పైగా వార్తలు రాజకీయవార్తలే. వాటిలోనూ నాయకుల ఉపన్యాసాలు అతిప్రధానమైనవి. ఫొటోలుకూడా 75 శాతం రాజకీయ నాయకులవే. పదవికి ఎన్నికైనప్పుడు, పరమపదించినప్పుడు వాళ్ళ జీవిత సంగ్రహాలు ప్రచురింపబడుతాయి. రాజకీయరంగంలో ప్రతి 'చచ్చినాడూ' అమరజీవి అవుతాడు. స్మారక సంఘాలు అవతరిస్తాయి. శిలా విగ్రహాలు వెలుస్తాయి.
ఈ క్షుద్ర దేవతారాధన అంతరించే వరకు సమాజం బాగుపడే ఆశ లేదు. ప్రజలు రైళ్ళు పడగొట్టడం కాదు, బస్సులు తగలెట్టడం కాదు. ముందు రాజకీయనాయకుల నోళ్ళకు తాళాలు వేసి, తాళం చెవులు జేబులో వేసుకోవాలి. ఈ నాయకులకు వోట్లు వేసింది వేదిక ఎక్కి వాగడానికి కాదు. హితబోధలు చేయడానికి కాదు-పరిపాలనా వ్యవహారాలు నిర్వహించడానికి మాత్రమే. ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రభుత్వంలో వున్నవారదంరూ-బంట్రోతు మొదలు ముఖ్యమంత్రి వరకు-ప్రజాసేవకులు, ఉద్యోగులు మాత్రమే. పెత్తందారులు, ప్రవక్తలు కాదు. చేస్తున్న పనికి జీతం తీసుకుంటున్నారు వారు. వారికి జీతాలు ఇస్తున్నది మనకి నీతులు బోధించడానికి కాదు.
పత్రికలు ఈ రాజకీయనాయకుల ఉపన్యాసాలకు విపరీత ప్రాముఖ్యం ఇవ్వడం మానేయాలి. ప్రభుత్వ నిర్ణయాలను గురించి, కార్యక్రమాలను గురించి చెప్పినవి ఏవైనా వుంటే అవి మాత్రం ప్రచురించి ధర్మోపన్యాసాలను చెత్తబుట్టలో వెయ్యాలి. అలా చేస్తే కొన్నాళ్ళకు నాయకులు ఉపన్యాసాలు మానేస్తారు.
దానికితోడు ఉపన్యాసాలపై పన్ను విధించాలి. అమ్మితే పన్ను, కొంటే పన్ను, సంపాదిస్తే పన్ను, పుడితే పన్ను, చస్తే పన్ను, విధించే ప్రభుత్వం ఉపన్యాసాల మీద మాత్రం పన్ను ఎందుకు విధించకూడదు? ఐదు నిమిషాలకు మించి ఉపన్యసిస్తే నిమిషానికి 'ఇంత' అని పన్ను నిర్ణయించాలి. ట్రంక్ కాల్స్ పద్ధతిలో అలా చేస్తే దేశంలో ధర్మోపన్యాసాలు తగ్గుతాయి. ప్రవక్తలు తగ్గుతారు. నోటి దురదతీరక ఎవరైనా అధిక ప్రసంగం చేస్తే వారి వల్ల ప్రభుత్వపు ఖజానాకు ఆదాయం చేకూరుతుంది. ఆ ధనాన్ని ప్రజాసంక్షేమానికి వినియోగించుకోవచ్చు.
ఉపన్యాసాలపై పన్ను వల్ల దేశంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన మహోత్సవాలు కూడా తగ్గుతాయి. మంత్రుల పర్యటనలు తగ్గుతాయి. బోలెడు డబ్బు పొదుపు అవుతుంది. మాటలు తగ్గితే క్రమంగా చేతలు పెరిగే అవకాశం వున్నది. నాయకులు శుష్కవాగ్దానాలు చేయడం తగ్గిస్తారు. అప్పుడు సమాజం చక్కగా బూజుదులిపి, వెల్లవేసి, కడిగి ముగ్గులు పెట్టినట్లు శుభ్రంగా వుంటుంది. ఈ సంస్కరణకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. అందుకు ముందు రాజకీయ నాయకులకు ప్రత్యేక గౌరవం ఇవ్వడం మానేయాలి. సాటి మనుషులుగా మాత్రమే వారిని గుర్తించాలి.
నండూరి పార్థసారథి
(1972లో 'స్వాతి' మాసపత్రికలో ప్రచురితమైనది)